ఆంధ్రప్రదేశ్

ఔను! ఇదే.. మంచి ప్రభుత్వం

  • October 8, 2024
  • 1 min read
[addtoany]
ఔను! ఇదే.. మంచి ప్రభుత్వం

100 రోజుల పాలనలో 1000 అడుగులు ముందుకు వేశాం. `ఇదీ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయ ప్రకటన. పాలనా విజయాన్ని కోట్లాది ప్రజలముందు పాలకుడు ప్రకటించుకోవడానికి గట్స్‌ కావాలి. కొంచెం నిజాయితీ ఉండాలి. ఆత్మసాక్షికి సమాధానం చెప్పుకోవాలి. చంద్రన్న ప్రకటనలో ప్రతి అక్షరంలో అదే కనిపించింది. తన పాలనా విజయాన్ని స్థిరంగా ప్రకటించారు. అదే సమయంలో బాధ్యతనూ కనబర్చారు. సార్వత్రిక ఎన్నికలలో `విధ్వంస రాజకీయానికి పాతరేసి.. కూటమిని అప్రతిహత విజయంతో గెలిపించారు ప్రజలు. ఎన్నికలకుముందు ‘విధ్వంస రాష్ట్రాన్ని వికాసంవైపు నడిపిస్తానని.. ఏపీ పునర్నిర్మాణమే తన లక్ష్యమని’ బలంగా ప్రకటించారు చంద్రబాబు. ‘జగన్‌ రహిత రాష్ట్రమే తన లక్ష్యమంటూ’ ఆదినుంచీ ప్రకటించిన జనసేన నాయకుడు పవన్‌ కల్యాణ్‌.. చంద్రబాబు అభివృద్ధి సిద్ధాంతానికి మద్దతు పలకడం.. భారతీయ జనతా పార్టీని కలుపుకుని విజయమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగడం తెలిసిందే. కూటమి సైతం విస్మయానికి గురయ్యేంత నమ్మకాన్ని ప్రజలు ప్రదర్శించి, అనూహ్య విజయం అందించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబుపై మరింత బాధ్యత పెరిగింది. ఎన్నికల విజయం అనంతరం జూన్‌ 12న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల మేరకు ‘కీలక దస్త్రాలపై తొలి సంతకాల’తోనే `చంద్రబాబు 4.0 అడ్మినిస్ట్రేషన్‌ ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పారు. ఇప్పుడిక కొత్త చంద్రబాబును చూస్తారంటూ ముందే ప్రకటించుకుని.. వేగవంతమైన పాలనతో ప్రభుత్వంపై పూర్తి ప్రజానమ్మకాన్ని సాధించారు. బాధ్యతలు స్వీకరించి వంద రోజులవుతున్న సందర్భంగా.. ఆర్థిక, సామాజిక, ప్రకృతి సవాళ్లను అధిగమిస్తూనే.. ఎన్డీయే ఎన్నో విజయాలు సాధించిందని సీఎం చంద్రబాబు గట్టిగానే చెప్పుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరితో కలిసి ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో.. ఎన్డీయే ప్రభుత్వ విజయాలు చంద్రబాబు మాటల్లోనే…

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులవుతోంది. పాలనాపరంగా వెయ్యి అడుగులు ముందుకేశాం. ‘ఇది మంచి ప్రభుత్వం’ అంటూ వారంపాటు `ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్‌ లక్ష్యాలను పజల్లోకి తీసుకెళ్లాం. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తే.. ఆ పాలన ఎలావుంటుందో ఈ 100 రోజుల ప్రగతి ఒక ఉదాహరణ. పాలనా ప్రగతి సాధనకు ఇకనుంచి ప్రజా ప్రతినిధులంతా నెలకు పది రోజులపాటు ప్రజల్లో ఉంటారు.

వైసీపీ హయాంలో

రాష్ట్రంలో భయానక పరిస్థితులు

వైసీపీ పాలనలో రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. నన్ను అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టారు. పరామర్శకు పవన్‌ కళ్యాణ్‌ను రానివ్వకుండా.. అనేకవిధాల అడ్డుకున్నారు. పవన్‌ రోడ్డుపై పడుకుని ధర్నాకు దిగడాన్ని మర్చిపోకూడదు. సాధారణంగా షూటింగ్‌లో చేయాల్సినవి… నిజ జీవితంలో చేసి పోరాట యోధునిగా నిలిచాడు పవన్‌. రాజకీయాల్లోకి పవన్‌ ఒక ఆశయంతో వచ్చారు. 2014లో టీడీపీ, బీజేపీ పొత్తుపెట్టుకున్న సమయంలో ఓట్లు చీల్చకూడదని.. పోటీకి దూరంగావుండి అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. రాజమండ్రి జైల్లో నన్ను కలిసిన అనంతరం రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. ప్రజలు గెలవాలి… రాష్ట్రాన్ని పునర్నిర్మించాలని నిర్ణయించుకున్నాం. సీట్లు సర్దుబాటుతోపాటు ఇతర అంశాల్లోనూ ఎక్కడా సమస్య రాకుండా చూసుకున్నాం. కేంద్రంలో బీజేపీ అధికారంలోవుంటే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఆలోచించాం. మోదీ 3వసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకుంది. కేంద్రంలో మనం అనుకున్న ప్రభుత్వం రాకుండా ఉంటే వెంటిలైటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని కాపాడుకోవడం కష్టమయ్యేది.

ఆలోచనల్లో భిన్నత్వం..                                              

రాష్ట్రాభివృద్ధికి ఏకత్వం

వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఎన్నో అవకతవకలకు పాల్పడిరది. ఖర్చుపెట్టిన డబ్బుకు లెక్కలు చూపలేదు. కేంద్రమిచ్చిన నిధులను మళ్లించుకున్నారు. ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి తెచ్చారు. ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నాం. మాపై చాలా ఆశలు పెట్టుకునే ప్రజలు గెలిపించారు, వాటిని వమ్ము చేయడం. 93 శాతం స్ట్రైక్‌రేట్‌, 57 శాతం ఓట్లు సాధించడం నా రాజకీయ జీవిత చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. 1994లో కూడా ఇంత మెజారిటీ రాలేదు. మూడు పార్టీలు అనుసరించిన విధానమే ఈ ఘన విజయానికి కారణం. ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ వారు మెచ్చుకునే నడవడిక చూపిస్తాం. మూడు పార్టీలలో విభిన్న ఆలోచనలున్నా రాష్ట్రాభివృద్ధే మా ధ్యేయం. ఈ కలయిక శాశ్వతంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. 100 రోజుల పాలనలో ప్రభుత్వం ఏంచేసింది… ఏం చేయబోతోందో కూడా ప్రజలకు వివరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ.. మా ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం, విశ్వాసం కలిగిస్తాం.

ప్రతి ఇంటికీ

కుళాయి ద్వారా సురక్షిత నీరు

నరేంద్రమోదీ 3వసారి ప్రధానిగా ధృడమైన సంకల్పంతో వికసిత్‌ భారత్‌-2047తో ముందుకు వెళ్తున్నారు. వరల్డ్‌ క్లాస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఉద్యోగాలు, ఇతర మార్పులు తీసుకొస్తున్నారు. వృద్ధులకు ఆయుష్మాన్‌ భారత్‌ కింద వైద్యం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మన రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి రాబోయే మూడేళ్లలో రూ.58 వేల కోట్లు ఖర్చు చేసేందుకు కేంద్రం ప్రణాళిక సిద్ధం చేసింది. నియోజకవర్గాల పరిధిలో జాతీయ రహదారులను ఫాస్ట్‌ట్రాక్‌లో పెట్టుకునేలా ఎమ్మెల్యేలు కృషి చేస్తారు. జల్‌ జీవన్‌ మిషన్‌ పథకానికి కేంద్రం 50 శాతం నిధులిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం కేంద్రమిచ్చే డబ్బులు సరిగా ఖర్చు చేయకుండా పథకాన్ని నిర్వీర్యం చేసింది. దీనిపై మళ్లీ కేంద్రాన్ని ఒప్పించి జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికీ కుళాయి ద్వారా సురక్షిత నీళ్లు అందిస్తాం. అందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.

అన్ని గ్రామ పంచాయతీల్లో

గ్రామసభలు ఒక రికార్డ్‌

స్థానిక సంస్థలకు గతంలో రూ.990 కోట్ల నిధులను ఆర్థిక సంఘం ఇవ్వలేదు. వాటిని ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక మంజూరు చేసింది. మరో రూ.1100 కోట్లు కేంద్రం నుండి మ్యాచింగ్‌ గ్రాంట్‌గా వచ్చాయి. మరో రూ.2 వేల కోట్లను కేంద్రం ఇవ్వనుంది. ఉపాధి హామీ పనిదినాలను ఆమోదించేందుకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు పెట్టాలని ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ నిర్ణయించారు. ఈ ఆలోచన అద్భుతం. రూ.4,500 కోట్ల పనులకు గ్రామ సభల ద్వారా ఆమోదం తెలపడం ఒక చరిత్ర. ఇటువంటి కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడా లేదు. అందుకే వరల్డ్‌ రికార్డు అయ్యింది. గ్రామాల్లో రోడ్ల కనెక్టివిటీ కోసం కేంద్రం రూ.49 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. రైల్వే లైన్లకు కూడా కేంద్రం నిధులు కేటాయిస్తోంది. విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటుకు గత ప్రభుత్వం స్థలం ఇవ్వలేదు. దీంతో జోన్‌ కార్యాలయం ఏర్పాటు కాలేదు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే అవసరమైన భూమి ఇచ్చాం. త్వరలోనే రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేస్తామని కేంద్రం తెలిపింది.

గ్రీన్‌ ఎనర్జీలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు…                

7.5 లక్షల ఉద్యోగాలు లక్ష్యం

భారత ప్రభుత్వం గ్రీన్‌ ఎనర్జీ మీద ఫోకస్‌ పెట్టింది. దాన్ని అందిపుచ్చుకుంటున్నాం. పీఎం సూర్య ఘర్‌ పథకంలో భాగంగా ప్రతి ఇంటిపై సోలార్‌ ఏర్పాటు చేసుకుని 300 యూనిట్ల విద్యుదుత్పత్తి చేసుకోవడానికి సబ్సిడీ ఇస్తోంది. దీనికి కొంత మొత్తంలో లబ్ధిదారుల వాటాను కలుపుకుని ఏర్పాటు చేసుకుంటే రాబోయే రోజుల్లో శాశ్వతంగా విద్యుత్‌ బిల్లులుకట్టే పరిస్థితి ఉండదు. దీన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తాం. గ్రీన్‌ఎనర్జీ, గ్రీన్‌ హైడ్రోజన్‌లో పెను మార్పులు వస్తాయి. ఒకప్పుడు పొలాలకు సరిగా కరెంట్‌ లేని పరిస్థితి. కానీ ఇప్పుడు కుసుమ్‌ పథకం కింద పంపుసెట్లు ఏర్పాటు చేసుకుని విద్యుదుత్పత్తి చేసుకునే పరిస్థితి ఉంది. రాష్ట్రంలో రాబోయే ఐదేళ్లలో గ్రీన్‌ఎనర్జీ ద్వారా 72 గిగావాట్ల సోలార్‌ విద్యుదుత్పత్తితో పాటు, రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగాల సాధనే లక్ష్యంగా ముందుకెళ్తాం. ఈ విషయంలో మా ప్రభుత్వం చాలా కమిటెడ్‌గా ఉంది.

ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా

విజన్‌ డాక్యుమెంట్‌ సిద్ధం చేసుకోవాలి

విజన్‌ 2047.. కేంద్రం వికసిత్‌ భారత్‌కు నాంది పలికింది. మనం స్వర్ణ ఆంధ్రప్రదేశ్‌తో 2047కి విజన్‌ సిద్ధం చేస్తున్నాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు విజన్‌ డాక్యుమెంట్‌ సిద్ధం చేసుకోవాలి. ఓట్లు వేసిన ప్రజలను అన్ని విధాలా పైకి తీసుకురావడానికి కష్టపడి పనిచేద్దాం. 2047 నాటికి రాష్ట్రంలో పేదరికం, ఆర్థిక అసమానతలు తగ్గుదలకు ప్రణాళిక రూపొందించుకుందాం. గత పాలకులు విచ్చలవిడిగా రూ.10 లక్షల కోట్లు అప్పులు చేశారు. లక్ష కోట్ల బిల్లులు పెండిరగులో పెట్టారు. ఇలాంటి కష్టసమయంలో అధికారంలోకి వచ్చాం. అయినా ఎమ్మెల్యేలు, ఎంపీలు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌, కేంద్ర సహకారంతో ముందుకు అడుగేస్తున్నాం. రాష్ట్ర ప్రగతి విషయంలో ఆగి ఆలోచించే పరిస్థితి రాకుండా.. శక్తికొలదీ పరిగెడదాం.

చేస్తున్న మంచిని

ప్రజలకు వివరించాలి

సీఎంగా బాద్యతలు చేపట్టిననాడు 5 ప్రధాన హామీల అమలుపై సంతకం చేశా. 16,347 ఉద్యోగాలతో డీఎస్సీ నిర్వహణకు శ్రీకారం చుట్టాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిచ్చే దిశగా ముందుకెళ్తున్నాం. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో పింఛను వెయ్యి మాత్రమే పెంచింది. కానీ మేము.. ఒకేసారి వెయ్యి పెంచి ఏప్రిల్‌, మే, జూన్‌ నెల బకాయిలు కూడా ఇచ్చాం. వాలంటీర్లు లేకుండా పింఛన్లు ఇవ్వలేరని ప్రచారం చేశారు. సచివాలయాల చుట్టూ వృద్ధులను తిప్పి 35మంది ప్రాణాలు తీశారు. కూటమి ప్రభుత్వం రాగానే వాలంటీర్లు లేకుండా ప్రభుత్వ యంత్రాంగంతో ఒకే రోజున పింఛన్లు పంపిణీ చేశాం. ప్రతి నెలా 1న పేదల సేవలో కార్యక్రమం ద్వారా పింఛన్లు పంపిణీ జరుగుతోంది. ఉద్యోగులు గత ఐదేళ్లలో ఏనాడూ మొదటి తేదీన జీతం తీసుకోలేదు. కానీ మా ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులకు, పెన్షన్‌దారులకు 1నే జీతాలు ఇస్తున్నాం. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ కూడా రద్దు చేశాం. ఇదొక భయంకరమైన చట్టం. సొంత మనుషుల్ని పెట్టుకుని రికార్డులు రాయడానికి గత పాలకులు చట్టం తెచ్చుకున్నారు. కోర్టుకు కూడా వెళ్లే అవకాశం లేకుండా చట్టం చేశారు. అందుకే అధికారంలోకి రాగానే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు చేసి ప్రజల ఆస్తులను కాపాడాం. రికార్డులను గత ప్రభుత్వం తారుమారు చేసి కొన్ని లక్షల ఎకరాలు ఫ్రీహోల్డ్‌ చేసి దోచుకున్నారు. మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో దస్త్రాలు తగలబెట్టారు. తప్పులు చేసిన వారు తప్పించుకోలేరు. రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు రద్దు చేసి పేదల పొట్టగొట్టారు. అందుకే నాలుగవ సంతకంలో భాగంగా 100 క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. వాటిని త్వరలోనే 203కు పెంచుతాం. నైపుణ్య గణన చేస్తే బావుంటుందని పవన్‌ కళ్యాణ్‌ ఇచ్చిన సూచనలతో దేశంలోనే మొదటిసారిగా నైపుణ్య గణన చేపట్టబోతున్నాం. ఇదంతా ప్రభుత్వం సైలెంట్‌గా చేసుకునిపోతుంది. కాని, మనం చేస్తున్న మంచిని ప్రజలకు చెప్పాలి. వాళ్ల దృష్టికి తీసుకెళ్లాలి. అందుకే `ప్రతి కార్యక్రమాన్నీ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నా.

విర్రవీగిన వాళ్లను

ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు

ఐదేళ్ల విధ్వంసాన్ని ప్రజల ముందు పెట్టేందుకు ఏడు శ్వేత పత్రాలు విడుదల చేసి ప్రజలకు పరిస్థితులను వివరించాను. వాలంటీర్ల పదవీకాలం యేడాదిముందే అయిపోయినా.. వాలంటీర్ల గురించి నిరంతరంగా బురద జల్లుతోన్న వ్యక్తి.. వాళ్లను రెన్యువల్‌ చేయలేదు.? కొంతమందితో రాజీనామాలు చేయించారు. మిగతా వాళ్లవి కాలపరమితి అయిపోయింది. 4 లక్షల మందితో నెలకు రూ.200 చొప్పున సాక్షి పత్రిక కొనుగోల చేయించారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటివి ఎక్కడా జరిగి ఉండవు, ఒక్క జగన్‌ జమానాలో తప్ప. ఆ పేపర్లో వేసే అసత్యాలు, అబద్ధాలను వాలంటీర్ల ద్వారా ఇంటింటికి ప్రచారం చేశారు. తప్పుడు ప్రచారం ఎంతచేసినా, ఏదో ఒకవిధంగా మభ్యపెట్టాలని చూసినా ప్రజలకు వాస్తవాలు తెలిస్తాయి. 151 సీట్లు వచ్చాయని విర్రవీగిన వారికి 11 సీట్లు వచ్చేలా చేశారంటే అదే ప్రజాస్వామ్య రహస్యం. ఇప్పుడు మేము, ఉచిత ఇసుకను కూడా అమలు చేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఇసుక అక్రమాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టి… వాటిపై ఇప్పుడు విచారణ చేస్తున్నాం. గతంలో వారు చేసిన తప్పులు మనం చేయకూడదని ప్రభుత్వ భాగస్వాములు అందరికీ చెప్తున్నా. ఈ విషయంలో మనం ఎంత ఖచ్చితంగా ఉండి.. ప్రజలకు ఇసుకను చేర్చగలిగితే తరువాత మన గెలుపునకు అదే దోహదం చేస్తుందని మా వాళ్లకు పదేపదే చెప్తున్నా.

రెండేళ్లలో పోలవరం

ఫేజ్‌ -1 పూర్తి చేసి జాతికి అంకితం

ఒక వ్యక్తి స్వలాభం కోసం మద్యం విధానాన్ని మార్చారు. సొంత బ్రాండ్లు, సొంత డిస్టలరీలు ఏర్పాటు చేసి సొమ్ము చేసుకున్నారు. నాణ్యతలేని మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీశారు. వీటన్నిటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రజలకు వివరించాము. అక్టోబరు నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వస్తోంది. నాసిరకం మద్యాన్ని నిర్మూలిస్తాం. కేంద్రం పోలవరానికి రూ.12,500 కోట్ల కేంద్రం ప్రకటించింది. కొత్త డయాఫ్రం వాల్‌ కూడా నిర్మించాల్సి ఉంది. 2 ఏళ్లలో పోలవరం ఫేజ్‌-1 పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. పోలవరాన్ని పూర్తి చేసి రైతులకు, జాతికి అంకితం చేస్తాం. అమరావతికి మళ్లీ పూర్వవైభవం తీసుకొస్తాం. రాజధాని నిర్మాణానికి వరల్డ్‌ బ్యాంకు ద్వారా రూ.15 వేల కోట్లు అందించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రియల్‌ పార్కుల ఏర్పాటుకు నిధులు కేటాయించింది. ఈ పార్కుల ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయి. శ్రీసిటీలో 15 సంస్థలు ప్రారంభించి, మరో 6 సంస్థలకు శంకుస్థాపన చేశాం. బీపీసీఎల్‌ రూ.70 వేల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చింది. విశాఖపట్నం ఎన్టీపీసీ రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సుకతతో ఉంది. ఇలాంటి ప్రయాణంతో భవిష్యత్‌లో అద్భుత ఫలితాలు సాధించగలమని బలంగా చెప్తున్నా.

పోలీస్‌ వ్యవస్థలో ప్రక్షాళన… 

చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తే చర్యలు

గతంలో గ్రామాల్లో 25 వేల కి.మీ సిమెంట్‌ రోడ్లు వేశాం. మ్యాచింగ్‌ ఇచ్చుకుంటే గ్రామాల్లో అన్ని పనులు చేసుకోవచ్చు. రాబోయే ఐదేళ్లలో 17 వేల కి.మీ సీసీ రోడ్లు, 10 వేల కి.మీ సీసీ డ్రెయిన్‌ల నిర్మాణం మా లక్ష్యం. అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం రైతులకు బకాయిలు పెట్టిన రూ.1,670 కోట్లు చెల్లించాం. రాబోయే రోజుల్లో కూడా 48 గంటల్లోనే ధాన్యం డబ్బులు చెల్లిస్తాం. రైతులకు డ్రిప్‌ 90శాతం సబ్సీడీతో అందిస్తాం. రూ.340 కోట్లతో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులు చేస్తాం. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోతే నాటి సీఎం కనీసం అక్కడికి వెళ్లలేదు. పులిచింతల గేట్‌ కొట్టుకుపోతే రెండు సీజన్లపాటు గేటు ఏర్పాటు చేయలేదు. గుండ్లకమ్మ గేటు కొట్టకుపోయింది. అంత జరిగినా వైసీపీలో చలనం లేదు. తుంగభద్ర గేటు కొట్టుకుపోయింది. సాగుకు నీళ్లివ్వలేమని అధికారులు ప్రకటించారు. ఇప్పుడెలా? అని మా ప్రభుత్వం ఆలోచిస్తూ కూర్చోలేదు. గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడుని పంపి గేటు ఏర్పాటు చేసి నీటి వృధాను అడ్డుకున్నాం. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను సమస్యగా చేయడానికి చూస్తున్నారు. గతంలో వాజ్‌పేయ్‌ హయాంలో నిధులు కేటాయించి నష్టాల నుండి గట్టెక్కించాం. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కాకుండా చూస్తున్నాం. నీరు `చెట్టు, నరేగా బిల్లులు కూడా విడుదల చేస్తున్నాం. పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేసి జవాబుదారీతనం తెస్తున్నాం. గత ఐదేళ్లు ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెట్టి వేధించారు. ముంబయిలో ఉన్న హీరోయిన్‌ను అరెస్టు చేసి ఇబ్బందులు పెట్టారు. చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకుంటాం. దేవాలయాల్లో పని చేసే నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేలకు గౌరవ వేతనం పెంచాం. బీసీలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లకు కేబినెట్‌లో ఆమోదించాం. అసెంబ్లీలో పాస్‌ చేసి కేంద్రానికి పంపుతాం. అర్చకుల వేతనం రూ.10 వేల నుండి 15 వేలకు పెంచాం. ఇవన్నీ ప్రభుత్వ విజయాలే.

అర్హులైన

ప్రతి ఒక్కరికీ ఇల్లు

ఇళ్లులేని ప్రతి ఒక్కరికీ ఇళ్లు నిర్మించి ఇస్తాం. పెండిరగులో ఉన్న ఇళ్లు పూర్తి చేస్తాం. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు ఇస్తాం. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలమిస్తాం. పట్టాదారు పాసుపుస్తకాలను రాజముద్రతో రైతులకు అప్పగిస్తాం. ఏ వ్యక్తి ఫోటోలు ఎక్కడా ఉండవు. 2047 విజన్‌తో 15 శాతం గ్రోత్‌ రేట్‌ లక్ష్యంగా పెట్టుకున్నాం. అసాధ్యం అన్నది సుసాధ్యం చేసి చూపిస్తాం. నూతన ఎంఎస్‌ఎంఈ విధానం, నూతన ఇండస్ట్రియల్‌ పాలసీల తెస్తున్నాం. రాబోయే రోజుల్లో పోర్టులు, ఎయిర్‌ పోర్టులు ముఖ్యమవుతాయి. వాటిపై దృష్టి పెట్టాం. అన్ని ట్రస్ట్‌ బోర్డుల్లో బ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణులను నియమిస్తున్నాం.

వైసీపీ హయాంలో

తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడకం

తిరుమల లడ్డూను గత ఐదేళ్లు నాసిరకంగా చేశారు. వెంకటేశ్వరస్వామి పవిత్రతను దెబ్బతీశారు. దేవుడు ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారు. ఆ పరిస్థితులను చక్కదిద్దుతున్నాం. వేంకటేశ్వరస్వామి ప్రతిష్టతను పెంచి పవిత్రత కాపాడుతాం. రాష్ట్రంలో రోడ్లు దారుణంగా ఉన్నాయి. ముందుగా గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రూ.500 కోట్లు మంజూరు చేశాం. పెద్దఎత్తున వరదలు సంభవించాయి. నా జీవితంలో చాలాసార్లు చూశాను కానీ… ఇంత పెద్దఎత్తున సీఎంఆర్‌ఎఫ్‌కు దాతలు ఏనాడూ విరాళాలు ఇవ్వలేదు. సమస్య వచ్చినపుడు ప్రజలు ఎంత సంఘటితంగా నిలబడతారనడానికి ఇది పెద్ద ఉదాహరణ. బుడమేరు ప్రాంతంలో కబ్జాలు పెరగడం వల్లే వరద ముంపునకు కారణమైంది. బుడమేరు మరమ్మతులకు మునుపటి ప్రభుత్వంలో నిధులు కేటాయిస్తే గత ప్రభుత్వం పనులను రద్దు చేసింది. ప్రకృతి విలయం, గత పాలకుల తప్పిదాలు ప్రజలకు శాపంగా మారి 10 రోజులు నీళ్లలోనే ఉండాల్సి వచ్చింది. 10 రోజుల పాటు విజయవాడ కలెక్టరేట్‌లో ఉండి పరిస్థితులు సాధారణ స్థితికి తెచ్చాను. వరద సాయంగా ప్రతి ఇంటికి రూ.25 వేలు అందించాలని నిర్ణయించాం. 25 కేజీల బియ్యం, 5 రకాల నిత్యవసర సరుకులు అందించాం.పాడైపోయిన ద్విచక్ర వాహనాల రిపేర్లకు రూ.3 వేలు ప్రకటించాం. టర్నోవర్‌ను బట్టి ఎంఎస్‌ఎంఈలకు ప్యాకేజీని ప్రకటించాం. ఇంత పెద్ద మొత్తంలో వరద బాధితులకు ప్యాకేజీ ఎవరూ, ఎప్పుడూ ప్రకటించలేదు. పంటలకు కూడా మొదటిసారి హెక్టారకు రూ.25 వేలు పరిహారం ప్రకటించాం. నష్టపోయిన కౌలు రైతులకే నేరుగా పరిహారం అందిస్తాం.  బుడమేరు గండ్లను పూడ్చేందుకు మంత్రులు నిమ్మల రామానాయుడు, నారా లోకేష్‌ రేయింబవళ్ళు కష్టపడ్డారు. వాళ్ల కృషిని అభినందించాలి.

దీపావలి పండుగ కానుకగా

ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకం ప్రారంభం

సూపర్‌ 6 హామీల్లో భాగంగా ఇచ్చిన 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకాన్ని దీపావళి పండుగ రోజున మొదటి గ్యాస్‌ అందిస్తాం. మిగిలిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు క్రమేణా అమలు చేస్తాం. ప్రభుత్వంపై పవిత్రమై బాధ్యత ఉంది. ప్రతి అడుగూ ప్రజల కోసం వేయాలి, అనునిత్యం పేదల కోసం పని చేయాలి, చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని భాగస్వాములకు చెప్తున్నా. ఈ వంద రోజులపాటు భాగస్వాములు చూపిన సమన్వయం అమోఘం. దీన్ని మరింత దృఢత్వంతో ముందుకు తీసుకెళ్లాలి. వైసీపీ అనునిత్యం విషంగక్కే పనిలోవుంది. ఏమాత్రం అశ్రద్ధ వహించకుండా తిప్పికొట్టాలి. వ్యక్తిగత విమర్శలు పట్టించుకోకుండా.. ప్రజలకు వాస్తవాలను వివరిస్తున్నాం.  జగన్‌లాంటి విపరీత ధోరణులున్న వ్యక్తుల వల్ల కలిగే నష్టాలేంటో ప్రజలకు చెబుతున్నాం. నామినేటెడ్‌ పోస్టులు భర్తీ మొదలుపెట్టాం. 175కు 175 సీట్లు మేమే గెలుస్తామని, 40 ఏళ్లు మేమే అధికారంలో ఉంటామని చెప్పుకోవడం లేదు. స్థిరమైన ప్రభుత్వంవల్ల అభివృద్ధి చేసుకోగలుగుతామనే చెప్తున్నాం. త్వరలోనే జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులను వేస్తున్నా. జిల్లాలవారీగా మూడు పార్టీల అధ్యక్షులు సమన్వయంతో పనిచేయాలి. ప్రతి ఇంటికీ ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు చేరవేయడానికి ప్రత్యేక ప్రణాళిక ఒకటి రూపొందించుకుంటాం.

100 రోజుల పాలనలో వెయ్యి అడుగులు ముందుకేశామని చంద్రబాబు ప్రకటించుకున్నారు. ఆ వెయ్యిలో మచ్చుకు కొన్ని ముఖ్యమైన అడుగులు..:

  • ఒకేసారి రూ.వెయ్యిపెంచి పింఛనులు రూ.4వేలు చేశారు. పింఛను 64లక్షల మందికి పైగా ఇవ్వడం దేశ చరిత్రలో తొలిసారి.
  • 16,437 ఉపాధ్యాయ నియామకాలకు మెగా డీఎస్సీ వేశారు. నాల్గవసారి సీఎం అయిన చంద్రబాబు.. 1996 నుంచి తొమ్మిది డీఎస్సీలు వేసి.. 2,32,179 మంది ఉపాధ్యాయ నియామకాలు చేపట్టారు.
  • అన్న క్యాంటీన్ల పునరుద్ధరణతో పేదోడి ఆకలి తీర్చి పెన్నిధిగా నిలిచారు.
  • ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దుతో ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించారు. 
  • డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలను రూ.5లక్షల నుండి రూ.10లక్షలకు పెంచారు. 
  • రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రంనుంచి రూ.15వేల కోట్లు సాధించారు.
  • పోలవరం నిర్మాణానికి రూ.12.5వేల కోట్లకు కేంద్ర అనుమతి పొందారు.
  • కర్నూలు జిల్లా ఓర్వకల్లు, కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక పార్కులకు రూ.25వేల కోట్లు పెట్టుబడులు, 75వేలమంది యువత ఉపాధికి కేంద్ర ఆమోదం.
  • ఆగస్టు 23న స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట రాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో ఒకేరోజు గ్రామసభలు నిర్వహించడం, రూ.4,500 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులకు తీర్మానాలు చేయడం.. వరల్డ్‌ రికార్డు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ సమన్వయానికి ఇది నిదర్శనం.
  • విశాఖ రైల్వే జోన్‌కు మడపర్లోవలో 52 ఎకరాలు పూర్తి హక్కులతో భూముల కేటాయింపు.
About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *