యుద్ధాలతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఇటు గాజాలో హమాస్‌తో.. అటు లెబనాన్‌లో హిజ్బుల్లాతో.. మరోపక్క ఇరాన్‌తో -ఇజ్రాయెల్‌ ఏకకాలంలో చేస్తోన్న యుద్ధాలతో పశ్చిమాసియా వణుకుతోంది. తాజాగా -‘లెబనాన్‌ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులకు పాల్పడిరది. దాడుల్లో 22మంది మృతిచెందారు. 117మంది గాయపడ్డారు’ అని లెబనాన్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటన వెల్లడిరచింది. యూఎన్‌ శాంతి పరిరక్షణ కార్యాలయంపై ఇజ్రాయెల్‌ దళాలు కాల్పులు జరిపినట్టూ కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు గాయపడ్డారన్నది సమాచారం. యూఎన్‌ శాంతి పరిరక్షణ కార్యాలయంపై ఇజ్రాయెల్‌ దళాలు కాల్పులు జరపడాన్ని ఇటలీ రక్షణమంత్రి గైడో క్రోసెట్టో ఖండిరచారు. దీన్ని యుద్ధనేరంగా పరిగణిస్తామన్నారు.  దీనిపై భారత్‌ సైతం ఆందోళన వ్యక్తం చేసింది. 

ఐరాస శాంతిపరిరక్షణ దళాలున్నచోట దాడులు..

దక్షిణ లెబనాన్‌లోని బీరుట్‌లో ఐరాస శాంతి పరిరక్షణ దళాలున్నచోట ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేస్తుండటంతో -తాజా పరిస్థితులపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఐరాస శాంతి పరిరక్షణ దళాల్లో భారత సైనికులూ పనిచేస్తున్నవేళ వ్యవహారంపై భారత్‌ స్పందించింది. వివాదం ప్రాంతీయ యుద్ధంగా మారకుండా చూడటం ఎంతో ముఖ్యమని అభిప్రాయపడిరది.. అయితే, తాజా ఉద్రిక్తతల వేళ ఇజ్రాయెల్‌, ఇరాన్‌తోపాటు ఇతర పశ్చిమాసియా దేశాల్లోని భారతీయులను తరలించే ప్రక్రియను ప్రస్తుతం చేపట్టడం లేదని భారత విదేశాంగశాఖ తెలిపింది. ‘లెబనాన్‌ సరిహద్దులో భద్రతా పరిస్థితులు క్షీణించడం ఆందోళనకరం. ఐరాస ప్రాంగణాలను అందరూ గౌరవించాలి. ఐరాస శాంతిపరిరక్షకులు, ఆ సంస్థ నిర్ణయాలను గౌరవించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి’ అని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. 

ఇజ్రాయెల్‌ దాడులపై వాషింగ్టన్‌ స్పందించింది. హిజ్బుల్లా సౌకర్యాలను లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు చేసే సమయంలో యూఎన్‌ శాంతి పరిరక్షకుల భద్రతకు ముప్పు వాటిల్లకుండా ఉండటం కష్టమని పేర్కొంది. ఇక, ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో యూఎన్‌ పరిరక్షకులు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని యూఎన్‌ సూచించింది.

ఖుద్స్‌ ఫోర్స్‌ చీఫే..

ఇరాన్‌ ఇంటి దొంగ

ఇరాన్‌ టాప్‌ కమాండర్‌ ఒకరు ఇజ్రాయెల్‌ ఏజెంట్‌గా పని చేస్తున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. తాజాగా అలాంటి పరిస్థితే ఇరాన్‌కు మరోసారి పునరావృతమైందని పశ్చిమ దేశాల పత్రికలు కథనం. ఐఆర్టీసీ ఖుడ్స్‌ ఫోర్స్‌ చీఫ్‌ను ఇరాన్‌ దళాలు బంధించి ఇంటరాగేషన్‌ చేస్తున్నాయట. ఆ సమయంలో తీవ్రమైన గుండెపోటు వచ్చినట్టు స్కైన్యూస్‌ అరబిక్‌లో కథనం ప్రచురితమైంది. అతడి సన్నిహిత బృందాన్నీ ఇరాన్‌ దళాలు బంధించినట్లు పేర్కొన్నాయి.

కీలక భేటీ

హిజ్బుల్లా అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేస్తోన్న వేళ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజిష్కియాన్‌ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇరువురు నేతలు తుర్క్‌మెనిస్థాన్‌ రాజధాని ఆష్టాబత్‌లో సమావేశం కానున్నారంటూ రష్యాకు చెందిన పలు మీడియా కథనాలు వెల్లడిరచాయి. 18వ శతాబ్దానికి చెందిన కవి మాగ్జిమ్‌గూలీ పైరగీ 300వ జయంతి పురస్కరించుకొని జరిగే వేడుకలో భాగంగా ఇద్దరు నేతలూ ఆ దేశంలో పర్యటించనున్నారు. ఈసందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌- ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజిష్కియాన్‌ జరిపే భేటీలో ద్వైపాక్షిక అంశాలు, పశ్చిమాసియాలో అస్థిర పరిస్థితులపైనా చర్చిస్తారన్నది కథనాల సారాంశం. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా నుంచి ఎస్‌యూ`35 యుద్ధవిమానాలు, అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ ఎస్‌-400వంటి వాటిని ఇరాన్‌ కోరుతున్నట్లు కథనాలు లేకపోలేదు. అట్టుడుకుతున్న పశ్చిమాసియాకు సంబంధించి ఇవీ తాజా కథనాలు. రోజురోజుకీ జఠిలమవుత్ను యుద్ధ పరిస్థితుల్లో అలుపెవరిది? గెలుపెవరిది? అన్న ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. క్రమంగా రీజినల్‌ వార్‌కు దారితీసే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఏడాదిగా సాగుతోన్న భీరక యుద్ధానికి ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడే కారణమైనా.. యుద్ధంనుంచి ఏ పక్షమూ వెనక్కి తగ్గలేకపోవడానికి ఏ పక్షానికి ఆ పక్షం.. వ్యూహాత్మక లక్ష్యాలున్నాయి. యుద్ధభూమిలో నిలబడి శాంతిని సాధించలేమని తెలిసీ.. యుద్ధంవైపే పరుగులు తీస్తున్న పశ్చిమాసియా పరిస్థితులపై `చరిత్ర అనుభవాలతో వర్తమానాన్ని విశ్లేషించుకోవాల్సిన సమయమిది.

సరిగ్గా ఏడాది క్రితం. అక్టోబర్‌ 7, 2023. 

గాజాలోని హమాస్‌, ఇజ్రాయెల్‌పై జరిపిన దుర్మార్గపు దాడుల్లో 1200మంది ఇజ్రాయెలీ పౌరులు చనిపోయారు. అందులో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. ఇజ్రాయెలీ పౌరుల్ని కొంతమందిని బందీలుగా తీసుకుని -హమస్‌ ఫైటర్లు వెళ్లిపోయారు. ఈ పరిణామం అనేక ఇతర పరిణామాలకు దారితీసింది. హమస్‌ దాడిని తీవ్రవాద చర్యగా అభివర్ణించింది ఇజ్రాయెల్‌. దాడికి ప్రతిదాడి తలపెట్టకుండా -ఏకంగా యుద్ధాన్ని ప్రకటించింది. ఏడాదిగా గాజాపైన ఇజ్రాయెల్‌ తీవ్రమైన యుద్ధం చేస్తోంది. ఇప్పటికి 50వేలమంది సాధారణ మహిళలు, పిల్లలు పాలస్తీనియన్లు చనిపోయారు. లక్షమంది గాయపడ్డారు. 23 లక్షలమంది గాజాలోని పాలస్తీనియన్లు నిర్వాశితులయ్యారు. 

గాజా. మధ్యధరా సముద్రానికి.. ఇజ్రాయెల్‌కు మధ్యలోవున్న 365 చదరపు కిలోమీటర్ల భూభాగం. ఇప్పుడిక్కడ శిధిల భవనాలే మిగిలాయి. ఆస్పత్రులు కనుమరుగయ్యాయి. పిల్లల స్కూళ్లు తునాతనకలయ్యాయి. నివాస భవనాలు కుప్పకూలాయి. నిజానికిప్పుడు గాజ -శిధిల సమూహం.

గాజాలో మారణహోమాన్ని నిరసిస్తూ హమస్‌కు మద్దతుగా నిలిచింది హిజ్బుల్లా. గత దశాబ్దాలుగా -ఇజ్రాయెల్‌కు పక్కలో బల్లెం అది. ఇజ్రాయెల్‌కు సరిహదుల్లోని సౌత్‌ లెబనాన్‌ నుంచి దాడులు మొదలెట్టింది. 

కొన్ని దశాబ్దాల క్రితం -సౌత్‌ లెబనాన్‌లో పాలస్తీనా విమోచన సంస్థను తరిమికొట్టడానికి ఇజ్రాయెల్‌ దాడులు చేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. యేళ్ల తరబడి సౌత్‌ లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ తిష్టవేసింది. ఆ సమయంలో ఇజ్రాయెల్‌ను ప్రతిఘటిస్తూ హిజ్బుల్లా పుట్టింది. ఏళ్ల తరబడి తిరుగుబాట్లు చేసింది. చిట్టచివరిగా సౌత్‌ లెబనాన్‌ నుంచి ఇజ్రాయెల్‌ను హిజ్బుల్లా తరిమికొట్టింది. అదీ సింపుల్‌గా హిజ్బుల్లా చరిత్ర.

హిజ్బుల్లా.. పెద్దఎత్తున ఇజ్రాయెల్‌పై మిస్సైల్స్‌తో విరుచుకుపడిది. ‘గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు ఆగేంతవరకూ మా దాడులు కొనసాగుతాయని ప్రకటించింది హిజ్బుల్లా. ఈ దాడులతో సౌత్‌ లెబనాన్‌ సరిహద్దుల్లోవున్న వేలాది ఇజ్రాయెల్‌ పౌరులు నిర్వాశితులయ్యారు. ఇళ్లు వదిలిపెట్టి రహస్య స్థావరాల్లో తలదాచుకునే పరిస్థితి వచ్చింది. ఇటు గాజాలో హమస్‌తో యుద్ధం చేస్తూనే.. హిజ్బుల్లాపై ఇజాయెల్‌ పెద్దఎత్తున కౌంటరు దాడులకు దిగింది. ఒకడుగు ముందుకేసి -హిజ్బుల్లాకు మద్దతిస్తున్న ఇరాన్‌పైకి మిస్సైల్స్‌ గురిపెట్టింది ఇజ్రాయెల్‌. అందులో భాగంగా సిరియా రాజధాని డమాస్కస్‌లోవున్న ఇరాన్‌ రాయభార కారాలయంపైనా ఇజ్రాయెల్‌ విరుచుకుపడిరది. ఈ దాడిలో ఇరానియన్‌ జనరల్స్‌ హతమయ్యారు. ఇజ్రాయెల్‌ దాడులను ఇరాన్‌ వ్యతిరేకించింది. ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. చెప్పినట్టుగానే.. ఇజ్రాయెల్‌పైన మిస్సైల్స్‌తో, ద్రోణులతో వ్యూహాత్మక దాడి జరిగింది. అంటే.. పౌరులకు నష్టం కలుగకుండా.. భారీ విధ్వంసం జరగకుండా ‘మా జోలికి వస్తే తాటతీస్తాం’ అన్న సందేశం అందేలాంటి దాడి జరిపింది. ఇరాన్‌ దాడికి ప్రతీకారంతో రగిలిపోయింది ఇజ్రాయెల్‌. మేమూ దాడి చేస్తామంటూ ప్రకటించింది ఇజ్రాయెల్‌. ఇరాన్‌లోని న్యూక్లియర్‌ ఫెసిలిటీస్‌వున్న నగరంపైకి ఇజ్రాయెల్‌ మిస్సైల్స్‌ దూసుకెళ్లాయి. ఇక్కడ -ఇజ్రాయెల్‌ సైతం వ్యూహాత్మక దాడినే ఎంచుకుంది. ప్రాణనష్టం, భారీ ఆస్తినష్టం వాటిల్లకుండా -‘మేమేం తక్కువ కాదు’ అన్న సందేశం అందేలాంటి దాడులకే పాల్పడిరది. ఇరాన్‌ -ఇజ్రాయెల్‌ మధ్య సింబాలిక్‌ దాడులు జరుగుతున్న సమయంలోనే.. గాజాలో పాలస్తీనియన్లకు మద్దతుగా యెమన్‌లోని హూథీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్‌పైన దాడులు దాడులు మొదలుపెట్టారు. కీలక వాణిజ్య జలసంధి అయిన ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై అటాక్స్‌కు దిగారు హూథీ తిరుగుబాటుదారులు. హూథీలపైకీ ఇజ్రాయెల్‌ తన ఆయుధాలను గురిపెట్టక తప్పలేదు. 

గాజానుంచి హమస్‌.. సౌత్‌ లెబనాన్‌నుంచి హిజ్బుల్లా.. ఇంకోపక్క ఇరాన్‌.. ఇప్పుడు యెమెన్‌ నుంచి హూథీలు. ముప్పేట యుద్ధం చేస్తూనే.. హిజ్బుల్లా కమాండర్లను లేపేసింది ఇజ్రాయెల్‌. సరిగ్గా ఇదే సమయంలో.. ఖతార్‌, ఈజిప్ట్‌లు శాంతికోసం అమెరికాతో కలిసి గాజాలో కాల్పుల విరమణ సాధించడానికి ప్రయత్నం జరిపాయి. ఈ ప్రయత్నానికి కీలక పాత్రధారిగా హమస్‌ తరఫున పొలిటికల్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ అనియే ఉన్నారు. శాంతి చర్చల ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే.. ఇరాన్‌ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి టెహ్రాన్‌ వెళ్లారు ఇస్మాయిల్‌ అనియే. ఇరాన్‌ రాజధాని గడ్డమీద ఇజ్రాయెల్‌ ఇంటిలిజెన్స్‌ విభాగం ముసాద్‌.. ప్లాన్డ్‌గా ఇస్మాయిల్‌ అనియేను అంతం చేసింది. అప్పటికే ఇరాన్‌ -ఇజ్రాయెల్‌ పరస్పరం వ్యూహాత్మక దాడుల్లో మునిగివున్నాయి. తమ భూభాగంలోకి ఇజ్రాయెల్‌ ప్రవేశించి.. అతిధిగావున్న ఇస్మాయిల్‌ అనియేను అంతం చేయడాన్ని ఇరాన్‌ జీర్ణించుకోలేకపోయింది. ఇజ్రాయెల్‌ తగిన మూల్యం చెల్లించక తప్పదని, ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్‌ ఈసారి యుద్ధ ప్రకటనే చేసింది.

ఈ హెచ్చరికలను లక్ష్యపెట్టకుండానే.. అప్పటికే ముప్పేట యుద్ధంలో మునిగివున్న ఇజ్రాయెల్‌ -సౌత్‌ లెబనాన్‌లోని హిజ్బుల్లా కమాండర్లనూ టార్గెట్‌ చేస్తూ.. చివరకు హిజ్బుల్లా సెక్రటరీ జనరల్‌, హిజ్బుల్లా చీఫ్‌ హసన్‌ నస్రల్లానూ లేపేసింది. చీఫ్‌నే లేపేస్తే సేన చల్లబడుతుందని ఇజ్రాయెల్‌ ఆసించింది. కాకపోతే ఇక్కడ సీన్‌ రివర్సైంది. చీఫ్‌ హసన్‌ నస్రల్లా అంతమైన తరువాత.. మరింత శక్తి కూడదీసుకుని.. హిజ్బుల్లా బలమైన దాడులు మొదలెట్టింది. 

తమ గడ్డపైనే ఇస్మాయిల్‌ అనియే అంతం కావడం.. తన మద్దతుదారు హిజ్బుల్లా చీఫ్‌ హసన్‌ నస్రల్లాను లేపేయడంలాటి పరిణామాలతో రగిలిపోయిన ఇరాన్‌.. మరోసారి ప్రకటన చేసింది. హసన్‌ నస్రల్లాను అంతం చేసిన దాడికి ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్‌ మత నాయకుడు హయతుల్లా ఖమేనీ ప్రకటించాడు. ప్రకటన చేస్తూనే ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ మిస్సైల్స్‌ విరుచుకుపడ్డాయి. ఈసారి జరిపింది సింబాలిక్‌ దాడికాదు. భీకర యుద్ధానికి దారితీసే ఆరంభదాడులే. అతి బలమైన ఇజ్రాయెల్‌ భద్రతా వలయాలను ఛేదిస్తూ.. టెల్‌ అవీవ్‌ దేశ రాజధాని జెరూసలెంలోకి ఇరాన్‌ క్షిపణులు దూసుకొచ్చాయి. ఊహించని పరిణామానికి ఇజ్రాయెల్‌ ఉలిక్కిపడిరది. ‘ఇరాన్‌ దాడులను మేమూ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇరాన్‌ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు’ అంటూ ఇజ్రాయెల్‌ సైతం భీకర యుద్ధ హెచ్చరికే చేసింది.

చిలికి చిలికి మొదలైన పరిణామాలు గాలివానగా మారి.. పశ్చిమ ఆసియాను భీకర యుద్ధఛాయలు అలముకోవడంతో -అమెరికా, ఫ్రాన్స్‌ దేశాలు గొంతువిప్పాయి. ‘సంయమనం వహించి కొద్దిరోజులు కాల్పుల విరమణ పాటించాలంటూ’ ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుకు పిలుపునిచ్చాయి. యునైటెడ్‌ నేషన్స్‌ సైతం ఇజ్రాయెల్‌కు అదే సూచన చేసింది. ‘యుద్ధాని విడిచిపెట్టి.. రాజకీయ చర్చలు, సంప్రతింపుల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని’ సూచించింది. అప్పటికే యుద్ధం కొనసాగించాల్సిన పరిస్థితుల్లో ఇరుక్కున్న ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు చెవికి శాంతివచనాలు ఎక్కలేదు. ‘ఇరాన్‌ సంగతి తేల్చాల్సిందేనంటూ’ ప్రతిన బూనాడు. ఏ క్షణమైనా పెద్దఎత్తున ఇరాన్‌పైకి ఇజ్రాయెల్‌ దాడులు మొదలెట్టొచ్చు. ఇజ్రాయెల్‌ హెచ్చరికను ఇరాన్‌ మత నాయకుడు అయతుల్లా ఖమేనీ కూడా అంతే గట్టిగా తిప్పికొట్టాడు. ఇజ్రాయెల్‌ కనుక తమపై విరుచుకుపడితే.. ఈసారి శత్రువును అమెరికా కాదుకదా.. ఆ దేవుడు కూడా రక్షించలేడు అని తీవ్ర స్వరంతో హెచ్చరించాడు. గత ఏడాది కాలంగా పశ్చిమాసియా రగులుతుండటానికి నేపథ్యం ఇదీ. ఇప్పుడు ఎవరు ఎవరిమీద భీకరంగా విరుచుకుపడినా.. సంభవించే నష్టాన్ని ఊహించలేం. అదే రీజినల్‌ వార్‌కూ దారితీయొచ్చు. ‘పశ్చిమాసియాలో పుట్టిన మంటలు.. ఏ క్షణమైనా ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చంటూ’ మీడియాలో, ఛానెల్స్‌లో పుంఖాను పుంఖాలుగా వస్తోన్న కథనాలు ఇందుకే!

అక్టోబర్‌ 7, 2023 నుంచి అక్టోబర్‌ 7, 2024 వరకూ పశ్చిమాసియాలో చోటుచేసుకున్న పరిణామాలివి. 

ఇక్కడే ఒక ప్రశ్న ఉద్భవిస్తుంది.

ఇజ్రాయెల్‌ -పాలస్తీనా ఘర్షణలది దశాబ్దాల చరిత్ర. సెకెండ్‌ వరల్డ్‌ వార్‌కు ముందునుంచీ చరిత్రలో ఈ ఘర్షణలకు ఆనవాళ్లున్నాయి. 

తాజా దాడులు, ప్రతిదాడులు మాత్రం.. అక్టోబర్‌ 7, 2023న ఇజ్రాయెల్‌పై హమస్‌ జరిపిన దాడితో మొదలైంది. అయితే, హమస్‌ దాడులను ఆదినుంచీ ఒక తీవ్రవాద చర్యగానే కొట్టేస్తూ వచ్చాయి ఇజ్రాయెల్‌ సహా పశ్చిమ దేశాలు. కానీ ఇజ్రాయెల్‌ ఆక్రమణలోని పాలస్తీనా ప్రాంతాలు, పాలస్తీనీయన్లకు మాతృదేశం లేకుండా చేయడం, పాలస్తీనీయన్లకు ఆవాసంగా మిగిలిన గాజా, వెస్ట్‌బ్యాంకులనూ ఇజ్రాయెల్‌ దిగ్బంధించడం.. ఆ ప్రాంతాల్లోనూ ఇజ్రాయెల్స్‌ సాగిస్తోన్న సెటిల్‌మెంట్స్‌.. వీటిని ప్రతిఘటిస్తూ పాలస్తీనా సంస్థలు, ముఖ్యంగా హమాస్‌ అటాక్స్‌. ఈ కోణంలో సమస్యను చూస్తే పరిస్థితి మరోలా ఉండేది. కానీ -పాలస్తీనియన్‌ మిలిటెన్సీ, మాతృదేశ ఆకాంక్ష.. ఈ రెంటినీ విడగొట్టి చూస్తూ వచ్చాయి పశ్చిమ దేశాలు. ఇదే కొరుకుడుపడని సమస్యగా, ముగింపులేని యుద్ధంగా పరిణమిస్తోంది. 

హమస్‌ ఎందుకు దాడులు చేసింది? దాడులకు కారణాలేంటి? ఈ కోణంలో ఇప్పుడు జరుగుతోన్న యుద్ధాన్ని విశ్లేషించుకుంటే.. పాలస్తీనా ప్రాంతాలపై ఇజ్రాయెల్‌ దురాక్రమణలు.. దిగ్బంధంలోవున్న ప్రాంత పాలస్తీనియన్లకు కొత్తేమీ కాదు. అది దశాబ్దాల చరిత్ర. కానీ, కాలక్రమంలో చోటుచేసుకుంటున్న కొత్త పరిణామాలే.. పాలస్తీనా సంస్థల గుండెల్లో మంటపెట్టింది.  దశాబ్దాలుగా సాగుతోన్న పాలస్తీనా మాతృదేశ పోరాటాన్ని పక్కకునెట్టి.. పోరాటానికి అండగా నిలబడాల్సిన ఆటగాళ్లే.. ప్రత్యర్థులతో చేతులు కలపడానికి సిద్ధమవ్వడమే పశ్చిమాసియా కల్లోలానికి అసలు కారణంగా కనిపిస్తోంది. 

అందులో మొదటిది, ప్రధానంగా ప్రస్తావించాల్సింది.. 2020లో యునైటెడ్‌ స్టేట్స్‌ డైరెక్షన్‌లో రూపుదిద్దుకున్న -అబ్రహామ్‌ అకార్డ్స్‌. అంటే అమెరికా దర్శకత్వంలో ఇజ్రాయెల్‌తో మూడు కీలక అరబ్‌ దేశాలైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, మొరాకో, బహ్రెయిన్‌లు కుదుర్చుకున్న ఒప్పందం. తోటి అరబ్‌ దేశాలు తమ స్వార్థాన్ని చూసుకుంటే.. మాతృదేశమైన పాలస్తీనా కోసం ఏళ్లతరబడి ఎదురు చూస్తున్న అరబ్‌ ప్రజల సంగతేంటి? సహజంగానే తెరపైకి వచ్చిన ప్రశ్న ఇది. ఇజ్రాయెల్‌ దురాక్రమణలోవున్న పాలస్తీనా ప్రాంతాల భవిష్యత్‌ పట్టించుకోకుండా -ఒప్పందాలు చేసుకోవడమే యుద్ధ వాతావరణానికి పునాధి పడిరది.

ఇక్కడ -సగం అమలై సగం అమలుకాకుండా చరిత్రలో ఉండిపోయిన యునైటెడ్‌ నేషన్స్‌ ప్రతిపాదనను ప్రస్తావించాలి. పశ్చిమాసియాలో శాంతి వాతావరణం నెలకొనాలంటే.. యూదులకు ఇజ్రాయెల్‌, అరబ్‌లకు పాలస్తీనా దేశాలు ఏర్పాటుచేసి.. ఇద్దరూ సహజీవనంగా మెలిగితేనే శాంతి సాధ్యమంటూ 1948లో యునైటెడ్‌ నేషన్స్‌ ప్రతిపాదిత పరిష్కారం చూపింది. అయితే ఐక్యరాజ్య సమితి తీర్మానం అమలు కాకుండా -ఇజ్రాయెల్‌ బలప్రయోగాలకు దిగడంతో.. శాంతి నెలకొనాల్సిన గడ్డ యుద్ధభూమిగా మారిపోయింది. యూదులు తమ దేశంగా ఇజ్రాయెల్‌ను ఏర్పరుచుకుని.. అరబ్‌, పాలస్తీనా ప్రాంతాలపై దాడులు చేస్తూ వచ్చారు. పాలస్తీనాకు మద్దతిచ్చిన అనేక అరబ్‌ ప్రాంతాలు జోర్డాన్‌, ఈజిప్ట్‌, సిరియా, లెబనాన్‌లాంటి దేశాలపైన ఇజ్రాయెల్‌ యుద్ధాలు సాగించింది. ఇజ్రాయెల్‌ భీకర యుద్ధాలతో చెల్లాచెదురైన పాలస్తీనియన్లు.. చివరకు 365 చదరపు కిలోమీటర్ల ముక్క గాజా, వెస్ట్‌బ్యాంకు ప్రాంతాలకు పరిమితమయ్యారు. అందుకే -మిగతా ఏ ప్రాంతంలోనూ పాలస్తీనియన్లకు పౌరసత్వం లేదు. అలా వెస్ట్‌బ్యాంకును పాలస్తీనియన్‌ అథారిటీ, గాజాను హమస్‌ పాలిస్తోంది. అయితే.. ఈ రెండు ప్రాంతాలనూ అష్టదిగ్బంధనం చేసి.. తమ చెప్పుచేతల్లో పెట్టుకోవాలన్న కాంక్ష ఇజ్రాయెల్‌ది. అందుకు -యూదుల సెటిల్‌మెంట్స్‌నూ ప్రోత్సహించింది. వాటికి రక్షణగా అప్పుడప్పుడు బలగాలను దింపుతుంది. ఆ బలగాలే దాడులకు పాల్పడేది. ఇదీ పాలస్తీనా సమస్య. 

నిజానికి -అబ్రహామ్‌ అకార్డ్స్‌ కుదరక ముందువరకూ సమస్య రూపం మరోలా ఉండేది. ఇజ్రాయెల్‌తో అరబ్‌ లీగ్‌ దేశాలు ఏ ఒప్పందం కుదుర్చుకోవాలనుకున్నా -‘ముందు పాలస్తీనా సమస్యకు పరిష్కారం చెప్పండి’ అన్న నిలదీత తెరపైకొచ్చేది. ఈసారి ఆ ‘నిలదీత’ను పక్కకునెట్టే -యూఏఈ, మొరాకో, బహ్రెయిన్లు ఇజ్రాయెల్‌తో ఒప్పందాలు చేసుకోవడమే సమస్యాత్మకమైంది. నిజానికి ఇజ్రాయెల్‌ వ్యూహాంలో ఇదొక భాగం. పాలస్తీనాకు మాతృదేశం లేకుండా చేయడానికి ఏ అరబ్‌ దేశాలతోనైతే యుద్ధాలు చేసిందో.. అదే అరబ్‌ లీగ్‌ దేశాలను మచ్చిక చేసుకునేందుకూ ఇజ్రాయెల్‌ కొన్నేళ్లుగా ఆసక్తి చూపుతోంది. అంటే -పాలస్తీనా మాతృదేశం అన్న డిమాండ్‌ను చరిత్ర పుటలనుంచి చెరిపేసేందుకు ఇజ్రాయెల్‌ వేస్తోన్న వ్యూహాత్మక అడుగు. ఇందులో మరోకోణం.. ఇజ్రాయెల్‌ను ముందు నిలబెట్టి అమెరికా ఆటాడుతోందన్న అనుమానమూ లేకపోలేదు. పాలస్తీనియన్‌ సంస్థల బురద్రల్లో తీవ్రవాదాన్ని రేకెత్తిస్తోన్న అంశాలివి. 

ఇక రెండొవది.. -అరబ్‌ దేశాలలో అత్యంత ధనిక దేశం సౌదీ అరేబియా. యుద్ధం ప్రారంభానికి కొద్దిరోజులు ముందు ఇజ్రాయెల్‌- సౌదీఅరేబియా దేశాలు సన్నిహిత సంబంధాలు ఏర్పాటుకు ముందుకొచ్చాయి. అందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తోంది. నిజానికి అరబ్‌ దేశాలు దశాబ్దాలుగా తోటి పాలస్తీనా ప్రజలకు చేస్తున్న విద్రోహంలో ఇదొక భాగం. బ్యాక్‌ చానెల్‌లో ఇజ్రాయెల్‌, అమెరికాతో కలిసి చర్చలు జరిపి.. ఫైనల్‌గా ఒప్పందాలు కుదుర్చుకోవడం పరిపాటైంది. 1979లో ఈజిప్ట్‌తో సంత్సంబంధాల దగ్గర్నుంచీ.. ఇటీవలి జోర్డాన్‌, మొరాకో, యూఏఈ, బహ్రెయిన్‌ ఒప్పందాలను ఈ కోణంలోనే చూడాలి. అంటే.. అరబ్‌ దేశాలు ఇజ్రాయెల్‌తో వైరాన్ని వదులుకుని.. పాలస్తీనా సమస్యను పక్కకుపెట్టేసి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఆ వరుసలోకి సౌదీ అరేబియా చేరింది. సౌదీ అరేబియా -ఇజ్రాయెల్‌ మధ్య నార్మలైజేషన్‌ టాక్స్‌ తుది దశకు చేరాయని సౌదీ అరేబియా క్రౌన్‌ ప్రిన్స్‌ మహ్మద్‌ బీన్‌ సల్మానే స్వయంగా, అధికారికంగా ప్రకటించాడు. సరిగ్గా ఈ ప్రయత్నమే.. గాజా- ఇజ్రాయెల్‌ మధ్య తాజా యుద్ధానికి కారణమన్న వాదనలను కొట్టి పారేయలేం. అక్టోబర్‌ 7, 2023 అటాక్‌. హమాస్‌ కనుక ఇజ్రాయెల్‌పై దాడి కాస్త ఆలస్యమైవుంటే.. -అబ్రహామ్‌ అకార్డ్‌ మాదిరిగానే సౌదీ అరేబియా-ఇజ్రాయెల్‌కు మధ్య ఒప్పందం కుదిరిపోయేది. పాలస్తీనా పోరుకు దన్నునిచ్చే మరో అరబ్‌ దేశం చేజారిపోయేది. ఆ ఒప్పందం కుదిరేముందే హమాస్‌ అటాక్‌ జరిగింది. 

ఇప్పుడు ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధం తీవ్రతరమవుతున్న వేళ అరబ్‌ దేశమైన సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌తో సత్సంబంధాలు ఏర్పరుచుకోవడానికి ఉద్దేశించిన ఒప్పంద చర్చలకు బ్రేక్‌ వేసినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వస్తున్నాయి. ఇజ్రాయెల్‌ ఒప్పంద చర్చలను నిలిపివేయాలని సౌదీ నిర్ణయించిందని, ఇదే విషయాన్ని అమెరికా అధికారులకు సౌదీ తెలియజేసిందన్నది తాజా సమాచారం. అరబ్‌ లీగ్‌లో బలమైన దేశాల్లో ఒకటైన సౌదీ అరేబియా.. ఇజ్రాయెల్‌తో సంబంధాలు ఏర్పరచుకుంటే మిగతా ముస్లిం దేశాలకు అది బలమైన సంకేతాన్ని పంపినట్టవుతుంది. ఇతర దేశాలూ సౌదీ బాటపట్టే అవకాశం ఉండకపోదు. సాధారణంగా పాలస్తీనా సమస్య.. అరబ్‌ దేశాలకు ఓ భావోద్వేగపరమైన అంశం. అందుకే మెజారిటీ ముస్లిం దేశాలు ఇజ్రాయెల్‌ విషయంలో ఇన్నాళ్లూ కఠిన వైఖరే అవలంబించాయి. ఆ దేశ సార్వభౌమత్వాన్ని అధికారికంగా గుర్తించడానికి తిరస్కరిస్తూ వచ్చాయి. అలాంటి దేశాలు యూదు దేశంతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల పాలస్తీనీయుల హక్కులకు వెన్నుపోటు పొడవడమే అవుతుందని ఇరాన్‌ కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో హమాస్‌ ఇజ్రాయెల్‌పై దాడి చేయడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో ఒప్పందం విషయంలో ముందడుగు పడటం కష్టమని అందరూ ఊహించనట్లుగానే సౌదీ వెనక్కి తగ్గింది.

ఈ రెండు పరిణామాలకు సమాంతరంగా -మూడో పరిణామం చోటు చేసుకుంది. అదే -ఐమెక్‌!

సెప్టెంబరు 9, 2023న న్యూఢల్లీ వేదికగా సాగిన జీ20 సమ్మిట్‌లో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ చేసిన ప్రకటన -ఐమెక్‌ (ఇండియా- మిడిల్‌ ఈస్ట్‌- ఐరోపా ఆర్ధిక నడవా). భారత్‌ నుంచి గల్ఫ్‌ దేశాలకు అక్కడి నుంచి ఇజ్రాయెల్‌ మీదుగా ఐరోపాలోకి సరకు రవాణాకు వీలుగా ప్రాజెక్టును ప్లాన్‌ చేశారు. జీ7 సభ్యదేశాలు చేపట్టిన ‘ది ప్రాజెక్టు ఫర్‌ గ్లోబల్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్మెంట్‌ (పీజీఐఐ)లో భాగమిది. గతేడాది జీ20 సదస్సు సందర్భంగా ఈ ఆలోచన పురుడు పోసుకొంది. ఆ సమ్మిట్‌లోనే ఎంవోయూపై భారత్‌, అమెరికా, యూఏఈ, సౌదీ, ఫ్రాన్స్‌, జర్మనీ, ఐరోపా సమాఖ్య, ఇటలీ సంతకాలు చేశాయి.భారత్‌లో మొదలయ్యే నడవానుంచి యూఏఈ, సౌదీ, జోర్డాన్‌, ఇజ్రాయెల్‌, గ్రీస్‌ మీదుగా ఐరోపాలోని ఇటలీ, ఫ్రాన్స్‌, జర్మనీకి సరకు రవాణాకు ఏర్పాటు చేస్తోన్న కారిడార్‌ ఇది. భారత్‌ నుంచి గల్ఫ్‌ దేశాలకు వెళ్లే దానిని తూర్పు నడవా అని.. అక్కడినుంచి ఐరోపాకు వెళ్లే మార్గాన్ని ఉత్తర నడవాగా విభజించారు. ఆసియా-ఐరోపా మధ్య జల, రైలు మార్గాల్లో సంబంధాలను బలోపేతం చేయాలన్నదే ఐమెక్‌ లక్ష్యం.

ఈ ప్రాజెక్టులో భారత్‌ ప్రత్యేక ఆసక్తి చూపించడానికి కారణం లేకపోలేదు. ఆ కారణం -చైనా బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బీఆర్‌ఎ). ప్రపంచంపై ఆధిపత్యం కోసం దశాబ్దకాలం క్రితమే చైనా ఈ ప్రాజెక్టును ఎత్తుకుంది. పెద్దసంఖ్యలో రహదారులు, హైవేలు, పైప్‌లైన్లు నిర్మించాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన ప్రాజెక్టులో దాదాపు 150 దేశాలు, 30 అంతర్జాతీయ సంస్థలు భాగమయ్యాయి. సామ్రాజ్యవాద కాంక్షతోనే డ్రాగన్‌ బీఆర్‌ఐ తీసుకొచ్చిందని చాలా దేశాలు గ్రహించడంతో.. క్రమంగా దాన్నుంచి బయటపడుతున్నాయి. అయితే -భారత్‌ ఆదిలోనే బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ ప్రాజెక్టును తిప్పికొట్టింది. ఇక్కడ రెండు అబ్జెక్షన్లు కారణం. ఒకటి.. ఈ బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌లో భాగమైన చైనా-పాకిస్థాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌. మన భూభాగాలుగా మనం భావిస్తున్న పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ మీదుగా వెళ్తుందిది. భారత సార్వభౌమత్వానికి భంగం కలిగించే అంశం కనుక.. భారత్‌ నో చెప్పింది. రెండోది.. ఈ ప్రాజెక్టుతో ప్రపంచాధిపత్యం సాధించాలన్న చైనా ఆకాంక్ష. అది భారత జాతీయ ప్రయోజనాలకు నష్టమని భావించి.. ప్రాజెక్టును మనం దూరం పెట్టాం. చైనా ప్రాజెక్టుకు పోటీగా తెరపైకి వచ్చిందే `ఐమెక్‌. దీంతో భారత్‌నుంచి ఐరోపా వరకూ గల్ఫ్‌దేశాలు, ఇజ్రాయెల్‌ ఒక పెద్ద ఎకనామిక్‌ ఇంటిగ్రేషన్‌ అవుతుంది. 

ఇది ప్రాజెక్టు పురుడు పోసుకుంటున్న సమయంలో -ఎవ్వరూ కూడా పాలస్తీనా పరిస్థితేంటి? యునైటెడ్‌ నేషన్స్‌ 1948లో ప్రతిపాదించిన ‘టూ స్టేట్స్‌’ సొల్యూషన్‌ సంగతేంటి? అన్నది చర్చకే రాలేదు. ఈ మూడో పరిణామం ఎప్పుడైతే వేగవంతమైందో.. పాలస్తీనియన్లకు వాళ్ల భవిష్యత్‌పై భయాలు ముసిరాయి. తమను పట్టించుకోకుండా, భవిష్యత్‌ను తేల్చకుండా.. అరబ్‌ దేశాలు ఇజ్రాయెల్‌తో కలిసిపోతున్నాయి. ఇదే జరిగితే దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ‘పాలస్తీనా మాతృదేశం’ అన్నది చరిత్ర పుటల నుంచి అంతర్థానమయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇదే -హమాస్‌కు కుదురులేకుండా చేసింది. 

పాలస్తీనా సమస్యను -పశ్చిమాసియా చరిత్ర పుటల నుంచి చెరిపేయాలన్న లక్ష్యంతో వ్యూహాత్మక ఆటాడుతున్న ఆటగాళ్లు ముగ్గురు. అబ్రహామ్‌ అకార్డ్సులోగాని, సౌదీ అరేబియా `ఇజ్రాయెల్‌ నార్మలైజేషన్‌ టాక్స్‌లోగానీ, ఇండియా- మిడిల్‌ ఈస్ట్‌- ఐరోపా ఆర్ధిక నడవాలోగానీ `వ్యూహాత్మకంగా అడుగులేస్తోన్న మొదటి ఆటగాడు ఇజ్రాయెల్‌. రెండో ఆటగాడు `అరబ్‌ లీగ్‌. కనిపించని మూడో ఆటగాడు -యునైటెడ్‌ స్టేట్‌. 

ఇజ్రాయెల్‌ లక్ష్యం.. పాలస్తీనా సమస్యను అరబ్‌ దేశాలే కాదు, ప్రపంచమే మర్చిపోవాలి. పాలస్తీనా ప్రాంతాల్లో తమ ఆక్రమణ శాశ్వతమైపోవాలి. అంటే, పాలస్తీనియన్లు శాశ్వతంగా ఇజ్రాయెల్‌ ఆక్రమణల్లోనే ఉండాలి. ఇదీ ఇజ్రాయెల్‌ వ్యూహాత్మక లక్ష్యం.

ఇక అరబ్‌ దేశాల లక్ష్యమేంటంటే..  పాలస్తీనా సమస్యను పక్కకునెట్టి.. భవిష్యత్‌ రక్షణ కోసం ఇజ్రాయెల్‌తో తమంతట తాము శాంతిని కుదుర్చుకోవాలి. పాలస్తీనా సమస్యను పట్టుకుని వేలాడటం కంటే.. ఇజ్రాయెల్‌తో మైత్రిని చేసుకుంటే.. అగ్రరాజ్యంతో అనుకూతల ఏర్పడుతుంది. బ్యాక్‌ ఛానెల్‌ నుంచి అరబ్‌ దేశాలు ఒప్పందాలు కుదుర్చుకుంటున్న ఘట్టాలకు అసలు వ్యూహమిదే.

ఇక అమెరికా లక్ష్యం.. పశ్చిమాసియాలో  బలమైన మొదటి శక్తి ఇజ్రాయెల్‌. రెండో శక్తి సున్నీ అరబ్‌ దేశాలు. మూడో శక్తి షియాల పాలనలోవున్న ఇరాన్‌. ఇందులో అమెరికాకు ఇరాన్‌ శత్రుదేశం. సౌదీ అరేబియా, జోర్డాన్‌, యూఏఈలాంటివన్నీ మిత్ర దేశాలు. తనకు నమ్మినబంటైన ఇజ్రాయెల్‌ను.. సున్నీ అరబ్‌ దేశాలతో టై అప్‌ చేయడం ద్వారా షియా దేశమైన ఇరాన్‌ను ఒంటరి చేయాలనేది అమెరికా లక్ష్యం. అప్పుడు పశ్చిమాసియాలో పెత్తనం సాగించొచ్చు. 

శరవేగంగా మారిపోతున్న ఈక్వేషన్స్‌లో మనమేంచేయాలి? అన్న ప్రశ్న సహజంగానే హమాస్‌ ముందుకొచ్చింది. జరుగుతున్న పరిణామాలన్నీ పాలస్తీనా సమస్యను పూర్తిగా చరిత్రనుంచే చెరిపేసేవిగా గోచరించాయి. కేంద్రీకృతమవుతున్న పరిణామాలను చెల్లాచెదురు చేయడానికి.. గాజా గద్దెపై కూర్చున్న హమాస్‌ పన్నిన యుద్ధతంత్రమే -దుర్మార్గపు దాడి. హమాస్‌ చరిత్రలోనే ఎప్పుడూ జరపనటువంటి దుర్మార్గమైన, భీకరమైన దాడికి తెగబడిరది. కమ్ముకొస్తున్న ముప్పును పారదోలాలంటే.. పశ్చిమాసియాను యుద్ధవాతావరణం కమ్ముకోవాలన్న వ్యూహాన్ని ప్రయోగించింది. ఇజ్రాయెల్‌పై హమాస్‌ విరుచుకుపడి.. పౌరులను ఊచకోత కోసి.. కొందరిని బందీలుగా ఎత్తుకుపోవడం చిన్న విషయమేం కాదు. ఆ ఒక్క స్ట్రైక్‌ అటాక్‌తో సౌదీ `ఇజ్రాయెల్‌ చర్చలు ఆగిపోయాయి. ఐమెక్‌ భవిష్యత్‌ ఆలోచనలో పడిరది. పశ్చిమాసియాలో ఇరాన్‌ను ఒంటరి చేయాలన్న ప్రయత్నాలు అంత సులభం కాదన్న విషయం ఆమెరికాకు అర్థమైంది. ఎందుకంటే `హమాస్‌ అటాక్‌తో ఓవరాల్‌గా అరబ్‌ సెంటిమెంట్‌ ముందుకొచ్చింది. ఇరాన్‌ మత నాయకుడు హయతుల్లా ఖమేనీ అదే ప్రకటించాడు ‘అన్ని విభేదాలను మరచి, ముస్లిం ప్రపంచమంతా పాలస్తీనాకు అండగా ఇజ్రాయెల్‌ సంగతి తేల్చాలని’. సో, ఇప్పుడు ఇజ్రాయెల్‌ వర్సెస్‌ రబ్‌ అనే పాత కాన్ఫ్లిక్ట్‌ ఊపిరితీసుకుంది. 

ఇప్పుడు -ప్రపంచానికి, అమెరికాకి, ఇజ్రాయెల్‌కు, అరబ్‌ లీగ్‌కు ఒక విషయం క్లారిటీ వస్తోంది. యుద్ధ వివాదానికి మూలం -పాలస్తీనా ప్రజల సమస్యని. యునైటెడ్‌ నేషన్స్‌ సూచించినట్టుగా.. ‘టూ స్టేట్స్‌ సొల్యూషన్‌’ తప్ప.. యుద్ధాలు, అణిచివేతలతో పశ్చిమాసియాలో శాంతి అసాధ్యమని. పాలస్తీనా ఒక దేశంగా ఏర్పడకుండా.. పాలస్తీనాను ఒక దేశంగా ఇజ్రాయెల్‌ గుర్తించకుండా.. పాలస్తీనా ఆక్రమిత ప్రాంతాలనుంచి ఇజ్రాయెల్‌ వైదొలగకుండా.. పశ్చిమాసియా భవిష్యత్‌ను రచించలేమని. 

సరిగ్గా హమాస్‌ లక్ష్యం కూడా ఇదే! ఇజ్రాయెల్‌పైన హమాస్‌ దాడి వెనుక స్ట్రాటజిక్‌ ఆబ్జెక్టివ్‌.. తమను విస్మరించి.. వెస్ట్‌ ఏసియా రూపు రేఖలను మారుస్తున్న అమెరికా, ఇజ్రాయెల్‌, అరబ్‌ దేశాల ప్రయత్నాన్ని ఒక్కసారిగా దెబ్బకొట్టాలని. ఈ విశేషణ ప్రకారం హమస్‌ తమ వ్యూహాత్మక లక్ష్యాన్ని నెరవేర్చుకుంది. అందుకు `ఏడాదిపాటు ఇజ్రాయెల్‌ భీకరదాడిని ఎదుర్కొంది. హమాస్‌ నాయకత్వంలో టాప్‌ లీడర్‌షిప్‌ను పోగొట్టుకుంది. మహా మారణహోమానికి పాలస్తీనియన్లను బలిపెట్టాల్సి వచ్చింది. భూమిపైన గాజాను నరకంగా మార్చుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామాలన్నీ అనుభవిస్తూ కూడా.. `తమ వ్యూహాత్మక లక్ష్యం పాలస్తీనా దేశం. అదే మా దీర్ఘకాలిక లక్ష్యం. అది సాధించే వరకూ ఎన్ని త్యాగాలైనా చేస్తాం. ఎంతటి నరకాన్నైనా అనుభవిస్తాం అంటోంది హమాస్‌. 

ఇప్పటి యుద్ధ పరిస్థితిని ఇజ్రాయెల్‌ కోణంలో చూస్తే…

అక్టోబరు 7, 2023.

హమాస్‌ దాడికి ప్రతిగా ఇజ్రాయెల్‌ ఏకంగా యుద్ధం ప్రకటించింది. పేరుకు హమాస్‌పైన యుద్ధమేగానీ, ఆచరణలో గాజాపైన యుద్ధం ప్రకటించింది. అందుకు రెండు లక్ష్య్యాలు. ఒకటి -గాజాలో హమాస్‌ చేతుల్లో బంధీలుగావున్న పౌరులను విడిపించుకోవడం. హమాస్‌ మిలటరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసి.. హమాస్‌ నుంచి పాలస్తీనియన్లకు విముక్తి కల్పించామని ప్రకటించుకోవడం. ఈ రెండు లక్ష్యాలతో ఇజ్రాయెల్‌ ఏడాదిగా యుద్ధం చేస్తోంది. ఏడాది యుద్ధం తరువాత కూడా -ఇజ్రాయెల్‌ లక్ష్యాలు నెరవేరలేదు. 

గాజాపై ఇజ్రాయెల్‌ యుద్ధానికి.. ఇరాన్‌ నిర్మిత ‘యాక్సిస్‌ ఆఫ్‌ రెసిస్టెన్స్‌’ నుంచి ప్రతిఘటన మొదలైంది. ఈ యాక్సిస్‌ ఆఫ్‌ రెసిస్టెన్స్‌లో ఇరాన్‌, లెబనాన్‌లోని హిజ్బుల్లా, పాలస్తీనా ప్రాంతాలైన గాజాలోని హమాస్‌, యెమన్‌లోని హూథీలు, ఇరాక్‌లోని షియా మిలీషియా.. ఇదంతా యాక్సిస్‌ ఆఫ్‌ రెసిస్టెన్స్‌. 

సహజంగానే గాజాపైన ఇజ్రాయెల్‌ యుద్ధానికి దిగడంతో `హమాస్‌ మిత్రపక్షాలు ఒక్కోక్కటిగా స్పందించాయి. ముందు హిజ్బుల్లా రెస్పాండైంది. సౌత్‌ లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ ఆక్రమణలను తిప్పికొట్టిన చరిత్ర హిజ్బుల్లాది. అరబ్‌ ప్రపంచంలో ఇజ్రాయెల్‌పైన నిర్ణయాత్మక విజయం సాధించిన చరిత్ర దీనికేవుంది. హసన్‌ నస్రల్లా నాయకత్వంలో సౌత్‌ లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ దురాక్రమణలను తిప్పికొట్టింది హిజ్బుల్లా. గాజాపై యుద్ధాన్ని నిరసిస్తూ అటాక్స్‌కు దిగడంతో.. హిజ్బుల్లామీదా ఇజ్రాయెల్‌ ఆయుధాలను గురిపెట్టింది. హిజ్బుల్లామీద ఇజ్రాయెల్‌ భీకరంగా విరుచుకు పడటానికి ప్రధాన కారణం.. ఇజ్రాయెల్‌` లెబనాన్‌ సరిహద్దుల్లోవున్న ఇజ్రాయెల్‌ పౌరులు నిర్వాశితులవ్వడమే. హిజ్బుల్లా దాడులను తిప్పికొట్టి.. తమ దేశ పౌరులను ఇళ్ళకు పంపించాలన్నది మొదటి లక్ష్యం. ఇక `దీర్ఘకాలిక లక్ష్యమేంటంటే.. హిజ్బుల్లా రహిత లెబనాన్‌ను సృష్టించాలని. హిజ్బుల్లా చీఫ్‌ హనన్‌ నస్రల్లాను టార్గెట్‌ చేసి లేపేయడం వెనుక `దీర్ఘకాలిక ప్రయోజనాన్ని కాంక్షించే. హిజ్బుల్లా ఫైటర్స్‌ చేతిలోని పేజర్లనే బాంబులుగా ప్రయోగించింది ఇజ్రాయెల్‌. వాకీటాకీలు పేలాయి. సదరన్‌ లెబనాన్‌లో నేలపైనా దండయాత్ర మొదలెట్టింది. ఇజ్రాయెల్‌ చేతుల్లోంచి హిజ్బుల్లా చేతుల్లోకి వచ్చిన సౌత్‌ లెబనాన్‌ను మళ్లీ ఇజ్రాయెల్‌ చేతుల్లోకి తెచ్చుకునేంతగా దాడులకు తెగబడిరది. సౌత్‌ లెబనాన్‌లో హిజ్బుల్లాను అంతం చేయడం ద్వారా తమకు సరిహద్దుల్లో సెక్యూరిటీ గ్యారెంటీ ఇచ్చుకుంటున్నామన్నది ఇజ్రాయెల్‌ వాదన. అంతకుముందు వరకూ హిజ్బుల్లా, హమాస్‌ దాడులను సెక్యూరిటీ వయొలెన్స్‌గానే చూస్తూ వచ్చిన ఇజ్రాయెల్‌.. పప్పుడైతే ఇజ్రాయెల్‌ రక్షణ వ్యవస్థనే చేధిస్తూ హమస్‌ చరిత్రలోనే కనీవినీ ఎరుగని దాడి చేసిందో.. ఇజ్రాయెల్‌ తన ఉనికికే ప్రమాదమన్న భావనకొచ్చింది. అందుకే -హమస్‌లేని గాజాను, హిజ్బుల్లాలేని లెబనాన్‌ను సృష్టిస్తానని ప్రకటించడం. పనిలో పనిగా.. మూడొ లక్ష్యం అసలు శత్రువైన ఇరాన్‌ సంగతి తేల్చడం. అందుకే `సిరియా రాజధాని డమాస్కస్‌లో ఇరాన్‌ రాయబార కార్యాలయంపైన అటాక్‌ చేసి ఇరాన్‌ జనరల్స్‌ను లేపేయడం. దాంతో ఇరాన్‌ -ఇజ్రాయెల్‌ పరస్పర దాడులు మొదలయ్యాయి. అలాగే యెమన్‌లోని హూథీలపైనా అటాక్‌ చేసింది. సింపుల్‌గా చెప్పాలంటే -ఇరాన్‌ సృష్టించిన ‘యాక్సిస్‌ ఆఫ్‌ క్రైసిస్‌’ను సమూలంగా తుడిచేయడం ఇజ్రాయెల్‌ అసలు లక్ష్యం. 

అమెరికా సహకారంతో సున్నీ అరబ్‌ దేశాలను మచ్చిక చేసుకుంటూనే (పాలస్తీనా సమస్యను పక్కకు నెట్టించి.. ఒప్పందాలు చేసుకోవడం వ్యూహంలో భాగమే)…. షియా ముస్లిం దేశాలను ఏరేయాలనేది ఇజ్రాయెల్‌ లక్ష్యం. అప్పుడు గల్ఫ్‌ దేశాలలో ఇరాన్‌ దాని మిత్రదేశాలు తప్ప.. అమెరికాకుగానీ, ఇజ్రాయెల్‌కుగానీ ఎలాంటి శత్రువులు ఉండరు. ఇజ్రాయెల్‌ టార్గెట్‌ అదే!

ఇక్కడ అమెరికా లక్ష్యాలు అమెరికాకున్నాయి. ఇజ్రాయెల్‌ రూపంలో గల్ఫ్‌ దేశాలమధ్య తగవులు పెట్టి.. తన మిత్రులను గెలిపించడం ద్వారా పశ్చిమాసియా మొత్తంపై పెత్తనం సాగించొచ్చనది అమెరికా లక్ష్యం. ఆ పెత్తనం ఆశించడానికి కారణం -ప్రపంచం మొత్తంమ్మీద మూడిరట రెండొంతుల చమురు నిక్షేపాలు పశ్చిమ ఆసియాలోనే ఉన్నాయి. అమెరికన్‌ బహుళ జాతి కంపెనీలు గల్ఫ్‌ దేశాలలో చమురు ఉత్పత్తి కార్యకలాపాలు సాగిస్తాయి. ఇలా అమెరికా వ్యాపార కార్యకలాపాలతో పెరిగే అరబ్‌ షేకులు సంపదను.. తిరిగి అమెరికా బ్యాంకులలోనే దాచుకుంటారు. అందుకే నమ్మినబంటు ఇజ్రాయెల్‌ను ఉసిగొల్పి.. పూర్తి పెత్తనానికి అడ్డుతగులుతున్న ఇరాన్‌, దాని మిత్రమండలిని నిర్వీర్యం చేయాలన్నది అమెరికా లక్ష్యం. ఇలా ఒకరికొకరు.. ఒకరికోసం మరొకరు.. ఒకరిమీద ఇంకొకరు అన్న పరిస్థితి ఉండటమే.. రీజినల్‌ వార్‌గా రూపాంతరం చెందుతోన్న పరిస్థితికి తావిస్తోంది.

మొత్తం యుద్ధ వ్యవహారంలో హమాస్‌ -తమ లక్ష్యాలను దాదాపుగా సాధించుకుంది. మరి, ఇజ్రాయెల్‌ తన లక్ష్యాలు సాధించుకునే అవకాశముందా? ఈ యుద్ధాలకు సంబంధించి చారిత్రక అనుభవాలు ఏం చెప్తున్నాయి. ఇదీ -అక్కడి పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న బుర్రల్లో పుట్టే పెద్ద ప్రశ్న!

హమాస్‌ దాడి ఘటన తరువాత -గాజాపై ఇజ్రాయెల్‌ ఏడాదిగా యుద్ధం చేస్తోంది. వాస్తవానికి 2007లో గాజాలో జరిగిన ఎన్నికలలో హమాస్‌ అధికారంలోకి వచ్చింది. అయితే.. హమాస్‌ అధికారాన్ని ఇజ్రాయెల్‌గానీ, అమెరికాగానీ, పశ్చిమ దేశాలేవీ గుర్తించలేదు. హమాస్‌ను తీవ్రవాద సంస్థగానే పేర్కొన్నాయి. హమాస్‌ నాయకత్వంలోని గాజాను ఇజ్రాయెల్‌ దిగ్బంధించింది. ఇప్పుడు హమాస్‌ను అంతం చేస్తామంటూ ఏడాదిగా గాజాపై యద్ధం చేస్తోంది. కానీ, హమాస్‌ నుంచి బంధీలను విడిపించలేదు. హమాస్‌లేని గాజాను సృష్టించలేదు. 

ఇక్కడ చరిత్రను ఒకసారి సింహావలోకనం చేయాలి. 2004లోనే ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో హమాస్‌ టాప్‌ లీడర్స్‌ అంతమయ్యారు. హమాస్‌ ఆగలేదు సరికదా.. 2005లో గాజానుంచి ఇజ్రాయెల్‌నే తరిమికొట్టింది. 2007లో ఏకంగా హమాస్‌ గాజాలో అధికారంలోకి కూడా వచ్చింది. ఈ ఏడాది యుద్ధంలోనూ హమాస్‌ టాప్‌ లీడర్స్‌నే ఇజ్రాయెల్‌ అంతం చేసింది. గాజాను పూర్తి శిథిలంగా మార్చింది. కానీ, హమాస్‌ను అక్కడినుంచి తీసేయలేకపోయింది. హమాస్‌ను అంతం చేయడం సాధ్యం కాదని కొత్తగా ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్సే చెప్తున్నాయంటే.. పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గాజాలో ఇజ్రెయెల్‌ రెండు లక్ష్యాలు నెరవేరడం అంత సులువుకాదని రెండు దశాబ్దాల చరిత్ర చెబుతోంది. ఏడాదిగా సాగుతోన్న యుద్ధం చేప్తోంది. మరి `భీకర యుద్ధం చేసి ఇజ్రాయెల్‌ ఏం సాధించినట్టు? 

ఇక లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ లక్ష్యాలు.. హిజ్బుల్లా దాడులనుంచి సరిహద్దు పౌరులను కాపాడి, సురక్షితంగా ఇళ్ళకు పంపడం. అది జరగాలంటే హిజ్బుల్దా దాడులు ఆగాలి. ఆగలేదు సరికదా.. హసన్‌ నస్రల్లాను మట్టుబెట్టిన తరువాత మరింత భీకరంగా గెరిల్లా దాడులకు దిగింది హిజ్బుల్లా. గాజాలో కాల్పుల విరమణ పాటిస్తేనే దాడులు ఆపుతామన్నది హిజ్బుల్లా మాట. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్‌ సిద్ధంగా లేదు. అంటే, హిజ్బుల్లా దాడులు ఆగవు. ఇప్పటికీ వేలసంఖ్యలో ఇజ్రాయెల్‌ పౌరులు ఇళ్ళకు దూరమయ్యారు. ఇక రెండో లక్ష్యం.. హిజ్బుల్లాలేని లెబనాన్‌ సృష్టి. ఇది సాధ్యమా? అనేదే అసలు ప్రశ్న. హిజ్బుల్లా సృష్టికర్తలైన ఒకరు అబ్బాస్‌ అల్‌ ముసావీని -ఇజ్రాయెల్‌ మూడు దశాబ్దాల క్రితం మట్టుబెట్టింది. ముసావీ అంతమయ్యాక.. హసన్‌ నస్రల్లాలాంటి బలమైన కమాండర్‌ను తయారు చేసుకుంది హిజ్బుల్లా. 2006కు వచ్చేసరికి.. సౌత్‌ లెబనాన్‌నుంచి ఇజ్రాయెలే తప్పుకోవాల్సిన పరిస్థితి తెచ్చింది హిజ్బుల్లా. 20ఏళ్లుగా హమాస్‌నే ఏరేయలేకపోయిన ఇజ్రాయెల్‌.. ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయిన హిజ్బుల్లాను అంతం చేయడం ఇజ్రాయెల్‌కు సాధ్యమేనా? ముసావీని చంపితే హసన్‌ పుట్టాడు. ఇప్పుడు హసన్‌ను లేపేశాక..? 

ఇజ్రాయెల్‌ తన లక్ష్యాలను అందుకోలేకపోవడానికి ప్రధాన కారణం -హమాస్‌, హిజ్బుల్లాను తీవ్రవాద సంస్థలుగా చూస్తుందే తప్ప.. ప్రజలతో మమేకమైన సంస్థలుగా చూడలేకపోవడం. ప్రజలతో మమేకమైన సంస్థలను యుద్ధంతో నియంత్రించాలనుకోవడమే ఇజ్రాయెల్‌ చేస్తోన్న తప్పని ఇజ్రాయెల్‌కు తెలుసు. కానీ, ప్రజలతో మమేకమైన సంస్థలుగా హమాస్‌, హిజ్బుల్లాను గుర్తించదు. అలా జరిగితే.. పాలస్తీనియన్లు కోరుకుంటున్న ‘మాతృదేశం’వైపు ప్రయాణించాల్సి ఉంటుంది. 1948లో ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించిన ‘టు నేషన్స్‌’ను తెరపైకి తేవాల్సి ఉంటుంది. అది ఇజ్రాయెల్‌కు ఇష్టం లేనిది. అందుకే.. అవసరమైతే విధ్వంసాన్ని, వినాశనాన్ని, రావణ కాష్టాలనైనా భరిస్తుంది తప్ప.. ఇజ్రాయెల్‌ వెనక్కి తగ్గదు. అమెరికా తగ్గనివ్వదు. యుద్ధంతో లక్ష్య సాధన సాధ్యం కాదు. 

తెరపై ఇజ్రాయెల్‌ టార్గెట్‌ హమాస్‌, హిజ్బుల్లాలే. కనిపించని టార్గెట్‌ -ఇరాన్‌ ‘యాక్సిస్‌ ఆఫ్‌ రెసిస్టెన్స్‌’. దాన్ని బలహీనపర్చడం, వీలైతే తుడిచేయడం. ఇది అంత సులువుకాదని ఇజ్రాయెల్‌కూ తెలుసు. అలాగని ఇజ్రాయెల్‌కు అంతటి సామర్థ్యం లేదని చెప్పలేం. ఎందుకంటే.. యాక్సిస్‌ ఆఫ్‌ రెసిస్టెన్స్‌లో సెకెండ్‌ మోస్ట్‌ పవర్‌ఫుల్‌ లీడర్‌ హసన్‌ నస్రల్లా. అలాంటి లీడర్‌ను -లేపేయ గలిగింది ఇజ్రాయెల్‌. ఇరాన్‌ రాజధానిలోవున్న హమాస్‌ పొలిటికల్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ అనియేనీ లేపేసింది. గతంలో.. ఇరాన్‌ న్యూక్లియర్‌ సైంటిస్టులనూ ఇజ్రాయెల్‌ లేపేసింది. ఇరాన్‌కూ భారీ నష్టాన్ని చేకూర్చగలదు. అదే జరిగితే.. ఇరాన్‌ -ఇజ్రాయెల్‌ వార్‌ నడుస్తూనే ఉంటుంది. ఇజ్రాయెల్‌కు అండగా అగ్రదేశం అమెరికా ర్యాలీ అయితే.. ఇరాన్‌కు అండగా రష్యాలాంటి దేశాలు ర్యాలీ అవుతాయా? ఇరాన్‌ తన ఆత్మరక్షణ కోసం అణువిధానాన్ని మార్చుకుని.. అణ్వాయుధాలవైపు వెళ్తే..? అదే జరిగితే -పరిణామాలు రీజినల్‌ వార్‌ను దాటి వరల్డ్‌ వార్‌వైపు వెళ్తాయా? సాధ్యమనీ చెప్పలేం.. అసాధ్యమనీ అనలేం!

ఇప్పటికే అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌లాంటి వాళ్లు -ఇరాన్‌ న్యూక్లియర్‌ ఫెసిలిటీస్‌ను టార్గెట్‌ చేయమని ఇజ్రాయెల్‌కు నూరిపోస్తున్నారు. అణ్వాయుధాలను బయటకు తీయాలని ఇరాన్‌లోని హార్డ్‌లైనర్లూ ఎగదోస్తున్నారు. రెండు దశాబ్దాలుగా హమాస్‌నే నియంత్రించలేకపోయిన ఇజ్రాయెల్‌.. అంతకంటే బలమైన హిజ్బుల్లానే వెనక్కి తరమలేకపోయిన ఇజ్రాయెల్‌.. అంతకుమించి శక్తివంతమైన ఇరాన్‌కు గురిపెట్టే యోచన చేస్తుందా? ఏడాది యుద్ధంతో గాజాలో సాధించలేని లక్ష్యాన్ని.. దశాబ్దకాలంలో లెబనాన్‌లో సాధించలేని లక్ష్యాన్ని.. ఇరాన్‌ విషయంలో సాధించగలుగుతుందా? అలుపెరుగని యుద్ధం చేస్తూనే.. అంచనాలకు అందని నష్టాలను చవిచూస్తూనే.. ఇరాన్‌లో ప్రభుత్వాన్నే మార్చేస్తామని ఉరకలేస్తున్న ఇజ్రాయెల్‌ -మత నాయకుడు హయతుల్లా ఖమేనీని టార్గెట్‌ చేస్తుందా? యుద్ధాలతో ప్రభుత్వాలను కూల్చి ఇరాక్‌, లిబియా, ఆఫ్గనిస్తాన్‌లలో అమెరికా ఏం సాధించింది? భీకర యుద్ధాలను తనలో నిక్షిప్తం చేసుకున్న చరిత్ర ఏం చెబుతుంది? 

యుద్ధాలతో ఒరిగేదేమీ ఉండదనే చరిత్ర చెబుతోంది. ఇంతటి ఉత్పాతానికి కారణమయ్యేకంటే.. గాజాలా కాల్పుల విరమణ పాటించమని ఇజ్రాయెల్‌కు హితవు చెప్తున్నాడు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌. అదే ఉత్తమ మార్గమని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ చెప్తున్నాడు. యుద్ధభూమిలో నిలబడి శాంతిని సాధించడం అసాధ్యమని భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం చెప్తున్నారు. ఇవేవీ ఇజ్రాయెల్‌కు నచ్చడం లేదు. కారణం -శాంతివైపు ప్రయాణించడమంటే.. 1948లో యునైటెడ్‌ నేషన్స్‌ చెప్పిన ‘టూ స్టేట్స్‌’ సొల్యూషన్‌ దిశగా ప్రయాణించాల్సి రావడం. దశాబ్దాలుగా పాలస్తీనియన్లు కోరుకునేదదే. పాలస్తీనా ఆక్రమణల నుంచి ఇజ్రాయెల్‌ వైదొలగాలి. ఇజ్రాయెల్‌ను అరబ్బులు.. పాలస్తీనాను యూదులు.. పరస్పరం ప్రాధాన్యతలు గుర్తించాలి. అంటే -అరబ్బులకు పాలస్తీనా, యూదులకు ఇజ్రాయెల్‌.. రెండు దేశాలు కలిసిమెలిసి బతకాలి. ఐక్య రాజ్యసమితైనా.. అంతర్జాతీయ సమాజమైనా కోరుకునేదిదే. కాని -వదులుకోడానికి హమాస్‌ సిద్ధంగా లేదు. వదిలేయడానికి ఇజ్రాయెల్‌ సిద్ధపడట్లేదు. అంటే, తాత్కాలికంగా చల్లబడినా.. యుద్ధం శాశ్వతంగా ఆగేలా లేదు. 

– కె.శ్రీనివాసరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *