ఆంధ్రప్రదేశ్

మహావిలయం

  • October 8, 2024
  • 1 min read
[addtoany]
మహావిలయం

ఆగస్టు 30, 2024.

రాష్ట్రం మొత్తం భారీ వర్షాలుపడే అవకాశముందంటూ వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలను ప్రజలు తేలిగ్గా తీసుకున్నారు.ముంచుకొస్తున్న ముప్పును ఊహించలేకపోయారు. వాతావరణ శాఖనుంచి స్పష్టమైన సమాచారం రావడం.. ఇంటెలిజెన్స్‌ రిపోర్టులు అందుకున్న ప్రభుత్వం మాత్రం `ఒక్కసారిగా అలెర్టయ్యింది. చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రభుత్వంనుంచి అలెర్ట్‌ మెసేజ్‌లు అందడంతో యావత్‌ రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడిరది.

కట్‌చేస్తే..

భారీ విపత్తు విజయవాడను బలంగా తాకింది. ఎగువనుంచి కృష్టమ్మ ఉరకలెత్తుతూ సముద్రంవైపు పరుగులు తీస్తుంటే.. కృష్ణమ్మలో కలవాల్సిన వాగులూ, వంకలూ ఆ ఉగ్రరూపానికి భయపడి ఊళ్లమీదపడ్డాయి. ఆక్రమణలతో దారులు మూసుకుపోయిన బుడమేరు.. గట్టు తెంపుకుని బెజవాడమీదకు తెగబడిరది. `లోతట్టు ప్రాంతాలను ముంచేసింది.

చాప్టర్‌ `1

ఆగస్టు 31, 2024.

వాతావరణ శాఖ హెచ్చరికలతో అలెర్టయిన సీఎం చంద్రబాబు ఓర్వకల్లు పర్యటన రద్దు చేసుకుని, వర్షాలపై సమీక్షలు, సహాయక చర్యల పర్యవేక్షణలో నిమగ్నమయ్యారు. ‘రాష్ట్రంలో మరో మూడురోజులు భారీ వర్షాలున్నాయి. కిందిస్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రతి అధికారి అప్రమత్తంగా ఉండండి’. ఇదీ ముఖ్యమంత్రి నుంచి వెళ్లిన ఆదేశం.

ముఖ్యమంతి ఆదేశాల మేరకు ప్రజలను అధికారులు అలెర్ట్‌ చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోడానికి విపత్తు నిర్వహణా బృందాలు సిద్ధమయ్యాయి. క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌లో అపార అనుభవమున్న చంద్రబాబు `ప్రాణనష్టం సంభవించకుండా సత్వర రక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో.. వాతావరణ తీవ్రత యంత్రాంగానికి అర్థమైంది. భారీ వర్షాలున్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవిచ్చేశారు. నదులు, వాగులు, వంకలవద్ద హెచ్చరిక బోర్డులు పెట్టారు. వరద ముంచెత్తుతున్న ప్రాంతాలకు డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌ విభాగంనుంచి మొబైల్స్‌కు అలెర్ట్‌ మెసేజ్‌లు వెళ్లాయి. మరోపక్క అనుక్షణం మంత్రులు, సీఎస్‌, డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సహా ఆయా శాఖల అధికారులతో ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్‌లు నడుస్తూనే ఉన్నాయి. రోడ్లపై భారీస్థాయిలో నీరుచేరి ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ స్థంభిస్తోందన్న సమాచారంతో.. ప్రజలు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్‌ మళ్లింపులకు, నిలిపివేతకు ఆదేశాలు వెళ్లాయి. మ్యాన్‌హోల్స్‌ దగ్గర, విద్యుత్‌ తీగలు తెగిపడిన ప్రదేశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. వాట్సాప్‌ గ్రూపుల ద్వారా అధికార్లు సమన్వయం చేసుకోవాలని, అవసరమైతే డ్రోన్లు టెక్నాలజీ వాడుకుని.. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. భారీ వర్షాలకు విజయవాడలోని మొగల్రాజపురంలో ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డాయన్న సమాచారం.. ఒక్కసారిగా బెజవాడను భయబ్రాంతులకు గురిచేసింది. ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతిచెందినవారి కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించిన ముఖ్యమంత్రి.. ప్రమాదకర వాతావరణ పరిస్థితుల్లోనూ క్షేత్రస్థాయిలోకి దిగిపోయారు.

చాప్టర్‌ `2

సెప్టెంబరు 1, 2024.

తుపాను తీవ్రతతో తెలుగు రాష్ట్రాల్లో జనజీవనం స్థంభించింది. గోదావరి, కృష్ణా నదులు, వాటి ఉపనదులు సహా ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాలగుండా ప్రవహించే నదులలో నీటిమట్టం పెరిగే అవకాశముందంటూ కేంద్ర జల సంఘం అలెర్ట్‌ చేసింది. నాగావళి, వంశధార, సువర్ణముఖి, చంపావతి, గోస్తని, శారద, వరాహ, శబరి, తమ్మిలేరు, ఏలేరు నదుల నీటిమట్టాలు పెరిగే అవకాశం లేకపోలేదన్నది హెచ్చరికల సారాంశం. దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోని విజయవాడ డివిజన్‌ అనేక రైళ్లను దారి మళ్లించింది. కొన్ని రద్దు చేసింది. అదే సమయంలో విజయవాడ నగరంలో రికార్డుస్థాయి వర్షపాతం నమోదైంది. 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఒకేరోజు 29 సెంటీమీటర్ల వర్షపాతం. రెండు రోజులపాటు నగరంలో కుండపోత వానలు.. పలు కాలనీలను ముంచేశాయి. 4 అడుగుల మేర వరద. ఆటోనగర్‌ నుంచి బెంజ్‌ సర్కిల్‌ వరకు రాకపోకలు బంద్‌. విజయవాడలోని చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ప్రకాశం బ్యారేజ్‌కు 5.55 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చేసరికి.. మొదటి హెచ్చరిక జారీ అయ్యింది. నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తం కావాలన్న హెచ్చరికలు వెళ్లాయి. భారీ వర్షాలు, వరదలు, జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై మంత్రులు, సీఎస్‌, డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షల మీద సమీక్షలు నిర్వహించారు. జిల్లాలు, శాఖలవారీగా తాజా పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై నిరంతరం ఆరా తీశారు. ఏలూరు జిల్లాలోనూ భారీ వర్షాలు చోటుచేసుకోవడతో.. ఎటువంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో వరదలపై ఏపీ డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌ అథారిటీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు.. వాతావరణ పరిస్థితి తీవ్రతను వివరించారు. ప్రజలు బయటకు రావొద్దని జాగ్రత్తలు చెప్పారు. విపత్తు నిర్వహణ శాఖ కార్యాలయం నుండి విజయవాడకు వస్తూ మధ్యలో కనకదుర్గ వారధిపై ఆగి కృష్ణా నదీ ప్రవాహం పరిశీలించి.. వరద మరింత పెరిగే అవకాశాన్ని అంచనా వేశారు. కలెక్టరేట్‌ను సెక్రటరియేట్‌గా మార్చుకొని వరద సహాయక చర్యల ప్రణాళిక అమలుకు సన్నద్ధమయ్యారు.

అదే సమయంలో భారీ వరదతో బుడమేరుకు గండ్లుపడి.. విజయవాడను ముంచెత్తింది. విజయవాడ కలెక్టరేట్‌ నుంచి వరద సహాయక చర్యల సమీక్షలు మొదలయ్యాయి. యుద్ధప్రాతిపదిక ‘ఆపరేషన్‌ ఫ్లడ్‌’ ఆరంభించారు. పీకల్లోతు వరదలో చిక్కుకున్న ప్రజలను బయటకు తెచ్చేందుకు అదనపు బోట్లు, ట్రాక్టర్లు రప్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి సమీక్షించేందుకు విజయవాడ సింగ్‌నగర్‌లోని బుడమేరు వరద ప్రభావిత ప్రాంతంలో ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్లారు. గుంటూరు, విజయవాడల్లో 37 సెం.మీ వర్షపాతం నమోదవ్వడం అసాధారణం. 50 ఏళ్లలో ఎప్పుడూ రానంత వరద విజయవాడను ముంచెత్తింది. అనూహ్య వరద పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు వివరించిన సీఎం చంద్రబాబు, కేంద్ర హోం సెక్రటరీతోనూ చర్చించారు. ఇతర రాష్ట్రాల నుండి తక్షణమే 6 ఎన్డీఆర్‌ఎఫ్‌ టీమ్‌లు ఏపీకి పంపుతున్నామని, 40 పవర్‌ బోట్లు రాష్ట్రానికి పంపుతున్నట్లు హోంసెక్రటరీ హామీ ఇచ్చారు.

చాప్టర్‌ `3

సెప్టెంబర్‌ 2, 2034

విజయవాడ ముంపు ప్రాంతాల్లో సీఎం సుడిగాలి పర్యటన సాగింది. సింగ్‌నగర్‌ తదితర ముంపు ప్రాంతాల్లో చీకట్లో టార్చ్‌ లైట్‌ వెల్తురులో అర్థరాత్రి 12 గంటల సమయంలో బోట్‌పై బాధితులను కలిశారు. బాధితులకు స్వయంగా ఆహారం అందించారు. ఆత్మస్థయిర్యం నింపేవిధంగా తెల్లవారుజామున మూడు గంటల వరకూ కృష్ణలంక, ఇబ్రహీంపట్నం, ఫెర్రీ, జూపూడి, మూలపాడు ప్రాంతాల్లో పర్యటన కొనసాగించారు. తిరిగి ఉదయం 8 గంటలనుంచే కృష్ణలంక, జక్కంపూడి ప్రాంతాల్లోనూ పర్యటించారు. ప్రకాశం బ్యారేజీ దిగువన వరద పరిస్థితిని పరిశీలించిన సీఎం, లోతట్టు ప్రాంతాల ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. విజయవాడలోని సితార సెంటర్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. సహాయ చర్యల పర్యవేక్షణకు 32 డివిజన్లకు 32మంది సీనియర్‌ ఐఏఎస్‌లను, 179 సచివాలయాలకు 179 మంది ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. ముంపునుంచి పునరావాస కేంద్రాలకు చేరిన బాధితులకు సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఉదయం నుంచే తమకు నీళ్లు, ఆహారం అందాయని, ఎన్డీఆర్‌ఎఫ్‌ బోట్ల ద్వారానే బయటకు రాగలిగామని బాధితులు చెప్పుకొచ్చారు. బాధితులనుంచి తీసుకున్న సమచారంతోనే పరిస్థితిని అంచనా వేసుకున్న సీఎం చంద్రబాబు `సహాయక చర్యలను వేగవంతం చేశారు. పసి పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు వరద నీటిలో చిక్కుకుని పడిన ఇబ్బందులు చెబుతుంటే.. సీఎం చంద్రబాబు చలించిపోయారు. విద్యుత్‌ సరఫరా దెబ్బతినంతో.. వరద ప్రభావిత ప్రాంతాలకు ఇంధన శాఖ నుంచి వెయ్యి సోలార్‌ లాంతర్లు సరఫరా చేశారు. విజయవాడ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌నుంచి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వరద ముంపు ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా 7,220 కిలోల ఆహారం, వాటర్‌ బాటిళ్లు, మందులు పంపిణీని సమీక్షించారు.  విజయవాడలో ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి ఒకానొక సమయంలో భయపెట్టింది. బ్యారేజీకి 11.43 లక్షల క్యూసెక్కుల వరద నీరు రాగా.. నాలుగు గంటలపాటు సాగిన ఉధృతి క్రమంగా తగ్గుముఖం పట్టింది. అటు, బుడమేరుకూ ఇన్‌ఫ్లో తగ్గిందన్న జలవనరుల శాఖ సమాచారం కాస్త ఊరటనిచ్చింది. వాస్తవానికి కృష్ణా నది చరిత్రలో రికార్డుస్థాయిలో విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌కు 11.43 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చింది. బ్యారేజ్‌ పూర్తి సామర్థ్యం 11.90 లక్షల క్యూసెక్కులు. బ్యారేజీ కట్టిన తర్వాత ఈస్థాయిలో వరద రావడం ఇదే తొలిసారి.

చాప్టర్‌ `4

సెప్టెంబర్‌ 3, 2034

నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో `వాహనాలు వెళ్లలేని పరిస్థితిలో జేసీబీపై ఏకబిగిన సీఎం చంద్రబాబు పర్యటించారు. బాధితులను పరామర్శిస్తూ.. సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఆహారం అందుతుందా? లేదా? స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మరోపక్క `వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలికాఫ్టర్లు, డ్రోన్ల ద్వారా బాధిత ప్రజలకు ఆహార పొట్లాలు, బిస్కట్లు, వాటర్‌ బాటిళ్లు, పాలు తదితర వస్తువుల సరఫరా సాగించారు. వరదల సమయంలో ప్రజలు ఏం చేయాలి, ఏం చేయకూడదన్న అంశాలపై అవగాహన కల్పించేలా 5 లక్షల కరపత్రాల పంపిణీ సాగింది. ఇదే సమయంలో వరద సహాయక చర్యలకు అడ్డుతగిలి.. వరదను బురద రాజకీయం చేయడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్‌ సీన్‌లోకి దిగి అభాసుపాలయ్యాడు.

చాప్టర్‌ `5

సెప్టెంబరు 4, 2024

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాలుగో రోజు జేసీబీపైనే పర్యటించారు. వరద తగ్గడంతో బురద తొలగించే పనులు మొదలయ్యాయి. ఫైరింజన్లు, పొక్లెయినర్లు, టిప్పర్ల సాయంతో వ్యర్థాలను తొలగించారు. వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో భాగంగా అంబులెన్స్లను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సహాయకచర్యలపై మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూనే వచ్చారు. వరదల్లో మృతులను కుటుంబాలకు అప్పగించాలని, ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వం తరపునే గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి సచివాలయంలో మెడికల్‌ క్యాంప్‌ ఏర్పాటుకు ఆదేశాలు జారీ అయ్యాయి. 25 కిలోల బియ్యం, లీటర్‌ పామాయిల్‌, 2 కిలోల ఉల్లిపాయలు, 2 కిలోల బంగాళదుంపలు, కిలో చక్కెర బాధితులకు అందించే ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి.

చాప్టర్‌ `6

సెప్టెంబరు 5, 2024

రాష్ట్రంలో కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్‌ కుమార్‌ జిందాల్‌ నేతృత్వంలో కేంద్ర బృందం ముంపు ప్రాంతాలను పరిశీలించి, నష్టాలపై ఒక అవగాహనకు వచ్చింది. అదే సమయంలో నష్టాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కి ఐటీ మంత్రి లోకేష్‌ వివరించార. కేంద్రం సంపూర్ణ సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రకటించారు.

చాప్టర్‌ `7

సెప్టెంబరు 6, 2024

వరద సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. జనజీవనం సాధారణ స్థితికి చేరడానికి అన్నివిధాలా వెసులుబాట్లు కల్పించారు. 15 లక్షల క్యూసెక్కుల నీరు డిశ్చార్జ్‌ చేయడానికి వీలుగా ప్రకాశం బ్యారేజీ సామర్థ్యం పెంచేలా ప్రయత్నం చేస్తామన్నారు. గన్నవరం ఎయిర్‌ పోర్టు నుంచి బుడమేరు వరద ముంపు ప్రాంతాల్లో హెలికాఫ్టర్‌ ద్వారా ఏరియల్‌ సర్వే నిర్వహించి.. బుడమేరు, కొల్లేరు, ప్రకాశం బ్యారేజ్‌ దిగువ ప్రాంతాల్లో కృష్ణా నదీ లంక గ్రామాలను పరిశీలించారు.. 

చాప్టర్‌ `8

సెప్టెంబరు 7, 2024

యధావిధిగానే ముఖ్యమంత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మరోపక్క భారీ వర్షాలు, వరద నష్టంపై కేంద్రానికి రూ. 6,880 కోట్లతో ప్రాథమిక నివేదికను ప్రభుత్వం పంపించింది. విజయవాడను ముంపునుంచి బయటకు తీసేందుకు ఐదురోజులుగా అలుపెరుగని యుద్ధం చేసిన జలవనరుల మంత్రి నిమ్మల సారథ్యంలో `బుడమేరు గండ్లను విజయవంతంగా పూడ్చేశారు. ప్రభుత్వ చర్యలను ఆర్మీ ఇంజనీరింగ్‌ విభాగం సైతం ప్రశంసించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టం అంచనాల సేకరణ (ఎన్యూమరేషన్‌) మొదలైంది. మరోపక్క `రాజ్‌భవన్‌కు వెళ్లి రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌ అబ్ధుల్‌ నజీర్‌కు పరిస్థితిని వివరించారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస చర్యలను స్వయంగా పర్యవేక్షించడం పట్ల ప్రత్యేకంగా అభినందించిన గవర్నర్‌.

చాప్టర్‌ `9

సెప్టెంబరు 8, 2024

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో మళ్లీ భారీ వర్షాలు ఉండవచ్చన్న హెచ్చరికలతో `ప్రభుత్వం అలెర్టయ్యింది. జిల్లా కలెక్టర్లతో సీఎం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 8 రోజులుగా విజయవాడలో వరద పరిస్థితులు, సహాయ చర్యలను చూస్తున్నారు కనుక.. అందుకు తగ్గట్లుగా సర్వసన్నద్ధమై ఉండాలని ఆదేశించారు. 8వ రోజూ ముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటించి.. ప్రభుత్వ చర్యలను పూర్తిగా సమీక్షించారు. అనంతరం సింగ్‌నగర్‌ ఫ్లైఓవర్‌ వద్ద ప్రజలతో చర్చించారు. అర్బన్‌ యాప్‌ వినియోగంపై ప్రజల్లో చైతన్యం కలిగించారు.  ఆప్కో, ఇతర సంస్థల వద్ద వస్త్రాలు తెచ్చి పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టరేట్‌ వెళ్లి అధికారులతో సహాయక చర్యలను సమీక్షించారు.

చాప్టర్‌ `10

సెప్టెంబరు 9, 2024

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లో వివిధ రకాల ఎలక్ట్రానిక్‌ కంపెనీల ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. వరదల్లో దెబ్బతిన్న ఎలక్ట్రానిక్‌ వస్తువులకు రిపేర్లు చేసే అంశంపై చర్చించి, సామాజిక బాధ్యతతో ముందుకు రావాలన్నారు. కంపెనీల వారిగా హెల్ప్‌ లైన్‌ ఏర్పాటు చేసి అదనంగా టెక్నీషియన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. బుడమేరు గండ్లు పూడ్చిన ప్రాంతంలో పర్యటించిన సీఎం,  బుడమేరు ప్రవాహాలు, చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. కలెక్టర్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్ష, ప్రజలకు అందుతున్న సాయం, ఎన్యుమరేషన్‌పై వివరాలు తెలుసుకున్నారు. మొత్తంగా పదిరోజులు యుద్ధం సాగించి `విజయవాడపై విరుచుకుపడిన భారీ విపత్తును ఎన్డీయే ప్రభుత్వం జయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల హృదయాలను గెలిచారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *