చాలామంది చెప్తున్నట్టు -సినిమా ఇండస్ట్రీమీద మోజుతో రాలేదు మిథున్ చక్రవర్తి. యాధృచ్చికంగా పరిశ్రమకు వచ్చిన తరువాతా.. ఇష్టంతో సినిమాలు చేయలేదు. కేవలం డబ్బు కోసమే చేశాడు. ‘నేను చేసిన సినమాల్లో నచ్చినవి కొన్నే. ఏడాదిలో 19 సినిమాలు చేసిన హీరోగా బిజీ లైఫ్ గడిపినా.. ఎక్కువ సినిమాలు డబ్బుకోశమే చేశా. బలంగా ఉన్నపుడు చుట్టూ చేరినోళ్లే.. బలహీనపడితే ముంచేస్తారు. అదే జరిగింది లైఫ్‌లో’ అంటాడాయన.
‘సినీరంగంలో ఫెయిల్యూర్స్ కామన్. సో, సీక్వెన్స్ ఫ్లాపులు నాకూ తప్పలేదు. అవకాశాలు ఆగిపోకముందే.. ఇండస్ట్రీకి దూరం జరిగాను. ఊటీకి వెళ్లి.. హాయిగా గడపాలనుకున్నా. టైం బాగలేనపుడు అనుకున్నవి జరగవు. అందుకే `మోనార్క్ గ్రూప్ పేరిట హోటల్ బిజినెస్లోకి దిగి పీకల్లోతు కష్టాలు తెచ్చుకున్నా. మిత్రులు శత్రువులయ్యారు. బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్లు కట్టడానికి బి-గ్రేడ్ చిత్రాలూ చేశా. అత్యధిక పారితోషికం తీసుకున్న నేను.. పారితోషికం ఎంతిచ్చినా సినిమాకు రెడీ అన్నాను. అదీ టైం గొప్పతనం. అత్యధిక పన్ను చెల్లించిన ఆర్టిస్టుగా పేరుండేది కానీ, అత్యధిక సంపన్నుడిని మాత్రం కాదు’ అంటాడు మిథున్.
బసంత కుమార్ చక్రవర్తి, శాంతి రాణి దంపతులకు 1950 జూన్ 16న పుట్టిన గట్టిపిండమే `గౌరంగా చక్రవర్తి. డిగ్రీ చదువుతున్న సమయంలోనే -పెత్తందారి వ్యవస్థతో ప్రజలు పడుతున్న వెతలుచూసి ఉద్యమబాట పట్టారు. ఒక వెలుగు వెలిగాడు. సోదరుడి ఆకస్మిక మరణంతో మనసు చలించి.. ఉద్యమాలు వదిలి ముంబయికి వెళ్లిపోయాడు. బతకాలి కనుక -నైట్ క్లబ్లో డ్యాన్సర్ అవతారమెత్తాడు. అలా -బెంగాలీ డైరెక్టర్ మృణాల్ సేన్ కంట్లోపడి ‘మృగయా’ (1976) తొలి సినిమాతో ఉత్తమ నటుడయ్యాడు. జాతీయ అవార్డు అందుకున్నాడు. ఆరంభంలో అనుకున్నస్థాయికి ఎదగకున్నా.. వరుసగా సినిమాలు చేశాడు మిథున్. 1982లో విడుదలైన ‘షౌకిన్’, ‘అశాంతి’ సినిమాలు లైఫ్‌కి టర్న్ ఇచ్చాయి. స్టార్ స్టేటస్ తెచ్చి పెట్టాయి. ఆ టైంలో విడుదలైన ‘డిస్కో డ్యాన్సర్’ ఏకంగా ప్రపంచ ఖ్యాతి తెచ్చింది. అలా ‘హీరో’కు కొత్త డెఫినిషనిచ్చాడు. బలిష్టమైన శరీరం.. బ్రేక్ డ్యాన్సులు.. ఆశ్చర్యపరిచే ఫైట్లతో ప్రేక్షకులతో ఔరా అనిపించాడు. 1989లో మిథున్ నుంచి 19 సినిమాలు విడుదలై -లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు దక్కడంతో.. బాలీవుడ్లో ‘బెంగాల్ టైగర్’గా కీర్తి గడిరచాడు మిథున్. ఇండస్ట్రీలో గుర్తింపు వచ్చేసిందని హీరో దగ్గరే ఆగలేదు మిథున్. డబ్బు కోసమే సినిమాలు అనుకున్నాడు కనుక.. విలన్, సహాయ పాత్రలు ఏదిచ్చినా చేసి.. వివిధ భాషల్లో మూడు జాతీయ అవార్డులు.. నాలుగు ఫిలింఫేర్లు అందుకున్నాడు మిథున్.
తరువాత రాజకీయాలవైపు దృష్టిపెట్టాడు. తృణమూల్ కాంగ్రెస్ తీర్థం చేసుకున్న మిథున్.. 2014లో రాజ్యసభకు వెళ్లాడు. 2016లో పదవికి రాజీనామా చేసేసి.. 2021లో భాజపాలో చేరాడు. నటుడు, వ్యాపారవేత్త, నిర్మాతగా బిజీగా ఉంటూనే.. ఏడుపదుల వయసులో ఏ రంగాన్నీ పూర్తిగా విడిచిపెట్టకుండా సమయానుకూలంగా జీవితాన్ని నడిపిస్తున్నాడు మిథున్ చక్రవర్తి. సినీ రంగానికి చేసిన సేవలను గుర్తించిన కేంద్రం కొన్నాళ్ల కిందటే ‘పద్మభూషణ్’తో గౌరవించింది. ఇప్పుడు ఏకంగా సినిమా పరిశ్రమవాసులు కలలుగనే -దాదా సాహెబ్ ఫాల్కే అవార్డే వరించింది.
