గ్రామగ్రామాన వారంపాటు సాగే పల్లె పండుగ నిండుగా ప్రారంభమవడం.. మహాదానందం. జట్టుగా అడుగులేస్తే రాష్ట్రాభివృద్ధి పరుగు తీస్తుందని -కూటమి ఏర్పాటు సమయంలోనే నమ్మాను. నా నిర్ణయం సరైనదని -నాలుగు నెలల పాలనలో చూశాను. ప్రజల కోసం తీసుకునే ఏ నిర్ణయమైనా.. వారి మధ్యే జరగాలి. వారితోనే జరగాలి. వారివల్లే జరగాలి. ఇదీ -ప్రభుత్వ ఉద్దేశం. గుట్టుమట్లకు తావివ్వని పారదర్శక పాలనతోనే వెళ్తున్నాం. గత ఆగస్టు 23న నిర్వహించిన గ్రామసభల్లో 30 వేల పనులకు ప్రజలే తీర్మానాలు చేశారు. ‘పల్లె పండుగ’లో వాటికి ప్రజలే శంకుస్థాపనలు చేస్తారు. సంక్రాంతికి ప్రజలే పనులు పూర్తి చేస్తారు. ప్రతి పలెలో సాగుతున్న ప్రగతి పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలి. అవుతారనే ఆశిస్తున్నా.

పరిపాలనాదక్షుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా రావడం రాష్ట్రం చేసుకున్న అదృష్టం. రాష్ట్ర శ్రేయస్సుకు పరితపించే వ్యక్తిగా నాకు, మనందరికీ స్ఫూర్తి. సహకరించే కేంద్రం, దిశానిర్దేశం చేయగల ప్రధానిగా నరేంద్రమోదీ ఉండటం రాష్ట్రానికి వరం. నిజంగా ఆంధ్రపదేశ్‌కు ఇవి అమృత గడియలు. పల్లెల ప్రగతి రథ చక్రాలను పరిగెత్తించి.. సుందర గ్రామాలను సాకారం చేసుకోదగ్గ ఘడియలు. ప్రజల కోసం ప్రజలు సాధించుకునే అద్భుతాలు -పల్లెలు కావాలి. అవి -సంక్రాంతి శోభతో పరిఢవిల్లాలి.

– ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌

దాదాపు శతాబ్ధంన్నర క్రితం -ఆఫ్‌ ద పీపుల్‌.. బై ద పీపుల్‌.. ఫర్‌ ద పీపుల్‌ అంటూ ప్రజాస్వామ్యానికి చారిత్రక అర్థం చెప్పాడు అమెరికా అధ్యక్షడు అబ్రహాం లింకన్‌. ఆ కాన్సెప్ట్‌ని బలంగానే అడాప్ట్‌ చేసుకుంది భారత్‌ కూడా. అయితే ఇటీవలి కాలంలో.. ‘ప్రజల కొరకు.. ప్రజల చేత..’ అన్న సమున్నత ఉద్దేశం చాలా సందర్భాల్లో మాటలకే పరిమితమవుతోంది తప్ప.. ఆచరణలో సత్యదూరమన్నది యథార్థం. చాలాకాలం తరువాత ఆ కాన్సెప్ట్‌ -ఇప్పుడు మళ్లీ కళ్లముందుకొచ్చింది. అదే -‘పల్లె పండుగ’. మీ గ్రామాల ఆలనా పాలనా మీదేనంటూ ఎన్డీయే సర్కారు -ఆదర్శవంతంగా.. నీతివంతంగా, పారదర్శకంగా మొదలుపెట్టిన పండుగను -ప్రజలే జరుపుకోవాలి. ప్రజలే పరిరక్షించుకోవాలి. ప్రజలే బాధ్యత తీసుకోవాలి. అప్పుడే -ప్రజల కోసం.. ప్రజల చేత.. ప్రజలే చేసుకుంటున్న పెద్ద పండుగ అవుతుంది. ప్రగతి పండుగవుతుంది. ప్రజాస్వామ్యంలో ఇదొక నిజమైన పండుగగా నిలుస్తుంది. 30 వేల పనులు.. రూ.4,500 కోట్ల నిధులు. సంక్రాంతికి పనులు పూర్తవ్వాలన్న ప్రణాళికలు. సమన్వయమవుతున్న ప్రభుత్వ శాఖలు. పర్యవేక్షణకు సన్నద్ధమవుతున్న అధికార్లు. మహాత్కార్యం గొప్పగా సాగాలని కోరుకుంటున్న ప్రభుత్వ భాగస్వాములు. మరుగున పడుతున్న గొప్ప సంస్కృతికి ఊపిరి పోయాలని తపనపడుతున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. ప్రజలతో సమ్మిళతమైన ప్రభుత్వం -వారంపాటు సాగించే పండుగ.. రాష్ట్రానికి గొప్ప వెలుగులు ఇస్తుందనడంలో సందేహాలు అక్కర్లేదు. అభివృద్ధి లక్ష్యంగా సంప్రదాయ సంస్కృతికి ఊపిరి పోస్తుందనడంలో అనుమానాలూ అక్కర్లేదు!! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *