స్వతంత్ర సిట్‌తో పాప ప్రక్షాళనేనా!?

పాపం చేసినా.. పుణ్యం చేసినా -భూమ్మీదే అనుభవించి పోతామన్నది హిందూ సంప్రదాయంలో ఓ విశ్వాసం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి కళ్లుగప్పి.. శ్రీవారి సన్నిధిలో చాలా పాప కార్యాలు చేశారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు -పాప పరిహారం భూమ్మీద అనుభవించకుండా పోతారా? ఇదీ వెంకన్నపట్ల విశ్వాసం ప్రదర్శించే కోటానుకోట్ల భక్తుల ప్రశ్న! వైసీపీ పాలనా కాలంలో దేవదేవుడికి అనేక సందర్భాలలో అనేక రూపాలుగా అపచారం జరిగిన మాట నిజమేనన్నది కోటానుకోట్ల భక్తులు నమ్ముతున్న విషయం. ఈ నమ్మకానికి గల కారణాలు అనేకమై ఉండొచ్చు. కానీ, భక్తుల మనోభావాలను దారుణంగా దెబ్బతీసేలా మహాప్రసాదానికి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్నదే జీర్ణించుకోలేకపోతున్న అంశం. ఈ విషయంలో వైసీపీనీ బద్నాం చేయడానికి సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రే అసత్యాలు ప్రచారం చేస్తున్నాంటూ వైసీపీ గొంతు చించుకుంటున్నా.. అనేక భౌతికాంశాలు, వైసీపీ నేతల పొంతనలేని మాటలు -కల్తీ నిజమేనన్న నిర్థారణకు భక్తకోటి ఎప్పుడో వచ్చేసింది. కాసులకు కక్కుర్తిపడి -ఐదేళ్లపాటు దుర్మార్గ రాజకీయాలకు తెరలేపిన వైసీపీ.. ఇప్పుడు నిజాలు చెప్పినా నమ్మని, నమ్మలేని పరిస్థితి. స్వామికి అపచారం జరిగిందన్న అంశంపై ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నా.. ఏడుకొండలవాడు ఏదోక రూపంలో నిజాలు కక్కించకపోడని ఎదురు చూస్తున్న భక్తులూ లేకపోలేదు. ఈ నమ్మకాలను ‘స్వతంత్ర సిట్‌’ నిజం చేసి చూపిస్తుందా? అన్నది కాలం నిర్ణయించాల్సిన అంశం. 

తిరుమల గిరులపై వెలసిన కలియుగ దైవం వేంకటేశ్వరుడికి అపచారం జరిగిందో లేదో నిగ్గుతేల్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను వేసింది. కల్తీ నెయ్యి వివాదంలో కొత్త చాప్టర్‌ మొదలైంది ఇక్కడినుంచే. సిట్‌ దర్యాప్తుతో బండారం బయటపడనుందని బెంబేలెత్తిన గత పాలక పాపులు.. న్యాయస్థానాలను ఆశ్రయించారు. గాలివానగా మారిన కల్తీ నెయ్యి వివాదం చివరకు దేశ సర్వోన్నత న్యాయస్థానం గడపకు చేరడంతో.. కొద్ది రోజుల క్రితమే దీనిపై విచారణ సాగింది. తిరుమలలోని దేవదేవుడి లడ్డూ మహాప్రసాదానికి కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణల అంశాన్ని లోతుగా విచారించిన జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అభిప్రాయాన్నీ తీసుకుంది. ‘కల్తీ నెయ్యి వాడారన్న అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాను. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం. దర్యాప్తు కొనసాగడమే శ్రేయస్కరం. స్వతంత్ర విచారణ కోరుతున్నారు కనుక.. సీనియర్‌ కేంద్ర అధికారి పర్యవేక్షణవుంటే.. దర్యాప్తు బృందంపట్ల మరింత విశ్వాసం పెరుగుతుంది’ అంటూ మెహతా కోర్టుకు నివేదించారు. అలా, సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశమే -ప్రత్యేక సిట్‌.

ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్‌ ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. సీబీఐనుంచి ఇద్దరు, ఏపీ ప్రభుత్వం తరపున ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి ఒక సీనియర్‌ అధికారిని.. స్పెషల్‌ సిట్‌ సభ్యులుగా ఉండాలన్నది సుప్రీం పెట్టిన కండిషన్‌. ఈ బృందాన్ని సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షిస్తారు. కోట్లాది భక్తుల మనోభావాలు, విశ్వాసాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేయడం -ఇక్కడ అండర్‌లైన్‌ పాయింట్‌.

కల్తీ నెయ్యి వివాదం సుప్రీం విచారణలో ఉన్నపుడే వైసీపీ కంత్రీ వ్యవహారం బయటపడటంతో.. సుప్రీం కోర్టే చివాట్లు పెట్టడాన్ని ఇక్కడ ప్రస్తావనార్హం. ఏడుకొండలవాడి కళ్లు గప్పినట్టే… సర్వోన్నత న్యాయస్థానం కళ్లుగప్పేందుకు ప్రయత్నించిన మాజీ ఎంపీ, మాజీ తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి భంగపడ్డాడు. తితిదే మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తనపై సాగుతోన్న విజిలెన్స్‌ విచారణ అంశాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఎదుట దాచిపెట్టడం దారుణమంటూ రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాదులు బండారాన్ని బట్టబయలు చేశారు. విజిలెన్స్‌ నోటీసులు.. దానిపై హైకోర్టులో వేసిన పిటిషన్‌ విషయాన్ని సుప్రీంకోర్టుకు వైవీ నివేదించలేదు. దీంతో వైవీ సుబ్బారెడ్డి తీరుపై అత్యున్నత న్యాయస్థానం కన్నెర్ర చేసింది. భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారానికి రాజకీయ ముసుగు తొడగొద్దని గట్టిగా చివాట్లుపెట్టింది. అంతేకాదు, పిటిషనర్లు అడిగినట్టుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటుకూ ధర్మాసనం నో చెప్పింది. దీంతో మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి, వైకాపా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, భక్తుడు విక్రమ సంపత్‌, సుదర్శన్‌ టీవీ ఎడిటర్‌ సురేష్‌ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలకు విలువలేకుండా పోయింది. ఇంత జరిగినా మీదమాటే మాట్లాడుతోంది వైసీపీ వర్గం. న్యాయస్థానాలనూ తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో భంగపడినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్‌ను కోర్టు కోట్టేసిందంటూ నిస్సిగ్గు ప్రచారానికి దిగడం జగన్‌ మార్క్‌ రాజకీయానికి పరాకాష్ట. కల్తీనెయ్యి బండారాన్ని నిగ్గుతేల్చడానికి సిట్‌ను మించిన ప్రత్యేక సిట్‌ ఏర్పాటుకు సుప్రీం ఆదేశించడంపై -గత పాలక పాపులు ఒక్కమాటా మాట్లాడకపోవడం.. మహాపచారం బయటపడగలదన్న భయమే!

ఆపదనుంచి బయటపడాల్సిన సమయంలో తలుపులు మూసుకుపోతే.. దేవుడు కిటికీ తలుపులైనా తెరుస్తాడన్నది -హిందూ ధర్మంలో ఓ మానసిక ఉపశమన విశ్వాసం. సమస్యనుంచి బయటపడే తెగువ కలగడానికి -ఇక్కడ దేవుడు ఒక ఊతం. కల్తీనెయ్యి కేసులోనూ అదే జరిగిందనిపిస్తుంది, కాకపోతే రివర్సయ్యిందంతే. అది -సిట్‌ అనే కిటికీ తలుపులు మూసుకుపోతే.. కల్తీనెయ్యి బండారాన్ని బయటపెట్టడానికి దేవుడు ఏకంగా ప్రధాన ద్వారాన్నే తెరిచాడు. అదే -స్వతంత్ర సిట్‌. పాపానికి ఒడిగడితే పనిష్మెంట్‌ తప్పదు. కలియుగ దైవానికి అపచారం చేస్తే.. అనుభవించకా తప్పదు! వెంకన్న లీలను త్వరలోనే చూద్దాం!!

కోర్టు హెచ్చరిక జగన్‌కే వర్తిస్తుంది

న్యాయ స్థానాలను రాజకీయ వేదికలు చేయవద్దంటూ సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు జగన్‌కే వర్తిస్తాయన్నారు దేవాదాయ ధర్మాదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. ఐదేళ్లపాటు ఏపీలో హిందూత్వంపై, హిందూ దేవాలయాలపై దాడులు జరిగినపుడు అప్పటి సీఎం జగన్‌ నోరు మెదపక పోవడమే కాకుండా చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. రివర్స్‌ టెండర్ల పేరుతో నాసిరకం నెయ్యి సరఫరా అవుతున్న విషయం అప్పటి ఈవోకి తెలిసే మౌనంగా వున్నారా? అని ప్రశ్నించారు. ‘సుప్రీం కోర్ట్‌ ఆదేశాలపై తప్పుడు ప్రచారానికి దిగడం జగన్‌ చేస్తోన్న పెద్ద తప్పు. నాసిరకం పదార్థాలు సరఫరా చేసే సంస్థల ఎంపికలో కాసులకు కక్కుర్తిపడిన అప్పటి అధికారులను జగన్‌ రక్షించే ప్రయత్నం చేయడం ఇంకో తప్పు. సీఎం చంద్రబాబు ప్రజలకు జవాబుదారీ కనుకే.. టీటీడీ శ్రీవారి ప్రసాదంలో కల్తీ జరిగిన వైనాన్ని వెలుగులోకి తెచ్చారన్నారు. సుప్రీమ్‌ కోర్ట్‌ వేస్తున్న స్వతంత్ర సిట్‌ అన్ని విషయాలను వెలుగులోకి తెస్తుందని, అప్పుడు జగన్‌ ఏంచెబుతాడో చూడాలని మంత్రి ఆనం వ్యాఖ్యానించారు.

కల్తీ జరిగిందనే నమ్ముతున్నాం

తిరుమల లడ్డూ కల్తీపై విచారణకు సుప్రీంకోర్టు ఐదుగురితో కమిటీ వేయడం.. దోషుల నిగ్గు తేల్చేందుకేనని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ వ్యాఖ్యానించారు. కల్తీ జరిగిందనే నమ్ముతున్నామని, సుప్రీం వేసిన స్వతంత్ర సిట్‌ దర్యాప్తుతో వాస్తవాలు వెలుగు చూస్తాయని అన్నారు. ‘జగన్‌ హయాంలో హిందూ ఆలయాలపై దాడులు జరిగాయి. రథం తగులబెట్టినా.. రాముడి విగ్రహం తల తొలగించినా చర్యలు లేవు. తిరుమలలోని నిబంధనలను జగనే తుంగలో తొక్కారు. దంపతులే స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవ్వాలని నిబంధనలు ఉన్నాయి. సతీమణి లేకుండా శాస్త్రం, ధర్మానికి వ్యతిరేకంగా జగన్‌ ఒక్కరే పట్టువస్త్రాలు సమర్పించారు. జగన్‌ హయాంలో లడ్డూలో కల్తీ జరిగిందని నమ్ముతున్నాం’ అని కేంద్రమంత్రి అన్నారు.

సుప్రీం నిర్ణయం – దర్యాప్తునకు కొత్త బలం

తిరుమల మహాప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామని ఐటీ మంత్రి నారా లోకేష్‌ తన ఎక్స్‌ వేదికపై స్పందించారు. స్వతంత్ర సిట్‌ దర్యాప్తు చేయాలన్న సుప్రీం నిర్ణయం.. ప్రస్తుతం నడుస్తున్న దర్యాప్తును మరింత బలోపేతం చేసినట్టేనన్నారు. సిట్‌ దర్యాప్తులో జాతీయ ఏజెన్సీలైన సీబీఐ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐలు భాగస్వాములుగా ఉండటం, దోషుల నిగ్గు తేల్చేందుకు దర్యాప్తును బలోపేతం చేసినట్టయ్యిందన్నారు. సత్యమే గెలుస్తుందని ఈ సందర్భంగా లోకేష్‌ తన పోస్టులో పేర్కొన్నారు.

‘స్వతంత్ర సిట్‌’ను స్వాగతిస్తున్నాము 

తిరుమల మహాప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్‌ ఏర్పాటు చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాన్ని స్వాగతిస్తున్నామని డిప్యూటీ చీఫ్‌ మినిస్టర్‌ పవన్‌ కల్యాణ్‌ అన్నారు. స్వతంత్ర సిట్‌ విచారణతో సత్యం వెలుగు చూస్తుందని ఆకాంక్షించారు.తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం విషయం తెలిసినప్పటి నుంచి సనా తన ధర్మాన్ని విశ్వసించే ప్రతిఒక్కరూ ఆందోళనతో ఉన్నార న్నారు. పవిత్ర క్షేత్రం తిరుమలలో గత పాలక మండళ్లు చేసిన నిర్ణయాలు,వారిపాలన తీరును సమగ్రంగా సమీ క్షించి, సంస్కరించే బాధ్యతను సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని, తప్పుడు నిర్ణయాలు, అపవిత్ర కార్యాలకు కారకులైన వారిని నిబంధనల ప్రకారం బాధ్యులను చేస్తామని డిప్యూటీ సీఎం పవన్‌ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *