ఆంధ్రప్రదేశ్

జలప్రళయానికి జగన్‌ కుట్ర!?

  • October 8, 2024
  • 1 min read
[addtoany]
జలప్రళయానికి జగన్‌ కుట్ర!?

ఓటమి అక్కసుతో రగిలిపోతున్న ఓ రాజకీయ సైకో.. ప్రభుత్వాన్ని ఇరుకున్న పెట్టాలన్న కుట్రతో ప్రకృతి ముసుగులో ప్రళయాన్ని సృష్టించేందుకు సిద్ధపడ్డాడన్న అభియోగాలు నిగ్గుతేలుతోన్న తరుణంలో `ప్రజల ఆలోచనలకు సంక్షిప్త రూపమే పైవాక్యం. కుట్ర పారలేదు కనుక… గండం గట్టెక్కింది కనుక… బెజవాడ మళ్లీ మనుషులతో మామూలగా కనిపిస్తోంది. లేదంటే.. ఈ సమయానికి విజయవాడ `లక్షలాది శవాలతో శ్మశానాన్ని తలపించేది. ప్రపంచ వార్తలలో పతాక శీర్షికన ఉండి ఉండేది. మానవ చరిత్రలోనే ఇదోక చారిత్రక తప్పిదమై ఉండేది. వొళ్లు గగుర్పొడిచే కుట్రే అది!

సెప్టెంబరు 1, 2024.

చరిత్రలో ఎప్పుడూ లేనంతగా `బెజవాడ నడినెత్తిన 48 గంటలపాటు కుండపోత వాన. 30 సెంటీమీటర్ల తెరిపిలేని వర్షపాతంతో విజయవాడ ఉక్కిరిబిక్కిరవుతున్న సమయం. కృష్ణా ఎగువ ప్రాంతంలోని క్యాచ్‌మెంట్‌ ఏరియాలో భారీ వర్షాలతో పోటెత్తిన వరద.. సుడులు తిరుగుతూ కిందకు దిగుతోన్న సమయం. లక్షల క్యూసెక్కులుగా దిగుతోన్న వరదను.. శతాబ్ధం క్రితంనాటి ప్రకాశం బ్యారేజీ తట్టుకుని నిలబడుతుందా? అన్న భయకంపిత అనుమానాలు. డిశ్చార్జి సామర్థ్యానికి మించి ఎగువనుంచి వరద పోటెత్తుతుంటే.. 11.46 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని కిందికి వదులుతూ.. జల వనరుల అధికారులు కిందామీదా పడుతున్న క్షణాలు. కరకట్టలే తెగుతాయో, కాంక్రీట్‌ గట్లే కోతకు గురవుతాయో అంచనావేయలేనంత నదీ ప్రవాహ వడి. అప్పటికే ముంచెత్తిన వరదలో జలదిగ్బంధమై.. ఎటుపోవాలో అర్థంకాక గుండెలు చిక్కబట్టిన లక్షలాది జనం. అనూహ్య విపత్కర పరిస్థితి నుంచి ప్రజలను ఎలా బయటకు తేవాలో అర్థంకాక.. మైండ్‌బ్లాంక్‌లోవున్న ప్రభుత్వం. ప్రమాదంలో చిక్కుకున్న తోటివాళ్ల గురించి ఆరా తీస్తూ.. ఏమవుతుందోనన్న భయాందోళనలో ఒడ్డునున్న ప్రపంచం. ఈ దృశ్యాలేవీ పైకి కనిపించనంతగా అలముకున్న గాంఢాంధకారం!

సరిగ్గా అదే సమయంలో.. మరోచోట.. బ్యారేజ్‌ దిగువ ప్రాంతాన్ని లక్ష శవాలతో శ్మశానంగా మార్చే కుట్ర పురుడుపోసుకుంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్నదే ఆ కుట్ర లక్ష్యం. విపత్తు ఎదుర్కోవడంపై ప్రభుత్వం నిమగ్నమై ఉంది కనుక.. ప్రకృతి ముసుగులోనే ప్రళయాన్ని సృష్టించి కక్ష తీర్చుకోవాలన్నది ప్రత్యర్థుల దుర్మార్గ ప్రణాళిక. జల ప్రళయంలో భారీ ప్రాణ నష్టం సంభవిస్తే.. రాష్ట్రపతి పాలనకు డిమాండ్‌ చేసి రెండునెలల ప్రభుతాన్ని దింపేయాలన్నది కుట్రలోని కోర్‌ థాట్‌. అమరావతిని రాజధానిగా అంగీకరించలేక.. ‘అదొక శ్మశానం’ అంటూ అనుయాయుడు బొత్సతో మాట్లాడిరచిన దుర్మార్గుడే.. దాన్ని నిజం చేయాలని స్కెచ్‌ వేశాడు. అత్యంత బరువైన ఇసుక డ్రెడ్జింగ్‌ బోట్లతో వరద ప్రవాహ వేగంలో బ్యారేజ్‌ను ఢీకొట్టించి.. కుప్ప కూల్చాలని కుట్రపన్నాడు. అనుకున్నదే తడవు `ఉద్దండరాయునిపాలెం గట్టునుంచి అత్యంత బరువున్న బోట్లను తరలించి.. గొల్లపూడి గట్టు దగ్గరున్న శ్మశాన వాటిక వద్ద మూడిరటినీ కలిపికట్టారు. ఆ మూడు బోట్లు బరువు `150 టన్నులు. పైగా ఉధృతంగా దిగుతోన్న వరద ప్రవాహ వేగం. కుట్రలో భాగంగా లంగరు శీలకు బలహీనంగా కట్టబడిన బోట్లు.. ప్లాస్టిక్‌ తాళ్లను తెంచుకుని వరదలో కొట్టుకొచ్చాయి. ప్రవాహ వేగంతో వచ్చి.. 150 టన్నుల బరువున్న బోట్లు ప్రకాశం బ్యారేజ్‌ చైన్‌ వెయిట్‌ దిమ్మెను ఢీకొట్టాయి.

అంత భారీ ఫోర్స్‌ నేరుగా కాలమ్స్‌కి తగిలి బ్యారేజీ కుప్పకూలివుంటే? లక్షమందికి పైగా జళప్రళయంలో చనిపోయేవారు. లక్షలాది అన్నదాతల పొలాలు, ఇండ్లు కొట్టుకుపోయేవి. గ్రామాలు బంగాళాఖాతంలో కలిసేవి. ఆ సన్నివేశం ఊహించుకుంటేనే.. భయవిహ్వలులవుతాం. అదృష్టవశాత్తూ.. దుర్గమ్మ పాదాల చెంతనున్న ప్రకాశం బ్యారేజీకి ఏంకాలేదు. ఆమే కాపాడిరదని జనం భావించారు. ఇప్పటికీ గుర్తు చేసుకుని దుర్గమ్మకు దణ్ణం పెట్టుకుంటున్నారు. 11.47 లక్షల క్యూసెక్కుల వరదలో 40-50 టన్నుల బరువున్న బోట్లన్నీ కలిపి కట్టి పంపిస్తే, అవి 120-150 టన్నుల ఫోర్సుతో ప్రకాశం బ్యారేజీనీ గుద్దుతుందని.. అన్నమయ్య డ్యాం లెక్కన కొట్టుకొని పోయేలా చేస్తుందన్నది కుట్రదారుల స్కెచ్‌. ఇంతటి కుట్రకు వెనకున్నది మాజీ ముఖ్యమంత్రి జగన్‌ అన్నది పాలకపక్షం అభియోగం. ఇందులో వైసీపీకి చెందిన నేతల హస్తం.. ఆ నేతల వెనక తిరిగే మూకల బోట్లు కావడం.. ఆ బోట్లపైవున్న పార్టీ రంగులు, గుర్తులు. ఇలా ఒక్కొక్కటిగా దర్యాప్తులో బయటపడుతున్న నిజాలు జనాలను నివ్వెరపోయేలా చేస్తున్నాయి. రాజకీయ ఆధిపత్యం కోసం లక్షమంది ప్రజల ప్రాణాలను ఫణంపెట్టిన కుట్రకు పేరేదైనా పెట్టాల్సి వస్తే.. అది `‘జగన్‌’!  అన్న మాటన్నది అందుకే.

అనుభవజ్ఞుడైన సీఎం చంద్రబాబు.. హుటాహుటిన ఆ ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. ‘ఇది ప్రకృతి ప్రమాదంలో భాగంకాదు, మానవ కుట్రలో భాగం. విజయవాడలో విలయాన్ని కాంక్షించి.. ఎవరో పన్నిన కుట్ర’ అన్న భావనానుమానం వ్యక్తం చేశారు. క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌లో అభవజ్ఞుడైన చంద్రబాబు నోటివెంట ఒక మాట వస్తే.. అది నిజమే అవ్వాలి. సమగ్ర సమాచారం ఉంటేనే మాట వదిలే స్థితప్రజ్ఞుడాయన. భారీ బోట్లు బ్యారేజ్‌ను ఢీకొన్నవెంటనే.. సంఘటనా ప్రాంతాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు `దీని వెనుక కుట్ర ఉండిఉండొచ్చని ఏ అనుమానం వ్యక్తం చేశారో.. రెండు రోజుల్లోనే అదే విషయం నిర్థారణ అయ్యింది. ఆయన అనుమానించినట్టే దర్యాప్తులో అనేకాంశాలు ఒక్కోక్కటిగా వెలుగు చూశాయి, చూస్తున్నాంయి. బ్యారేజీని బోట్లతో గుద్ది కూల్చి భారీ విధ్వంసానికి ఒడిగట్టాలన్నది జగన్‌ కుట్రేనని ప్రత్యక్షంగా, పరోక్షంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు. వైసీపీ నాయకుడు, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ల పేర్లు బయటకు వచ్చాయి. బోట్లతో బ్యారేజ్‌ను ఢీకొట్టించే చర్యకు వాళ్లే ఉపక్రమించినట్టు వాళ్ల అనుయాయులు రామ్మోహన్‌, ఉషాద్రిలు పోలీస్‌ విచారణలో బట్టబయలు చేసినట్టు బలంగా వినిపిస్తోంది. పూర్తి దర్యాప్తు సారాంశం ఇంకా బయటకు రావాల్సి ఉంది.

అనుమానలన్నీ వేలెత్తి చూపిస్తుండటంతో ఉలిక్కిపడిన జగన్‌, యలహంకా వ్యూహాన్‌ ప్యాలస్‌లో టెన్షన్‌ భరించలేని పరిస్థితి ఎదుర్కొంటున్నాడన్న కథనాలూ బయటకు వచ్చాయి. ఈ విషయంలో తన పేరు బయటకు రాకుండా.. మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు ఆదేశాలు వెళ్లాయన్నది బయట వినిపిస్తోన్న మాట. వేరే కేసులో అరెస్టై రిమాండ్‌లోవున్న నందిగం సురేష్‌ను `పరామర్శ పేరిట జగన్‌ జైలుకెళ్లి కలవడం వెనుక అంతరార్థం అదేనంటూ అనుమానాలను బలోపేతం చేసే దృశ్యాలూ గోచరించాయి.

జగన్‌ గద్దెమీదున్నపుడు `తనను నమ్ముకున్న ఇసుక మాఫియా కోసం ప్రజలు ప్రాణాలు ఫణం పెట్టిన ఉదంతాల కథనాలు.. ఈ సందర్భంలో మళ్లీ ప్రచారంలోకి వచ్చాయి. సైకో జగన్‌ తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేశాన్నది అప్పట్లో వినిపించిన కథనాలు. ఆ ప్రమాద ఘట్టంలో 50మంది ప్రజల ప్రాణాలు బలైపోయాయి. ఐదూళ్లు నామరూపాలు లేకుండాపోయాయి. ఇదే ప్లాన్‌ ప్రకారం ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టి కూల్చేసి, విజయవాడతోపాటు పదుల సంఖ్యలో లంకగ్రామాలు నామరూపాలు లేకుండా చేసి, లక్షలాది ప్రజలను జలసమాధి చేసేలా.. సైకో జగన్‌ పన్నిన కుట్ర బట్టబయలైదన్న కథనాలను సభ్య సమాజం బలంగానే నమ్ముతోంది. ప్రకాశం బ్యారేజీని పడవలతో కూల్చేయాలనే కుట్రకు ప్లాన్‌ చేసింది సైకో జగన్‌ అయితే, ప్లాన్‌ అమలు చేసింది వైసీపీ నేతలు తలశిల రఘురాం, నందిగం సురేష్‌. చేసిందంతా చేసి.. తమ కుట్రలు బయటపడకుండా వరద ముంపునకు ప్రభుత్వమే కారణమంటూ విషప్రచారానికి దిగిన వైనం `దర్యాప్తులో తేలాల్సి ఉంది.

ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలతో ఢీకొట్టిన ఘటనలో వైకాపా నేతలు వక్కలగడ్డ ఉషాద్రి, కోమటి రామ్మోహన్లు అరెస్టయ్యారు. కోర్టు రిమాండ్‌ విధించింది. ఈ వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తోంది. బ్యారేజీ గేట్లను పడవలు బలంగా ఢీకొట్టడంతో మూడు గేట్ల కౌంటర్‌ వెయిట్లు దెబ్బతిన్న ఘటనపై జలవనరుల శాఖ ఈఈ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఐదు పడవలు ఢీకొట్టిన ఘటనలో వేర్వేరుగా ఐదు ఎఫ్‌ ఐఆర్‌లు నమోదు చేశారు. కేసులకు సంబంధించి ఉషాద్రి, రామ్మోహన్‌ను విచారించి.. బోట్లను పటిష్ఠంగా కట్టి ఉంచకుండా ప్రవాహ వేగానికి కొట్టుకుపోయేలా కట్టి ఉద్దేశపూర్వకంగా కుట్రకు పాల్పడ్డారని రూఢీ చేసుకున్నారు.

సర్కారుకు సవాల్‌గా మారిన తొలగింపు ఆపరేషన్‌

ప్రకాశం బ్యారేజీ గేట్లవద్ద కుట్రపూరితంగా చిక్కుకున్న బోట్ల తొలగింపు ఆపరేషన్‌ సర్కారుకు పెనుసవాల్‌గా మారింది. దాదాపు 20రోజులుగా సాగుతోన్న ప్రయత్నాలు కొలిక్కి రాలేదు. బోట్ల వెలికితీత పనుల్లో బెకెమ్‌ సంస్థ ఇంజినీర్లు, అధికారులు, సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. బోట్లు తొలగించేందుకు చేపట్టిన నాలుగు వ్యూహాలు విఫలమవడంతో సరికొత్త ప్రణాళికతో బోట్లను బయటకు తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఒక్కోటి 40 టన్నుల బరువుండి నదిలో ఇసుక డ్రెడ్జింగ్‌ చేసే రెండు భారీ ఇసుక బోట్లను ఇనుప గడ్డర్లతో అనుసంధానించిన ఇంజినీర్లు.. వాటిని ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్దకు తెచ్చారు. ఈ రెండు భారీ బోట్లు 300 టన్నులకు పైగా బరువును అవలీలగా లాగేలా గడ్డర్లను అమర్చారు. కృష్ణా నదిలో బ్యారేజీ 67వ గేటు వద్ద చిక్కుకున్న భారీ బోటును పైకి తీసుకు వచ్చి రెండు పడవల మధ్య భాగంలో గొలుసులు, తాళ్లతో గట్టిగా కట్టి.. రెండు పడవలను ఒకేసారి నడుపుతూ చిక్కుకున్న పడవను ఒడ్డుకు లాక్కుని వచ్చేలా ప్రయత్నం చేశారు. తొలుత వంద టన్నుల బరువు ఎత్తే రెండు భారీ క్రేన్లతో బోట్లకు కట్టి ఎత్తే ప్రయత్నం చేయగా విఫలమైంది. డైవింగ్‌ టీంలతో బోట్లను రెండు భాగాలుగా ముక్కలు చేసి బయటకు తీసేందుకు చేసిన ప్రయత్నమూ ఫలించలేదు. భారీ పడవలను వెలికి తీయడంలో అనుభవమున్న కాకినాడకు చెందిన అబ్బులు టీంను రంగంలోకి దింపారు. భారీ పడవలకు రోడ్లను కట్టి వెనక్కి లాగగా 20 మీటర్ల దూరం వచ్చి ఇసుకలో చిక్కుకుని పైకి రాలేదు. ప్రొక్లెయిన్‌కు తాళ్లుకట్టి రోజంతా లాగినా కేవలం 5 మీటర్లు మాత్రమే కదిలి.. బయటకు రాకుండా మొరాయించాయి. ఈ కథనం రాస్తున్న సమయానికి ఐదో ప్లాన్‌ను నిపుణులు అమలు చేస్తున్నారు.

మొత్తానికి.. రెండో బోటును బెకెం ఇంజినీర్లు సరికొత్త ప్రణాళికతో బయటకు తీశారు. ఇనుప గడ్డర్లతో రెండు పడవలను అనుసంధానించి అడ్డుపడిన పడవను వెలికి తీశారు. నీటమునిగిన పడవను చైన్‌ పుల్లర్‌తో ఎత్తుకు లేపి బ్యారేజీ ఎగువన పున్నమి ఘాట్‌ వద్దకు చేర్చారు. బ్యారేజీ వద్ద ఇంకా మరో భారీ బోటు, మోస్తరు బోటు నదిలో ఉన్నాయి. ఒకటి రెండు రోజులల్లో మూడో బోటును ఒడ్డుకు తరలించడంలో అధికారుల ప్రయత్నాలు సఫలమయ్యేలాగునే కనిపిస్తున్నాయి .

…………………………………..

ఎవ్వరినీ వదలను..

ప్రకృతి విపత్తు ముసుగులో మానవ విలయం సృష్టించేందుకు కుట్ర చేసిన ఎవ్వరినీ వదిలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్వరంతో హెచ్చరించారు. వరద ముంపునుంచి విజయవాడ పూర్తిగా తేరుకునేంత వరకూ పదిరోజులపాటు వరద ప్రభావిత ప్రాంతంలోనే బస్సులోనే బస చేసిన ముఖ్యమంత్రి `ఈ ఘటనపై అనేక సందర్భాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఈ దురాగతంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమన్నారంటే.. `‘తనను ఓడిరచిన మానవ సమాజంపై వైకాపా విషం చిమ్ముతూనే ఉంది. ఓటమిని జీర్ణించుకోలేని అక్కసుతో.. ప్రజలపై కక్ష తీరుకునే ప్రయత్నాలకు ఒడిగడుతున్నారు. అందులో.. బ్యారేజీని కుప్పకూల్చే కుట్ర ఒకటి. కృష్ణాలో 11.20 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉన్నప్పుడు నదిలోకి అత్యంత బరువైన మూడు బోట్లు వదిలారు. ఆ బోట్లు కౌంటర్‌ వెయిట్‌కు కాకుండా కాలమును ఢీకొట్టి ఉంటే ప్రమాద తీవ్రత ఎలా ఉండేదో ఊహించుకోవడానికే వణికిపోవాలి. బోట్లకు వైకాపా రంగులు ఎందుకున్నాయి? బోట్లు వదిలిన వారిని వదిలిపెట్టం. కఠిన చర్యలు తప్పవు. దుర్గమ్మ దయతో పెను ప్రమాదం సంభవించలేదు. వరద ప్రాంతాల్లో మంత్రులు, ఉన్నతాధికారులు, అధికారులు పడిన కష్టానికి ప్రాణనష్టం తగ్గించగలిగాం. రాజకీయం ముసుగులోవున్న నేరస్థుల ముసుగు తొలగిస్తా. ప్రజలముందు నిలబెడతా. నేర సామ్రాజ్య విస్తరణకు రాజకీయ ముసుగు తొడిగితే ఊరుకునేది లేదు. సూర్యాస్తమయం అయ్యాక యుద్ధం చేయకూడదనే నియమాలుంటాయి. కానీ, వరదలపై యుద్ధంలో విశ్రాంతిలేకుండా పనిచేశాం కనుకనే.. పరిస్థితిని త్వరగానే సాధారణ స్థితికి తీసుకొచ్చాం.

……………………………………………..

చారిత్రక సౌభాగ్య నిర్మాణం..!

సముద్రం పాలవుతున్న కృష్ణాను ఒడిసిపట్టి `నిత్యం కరవు తాండవించే డెల్టాను సౌభాగ్యవంతం చేయాలన్న ప్రయత్నాలు రెండు శతాబ్దాల క్రితం నాటివి. కృష్ణా నదిపై బెజవాడ వద్ద ఆనకట్ట నిర్మించాలన్న ఆలోచన.. 1792లో బ్రిటీష్‌ అధికారి అలెగ్జాండర్‌ బీట్సన్‌ మస్తిష్కానికి చేరింది. సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వమంటూ కిందిస్థాయి అధికారి మైకెల్‌ టాపింగ్‌ను ఆదేశించారు. సుదీర్ఘ, విస్తృత అధ్యయనాలు జరిపిన టాపింగ్‌.. ఆనకట్ట నిర్మాణ అనివార్యతను బలపర్చారు. నివేదికైతే సిద్ధమైందికానీ, కార్యరూపం దాల్చకుండా అర్థ శతాబ్దంపాటు మూలనపడిరది. 1840ల్లో డెల్టాలో తలెత్తిన తీవ్ర కరవుతో లక్షలాది ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. పశు సంపద కనుమరుగైంది. తీవ్ర క్షామ ప్రభావం ప్రభుత్వ ఆదాయంపైనా పడటంతో.. పరిస్థితులను అధిగమించాలంటే ఆనకట్ట అవసరమంటూ బిటీష్‌ ఇంజనీర్‌ కెప్టెన్‌ ఎడ్వర్డ్‌ బకుల్‌.. పాత ప్రతిపాదనను మళ్లీ తెరపైకి తెచ్చాడు. అప్పటికే ప్రభుత్వంలో చలనం రాకపోవడంతో.. గుంటూరు, కృష్ణా ప్రజలు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. దిగివచ్చిన ప్రభుత్వం.. డీటెయిల్డ్‌ రిపోర్టు ఇవ్వమంటూ సివిల్‌ ఇంజనీరు లెఫ్టినెంట్‌ హెచ్‌ఏ లేక్‌ను ఆదేశించింది. అప్పటికే గోదావరిపై ఆనకట్ట నిర్మాణ పనుల్లోవున్న సర్‌ ఆర్ధర్‌ కాటన్‌పై నమ్మకంతో.. ఆయన మార్గదర్శకత్వంలో రూపొందిన కృష్ణా ఆనకట్ట ప్రతిపాదనలను 1851లో ఆమోదించింది. ఆనకట్ట నిర్మాణం, కాల్వల తవ్వకం పనులు 1852లో మొదలై 1855లో పూర్తయ్యాయి. 170 సంవత్సరాల క్రితమే.. కృష్ణా లోయలో మూడేళ్లలో ఆనకట్ట నిర్మాణం పూర్తి చేశారు. అలా, ఆనకట్ట కింద ఆరు లక్షల ఎకరాలను స్థిరీకరించి సాగునీటి సౌకర్యం కల్పించారు. 1894లో తలుపులను బిగించి, ఆనకట్ట ఎత్తు పెంచడంతో ఆయకట్టు విస్తీర్ణం 8 లక్షల ఎకరాలకు పెరిగింది. 1925లో మరో మూడడుగుల ఎత్తు పెంచడంతో.. ఆయకట్టు 12 లక్షల ఎకరాలకు విస్తరించింది. శతాబ్దకాలంలో డెల్టాను సౌభాగ్యవంతం చేసిన ఆనకట్టకు, 1952లో గండిపడి భారీ నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. అప్పటి మద్రాస్‌ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు బ్యారేజీ నిర్మాణానికి పూనుకోవడంతో.. 1957 డిసెంబర్‌ నాటికి నిర్మాణం పూర్తిచేసి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి చేతులమీదుగా జాతికి అంకితం చేశారు. దీంతో కృష్ణా డెల్టా ఆయకట్టు 13.75 లక్షల ఎకరాలకు స్థిరీకరించబడిరది. బ్యారేజీ నిర్మాణానికి పూనుకున్న ప్రకాశం పంతులుమీద గౌరవంతో ఆయన పేరునే బ్యారేజీకి పెట్టారు. బ్యారేజ్‌ నిర్మాణంతో కృష్ణా, గుంటూరు జిల్లాలు సర్వతోముఖాభివృద్ధి సాధించాయి. అంతటి చారిత్రక నేపథ్యమున్న బ్యారేజీని కుప్పకూల్చడానికి కుట్రలు పన్నడం.. ఏపీ రాజకీయం ఎటుపోతోందన్న భయాందోళనలు తలెత్తక మానవు.

………………………..

అంతటి దుర్మార్గుడు.. జగన్‌

తన స్వార్థ రాజకీయాల కోసం లక్షమంది ప్రజల ప్రాణాలను ఫణంపెట్టిన జగన్‌.. కుట్రనుంచి తప్పించుకోవడానికి పాలకపక్షంవైపు వేలెత్తి చూపుతున్నాడంటూ జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోట్ల యజమానులు తెలుగు దేశం కార్యకర్తలేనంటూ వైసీపీ సాగిస్తోన్న అబద్ధపు ప్రచారాన్ని నిమ్మల తీవ్రంగా తిప్పికొట్టారు. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్ల యజమాని, వైకాపా నాయకుడైన ఉషాద్రి…. తెదేపా వర్గీయుడంటూ మార్ఫింగ్‌, ఎడిటింగ్‌ ఫొటోలతో ప్రచారం చేయడం జగన్‌ పత్రిక, ఛానళ్లకే చెల్లిందన్నది మంత్రి నిమ్మల వ్యాఖ్య. కృష్ణానదిలో మాన్యువల్‌గా ఇసుక తవ్వకాలకు అనుమతించాలంటూ అమరావతి యాంత్రిక ఇసుక పడవల యజమానుల సంఘం ప్రతినిధులు ఇటీవల మంత్రి లోకేశ్‌కు నతిపత్రం ఇచ్చారని, అందులో ఉషాద్రి సైతం ఉన్నాడని, ఆ ఫొటోలో మిగతావారిని ఎడిటింగ్‌లో తీసేసి.. ఉషాద్రికి తెదేపాతో సంబంధాలున్నాయంటూ దుష్ప్రచారం చేయడం వైకాపా నేరపూరిత స్వభావానికి అద్దం పడుతుందన్నారు. బోట్ల యజమాని ఉషాద్రితో ఇసుక అక్రమ తవ్వకాల్లో భాగస్వామిగా ఉన్న కోమటి రామ్మోహన్‌ వైకాపా ఎమ్మెల్సీ తలశిల రఘురాముకు మేనల్లుడని నిమ్మల గుర్తు చేశారు. వీరంతా మాజీ ఎంపీ నందిగం సురేషు అనుచరులన్నది మంత్రి మాట. అనుమతులు లేకపోయినా గత ఐదేళ్లలో బోట్లతో యదేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు చేశారన్నారు. ప్రకాశం బ్యారేజీని కూల్చివేయడానికి జగన్‌ కుట్రలు ఒక్కొక్కటీ వెలుగుచూస్తుంటే.. వాటిని కప్పిపుచ్చుకోవడానికి సాక్షి పత్రికలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యారేజీని ఢీకొట్టాక పోలీసులు గుర్తించేవరకూ యజమానులు ముందుకు రాలేదని.. దీన్నిబట్టి జగన్‌ కుట్ర స్పష్టమవుతోందన్నది నిమ్మల మాట. గత సార్వత్రిక ఎన్నికలలో భారీ ఓటమినిచ్చి జగన్‌ను తీవ్రంగా పరాభవించిన సాధారణ ప్రజలపై కక్షగట్టి.. ప్రకాశం బ్యారేజీని కూల్చేసి ప్రజల ప్రాణం తీయడానికి కుట్ర పన్నారని మంత్రి నిమ్మల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *