కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌గా కృష్ణయ్య

కూటమి ప్రభుత్వంలో ఫస్ట్‌ నామినేటెడ్‌ పోస్టు దక్కించుకున్నారు పి. కృష్ణయ్య. సార్వత్రిక ఎన్నికలలో అనితరసాధ్యమైన వియం అందుకున్న ఎన్డీయే సర్కారు.. పాలన మొదలెట్టి వందరోజులు దాటుతోంది. ‘తెలుగుదేశం చరిత్రలోనే ఇది ఊహించని విజయం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ప్రకటించారు. బలమైన విజయంతో ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర్నుంచీ.. పార్టీ వర్గాల్లో నామినేటెడ్‌ పోస్టులపై ఆశలు చిగురించడం మొదలెట్టాయి. పార్టీ కోసం కష్టించిన వాళ్లకే నామినేటెడ్‌ పదవులంటూ నాయకుడు సైతం ప్రకటించడంతో.. పార్టీ కోసం మేంపడిన కష్టం ఇంత? అంటూ పార్టీ శ్రేణులు ఎవరికి వారు ఆశపడుతున్న నామినేటెడ్‌ పోస్టుల కోసం భారీగానే దరఖాస్తులు చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో `ఏపీలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ మొదలైంది. కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి పి కృష్ణయ్య తొలి తాంబూలం అందుకున్నారు. దీంతో.. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలవుతున్నా.. ఇంకా నామినేటెడ్‌ పదవుల భర్తీని ప్రారంభించలేదన్న బెంగ పార్టీ శ్రేణుల్లో తొలగిపోయింది. ఎన్నికల సమయంలో అవకాశం రాని నేతలు, పొత్తుల లెక్కల్లో సీటు కోల్పోయిన నేతలు నిరుత్సాహం నుంచి బయటపడి `పార్టీవైపు ఆశగా చూస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం తొలి నామినేటెడ్‌ పదవిని భర్తీ చేసి.. నామినేటెడ్‌ పదవుల మేళా మొదలుపెట్టినట్టు సంకేతమిచ్చేసింది. దసరాలోగా నామినేటెడ్‌ పదవులను భర్తీ చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు పార్టీ సీనియర్లలో చర్చ నడుస్తోంది.

ఇక అసలు సంగతికి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌గా పి. కృష్ణయ్య  నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వంనుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన కృష్ణయ్య.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీఐఐసీ ఛైర్మన్‌గా పనిచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. అలాగే చంద్రబాబు కుటుంబానికి చెందిన ఎన్టీఆర్‌ ట్రస్టులో ట్రస్టీగానూ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ చేసిన కృష్ణయ్య.. ఎకనమిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు. గుంటూరు, రంగారెడ్డి జిల్లాలకు జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేశారు. మహబూబ్‌నగర్‌, చిత్తూరు జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు. అలాగే ముఖ్యమంత్రి వద్ద జాయింట్‌ సెక్రటరీగానూ వ్యవహరించారు. తాజాగా కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌గా నియమితులయ్యారు.

ఉత్తర్వులు రాగానే కృష్ణయ్య బాధ్యతలు స్వీకరించారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక భర్తీ చేసిన తొలి నామినేటెడ్‌ పదవి ఇదే. నామినేటెడ్‌ పదవులను 60:30:10 నిష్పత్తిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీలు షేర్‌ చేసుకునే వాతావరణం కనిపిస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం రాని ముఖ్య నేతలు నామినేటెడ్‌ పోస్టులపై ఆశలు పెట్టుకోవడం ఎప్పుడూ జరిగేదే. మరోవైపు పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో ప్రాధాన్యమిస్తామని చంద్రబాబు ప్రతిసారీ చెప్తుంటారు. అన్న మాట ప్రకారం.. పార్టీ పరిస్థితులకు అనుగుణంగా పదవులు కట్టబెట్టిన ఘట్టాలూ మామూలే. ఆ ప్రకారమే ఎవరికి ఏ పదవిని అప్పగించాలనే దానిపైనా సీఎం చంద్రబాబు టీం.. లోతైన అధ్యయనాల జరిపి ఓ క్లారిటీ తెచ్చినట్టే చెబుతున్నారు.

వికసిత ప్రకాశం దిశగా…

ఉమ్మడి ప్రకాశంలో సమ్మిళిత అభివృద్ధి సాధించి ` ‘వికసిత ప్రకాశం’గా నిలబెట్టాలని తపనపడే రాజకీయ నాయకుల్లో రాష్ట్ర బీజేపీ నాయకుడు, ఆ పార్టీ అధికార ప్రతినిధి లంకా దినకర్‌ను ప్రధానంగా ప్రస్తావించాలి. సహజంగానే ఒంగోలువాసి కనుక ఆ జిల్లా అభివృద్ధిని కాంక్షించడం తప్పుకాదు. కానీ, ఏనాటికైనా ఆరోజొస్తుందని, ఆ అభివృద్ధిలో తానుసైతం భాగస్వామి కావాలని పదిహేనేళ్లుగా నమ్మకంగా రాజకీయ ప్రయాణం చేస్తున్న నేత లంకా దినకర్‌. ఇప్పుడు ఆ ఆశలు ఫలించే రోజులు కళ్లముందు కనిపిస్తున్నాయి. మొన్నటి కేంద్ర బడ్జెట్‌లో `ప్రకాశం జిల్లాను వెనుకబడిన ప్రాంతంగా గుర్తిస్తున్నట్టు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించడమే. ప్రకాశం జిల్లాను కేంద్రం నోటిఫై చేయడంతో బందేల్‌ఖండ్‌లాంటి ప్యాకేజీ రావొచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం మాటమాత్రంగా వ్యాఖ్యానించడం ప్రకాశం జిల్లా వాసులకు పెద్ద ఊరటే. ఇది పక్కనపెడితే.. ‘ప్రకాశం జిల్లాను వెనుకబడిన ప్రాంతంగా గుర్తించడమే.. వికసిత ప్రకాశం ఆశ నెరవేరడానికి తొలి అడుగు పడినట్టని’ అంటున్నారు దినకర్‌. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌గా ఎన్డీయే సర్కారు కొలువుదీరిన తరుణం కూడా అనుకూలాంశమన్నది ఆయన మాట. ఉమ్మడి ప్రకాశం అభివృద్ధికి ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న తరుణం ఆసన్నమవ్వడంతో.. కూటమి పక్షంలోని భాగస్వామ్యపక్షాల నేతలను కలుపుకుని `కలల సాకారానికి ముందుకెళ్లాలన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు దినకర్‌. ‘కేంద్రం నిర్ణయంతో ప్రకాశాన్ని ప్రారిశ్రామిక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి అవసరమైన నిధులు సాధించడం సులువవుతుంది. జిల్లాకు వరప్రదాయినిగా వెలిగొండ ప్రాజెక్టు ఉన్నప్పటికీ, కృష్ణా మిగులు జలాలమీద ఆధారపడిన ప్రాజెక్టు. అందుకే దీన్ని పూర్తి చేసుకుంటూనే.. రాజస్థాన్‌లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో భూగర్భ జలాల పెంపునకు ‘కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ’లాంటి కేంద్రం చర్యలు సత్ఫలితాలిచ్చాయి. ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా తీర్చిదిద్దితే అదీ సాధ్యమవుతుంది. పారిశ్రామికీకరణవైపు దృష్టిపెడితే.. అందుకు అనుగుణమైన ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికీ బీజం పడినట్టే. రోడ్లు, రైలు, వాయు, ఇంధన సదుపాయాల విస్తృతికి భారీగా నిధులు రాబట్టొచ్చు. ఇక ప్రధానంగా తూర్పు తీర రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం ఉద్దేశించిన ‘పూర్వోదయ’ ప్రాజెక్టు పెద్ద వరం. మౌలిక సదుపాయాల కల్పనద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచటమే కాదు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు `ప్రకాశం అభివృద్దికి పెద్దవరమే’ అంటున్నారు లంకా దినకర్‌.

‘వెనుకబడిన ప్రాంతంగా ప్రకాశం జిల్లాను ప్రకటించక ముందు అనుమతి సాధించిన అనేక ప్రాజెక్టులు పెండిరగ్‌లో ఉన్నాయి. పెండిరగ్‌ ప్రాజెక్టులను కలుపుకుని.. చేస్తున్నవి, చేయదగ్గ ప్రాజెక్టులతో మేళవించడం.. జల వాయు రైలు రోడ్డు మార్గాలను జిల్లాలోని దొనకొండ, కనిగిరిలాంటి ప్రధాన ప్రాంతాలతో అనుసంధానించి.. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసుకుని.. భూగర్భ జలాల పెంపునకు ప్రణాళికలు అమలుచేసి.. తూర్పు పశ్చిమ ప్రకాశంలో సమ్మిళిత అభివృద్ధి సాధించే ప్రక్రియలో భాగస్వామి’ కావాలన్న కాంక్ష వ్యక్తం చేస్తున్న దినకర్‌.. ఆ దిశగానే అడుగులేస్తున్నారు. బీజేపీ పెద్దల ఆశీర్వాదం తీసుకుంటూనే.. కూటమి పక్షాలైన తెదేపా, జనసేన పార్టీల మంత్రులు, నేతలను కలుపుకుని ముందుకెళ్తానంటున్నారు దినకర్‌. పార్టీకి దినకర్‌ అందిస్తోన్న సేవలను గుర్తించి `నామినేటెడ్‌ పదవుల కోటాలో ‘20 సూత్రాల అమలు కమిటీ’ చైర్మన్‌ పదవిని కట్టబెట్టింది బీజేపీ. పదవుల కంటే ప్రకాశం అభివృద్ధిపైనే దృష్టిపెట్టిన దినకర్‌ `వికసిత భారత్‌, వికసిత ఆంధ్రలో అంతర్భాగంగా ‘వికసిత ప్రకాశం’ సాధనలో కీలక భూమిక పోషిస్తారనే అభిమానులు, పార్టీ పెద్దలు, ప్రకాశం జిల్లావాసులు ఆశిస్తున్నారు.

విధేయతకు పట్టం

రవినాయుడును వరించిన నామినేటెడ్‌ పోస్టు

రాష్ట్ర శాప్‌ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

టీడీపీ అధినేత నారా చంద్రబాబనాయుడు, యువనేత నారా లోకేష్‌ ఇచ్చిన స్ఫూర్తితో విద్యార్థి నాయడుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి అందిరివాడయ్యాడు అనిమిని రవినాయుడు. అందుకే తెలుగుదేశం పార్టీ అధిష్టానం నామినేటెడ్‌ పదవుల పందేరంలో భాగంగా రాష్ట్ర శాప్‌ చైైర్మన్‌ పదవిని కట్టబెట్టింది. విద్యార్థి నేతగా తన ప్రస్థానం ప్రారంభించి పెద్దల ఆశీస్సులతో లీడర్‌గా తననుతాను తీర్చిదిద్దుకుంటూ వచ్చారు రవినాయుడు. ఏ పని అప్పగించినా వందకు 200 శాతం న్యాయం చేశారు. ఏనాడూ పదవులు ఆశించకుండా. పార్టీ పటిష్టతే లక్ష్యంగా శక్తివంచన లేకుండా కృషి చేస్తూ వచ్చాడు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో రవినాయుడుపై ఏకంగా 57 తప్పుడు కేసులు పెట్టింది. అయినా ఏనాడూ వెనడదుగు వేయలేదు సరికదా… మరింత ఉత్సాహంతో పార్టీ నిర్ణయాలు, ఆదేశాలే శిరోధార్యంగా పనిచేశాడు. ఒక సామాన్య రైతు కుటుంబంనుంచి నేడు శాప్‌ ఛైర్మన్‌స్థాయికి ఎదిగాడు. సామాన్య కార్యకర్తలకు, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి టీడీపీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందనేందుడు రవినాయుడు ఒక పెద్ద ఉదాహరణ.

‘2005లో ఓరియంటల్‌ కాలేజీ అధ్యక్షుడిగా, 2006 చంద్రగిరి నియోజకవర్గ టిఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడిగా, 2007 ఎస్వీ యూనివర్సిటీ టిఎన్‌ఎస్‌ఎఫ్‌ ప్రధాన కార్యదర్శిగా, 2008, 2010 ఎస్వీ యూనివర్సిటీ అధ్యక్షుడిగా, 2010, 2015 టిఎన్‌ఎస్‌ఎఫ్‌ చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా, 2015 టిఎన్‌ఎస్‌ఎఫ్‌ జాతీయ సమన్వయకర్తగా, 2020 తిరుపతి పార్లమెంట్‌ యువత అధ్యక్షుడిగా, 2021 యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, కార్యక్రమాల కోఆర్డినేటర్‌గా, యువగళం వాలంటీర్ల కోఆర్డినేటర్‌గా, నిజం గెలవాలి టూర్‌ కోఆర్డినేటర్‌గా, శంఖారావం టూర్‌ కోఆర్డినేటర్‌గా పార్టీ నిర్ణయాలను తూఛ తప్పకుండా పాటించాను. సామాన్య రైతు కుటుంబం నుంచి విద్యార్థి యువత నాయకుడిగా ఉన్న నన్ను మంత్రి లోకేష్‌ ఈస్థాయికి తీసుకొచ్చారు. నాపై నమ్మకముంచిన పార్టీ నాయకత్వానికి, ఆదరించిన ప్రతిఒక్కరికీ రుణపడి ఉంటానని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ముంత్రి నారా లోకేష్‌ నాపై పెట్టిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తాను’ అని రవినాయుడు అన్నాడు.

వరదల్లో వీరోచితంగా…

తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో అత్యంత ఉతాహంగా పాల్గొనే అనిమిని రవినాయుడు `కొద్ది రోజుల క్రితం విజయవాడ వరదలను ఎదుర్కొన్న సందర్భలోనూ అత్యంత ఉత్సాహంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. యువగళం టీంతో కలిసి విజయవాడలోని 15, 16, 17 డివిజన్లలో బాధితులకు ఇతోధిక సహాయ సహకారాలు అందించారు.

…………………………………………..

సాయమే..

మహదానందం!

రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో 2019కి ముందు అమలైన పథకాలను ప్రభుత్వం మళ్లీ ప్రారంభిస్తోంది. గడచిన ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పేదలకు రూ.5లకే ఆహారం అందించే అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించింది. కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు ‘అన్న క్యాంటీన్‌’ను లాంఛనంగా ప్రారంభిస్తే.. మర్నాడు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు అన్న క్యాంటీన్లకు శ్రీకారం చుట్టారు. కాగా, అన్న క్యాంటీన్‌ ట్రస్టుకు విరాళాలు అందజేయాలన్న సీఎం చంద్రబాబు పిలుపునకు విశేష స్పందన లభిస్తోంది. పలువురు ముందుకొచ్చి పెద్దమొత్తంలో విరాళాలు అందిస్తున్నారు. అందులో భాగంగానే.. నగరానికి చెందిన శ్రీలక్మీ వెంకటేశ్వర డెవలపర్స్‌ సంస్థ అధినేత పెన్మెత్స శ్రీనివాసరాజు అన్న క్యాంటీన్ల నిర్వహణలో తాను సైతం అంటూ.. రూ.కోటి విరాళం ప్రకటించారు. వచ్చే ఐదేళ్లపాటు ఏటా రూ.కోటి విరాళం ఇస్తానని శ్రీనివాస రాజు ప్రకటించడం.. పేదవాడికి సాయం చేయాలన్న ఆయన దాతృత్వం ఇక్కడ స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో మెరుగైన ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుకు అందరూ భాగస్వాములవ్వాలని పిలుపునిస్తూ.. స్వయంగా ముఖ్యమంత్రిని సచివాలయంలో కలిసి విరాళం చెక్కును అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరాజును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు సీఎం చంద్రబాబు ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేయడం విశేషం. మకున్నదాంట్లో కొంత సమాజానికి ఖర్చు చేయాలనే శ్రీనివాసరాజు ఆలోచనలు సమాజానిం స్ఫూర్తిదాయకమని సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణలు అభినందనలు తెలిపారు. చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి సైతం రూ.కోటి విరాళాన్ని ఇవ్వగా.. ఓ వ్యక్తి తన మూడెకరాల భూమిని ’అన్న క్యాంటీన్ల’కు రాసిచ్చేశారు. ఉదాత్తమైన అన్నదాన కార్యక్రమానికి దాతలు భారీగా విరాళాలు అందిస్తున్నారు.

అన్న క్యాంటీన్లలో ఒక మనిషికి రోజుకు రూ.96 ఖర్చవుతుంది. పూటకు రూ.5కే ఆహారం అందిస్తే.. మూడు పూటలకు క్యాంటీన్లలో ఆహారం తినే వ్యక్తి రూ.15 చెల్లిస్తాడు. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం, దాతలు భరించేలా ‘అన్న క్యాంటీన్ల’ను డిజైన్‌ చేశారు. ఇది పేదలకు సాయం చేయడమే కాదు, మనిషి కోసం మనిషి అన్న మానవతా దృక్పథాన్ని అలవర్చాలన్న లక్ష్యాన్ని అంతర్లీనంగా పొందుపర్చారు. మొత్తం 200 అన్న క్యాంటీన్లు ప్రారంభించాలన్నది కూటమి నిర్ణయం. తొలి విడతలో 100కిపైగా అన్న క్యాంటీలను ప్రారంభించారు. త్వరలోనే మరికొన్నింటిని ప్రభుత్వం పునఃప్రారంభిస్తోంది. 2019కి ముందు రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు టీడీపీ ప్రభుత్వం నిర్వహిస్తే.. జగన్‌ సర్కారు పేదవాడి నోటిదగ్గర కూడుకొట్టి మూసేసింది.

రాష్ట్రంలో సంపద ఉన్నవారు అట్టడుగునున్న వారికి సాయం చేయలన్నది చంద్రబాబు సూచన. అన్న క్యాంటీన్‌ ట్రస్టుకు విరాళాలు అందజేయాలని కోరిన సీఎం.. ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా ప్రారంభించారు. ఎస్‌బీఐ అకౌంట్‌ నంబరు 37818165097, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ ఎస్‌బీఐఎన్‌0020541కు విరాళాలు అందించవచ్చు. వెబ్‌సైట్‌ ద్వారా కూడా విరాళాలు అందించవచ్చు. ఇక, ప్రభుత్వానికి నేరుగా విరాళాలు అందించలేని వ్యక్తులు ఆన్‌లైన్‌ ద్వారా లేదా చెక్కులను అన్నక్యాంటీన్లకు సంబంధించిన ఖాతాలో జమచేయొచ్చు.

………………………………………………….

అన్నం..

అమ్మ స్వరూపం!

సాధారణంగా `అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటుంటాం. కానీ `ప్రఖ్యాత వైద్యుడు గన్ని భాస్కరరావు మాత్రం.. అన్నం అమ్మ స్వరూపం అన్న భావన వ్యక్తం చేస్తున్నారు. ‘ఎవరైనా అన్నం పెడితే వద్దనకండి. పెట్టేవాడు గొప్పకాదు, స్వీకరించేవాడే గొప్ప. దొరికినంతవరకూ శుభ్రమైన ఆహారం తీసుకుని.. ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేవాడికంటే గొప్పవాడు, అదృష్టవంతుడు, సామాజక సృహ కలిగిన సైనికుడు కూడా వాడే అంటున్నారు భాస్కర రావు. రాజమండ్రి, రాజానగరం కేంద్రాలుగా.. జీఎస్‌ఎల్‌ మెడికల్‌ కాలేజీ అండ్‌ జనరల్‌ హాస్పిటల్‌, జీఎస్‌ఎల్‌ హెల్త్‌ కేర్‌, జీఎస్‌ఎల్‌ హెల్త్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సంస్ధల ఫౌండర్‌ చైర్మనే డాక్టర్‌ భాస్కరరావు. క్రమశిక్షణతో కూడిన కృషితో వైద్యవృత్తినుంచి వ్యక్తిగా ప్రారంభమై.. 38ఏళ్ల నిరంతర ప్రయాణంలో బలమైన వ్యవస్థగా ఎదిగిన వ్యక్తి ఆయన. డబ్బు కొలమానాలు పక్కనపెట్టి.. వైద్యాన్ని విద్యుక్తధర్మంగా భావించిన వైద్యడాయన. బుడమేరు వరదతో విజయవాడ కకావికలమై.. భారీగా నష్టపోయిన బాధితులకు వితరణకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌)కి రూ. కోటి రూపాయల చెక్కును తనవంతు సాయంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు. ఇలాంటి సామాజిక బాధ్యత గన్నికి కొత్తకాదు. సుదూర ప్రాంతాల నుంచి తనవద్దకు వైద్యం కోసం వస్తున్న పేషెట్లు ఆకలితో ఇబ్బంది పడుతున్నారని గ్రహించిన భాస్కర రావు `వాళ్లకొక ‘అమ్మ’ను చూపించారు. ఆస్పత్రిలో కొలువుదీరిన ఆ ‘అమ్మ’ దగ్గరికెళ్తే కడుపునిండా శుభ్రమైన భోజనం పెడుతుంది. ఉదయమే వెళ్తే అల్పాహారం పెడుతుంది. కేవలం రూ.15కే రెండు పూటలా ఆహారం అందించే గొప్ప విషయానికి మించి.. బిడ్డ కడుపాకలి చూసి అమ్మ అన్నం పెట్టినంత కమ్మగా, ప్రేమగా పెట్టడం విషయం. ‘అమ్మ’ పేరిట నిత్యం వెయ్యిమందికి పైగా సంతృప్తికరమైన ఆహారం పెట్టడానికి మించి ఆనందం ఏముంటుంది అంటారు భాస్కరరావు సింపుల్‌గా. ‘వైద్యుడిగా నన్ను నమ్మిన సమాజం నాకు చాలా ఇచ్చింది.ఇంకా ఇస్తోంది కూడా. అందులో నాకు ఎంతఅవసరమో అంతా ఉంచుకుని.. మిగిలింది తిరిగి ఇచ్చేస్తున్నాను. అలాంటి కార్యక్రమాల్లో చిన్న భాగమే ఈ అమ్మ భోజనం’ అంటున్నారు భాస్కరరావు. సాధారణంగా వైద్యుడు ఔషధంలో ఆరోగ్యాన్ని కలిపి ఇస్తాడు. కానీ, గన్ని భాస్కరరావులాంటి వైద్యులు అన్నంలో ఆరోగ్యాన్ని కలిపి పెడుతున్నారు. ఆధునిక సమాజానికి వైద్యునిగానే కాదు, వితరణశీలిగానూ గన్ని ఒక స్ఫూర్తి!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *