మొదలైన నామినేటెడ్ పదవుల పందేరం
సింపుల్ గవర్నమెంట్.. ఎఫెక్టివ్ గవర్నెన్స్. వ్యక్తులైనా, వ్యవస్థలైనా ఈ విధానాన్ని ఆచరిస్తేనే రాణింపు. పార్టీల ఆదేశాలను అనుసరించండి. ప్రభుత్వంలో పదవి బాధ్యత మాత్రమే. ప్రజలకంటే మనం ప్రత్యేకమన్న భావనకు దూరంగా మన మాటా, పని గౌరవంగా, హూందాగా ఉండాలి. కూటమిలో భాగస్వాములైన మూడు పార్టీల వారికీ పదవులిచ్చాం. మొన్నటి ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేకపోయిన వాళ్లకు నామినేటెడ్ మొదటి లిస్టులో అవకాశమిచ్చాం. ఇంకా నామినేటెడ్ పోస్టుల లిస్టులున్నాయి. పదవుల విషయంలో కొందరు నాయకులు తొందర పడటం మంచి పద్ధతి కాదు. ఎవరికి ఎప్పుడు ఏది ఎలా ఇవ్వాలో నాయకుడిగా నా బాధ్యత. ఎవ్వరికీ అన్యాయం జరగదని మాటిస్తున్నా. మీ వల్ల కూటమి ప్రభుత్వానికి పొలిటికల్ గెయిన్ ఉండాలి. ఆల్ ది బెస్ట్.
` నారా చంద్రబాబు నాయుడు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో టీడీపీ అధిష్టానం అసలు సిసలైన కార్యకర్తలకు పదవుల ప్రాధాన్యత కల్పించింది. తొలివిడతగా 99మందితో ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీలకు పెద్దపీట వేసింది. తొలివిడతలో 11మంది క్లస్టర్ ఇన్ఛార్జిలకు పదవులు లభించగా, అందులో ఒక క్లస్టర్ ఇన్ఛార్జికి ఛైర్మెన్ పదవి కట్టబెట్టింది. వీరితోపాటు 6గురు యూనిట్ ఇన్ఛార్జిలకు పదవులు లభించాయి. నామినేటెడ్ పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూనే, యువతకు ప్రాధాన్యమిచ్చారు. 20 మంది చైర్మన్లు, ఒక వైస్‌ఛైర్మన్ పోస్టుల్లో ఏడుగురు బీసీలు, ఇద్దరు ఎస్సీలు, ఒకరు ఎస్టీ, ఒకరు ముస్లిం మైనార్టీకి చెందిన వారున్నారు. ఆర్టీసీ, పౌరసరఫరాలు, ఏపీఐఐసీ, వక్స్‌బోర్డు వంటి 20 కీలక కార్పొరేషన్లకు చైర్మన్లతోపాటు ఆర్టీసీకి వైస్ చైర్మన్‌ను కూడా నియమించింది. వీటిలో ఏడు కార్పొరేషన్లలో 64 మంది సభ్యులకు చోటు కల్పించింది. మిగతా 13 కార్పొరేషన్లకు ప్రస్తుతానికి ఛైర్మన్లను మాత్రమే ప్రకటించింది. తెదేపా నుంచి 16 మందిని చైర్మన్లుగా, 53 మందిని సభ్యులుగా, జనసేన నుంచి ముగ్గురిని చైర్మన్లుగా, తొమ్మిది మందిని సభ్యులుగా, భాజపా నుంచి ఒకరిని ఛైర్మన్‌గా, ఐదుగురిని సభ్యులుగా నియమించారు. ఆర్టీసీ వైస్ చైర్మన్ పోస్టు తెదేపాకు దక్కింది. ఇది తొలి విడత మాత్రమే. కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల ఎంపికలో.. కష్టకాలంలోనూ తెదేపాను అంటిపెట్టుకుని అత్యంత విధేయత, అంకితభావం, చిత్తశుద్ధితో పనిచేసిన వారికి ప్రాధాన్యమిచ్చారు. ఎన్డీయే పొత్తులో భాగంగా టికెట్ దక్కని వారికి, రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఇంకా బలమైన అభ్యర్థులకు టికెట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు, పార్టీ ఆదేశాలకు కట్టుబడి త్యాగం చేసిన వారికి, పొత్తు ధర్మాన్ని పాటించి కూటమి అభ్యర్థుల విజయానికి కృషిచేసిన వారికి గుర్తింపు లభించింది.
పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పదవులు కట్టబెట్టారు. సామాజిక సమతూకం పాటిస్తూ సోషల్ ఇంజనీరింగ్‌తో తొలి విడత ప్రకటించిన పదవులపై పార్టీ క్యాడర్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రఘురామ కృష్ణంరాజు కోసం సీటు త్యాగం చేసిన అప్పటి సిటింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్ పదవి లభించింది. మాజీ ఎంపీ, బీసీ నేత కొనకళ్ళ నారాయణరావుకు ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ పదవి దక్కింది. అలాగే యువగళం పాదయాత్రలో వాలంటీర్ల కోఆర్డినేటర్‌గా పనిచేసిన అనిమిని రవినాయుడుకు శాప్ చైర్మన్ పదవి, మంగళగిరిలో పార్టీ విజయం కోసం కృషి చేసిన సీనియర్ బీసీ నేత నందం అబద్దయ్యకు పద్మశాలి కార్పొరేషన్ దక్కింది. 2014 ఎన్నికల్లో చింతలపూడి నుంచి గెలిచిన పీతల సుజాత మంత్రిగానూ పనిచేశారు. తర్వాత మంత్రి పదవి కోల్పోయినా, పార్టీకి విధేయురాలిగా ఉన్నారు. ప్రతిఫలంగా వినియోగదారుల రక్షణ మండలి చైర్మన్ పదవి లభించింది. అనకాపల్లి నియోజకవర్గ తెదేపా ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు సత్యనారాయణకు ఇటీవల ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. అనకాపల్లి సీటు జనసేనకు కేటాయించడంతో ఆయన మొదట్లో కొంత అసంతృప్తితో ఉన్నా, అధినేత ఆదేశాలకు కట్టుబడి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ విజయానికి కృషిచేశారు. అందుకు గుర్తింపుగా ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల తెదేపా టికెట్ ఇన్చార్జి కర్రోతు బంగార్రాజుకే ఖాయమనుకున్నారు. యువగళం పాదయాత్ర విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించడంలోనూ ఆయన కీలకపాత్ర పోషించారు. కానీ ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో బంగార్రాజుకు నిరాశ ఎదురైంది. ఇప్పుడాయనను కీలకమైన మార్క్ ఫెడ్ చైర్మన్ పదవి వరించింది. ఏలూరు జిల్లాలోని పోలవరం నియోజక వర్గానికి తెదేపా కన్వీనర్‌గా ఉన్న బొరగం శ్రీనివాసులుకు గత ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. అక్కడి నుంచి జనసేన అభ్యర్థిని బరిలో నిలపగా, శ్రీనివాసులు సహకరించారు. ఆయనకు ఏపీ ట్రైకార్ చైర్మన్ పదవి దక్కింది. మాదిగ సామాజికవర్గ ప్రముఖుడు పిల్లి మాణిక్యాలరావుకు లెదర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు లభించాయి. ఉత్తరాంధ్ర పార్టీ కోఆర్డినేటర్‌గా పనిచేసిన దామచర్ల సత్యకు కీలకమైన మారిటైం బోర్డు చైర్మన్ పదవి లభించింది. రాష్ట్రంలో ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్య సాధనలో కీలకం కానున్న సీడాప్ చైర్మన్ పదవిని సీనియర్ నేత గునుపాటి దీపక్‌రెడ్డికి ఇచ్చారు.
ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు, బీసీ నేత నూకసాని బాలాజీకి కీలకమైన టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించింది. ఏపీఎస్‌ఆర్టీసీ వైస్ ఛైర్మన్‌గా నియమితులైన కుప్పం నియోజక వర్గ తెదేపా ఇన్ఛార్జి పీఎస్ మునిరత్నం.. చంద్రబాబుకు సన్నిహితుడు. ఎస్వీయూలో ఇద్దరూ కలిసి చదువుకున్నారు.. కుప్పం మండలం కంగుంది సర్పంచిగా, సమితి ప్రెసిడెంట్‌గా,కుప్పం ఎంపీపీగా పనిచేశారు.2014-19 మధ్య తెదేపా ప్రభుత్వంలో కుప్పం రెస్కో ఛైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం తెదేపా క్రమ శిక్షణా కమిటీ సభ్యుడిగా, కుప్పం నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిగా ఉన్నారు. ఆయనకు పార్టీ సముచిత స్థానం కల్పించింది. వక్ఫ్‌బోర్డు ఛైóైర్మన్‌గా అబ్దుల్ అజీజ్, గృహనిర్మాణ బోర్డు ఛైర్మన్‌గా తాత్యబాబు, 20సూత్రాల అమలు కమిటీ ఛైర్మగా లంకా దినకర్, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మన్నె సుబ్బా రెడ్డి, ఏపీటీడీసీ ఛైర్మన్‌గా నూకసాని బాలాజీ, ఎంఎస్‌ఎంఈ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా తమ్మిరెడ్డి శివశంకర్(జనసేన), ఏపీటీపీసీ ఛైర్మన్‌గా వజ్జ బాబురావు, ఏపీ టిడ్కో ఛైర్మన్‌గా వేములపాటి అజయ్కుమార్(జనసేన), పౌరసరఫరాల కార్పొరేషన్ ఛైర్మన్‌గా తోట మెహర్‌సుధీర్ (జనసేన) నియమితులయ్యారు.
