సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు తమతమ గమ్యస్థానాలకు చేరేందుకు ఇతోధిక సేవలందిస్తోన్న సంస్థ -ఆర్టీసీ. ప్రభుత్వరంగంలో సేవాతత్పరతతో నడుస్తోన్న సంస్థ పరిరక్షణకు అహరహం కృషిచేస్తానని మాటిస్తున్నా. ఆర్టీసీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదాయం పెంచుకుని, ఖర్చులు నియంత్రించుకునే మార్గాలు అన్వేషించాలి. ఎలక్ట్రానిక్ బస్సులతో ఆ లక్ష్యాలను చేరుకోగలమనే అనుకుంటున్నా. ఆ దిశగా అధ్యయనాలు చేస్తా. ఇక, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుకు సీఎం చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు. ప్రభుత్వ విధానాల అమలుకు చిత్తశుద్ధితో కృషి చేస్తా. ఆర్టీసీకి ప్రయాణికులు ఎంత ముఖ్యమో, సంస్థ కార్మిక వర్గాల శేయస్సూ అంతే ముఖ్యం. ఆర్టీసీ కార్మిక సంఘాలకు అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం నాది. కార్మికుల, ఉద్యోగుల సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. సమస్యలు, సవాళ్లను అధిగమిస్తూ.. ఆర్టీసీ ప్రగతి చక్రాలను వేగంగా పరిగెత్తించేందుకు కృషి చేస్తాను. ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిలబెడుతూ ఆర్టీసీని లాభాలబాట పట్టించడమే నాముందున్న తక్షణ కర్తవ్యం.
– కొనకళ్ల నారాయణరావు, ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ చైర్మన్‌గా కొనకళ్ళ నారాయణరావు శనివారం విజయవాడలోని ఎన్టీఆర్ పరిపాలన భవనం, ఆర్టీసీ కార్యాలయంలో రాష్ట్ర రవాణా యువజన మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి సమక్షంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కొత్త ఛైర్మన్‌ను మంత్రి మండిపల్లి దుశ్శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. కొనకళ్ల బాధ్యతల స్వీకార కార్యక్రమానికి మంత్రులు కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, ఎమ్మెల్యే వెనిగళ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు, దూళిపాళ్ల నరేంద్ర, నరేంద్ర వర్మ, హీరో సుమన్, నాగుల్ మీరా, అడ్వకేట్ రామకృష్ణ ప్రసాద్, ఆర్టీసీ అధికారులు బ్రహ్మానంద రెడ్డి, చంద్రశేఖర్, రవివర్మ, ఎంవై దానం, నాయకులు, అభిమానులు పెద్దఎత్తున హాజరై అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిధిగా అభినందన సభ నిర్వహించారు. కార్యక్రమంలో కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. మచిలీపట్నం ఎంపీగా రెండు పర్యాయాలు సేవలందించిన కొనకళ్ల నారాయణరావు రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారన్నారు. పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లును ఆమోదించే సమయంలో రాష్ట్రం కోసం పరితపించి గుండెపోటుతో స్పృహతప్పి పడిపోయిన వ్యక్తి కొనకళ్ల నారాయణరావు అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందంటూనే.. ఆ దిశగా కొనకళ్ల సహాయ సహకారాలు అందించాలన్నారు. గత ప్రభుత్వం విలీనం పేరిట ఆర్టీసీని నష్టాలబాట పట్టించిందని, కార్మికుల సమస్యలపై నిర్లక్ష్యం వహించిందన్నారు. కొనకళ్ల ఎంపీగా ఉన్నప్పుడే రైల్వేలైన్, ఫోర్‌లైన్ రోడ్ తదితర అంశాల కోసం పార్లమెంటులో గళమెత్తారన్నారు. అనుభవశాలి కనుకే.. సీఎం చంద్రబాబు నమ్మకంతో కొనకళ్లకు ఆర్టీసీ బాధ్యతలు అప్పగించారన్నారు. కొనకళ్ల సారథ్యంలో అతిపెద్ద ప్రభుత్వ సంస్థ అయిన ఆర్టీసీ అభివృద్ధిపథంలో పయనిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల మాట్లాడుతూ.. ‘ఆర్టీసీకి నష్టం వచ్చినా, ప్రజలపై టికెట్ భారం వేయకుండా నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. పేదవారికి, మధ్య తరగతికి ఆర్టీసీని అందుబాటులో ఉంచుతూ సౌకర్యవంతంగా, సౌలభ్యంగా ప్రయాణించేలా చర్యలు తీసుకుంటాం. ఇతర సంస్థలతో పోల్చుకుంటే యాక్సిడెంట్లు లేకుండా 99 శాతం బస్సులను ప్రజలకు సౌకర్యవంతంగా నడుపుతూ, ఏరకమైన ఇబ్బందులు వచ్చినా వెంటనే సరిచేసుకుని ప్రజలకు సేవలు అందించటంలో ఆర్టీసీదే అగ్రస్థానం. ఆర్టీసీలో కార్గోను కూడా అభివృద్ధి చేస్తాం’ అన్నారు. కేంద్రం సాయంతో ఎలక్ట్రానిక్ బస్సులను కొనుగోలు చేస్తామని, చార్జింగ్ సౌకర్యాల కోసం అనేకచోట్ల చార్జింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్టీసీని అన్ని విధాలుగా అభివృద్దిచేసి ఆదాయం పెంచుతామన్నారు. ఎలక్ట్రానిక్ బస్సులను ప్రవేశపెట్లడంవల్ల ఆర్టీసీలో చాలావరకు ఖర్చు తగ్గించవచ్చన్నారు. ఆర్టీసీలో కార్మిక సంఘాలకు గౌరవాధ్యక్షుడిగా చాలా సంవత్సరాలు ఉన్నానని, కార్మికుల, ఉద్యోగుల సమస్యలన్నీ అవగాహనతో పరిష్కరిస్తానన్నారు.
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంకాకముందు ఉద్యోగులకు ఆరోగ్యం విషయంలో ఆర్టీసీ పూర్తి బాధ్యత తీసుకుని వైద్యం చేయించేదని… ప్రభుత్వంలో కలిశాక వారికి ఆరోగ్యం కల్పించే విషయంలో ఉద్యోగులకు సమస్యలున్నాయని, అధికారులతో అధ్యయనం చేసి వాటిపై దృష్టి పెడతానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై గురువాత బాధ్యత మోపారని, తప్పకుండా నెరువేరుస్తానన్నారు. కార్యక్రమంలో ఎంపీలు వల్లభనేని బాలశౌరి, కేశినేని శివనాథ్ (చిన్ని), పితాని సత్యనారాయణ, వెనిగండ్ల రాము, యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి), బోడె ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, పంచకర్ల రమేష్‌బాబు, కామినేని శ్రీనివాస్, కాగిత కృష్ణప్రసాద్, మండలి బుద్ధప్రసాద్, తెనాలి శ్రావణ్‌కుమార్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రామారావు తదితరులు పాల్గొన్నారు.
ప్రణాళికాబద్ధంగా.. పోర్టులు, హార్బర్ల అభివృద్ధి
మన రాష్ట్రానికి విశాలమైన తీరప్రాంతముంది. దాన్ని గొప్ప ఆదాయ వనరుగా మార్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సైతం విస్తృతమైన ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అలాంటి తరుణంలో `ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్టు ఛైర్మన్‌గా నాకు బాధ్యతలు అప్పగించడం నేను చేసుకున్న అదృష్టం. రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికల అమలులో కీలక భాగస్వామినై.. పోర్టులు, హార్బర్ల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నాపై నమ్మకముంచి ఛైర్మన్‌గా అవకాశం కల్పించడం చాలా సంతోషం. మారిటైం బోర్డు ఛైర్మన్‌గా రాష్ట్రాభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషిస్తూనే.. పెట్టుబడుల సాధనకు ప్రణాళికలు రూపకల్పన చేసి.. యువతకు పెద్దఎత్తున ఉపాధి కల్పించేందుకు నావంతు కృషి చేస్తా. నేను ఈస్థాయికి ఎదగడానికి కొండపి సెగ్మెంట్ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు కృషి మరువలేను. కొండపి నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తూ.. అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నా.
– దామచర్ల సత్యనారాయణ (సత్య), ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు ఛైర్మన్
మంగళగిరిలోని ఐహెచ్‌సీ కార్పొరేట్ భవనం రెండో అంతస్తులోవున్న ఆంధ్రప్రదేశ్ మారిటైమ్‌బోర్డు కార్యాలయంలో అధికారికంగా ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించారు దామచర్ల సత్యనారాయణ (సత్య). తన ఛాంబర్‌లో కుటుంబసభ్యులతో పూజలు నిర్వహించి మధ్యాహ్నం 12:36 నిమిషాలకు ఛైర్మన్ బాధ్యతల స్వీకార దస్త్రంపై సంతకం చేశారు. కార్యక్రమానికి పెద్దఎత్తున రాష్ట్రమంత్రులు, పార్టీ నాయకులు, అభిమానులు హాజరై ఛైర్మన్ దామచర్లకు అభినందనలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి మారిటైం బోర్డును తిరుగులేని ఆయుధం చేసి ప్రగతి సాధనకు కృషి చేయాలని ప్రతిఒక్కరూ ఆకాంక్షించారు. అనంతరం మారిటైం బోర్డు కార్యాలయ సమీపంలోని రాయల్ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో దామచర్ల సత్యకు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. దామచర్ల సత్యకు రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ఆత్మీయ ఆలింగనం చేసుకుని.. పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంలో మంత్రి కొల్లు మాట్లాడుతూ.. రాష్ట్రానికి విశాలమైన సముద్ర తీరం, ఎన్నో భారీ పోర్టులు ఉన్నాయి. శతాబ్దాల క్రితమే మన ప్రాంతం అంతర్జాతీయ వ్యాపారాలు నిర్వహించింది. బందరు పోర్టును ఏడాదిలో పూర్తి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వముంది. దేశంలో ఏ రాష్ట్రానికి లేని అనేక అవకాశాలున్నాయి. మెరైన్ ఎగుమతుల్లో రాష్ట్రాన్ని అగ్రపథంలో నడిపించే బాధ్యత దామచర్ల సత్య తీసుకోవాలి. తద్వారా భారీఎత్తున ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి హాజరైన హోంమంత్రి వంగలపూడి అనిత ఏపీఎంబీ ఛైర్మన్ సత్యను అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పరిశ్రమల ఏర్పాటు, పోర్టుల అభివృద్ధితో రాష్ట్ర యువతకు పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించాలని అనిత ఆకాంక్షించారు. కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, సాంఘిక సంక్షేమ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్‌రెడ్డి, సంతనూతలాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్‌కుమార్ తదితరులు ఏపీఎంబీ ఛైర్మన్ సత్యకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం నుండి భారీఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజను దామచర్లకు శుభాకంక్షలు తెలిపారు.
లిడ్‌క్యాప్‌కు మంచిరోజులు
దళిత సామాజిక వర్గంలో ఫైర్‌బ్రాండ్‌గా తనకంటూ ప్రత్యేక ఒరవడి సృష్టించుకున్న పిల్లి మాణిక్యాల రావు -లిడ్‌క్యాప్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. గతంలో దండోరా జాతీయాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించిన మాణిక్యాలరావు.. టీడీపీలో చేరిన దగ్గర్నుంచీ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మీడియా ద్వారా వైసీపీ నేత జగన్ అక్రమాలు, దుర్మార్గాలపై బలమైన గొంతు వినిపించిన మాణిక్యాల రావు.. ఎన్నికల ముందు సైతం జగన్‌ను తూర్పారబట్టడంలో తనదైన శైలి ప్రదర్శించారు. ఉద్యమ కారుడిగా మాణిక్యాలరావుకు పార్టీలో ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (లిడ్‌క్యాప్)కు చైర్మన్‌గా నియమించడం తెలిసిందే. మంత్రులు, పార్టీ నాయకులు, అధికారుల సమక్షంలో సంస్థ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకార కార్యక్రమానికి హాజరైన మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ.. రాష్ట్రంలో లిడ్‌క్యాప్‌కి ఇక మంచి రోజులు వచ్చినట్టేనన్నారు. ఈ సంస్థ ద్వారా అనేకమందికి స్వయం ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. వైసీపీ హయాంలో లిడ్‌క్యాప్‌ని నిర్వీర్యం చేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంచి రోజులు వచ్చాయన్నారు. పిల్లి మాణిక్యాలరావు కష్టపడే మనస్తత్వం ఉన్నవాడని, తెలుగుదేశం పార్టీలో నిబద్ధతగా పనిచేసే వారికి గౌరవం దక్కుతుందనేందుకు మాణిక్యాలరావే ఉదాహరణ అన్నారు. లిడ్‌క్యాప్ చైర్మన్‌గా ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని మంత్రి ఆకాంక్షించారు.
ప్రగతిపథంలో పరిగెత్తిస్తాం
మారుమూల గిరిజన ప్రాంతాలకు సైతం రవాణా సౌకర్యం కల్పిస్తోన్న సంస్థ -ఆర్టీసీ. రవాణా విషయంలో గ్రామీణ ప్రాంతాలకు గొప్ప కనెక్టివిటీ కూడా ఆర్టీసీయే. రాష్ట్ర ప్రజలకు గొప్ప సవలందిస్తున్న ఆర్టీసీని మరింత బలోపేతం చేసేందుకు నావంతు కృషి చేస్తా. రాష్ట్రానికి ఒక విజనరీ లీడర్ ముఖ్యమంత్రిగా ఉండటం మన అదృష్టం. చంద్రబాబు సారథ్యంలో అతి ముఖ్యమైన ఆర్టీసీకి వన్నె తెచ్చేలా వైస్ చైర్మన్ బాధ్యతలు నిర్వర్తిస్తా. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ఉచిత బస్సు పథకాన్ని త్వరలోనే అమలు చేయనున్నారు. ట్రాన్స్‌పోర్టు మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి, చైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలసి ఆర్టీసీ సంస్థ అభివృద్ధి పథంలో పయనించేలా కృషి చేస్తాను.
– ఆర్టీసీ వైస్ ఛైర్మన్ పిఎస్ మునిరత్నం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్‌చైర్మన్‌గా పిఎస్ మునిరత్నం ఆర్టీసీ హౌస్‌లో అధికారుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతాలకు సైతం ఆర్టీసీ బస్సులను నడుపుతున్న ఘనత ఆర్టీసీకే దక్కుతుందన్నారు. గ్రామీణ ప్రాంత పేదలు ఎక్కువగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తారన్నారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ఉచిత బస్సు పథకాన్ని ముఖ్యమంత్రి ఆదేశాలతో అమలు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రానికి ఒక విజనరీ లీడర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అతి ముఖ్యమైన ఆర్టీసీ వైస్ చైర్మన్ పదవి అప్పగించారన్నారు. పదవికి వన్నె తెచ్చేలా.. ఆర్టీసీ సంస్థ అభివృద్ధి బాటలో పయనించేలా మంత్రి రాంప్రసాద్ రెడ్డి, చైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలసి కృషి చేస్తానన్నారు. సీఎం నారా చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఉందన్నారు. నాకు పదవి దక్కడం కుప్పం సెగ్మెంట్‌కే తలమానికమన్నారు. ప్రతి క్రైసిస్‌ని అవకాశంగా మలచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారన్నారు. సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని ముందుకి తీసుకెళ్లగల సమర్ధత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉందని, ఇలాంటి ముఖ్యమంత్రి సేవలు రాష్ట్రానికి ఎంతో అవసరమన్నారు. 2047నాటికి ఆంధ్రను తలమానికంగా నిలిపేలా ముఖ్యమంత్రి పని చేస్తున్నారన్నారు. ఆర్టీసీని కార్మికులు, ఉద్యోగుల సహకారంతో అభివృద్ధిలో ముందుకు నడిపేలా పనిచేస్తామన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ 50 వేలమంది కార్మికులతో ప్రజలకు సేవలు అందిస్తున్నందుకు కార్మికులకు అభినందనలు తెలియజేశారు.
చైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలిసి, వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం విజయవాడ వరదల్లో ఏపీఎస్ ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బంది 130మందికి రూ.1500 విలువగల నిత్యావసర సరుకుల కిట్‌ను ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యూనియన్ తరపున అందించారు. తోటివారు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి సాయం అందించడం మంచి పరిణామమని చైర్మన్ కొనకళ్ల నారాయణరావు వ్యాఖ్యానించారు. వైస్‌చైర్మన్ మాట్లాడుతూ విజయవాడ వరదల్లో సింగ్‌నగర్ తదితర ప్రాంతాల్లో ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని.. ముఖ్యమంత్రి రేయింబవళ్లు పనిచేసి ఆయా ప్రజలు మమూలు స్థితికి వచ్చేలా చేశారన్నారు. సహ ఉద్యోగులు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం మానవత్వానికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్, ఆర్టీసీ అధికారులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి పేదకూ ఖాయంగా.. పక్కా ఇల్లు!
రాష్ట్రంలోని ప్రతి పేదవాడికీ సౌకర్యవంతమైన పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలన్న ప్రభత్వ బృహత్కార్యంలో.. గృహనిర్మాణ సంస్థ ఛైర్మన్‌గా నా బాధ్యతలు నేను నిర్వర్తిస్తా. పాలనానుభవం కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీయే సర్కారు పేదల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో భ్రష్టుపట్టిన వ్యవస్థలను తిరిగి గాడిలోపెట్టే ప్రక్రియ సాగుతోంది. హౌసింగ్ కార్పొరేషన్‌ను బలోపేతం చేసి.. పేదలకు న్యాయం జరిగేలా చిత్తశుద్ధితో కృషి చేస్తా.
బత్తుల తాతయ్యబాబు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్
రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చైర్మన్‌గా బత్తుల తాతయ్య బాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించిన తాతయ్యబాబుకు రాష్ట్ర గృహనిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి, హోంమంత్రి వంగలపూడి అనిత, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తదితరులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తాతయ్యబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి పేదవాడికీ పక్కా ఇల్లు నిర్మించేలా ప్రభుత్వం చేస్తోన్న కృషిలో భాగమవుతానన్నారు. పేదలకు అన్ని సౌకర్యాలుతో ఇళ్లు నిర్మించాలన్న సీఎం నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ధ్యేయం ముందుకెళ్లేలా సంస్థాగత చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా పక్కా ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో కనీస సౌకర్యాలు లేకుండానే ఇళ్ల నిర్మాణాలు చేపట్టి.. లబ్దిదారులకు ద్రోహం చేశారన్నారు. రహదారులు, విద్యుత్, మంచినీటి సౌకర్యాలుతో పేదలు సౌకర్యవంతంగా జీవించేలా కూటమి పక్కాఇళ్లను నిర్మిస్తుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పరిపాలన అనుభవంతో పేదలకు మంచిజరిగేలా అనేక పథకాలు అమలు చేస్తున్నారని, ఇప్పటికే పలు పథకాలు అమలుకు శ్రీకారం చుట్టారన్నారు. దీపావళినుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ ప్రారంభమవుతుందని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో భ్రష్టుపట్టిన వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టి రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని తాతయ్యబాబు పేర్కొన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యేలు కెఎస్‌ఎన్ రాజు, బండారు సత్యనారాయణమూర్తి, యార్లగడ్డ వెంకటరావు, సుందర విజయకుమార్, రాష్ట్ర పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఎండి కె రాజబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు, పలువురు అధికార్లు హాజరై.. ఛైర్మన్‌ను కలిసి పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు.
ప్రజలకు ఆహ్లాదం.. ప్రభుత్వానికి ఆదాయం
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత ప్రీతిపాత్రమైంది -పర్యాటకం. రాష్ట్ర ఆదాయాన్ని విస్తృతం చేసుకోవడానికి అవకాశమున్న రంగం కూడా. అలాంటి కీలకమైన ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ బాధ్యతలు నాకు అప్పగించడం.. పార్టీ నాకిచ్చిన గొప్ప గుర్తింపుగానే భావిస్తున్నా. ప్రజలకు ఆహ్లాదాన్ని, ప్రభుత్వానికి ఆదాయాన్నిచ్చే ఈ సెక్టారులో అద్భుతాలు సాధించగలిగే అవకాశమే ఉంది. దురదృష్టవశాత్తూ గత పాలకులు ఏపీటీడీసీని నిర్లక్ష్యం చేశారు. మరీ పచ్చిగా చెప్పాలంటే విధ్వంసానికే పాల్పడి రాష్ట్రానికి అన్యాయమే చేశారు. రాష్ట్ర విభజన తరువాత 2014`19మధ్య అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పర్యాటకరంగానికి గణనీయమైన ప్రాధాన్యతే ఇచ్చింది. పర్యాటకంలో ప్రగతి సాధిస్తోన్న దేశంలోని అనేక రాష్ట్రాలకు దీటుగా మనకూ ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కొన్ని పూర్తి చేసుకున్నాం.. ఇంకొన్ని పూర్తి కావాల్సి వుంది. ఆ దశలో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. పర్యాటకంపై వచ్చే ఆదాయాన్ని పక్క రంగాలకు మళ్లించుకుని.. దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. పెట్టుబడులను సాధించి పర్యాటకాన్ని అభివృద్ధి చేయలేకపోయారు. సరే, ముగిసిన శకమది. ఇప్పుడు సీఎం చంద్రబాబు.. స్పష్టమైన విజన్‌వున్న నాయకుడు. రాష్ట్ర పర్యాటక రంగాన్ని ఏ దిశకు, దశకు తీసుకెళ్లాలో గత సెప్టెంబరు 27న ‘వరల్డ్ టూరిజం డే’ సందర్భంలో విస్పష్టంగా చెప్పారు. పర్యాటకానికి ఇండస్త్రీ హోదా ఇవ్వడం కూడా గొప్ప శుభపరిణామం. ఈ రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను రాయితీలతో ఆకర్షించి.. రాష్ట్ర పర్యాటకాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లొచ్చు. ఇప్పటికే అధికారలతో రెండు దఫాలు చర్చించాను. నాకంటూ స్పష్టమైన ప్రణాళికలు కొన్నివున్నాయి. కేరళ, కర్నాటకలాంటి రాష్ట్రాలనూ అధ్యయనం చేస్తున్నాం. ముఖ్యమంత్రి విజన్‌కు అనుగుణంగా ఏపీ టూరిజంలో బహుముఖీన అభివృద్ధి సాధించి.. దేశ పర్యాటక రంగంలో ఆంధ్రకు ప్రత్యేక స్థానం కల్పించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా.
– నూకసాని బాలాజీ, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్
విద్యాధికుడు, సౌమ్యుడిగా పేరున్న డాక్టర్ నూకసాని బాలాజీ -ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా విజయవాడ ఆటోనగర్‌లోని ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర మంత్రులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానుల కోలాహలం మధ్య పండుగ వాతావరణంలో.. వేద పండితుల ఆశీర్వచనాలతో మూహూర్త సమయానికి ఛైర్మన్ దస్త్రంపై సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు.
ప్రకాశం జిల్లా అధికార తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కావడం, జిల్లాలో అత్యంత ప్రజాదరణ ఉండటం, ఆయనకున్న కలుపుగోలుతనం, స్నేహశీలతతో రాష్ట్రం నలుమూలల నుంచి అసంఖ్యాకంగా ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరవ్వడంతో కార్యక్రమం ఆద్యంతం పండుగ వాతావరణంలో అత్యంత కోలాహలంగా జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో బాలాజీ మాట్లాడుతూ.. తనకు బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం దార్శనికత ఎంత గొప్పదో తెలుసని, ఆ బాటలో ఏపీటీడీసీని ప్రగతిపథంలో నడిపించడానికి తనవంతు కృషి చేస్తానన్నారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఏపీటీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ అభిషిక్త్ కిషోర్, చైర్మన్‌కు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, అబ్కారీ మంత్రి కొల్లు రవీంద్ర, సాంఘిక సంక్షేమ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ బూర్ల ఆంజనేయులు, ఎమ్మెల్యేలు కూన రవికుమార్, గద్దె రామ్మోహన్, యార్లగడ్డ వెంకట్రావు, తేనేటి కృష్ణప్రసాద్, ఎరపతినేని శ్రీనివాసరావు, వేగేసిన నరేంద్రవర్మ, దామచర్ల జనార్ధన్, ముత్తుమల అశోక్‌రెడ్డి, ఉగ్రనరసింహారెడ్డి, బిఎన్ విజయ్‌కుమార్, ఏలూరు సాంబశివరావు, ఇంటూరి నాగేశ్వరావు, మద్దులూరు మాలకొండయ్య, పర్చూర్ అశోక్‌బాబు, ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, దువ్వాడ రామారావు, బీద రవిచంద్ర, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి రామరాజు, ఏపీ వినియోగదారుల రక్షణ చట్టం ఛైర్మన్ పీతల సుజాత, మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, గొట్టిపాటి లక్ష్మీ, గూడూరు ఎలక్షన్ బాబు, నారశెట్టి పాపారావు, గోరంట్ల రవికుమార్ తదితరులు హాజరై ఛైర్మన్ బాలాజీకి అభినందనలు తెలిపారు. పెద్దఎత్తున నూకసాని అభిమానులు హాజరయ్యారు.
చిత్తశుద్ధితో కృషి చేస్తా
రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్‌గా కర్తవ్య నిర్వహణకు చిత్తశుద్ధితో కృషి చేస్తానన్నారు వజ్జా బాబూరావు. రాష్ట్రంలోని పరిశ్రమలను అభివృద్ధి చేసి ఎగుమతులను ప్రోత్సహించేందుకు తనవంతు కృషి చేస్తానంటూనే.. ఛైర్మన్‌గా తన బాధ్యతలు ఏదీ విస్మరించుకుండా పదవికి వన్నెతెచ్చే విధంగా కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకంతో ఏపీటీపీసీ బాధ్యతలు అప్పగించినందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియచేస్తూ.. రాష్ట్రంలో ట్రేడ్ ప్రమోషన్ ఏవిధంగా పెంచాలన్నది అధ్యయనాలు చేసి.. సీనియర్ల సలహాలు, సూచునలతో ముందుకెళ్తానన్నారు. ఏపీటీపీసీ చైర్మన్‌గా సంస్థ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన బాబూరావు, ఎలాంటి హడావుడి లేకుండానే విధులను ప్రారంభించారు. ముఖ్యమంత్రి విజన్ మేరకు ఏపీటీపీసీ సంస్థ యూనిటీగా పనిచేయాలని, అందుకు ఛైర్మన్‌గా తన సహాయ సహకారాలు ఉంటాయని సిబ్బందికి సూచించారు. ఏపీటీపీసీ కార్యాలయ వీసీ, యం.డి., జనరల్ మేనేజర్ ఇతర సభ్యులు నూతన చైర్మన్‌కు అభినందనలు తెలిపారు. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే గౌతు శిరీష, ఎంపీ రామ్మోహన్‌నాయుడు విజయానికి విశేషంగా కృషి చేశారు బాబూరావు. పార్టీ విధేయునిగా ఉన్న ఆయనకు చైర్మన్ పదవి వరించడంతో టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలాసలోని ఎమ్మెల్యే కార్యాలయంలో బాబూరావును ఎమ్మెల్యే గౌతు శిరీష సత్కరించారు. తనకు చైర్మన్ పదవి రావడానికి కృషి చేసిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష, టిడిపి జిల్లా అధ్యక్షులు కలమట వెంకటరమణతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్‌కు బాబూరావు కృతజ్ఞతలు తెలిపారు.
పట్టణాభివృద్ధికి నిధులు సమీకరిస్తా..
పథకాలకు సంబంధించిన నిధులు సకాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర ఏజెన్సీల నుంచి సమీకరించడంలో నావంతు కృషి చేస్తానని నమ్మకంగా చెబుతున్నా. అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యేలా ఏపీయూఎఫ్‌ఐడిసీ పనితీరు మెరుగు పరుస్తాను. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయం ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు సరఫరా చేయాలని. ఈ బృహత్తర కార్యంలో నావంతు పాత్ర పోషించి పట్టణ ప్రజలందరికీ రక్షిత మంచినీటి సదుపాయం కల్పిస్తాను. మెరుగైన జీవన విధానాన్ని కల్పించేందుకు నావంతుగా చిత్తశుద్ధితో కృషి చేస్తాను.
– పీలా గోవింద సత్యనారాయణ,
ఆంధ్రప్రదేశ్ పట్టణ ఆర్థిక మరియు మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్
ఎన్డీయే ప్రభుత్వం నిర్దేశించిన రాష్ట్ర పునర్నిర్మాణ బృహత్తర కార్యంలో ఆంధ్రప్రదేశ్ పట్టణ ఆర్థిక మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ కీలక పాత్రే పోషించనుంది. ఏపీయూఎఫ్‌ఐడిసి ప్రధాన లక్ష్యం పట్టణ ప్రాంతాల్లో తాగు నీటి సదుపాయాలు పెంచడం. పారిశుద్ధ్యం మరియు పార్కుల అభివృద్ధికి నిధులను సమీకరించడం. రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వివిధ పట్టణాభివృద్ధి పథకాల ద్వారా నిధులను సమీకరించి -రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు, మున్సిపల్ కార్పొరేషన్‌లకు అందించే బృహత్తర బాధ్యతను ఏపీయూఎఫ్‌ఐడీసీ పోషిస్తోంది. ప్రస్తుతం అమృత్ పథకం.. పట్టణ తాగునీటి సరఫరా.. ఇతర మౌలిక సదుపాయాల కల్పనా పథకాల కింద ఏపీయూఎఫ్‌ఐడిసి ప్రభుత్వ నిధులను దశలవారీగా ఆయా మున్సిపాలిటీలకు విడుదల చేస్తోంది. ఈ పథకాల ప్రధాన ఉద్దేశం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పట్టణాలలో తాగు నీరు మరియు మెరుగైన పారిశుద్ద్య వసతుల కల్పనే. ఏపీయూఎఫ్‌ఐడిసి లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.
పథకాలకు సంబంధించిన నిధులు సకాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర ఏజెన్సీల నుంచి సమీకరించడంలో నావంతు కృషి చేస్తానని నమ్మకంగా చెబుతున్నా. అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యేలా ఏపీయూఎఫ్‌ఐడిసీ పనితీరు మెరుగు పరుస్తాను. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయం ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు సరఫరా చేయాలని. ఈ బృహత్తర కార్యంలో నావంతు పాత్ర పోషించి పట్టణ ప్రజలందరికీ రక్షిత మంచినీటి సదుపాయం కల్పిస్తాను. మెరుగైన జీవన విధానాన్ని కల్పించేందుకు నావంతుగా చిత్తశుద్ధితో కృషి చేస్తాను.
ఆంధ్రప్రదేశ్ పట్టణ ఆర్థిక మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తూ పీలా గోవింద సత్యనారాయణ ఇలా రాష్ట్ర ప్రజలకు మాటిచ్చారు. ఏపీయూఎఫ్‌ఐడిసీ చైర్మన్‌గా పీలా గోవింద సత్యనారాయణ సంస్థ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు,గాజువాక ఎమ్మెల్యే పళ్లా శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, హౌసింగ్ చైర్మన్ బత్తుల తాతయ్య చౌదరి, ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణ మూర్తి తదితరులు కార్యక్రమానికి హాజరై అభినందనలు తెలిపారు. కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున నాయకులు, అభిమానులు హాజరవ్వడంతో.. ఏపీయూ ఎఫ్‌ఐడిసీ చైర్మన్‌గా పీలా గోవింద సత్యనారాయణ బాధ్యతల స్వీకార కార్యక్రమం కోలాహలంగా సాగింది.
