కళ్లముందు కనిపించే ఉక్కుమనిషి -చంద్రబాబు. మనసులో ఒకటనుకుంటే -ఆ కార్యం నెరవేరేవరకూ చలించని స్థితప్రజ్ఞుడు. ఇది ముఖస్థితి కాదు, 40యేళ్ల ఆయన రాజకీయ జీవితాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే.. మూలాల్లో దొరికే సారం. ఉమ్మడి రాష్ట్రానికి ప్రభుత్వాధినేతగా ఉన్నపుడూ.. విభజిత రాష్ట్రానికి తొలి ప్రభుత్వాధినేత అయినపుడూ.. – ఆయన పాలనలోని ఎన్నో ఘట్టాలు ఈ విషయాన్ని రుజువు చేస్తాయి. 2024 ఎన్నికలకు వెళ్తున్న సమయంలోనే ‘నా సత్సంకల్పం.. స్వర్ణాంధ్రం’ అని ప్రకటించుకున్న చంద్రబాబు.. ఆ స్వప్న సాధన దిశగానే అడుగులేస్తున్నారు. గత పాలకుల అసమర్థ విధానాలతో విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించే పనిలోనే ముందుకు సాగుతున్నారు. గద్దెనెక్కిన క్షణం నుంచే ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుంటూ వచ్చిన చంద్రబాబు.. వంద రోజుల పాలనతో ప్రజా హృదయాలను గెలిచారు. అసమర్థ రాజకీయులు.. అసత్యాల ప్రచారంతో పాలనా పరుగుకు అడ్డుపడుతున్నా పట్టించుకోకుండా సంకల్ప సాధన దిశగా చంద్రబాబు అడుగులేస్తున్నారని చెప్పడానికి -రెండు రోజుల హస్తిన పర్యటన నిలువుటద్దం. కూటమి అధికారం చేపట్టిన తరువాత రాష్ట్రంలోని జటిల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నామని చెప్తోన్న ముఖ్యమంత్రి.. స్వర్ణాంధ్రప్రదేశ్‌ 2047 విజన్‌ డాక్యుమెంట్‌ రూపకల్పనపై దృష్టి పెట్టామని అంటున్నారు. హస్తిన పర్యటనలో రాష్ట్ర వాస్తవ పరిస్థితిని ప్రధాని మోదీ ముందుంచిన చంద్రబాబు -సత్సంకల్ప సాధనకు కేంద్రం సహకారం తీసుకోవడంలోనూ విజయం సాధించినట్టే కనిపిస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్‌కు ఇదొక శుభపరిణామం!!

‘విజన్‌ డాక్యుమెంట్‌లో పొందుపర్చాల్సిన అంశాలను ప్రధాని నరేంద్రమోదీతో చర్చించాం. నవంబరు 1నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్‌ 2047 విజన్‌ డాక్యుమెంట్‌ రూపకల్పన పూర్తవుతుందనే అనుకుంటున్నా. రాష్ట్రంలో పేరుకున్న జటిల సమస్యలకు వంద రోజుల్లో పరిష్కారాలు కనుగొన్నామన్న ఉత్సాహం ఎన్డీయే కూటమిలో కనిపిస్తోంది. ఢిల్లీ పర్యటన తరువాత నిర్దేశించుకున్న ప్రణాళికల్లో -రెండేళ్లలో పోలవరం తొలి దశ పూర్తిచేస్తాం. వచ్చే ఏడాది చివరికి భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తి చేస్తాం. రూ.85 వేల కోట్లతో బీపీసీఎల్‌ రిఫైనరీని రాష్ట్రంలో నెలకొల్పే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. లక్ష కోట్లతో గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టులు రాబోతున్నాయి. ఇక ప్రధానమైన ఉక్కు సమస్య పరిష్కారానికి విస్తృత చర్యలు జరుపుతున్నాం. ఈ అంశంపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో అన్ని కోణాల్లో చర్చించాం’… ఇదీ – ఢిల్లీ టూర్‌కి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్యాక్ట్‌ షీట్‌లోని సంక్షిప్త సారాంశం. 

అడగనిదే అమ్మయినా పెట్టదు! 

అలాంటిది అడగకుంటా కేంద్రం పెడుతుందా? పెట్టదుగాక పెట్టదు. జగన్‌ జమానాలో అదే జరిగింది. చంద్రబాబు పాలనలో జరగాల్సిందే జరుగుతుంది. జగన్‌ గద్దెనెక్కే సమయానికి అతని నెత్తిన సవాలక్ష కేసులు. ముఖ్యమంత్రి హోదాలో కేంద్రం వద్దకెళ్లిన ప్రతిసారీ.. తనను రక్షించమని అడుక్కోవడమే తప్ప.. రాష్ట్రానికి నిధులు విదల్చమని అడిగిన పాపాన పోలేదు.  ఆ విషయాన్ని గత ఐదేళ్ల జగన్‌ జమానా చూసి చెప్పొచ్చు. ఎన్డీయే సర్కారు గద్దెనెక్కి ఐదు నెలలవుతున్నా.. ఏం సాధించిందంటూ పాచినోళ్లతో నిస్సిగ్గుగా ప్రశ్నించే వైకాపా’లకు -చంద్రబాబు రెండురోజుల ఢిల్లీ టూర్‌ని చూపిస్తే చాలు! సిగ్గుతో తలలు ఎక్కడో పెట్టుకోవాలి!!

జూలై 12న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత -అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు హస్తినకు పోయిరావడం ఇది మూడోసారి. వెళ్లిన ప్రతిసారీ.. రాష్ట్రానికి ఏంకావాలో నిక్కచ్చిగా అడిగి తెచ్చుకోవడం ఆయన సమర్థతకు గీటురాయి. రెండు రోజుల హస్తిన పర్యటనలో భాగంగా గత సోమవారం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు, విమానం దిగడంతోనే ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి ప్రాణప్రదమైన రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు నిధుల సంగతేంటని ప్రస్తావించారు.  రాష్ట్రంలో వివిధ రహదారుల అభివృద్ధి, రైల్వేజోన్‌ శంకుస్థాపన, సెయిల్‌లో విశాఖ స్టీల్‌ విలీనం, వరద వైపరీత్యానికి కేంద్రం అందించాల్సిన సాయం.. ఇతరత్రా అంశాలను ప్రధాని మోదీవద్ద ప్రస్తావించారు. పనిలో పనిగా విభజన హామీల పరిస్థితినీ చర్చించారు. ఏపీ దుస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గుక్కతిప్పకుండా గంటపాటు ప్రధానికి ఏకరవు పెట్టిన చంద్రబాబు -లక్ష్య సమయానికి స్వర్ణాంధ్ర సాధించాలంటే కేంద్రం నుంచి ఎలాంటి సహకారం ఆశిస్తున్నారో.. ఆ విషయాలనూ మోదీ మెదడుకు ఎక్కించారు. 

‘ప్రధాని మోదీతో సానుకూల వాతావరణంలో సాగిన సమావేశం ఫలప్రదమైంది. రాష్ట్ర ప్రగతిలో కీలక భూమిక పోషించే పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను కేబినెట్‌ ఆమోదించింది. ఏపీ అభివృద్ధికి కేంద్రం పరిధిలో చేయతగిన సాయం చేస్తాననీ మోదీ మాటిచ్చారు. ఆర్థిక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న ఏపీకి కేంద్రం భరోసా దొరకడం, రాజధాని అమరావతికి కేంద్రం మద్దతివ్వడం ఆనందదాయకం. అందుకు మోదీజీ.. థాంక్స్‌’ అంటూ సింపుల్‌ ట్వీటేశారు చంద్రబాబు. మరో సీజన్‌ నష్టపోకముందే.. పోలవరం పనులు ప్రారంభించడానికి.. నవంబర్‌లో నదీ ప్రవాహం నెమ్మదించగానే కొత్త డయాఫ్రంవాల్‌ నిర్మాణ పనులు మొదలెట్టడానికీ ‘ఓకే’ అనిపించేసుకుని.. వేసవికల్లా పనులు పూర్తిచేస్తానన్న మాటిచ్చి బయటికొచ్చారు చంద్రబాబు. అదికదా కార్యదక్షత! అనకుండా పలా ఉండగలం.

ప్రధాని భేటీతోనే పనైపోయినట్టని -విశ్రాంతి తీసుకోలేదు చంద్రబాబు. ముఖ్యమంత్రి అధికార నివాసానికి కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్టవ్‌ను మర్యాదపూర్వకంగా ఆహ్వానించి.. కాగల రైల్వే ప్రాజెక్టుల కార్యాన్ని అక్కడే చక్కబెట్టారు. పర్యటనలో రెండోరోజైన మంగళవారం ఢిల్లీ మీడియాతో మాట్లాడుతూ.. ‘విశాఖ రైల్వే జోన్‌ గురించి మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో చర్చించాను. విశాఖ రైల్వే జోన్‌కు గత ప్రభుత్వం భూమివ్వకుండా తాత్సారం చేసింది. కూటమి ప్రభుత్వం రాగానే రైల్వే జోన్‌కు భూమినిచ్చాం.  డిసెంబర్‌లో విశాఖ రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేస్తున్నాం. విశాఖ రైల్వే జోన్‌లోనే వాల్తేరు రైల్వే డివిజన్‌ ఉంటుంది. జఠిలమైన సమస్యకు పరిష్కారం దొరికింది. ఇక -హౌరా నుండి చెన్నై నేషనల్‌ హైవే రెండు లేన్లను నాలుగు లేన్లగా మారుస్తున్నారు. గూడ్స్‌, రైళ్ల రాకపోకలు పెరుగుతాయి. శ్రీకాకుళంనుండి నెల్లూరువరకు పట్టణాలన్నీ అనుసంధానమవుతాయి.  ఏకకాలంలో ఎకనమిక్‌, పోర్టు డెవలప్‌మెంట్‌తోపాటు ఉపాధి అవకాశాలు విస్తృతమవుతాయి. విజయవాడ నుంచి అమరావతి, మచిలీపట్నం టు రేపల్లె రైల్వేలైనుకు కేంద్రం ఓకే చెప్పింది. బుల్లెట్‌ ట్రైన్‌ ద్వారా సౌత్‌ ఇండియాలోని నాలుగు ప్రధాన (అమరావతి, చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు) నగరాలను అనుసంధానించాని కోరాం. దేశంలోని కీలకమైన ఎకనమిక్‌ హబ్‌లగుండా బులెట్‌ ట్రైన్‌ ప్రయాణముంటుంది. ఈ ప్రయోగం ఎకానమీ ఆక్టివిటీస్‌ని విస్తృతం చేయడానికే. 2027నాటికి బులెట్‌ ట్రైన్‌ పనులు ప్రారంభం కావొచ్చు. రాష్ట్రంలోని ప్రతీ రైల్వేస్టేషన్‌ ఆధునీకరించాలని అడిగాను. నడికుడి టు శ్రీకాళహస్తి, కోటిపల్లి టు నరసాపురం, కడప టు బెంగళూరు లైన్ల కోసం కేంద్రం మ్యాచింగ్‌ గ్రాంట్‌ అడుగుతోంది. దీనిమీద ఆలోచన చేయాలి. రాష్ట్రంలో రూ.75 వేల కోట్ల రైల్వేపనులు జరుగుతున్నాయని చెప్పడం హ్యాపీగా ఉంది’ అని చంద్రబాబు ప్రకటించడం.. ముందురోజు చక్కబెట్టిన వ్యవహారమే. 

‘దీర్ఘకాలంగా పెండిరగ్‌లోవున్న విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటు హామీని ముందుకు తీసుకెళ్లినందుకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్టవ్‌కు ధన్యవాదాలు. డిసెంబరులో కొత్త జోన్‌కు శంకుస్థాపన చేస్తారని ఆకాంక్షిస్తున్నా. ఏపీలో లాజిస్టికల్‌ కమ్యూటర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేయడానికి భారతీయ రైల్వేలతో భాగస్వామ్యం కోసం ఏపీ ఎదురుచూస్తోంది. అడిగినవన్నీ ఇచ్చిన రైల్వే మంత్రి వైష్టవ్‌కు ఒక థాంక్స్‌’ అంటూ ఇక్కడా ట్వీటేశారు చంద్రబాబు.

ఇక మంగళవారం ఉదయం నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యకలాపాలు మొదలయ్యాయి. ముందుగా -కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీతో భేటీ అయిన చంద్రబాబు.. అమరావతి ఓఆర్‌ఆర్‌ సహా జాతీయ రహదారుల అభివృద్ధికి నిధుల కేటాయింపులపై చర్చించారు. సాయంత్రం పెట్రోలియం మంత్రి హర్దీప్‌సింగ్‌ పురీతో భేటీ అయ్యారు. తదుపరి కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో, రాత్రి 8 గంటలకు హోంమంత్రి అమిత్‌ షాతో, 11.15 గంటలకు నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు వరుస భేటీలు సాగించి.. కేంద్రం ఇవ్వాల్సింది, రాష్ట్రానికి రావాల్సింది మొహమాటం లేకుండా అడిగి సాధించుకున్నారు.

మొత్తానికి రెండురోజుల ఢిల్లీ టూర్‌తో -కేంద్రానికి చెప్పాల్సింది చెప్పారు. కేంద్రాన్ని -అడగాల్సింది అడిగారు. కేంద్రం -ఇచ్చిందేదో తీసుకున్నారు. కేంద్రం నుంచి ఇంకేంకావాలో -ప్రతిపాదనలు పెట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గడిచిన ఐదేళ్లలో జరిగిన విధ్వంసాన్ని మళ్లీ మళ్లీ ప్రధాని మోదీకి వివరిస్తూనే…‘స్వర్ణాంధ్ర విజన్‌ డాక్యుమెంట్‌’ను ప్రధాని ముందుపెట్టారు చంద్రబాబు.

నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీని ఏపీలో నెలకొల్పేందుకు కేంద్రం సానుకూలంగా ఉంది. దీంతో సెమీ కండక్టర్స్‌ ఇండస్ట్రీకి డిమాండ్‌ పెరగొచ్చు. ఎలాగనే దానిపై వర్కవుట్‌ చేసి, లాభనష్టాలు బేరీజు వేసుకుని ముందుకెళ్లాం. ఫ్యాబ్రికేషన్‌ ఇండస్ట్రీకి ఏపీని కేరాఫ్‌గా మార్చి.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తా. డేటా సెంటర్‌కు మంచి ఫ్యూచరుంటుంది. దీనిపై కేంద్రానికి నివేదించాం.. ఏపీలో అందుకు సంబంధించిన వ్యవస్థను రూపొందిస్తాం. ఏఐని సమగ్రంగా వినియోగించి సత్వర పాలనలో సత్వర ఫలితాలు సాధిస్తాం. గతంలో ఐటీని ప్రోత్సహించించిన విధంగానే నేడు కృత్రిమ మేథను ప్రోత్సహించే యోచన లేకపోలేదు. 

పోలవరం తొలి దశకు రూ.12,500 కోట్లకు ఆమోదం తెలిపి సోమవారం కొంత విడుదల చేసినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపాను. తొలిదశ రెండేళ్లలో పూర్తి చేసేందుకు శ్రీకారం చుట్టాం. అమరావతి నిర్మాణానికి ప్రపంచబ్యాంకు తొలిదశ కింద రూ.15 వేల కోట్లు ఇస్తామని చెప్పింది. అక్కడ డిసెంబరు నుంచి రహదారులు, భవనాల పనులు ప్రారంభమవుతాయి. నిర్దిష్ట గడువు పెట్టుకొని వాటిని పూర్తిచేస్తాం. తీరప్రాంతంలో ఉన్న 20 వేల ఎకరాల ఉప్పు భూమిని పరిశ్రమల అవసరాల కోసం ఇవ్వాలని కేంద్ర వాణిజ్యమంత్రి పీయూష్‌ గోయల్‌ను కోరాం. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి ఒక కమిటీ వేశాం. లెదర్‌ పాలసీ తీసుకొస్తే డబ్బులిస్తామన్నారు.

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఎక్స్‌ప్రెస్‌ హైవే ఏర్పాటు కోరుతూ కేంద్రానికి నివేదించాం. అమరావతి 183 కి.మీ ఔటర్‌రింగ్‌ రోడ్‌పైనా కేంద్రంతో చర్చించాం. విజయవాడ వెస్టర్న్‌ బైపాస్‌ పూర్తవ్వగానే ఈస్టర్న్‌ బైపాస్‌ ప్రారంభిస్తామని గడ్కరీ చెప్పారు. రాష్ట్రంలోని స్టేట్‌ హైవేలు పూర్తి చేయాలని గడ్కరీని కోరాను. రహదారులకు సంబంధించి ఇప్పటికే రూ.50 వేల కోట్ల విలువైన పనులు నడుస్తున్నాయి. రెండేళ్లలో యుద్ధ ప్రాతిపదికన హైవేలు పూర్తి చేయాలని కోరాం. కుప్పం- హోసూరు గ్రీన్‌ ఫీల్డ్‌ ప్రాజెక్ట్‌ రోడ్‌, మూలపేట నుండి వైజాగ్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారి ఏర్పాటుతో ఇండస్ట్రియల్‌ హబ్‌ ఏర్పాటు చేయాలని కోరాం. భోగాపురం ఎయిర్‌ పోర్టుకు, విశాఖ బీచ్‌కు ఈ రోడ్‌ను అనుసంధానిస్తాం. 2025 డిసెంబర్‌ నాటికి భోగాపురం ఎయిర్‌ పోర్టు పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరాం. 

రాష్ట్రంలో బీపీసీఎల్‌ రిఫైనరీ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ఇందుకోసం రామాయపట్నం, మచిలీపట్నం, మూలపాడులను పరిశీలిస్తోంది. అవసరమైతే కృష్ణపట్నం కూడా చూడమని కోరాం. తొలుత మచిలీపట్నం అనుకున్నాం. అయితే అక్కడ లోతట్టు భూములున్నందున సమస్యలు వస్తాయన్నారు. రామాయపట్నం వద్ద స్థలం అడిగారు. దేనికైనా మేం సిద్ధంగా ఉన్నట్లు చెప్పాం. దానివల్ల రూ.85 వేల కోట్ల పెట్టుబడి వస్తుంది. నేషనల్‌ హైడ్రోపవర్‌ కార్పొరేషన్‌ ఏపీ జెన్కోతో కలిసి రూ.లక్ష కోట్ల పెట్టుబడితో గ్రీన్‌ హైడ్రోజన్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి వచ్చేనెలలో విశాఖపట్నంలో శంకుస్థాపన జరుగుతుంది.

అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌వే జోలికి ప్రస్తుతానికి పోవడంలేదు. గతంలో ఈ రెండు ప్రాంతాల మధ్య మేం ప్రతిపాదించిన రోడ్డును గత ప్రభుత్వం మార్చింది. అయినా దాన్ని చెడగొట్టాలనుకోవడంలేదు. జగన్‌ చేసినట్లు నేనూ చేస్తే అర్థముండదు. గతంలో మేం కొత్తవలస మండలంలో ప్రతిపాదించిన గిరిజన యూనివర్సిటీని సాలూరుకు తరలించారు. ఇప్పుడు దాన్ని కొత్తవలసకు మారిస్తే మళ్ళీ మొదటికొచ్చే ప్రమాదముంది. అందువల్ల సాలూరులోనే కొనసాగించాలని నిర్ణయించాం. ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేయడంపై దృష్టిపెట్టాం తప్పితే సమస్యగా మార్చాలనుకోవడంలేదు. ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్‌ పార్కుల పనులు కూడా ప్రారంభిస్తాం. లెథర్‌ పాలసీ తీసుకొచ్చి ప్రమోట్‌ చేస్తాం. పీఎం ఉజ్వల కింద ఏపీకి ఇవ్వాల్సిన 65 లక్షల కనెక్షన్లు ఇవ్వాలని కోరాం. దీపం పథకం కింద కేటాయించాలని కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ను అడిగాను. 

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, ఉక్కుమంత్రి కుమారస్వామిలతో చర్చించాం. దీని పునరుద్ధరణకు ఉన్న వివిధ ప్రత్యామ్నాయమార్గాలపై సమాలోచనలు జరిపాం. గత కొన్నేళ్లపాటు శ్రద్ద పెట్టకుండా ఖాయిలా పడే స్థితికి తీసుకొచ్చారు. ఇప్పుడు రూ.1,400 కోట్ల నిధులిచ్చి ఒక ఫర్నేస్‌ పనిచేసేలా చూశారు. బీఏఎస్‌ఆర్‌కు వెళ్లే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆ డబ్బులు ఇవ్వడం వల్ల బ్యాంకులు కొంత వేచి చూస్తున్నాయి. ఈ సంస్థను పూర్తిగా పునరుద్ధరించడానికి కసరత్తు చేస్తున్నారు. ఇబ్బందులను అధిగమించి శాశ్వత పరిష్కారం కనుగొనే అంశంపై చర్చిస్తున్నాం. ఇది తెలుగుజాతి ఆత్మగౌరవం, మనోభావాలకు సంబంధించిన విషయం. కానీ ఇన్నాళ్లు దీన్ని సక్రమంగా నడవకుండా చేశారు. ఇందులో ఎవరి భాగస్వామ్యం ఎంతుందన్న సమాచారం నా దగ్గర లేదు.

ప్రస్తుతానికి పెట్టుబడుల ఉపసంహరణ ఆగినా, పరిశ్రమ నడవడానికి డబ్బులు కావాలి. సెయిల్‌లో విలీనం చేయాలన్నది ఒక ప్రత్యామ్నాయం. అందుకు సెయిల్‌, కేంద్ర ప్రభుత్వం అంగీకరించాలి. ఎన్‌ఎండీసీకి భూములిచ్చి కొంత డబ్బు తీసుకున్నా అది తాత్కాలిక పరిష్కారమే తప్పితే శాశ్వత పరిష్కారం లభించదు. సమగ్రంగా ప్యాకేజీ కింద ఆలోచిస్తే తప్ప పునరుద్ధరించడం అసాధ్యం. ప్రైవేటీకరించకుండా దాన్ని కాపాడుకొనే ప్రత్యామ్నాయ మార్గాలన్నింటి గురించి ఆలోచిస్తున్నాం. కేంద్రంతో చర్చించి నిర్ణయం తీసుకున్న తర్వాత శ్వేతపత్రం విడుదల చేస్తాం.

గత ప్రభుత్వం జల్‌ జీవన్‌ మిషన్‌ నిధులను సరిగా వినియోగించలేదు. కుళాయి ద్వారా నీళ్లందించే అవకాశాన్ని ఉపయోగించలేదు. ఎఫ్‌ఆర్బీఎం పరిధిదాటి గత ప్రభుత్వం ఇష్టారీతిన అప్పులు చేసింది. రూ.10 లక్షల కోట్లకుపైగా అప్పుల భారాన్ని గత ప్రభుత్వం మిగిల్చింది. రాష్ట్రానికి ఆర్థిక సాయం కోసమే కేంద్రంతో పదేపదే మాట్లాడుతున్నాం. ఇదీ చంద్రబాబు ఢిల్లీ టూర్‌. సూపర్‌ సక్సెస్‌ అని చెప్పడానికి ఎలాంటి కొలమానాలు కావాలి? చంద్రబాబు సమర్థతను చూసి నేర్చుకోమని -వైకాపాలకు చెప్పడానికి ఎందుకు సందేహించాలి!!

చేయడానికి చాలా ఉంది..!

ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు. ఇదీ – సీఎం చంద్రబాబు లక్ష్యం. ఆ సంకల్ప సాధనలో కీలక భూమిక ‘సీడాప్‌’దే (సొసైటీ ఫర్‌ ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ అండ్‌ ఎంటర్‌ప్రైజ్‌ ఇన్నోవేషన్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌). లక్ష్య సాధనలో చైర్మన్‌గా నన్ను భాగస్వామిని చేయడం నా అదృష్టం. ఉద్యోగాల కల్పనలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు నాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా.. చిత్తశుద్ధితో గురుతర బాధ్యత నిర్వర్తిస్తా.

– గుణపాటి దీపక్‌రెడ్డి.

ఎన్డీయే సర్కారు నామినేటెడ్‌ పదవుల పందేరంలో సీడాప్‌ చైర్మన్‌ పదవి అందుకున్నారు మాజీ ఎమ్మెల్సీ గుణపాటి దీపక్‌రెడ్డి. విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన దీపక్‌ -దస్త్రంపై సంతకం చేస్తూ చేసిన ప్రకటనే పై సారాంశం. యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో కీలక భూమిక పోషించనున్న సీడాప్‌ చైర్మన్‌గా -లక్ష్య సాధనకు అహర్నిశలూ కృషిచేస్తానన్నది బాధ్యతలు స్వీకరించే సమయంలో దీపక్‌ ఇచ్చిన ప్రామిస్‌. నిజానికి సీడాప్‌కు అంత ప్రాధాన్యత ఉందా? అంటే ఉందనే చెప్తున్నారు దీపక్‌రెడ్డి. దేశంలోని అతిపెద్ద నైపుణ్య సంస్థల్లో ఒకటిగా 2015లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో ప్రాధాన్యత సంతరించుకున్న ఈ నోడల్‌ ఏజెన్సీ -వేతన ఉపాధి, స్వయం ఉపాధి, వ్యవస్థాపకతలో యువత స్థిరపడేందుకు లెక్కలేనన్ని అవకాశాలు కల్పిస్తోంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో యవతకు వివిధ నైపుణ్య కార్యక్రమాలు అమలు చేస్తోన్న నోడల్‌ ఏజెన్సీలో -లెక్కలేనన్ని సక్సెస్‌ స్టోరీలు. దీనదయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్‌ యోజన (డీడీయూ-జీకేవై) పథకంలో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామిగా చేరడంతో డీఆర్డీఏ ఆధ్వర్యంలో సీడాప్‌ నడుస్తోంది. 18-35 ఏళ్ల మధ్య వయస్కుల గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి ఆధారిత, మార్కెట్‌ ఆధారిత నైపుణ్య శిక్షనివ్వడం ద్వారా -సంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది సీడాప్‌ ముఖ్యోద్దేశం. వ్యవసాయం, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ హార్డ్‌వేర్‌, రిటైల్‌, టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్‌, టెలికాం, ఆటోమోటివ్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, కన్‌స్ట్రక్షన్స్‌, లైఫ్‌ సైన్సెస్‌, విద్యుత్‌, మైనింగ్‌.. ఇలా సుమారు 38 సెక్టర్లలో లెక్కలేనన్ని విభాగాల్లో యువతకు నైపుణ్య శిక్షణనిచ్చే కార్యక్రమాలు ఇందులో పొందుపర్చారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 140 కేంద్రాలుగా విస్తరించివున్న ఈ నోడల్‌ ఏజెన్సీ ద్వారా -యువతకు విస్తృత అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో పరుగులు మొదలుపెట్టింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించివున్న కేంద్రాల్లో 35 వరకూ ప్రభుత్వ నిర్వహణలో ఉన్నవేనని, మిగతా కేంద్రాలను కేంద్రం నుంచి అనుమతులు పొందిన ప్రయివేట్‌ వ్యక్తులు నిర్వహిస్తున్నారని వివరించారు దీపక్‌రెడ్డి. సిడాప్‌ కేంద్రాలలో నైపుణ్య శిక్షణ మాత్రమే కాదని, శిక్షణపొందిన విభాగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతను ఆయా కేంద్రాలే నిర్వర్తిస్తాయన్నారు. 70శాతానికి మించి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించలేకపోయినా.. నైపుణ్య శిక్షణకు వచ్చిన అభ్యర్థులను సమర్థులుగా తీర్చిదిద్దలేకపోయినా.. ఆయా కేంద్రాలపై చర్యలు తీసుకునేందుకు నియమ నిబంధనలు ఉండటంతో.. అన్ని కేంద్రాలు మెరుగైన ఫలితాలే ఇవ్వగలవన్న ఆశాభావం వ్యక్తం చేశారు. చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న సమయంనుంచే పునర్నిర్మాణ ప్రక్రియ మొదలైందన్నారు. అన్ని శిక్షణ కేంద్రాలను బలోపేతం చేసి.. అభ్యర్థుల హాజరీని పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు దీపక్‌రెడ్డి వెల్లడిరచారు. కేంద్రాలలో అభ్యర్థుల హాజరీని నిర్దేశించుకున్న లక్ష్యాలమేరకు పెంచుతూనే.. రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించే యోచన ఉందన్నారు. ఉద్యోగ, ఉపాధి నైపుణ్య విద్యను కళాశాలల్లో కరికులంగా చేసి.. శిక్షణను ప్రత్యేక పీరియడ్‌గా నిర్దేశించే యోచన లేకపోలేదన్నారు. దీనివల్ల కాలేజీల నుంచి బయటకు వచ్చే గ్రాడ్యుయేట్లు..ఏదోక నైపుణ్యంలో సుశిక్షితులై ఉంటారని.. దీనివల్ల విద్యార్థులపై కెరియర్‌ వత్తిళ్లు పూర్తిగా తగ్గుతాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించే కార్యక్రమం కనుక.. నిధుల సమీకరణ ఇబ్బందులు పెద్దగా ఉండకపోవచ్చని ఛైర్మన్‌ దీపక్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘స్టేట్‌ ఫర్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ కమ్యూనికేన్ల శాఖామంత్రిగావున్న పెమ్మసాని చంద్రశేఖర్‌ నిధులకు ఢోకా లేదని భరోసా ఇచ్చారు. ప్రాజెక్టును ఎంత విస్తృతం చేయగలిగితే అంత విస్తృతం చేయమంటూ యువనేత, ఐటీ మంత్రి నారా లోకేష్‌ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వంలో కీలక స్థాయిలోవున్న మంత్రులు, ఇతర నేతల సహాయ సహకారాలతో నూరుశాతం లక్ష్యాలను అధిగమించగలను’ అని దీపక్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘రాష్ట్రానికి విస్తృతంగా పరిశ్రమలు రాబోతున్నాయి. ఆయా పరిశ్రమలకు మానవ వనరుల అవసరం లెక్కలేనంత ఉంది. ఈ దిశగా లక్ష్యాల సాధనవైపు పరుగులు తీస్తామని దీపక్‌రెడ్డి వెల్లడిరచారు. ‘కాలేజీలనుంచి, వర్శిటీలనుంచి గ్రాడ్యుయేట్లు బయటికొస్తున్నారేగానీ, మార్కెట్‌ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలు మిస్సవుతున్నారు. ఆ వత్యాసాన్ని సమతుల్యం చేయగలిగితే.. యువతకు లెక్కలేనన్ని అవకాశాలు. ఆ కర్తవ్య నిర్వహణ సీడాప్‌నుంచి జరగాలన్నది సీఎం ఆలోచన. అందుకే -మార్కెట్‌లోని 38 సెక్టార్లలో అవసరాలేంటో తెలుసుకునే పనికి శ్రీకారం చుట్టాం. మర్కెట్‌ రిక్వైర్‌మెంట్‌ తెలుసుకుని.. అందుకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలన్నది సీడాప్‌ ఆలోచన’ అంటున్నారు చైర్మన్‌ దీపక్‌రెడ్డి. గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణనిచ్చి క్యాంపస్‌ సెలెక్షన్స్‌తో కార్పొరేట్‌ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలని మనసారా ఆశిద్దాం. చైర్మన్‌ దీపక్‌రెడ్డికి బెస్టాఫ్‌ లక్‌!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *