ఆంధ్రప్రదేశ్

యుద్ధంలో గెలిచాం.. తరువాత!?

  • October 8, 2024
  • 0 min read
[addtoany]
యుద్ధంలో గెలిచాం.. తరువాత!?

వరద దెబ్బకు విలవిల్లాడిన విజయవాడ `ప్రభుత్వ సహాయక చర్యలతో పూర్తిగా తేరుకుంది. అక్కడితో యుద్ధం ముగిసినట్టా. క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌లో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నిర్వహించిన ‘ఆపరేషన్‌ ఫ్లడ్‌’ ఫలితాలు చూసి.. వరద మిగిల్చిన అపార నష్టాన్ని ముఖ్యమంత్రి అధిగమించిన వైనాన్ని చూసి.. ఇంకేముంటుంది? అని చాలామంది అనొచ్చు.

మరోపక్క `బుడమేరు విలయాన్ని కళ్లారా చూసిన.. చంద్రబాబు పిలుపును అందుకున్న దాతలూ.. సహాయ నిధికి శక్తిమేర విరాళాలు అందించడం వరకూ ఓకే. కాని, భారీ వరద విజయవాడ మహానగరం ముందు వదలివెళ్లిన ప్రశ్నలో.. అసలు యుద్ధం ఇప్పుడే మొదలవ్వాలన్న సమాధానం దాగివుందని చెప్పకుండా ఉండలేం. భవిష్యత్‌లో మరోసారి కనుక వరద విరుచుకుపడితే.. నగరం పరిస్థితి ఏమిటి? అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకముందు చేపట్టాల్సిన చర్యలే `కళ్లముందున్న యుద్ధం. విపత్తు ఏ క్షణాన విరుచుకుపడుతుందో అంచనా వేయడం సులువేమీ కాదు. లిప్తకాలంలో సంభవించే ప్రమాదాన్ని నివారించేందుకు అప్పటికప్పుడు చేయగలిగేదీ ఉండదు. వరద బాధితులను పరామర్శించి.. ప్రభుత్వ సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించిన అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్యాపదేశంగా ప్రస్తావించిన అంశమిదే. ప్రకృతినుంచైనా.. మానవ తప్పిద ప్రమాదమైనా.. వచ్చిన వరద లోపాల్ని ఎత్తిచూపి కళ్లు తెరిచేలా చేసిందన్నది నిజం. దశాబ్దాలుగా పెను నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతంలో దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని బుడమేరు విలయం నొక్కిచెప్పింది. భవిష్యత్తులో ఇంతకుమించిన జల ప్రళయాలొచ్చినా.. ఎదుర్కోవడానికి ఎంత సన్నద్ధంగా ఉండాలో చాటిచెప్పింది.

మారుతున్న కాలంలో.. మహానగరాలు వరద ముప్పు, ముంపులను ఎదుర్కొంటోన్న ఘట్టాలు కళ్లముందు కనిపిస్తూనే ఉన్నాయి. భారీ వర్షాలు, వరదలు సంభవించినపుడు ముంబయి, గుజరాత్‌, హైదరాబాద్‌లాంటి నగరాలు ఎలా విలవిల్లాడాయో చరిత్ర పుటల్లో స్పష్టం. ఇప్పుడు `బెజవాడ వరదతో స్వీయ అనుభవం. కృష్ణానదికి ఒక ఒడ్డునున్న విజయవాడ నగరం శరవేగంగా విస్తరిస్తోంది. మరోఒడ్డున రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతోంది. ఈ రెండు నగరాలకు ముంపు సమస్య తలెత్తకుండా పటిష్ఠమైన రక్షణ కవచం అవసరమన్నదే ప్రస్తుత ప్రాధాన్యతాంశం. సాధారణానికి కాస్త ఎక్కువ వాన కురిస్తేనే విజయవాడలోని వీధులన్నీ కాల్వలవుతున్నాయి. బుడమేరు ముప్పు ఎప్పుడూ పొంచే ఉంటుంది. కృష్ణా నదికి భవిష్యత్తులో భారీ వరదలు పోటెత్తవన్న గ్యారెంటీ లేదు! వీటన్నింటినీ ఎదుర్కొనేందుకు బహుముఖ వ్యూహం అవసరమన్నది నిపుణులు మాట. భారీ ఆర్థిక ప్రణాళికే అయినా.. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా భావించి చేపట్టాని సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనో, ప్రపంచబ్యాంకు వంటి సంస్థల రుణ సహకారంతో మహానగరానికి రక్షణ కవచాన్ని నిర్మించాల్సిన అవసరాన్ని బలంగా ప్రస్తావిస్తున్నారు.

ప్రకాశం బ్యారేజీ ప్రస్తుత నీటి ప్రవాహ సామర్థ్యం 11.9 లక్షల క్యూసెక్కులు. 2009 అక్టోబరు 5న ప్రవహించిన 10.94 లక్షల క్యూసెక్కుల నీరే ఇప్పటి వరకూ రికార్డు. అయితే, సెప్టెంబరు 2న బ్యారేజీనుంచి రికార్డుస్థాయిలో 11.43 లక్షల క్యూసెక్కుల నీరు వదిలారు. నాలుగు గంటలపాటు నిరంతరంగా సాగిన ప్రవాహం.. ఒక దశలో 12 లక్షల క్యూసెక్కులకు చేరుతుందన్న భయాలూ ముసిరాయి. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు మధ్యలో మున్నేరు, కట్టలేరు, వైరా, పాలేరు, కీసర, బుడమేరు వంటి వాగులు వచ్చి కృష్ణాలో కలుస్తాయి. భవిష్యత్‌లో క్యాచ్మెంట్‌ ఏరియాలో భారీ వర్షాలు పడితే వాగులు పొంగి.. ప్రకాశం బ్యారేజీకి ఇప్పటికంటే ఎక్కువ వరద పోటెత్తే ప్రమాదం లేకపోలేదు. ఈ అంచనాల నేపథ్యంలో.. ప్రకాశం బ్యారేజీ డిశ్చార్జ్‌ సామర్ధ్యాన్ని కనీసం 15 లక్షల క్యూసెక్కులకు పెంచేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావిస్తున్నారు. వరద నష్టాల అంచనాకు వచ్చిన కేంద్ర బృందానికి సైతం.. ముఖ్యమంత్రి ఇదే విషయాన్ని విస్పష్టంగా వివరించారు. బ్యారేజ్‌ డిశ్చార్జ్‌ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి తగిన ఆర్థిక సాయం కేంద్రం నుంచి తీసుకోవాలన్నది చంద్రబాబు ఆలోచన. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు కృష్ణా నది పొడవు 80కి.మీ.లకు పైగాఉంది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన 23వ కి.మీ. వద్ద వైకుంఠపురంలో 10 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మించొచ్చు. అది ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తకుండా అడ్డుకోవడంతోపాటు, అక్కడ నిల్వ చేసే నీరు ఈ ప్రాంత సాగు, తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతుంది. బ్యారేజీకి దిగువన 16 కి.మీ.ల వద్ద చోడవరం సమీపంలో 1.70 టీఎంసీల సామర్థ్యంతో ఒకటి, 67 కి.మీ.ల దిగువన బండి కొల్లంక వద్ద 4.70 టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మించుకునే అవకాశముంది. భవిష్యత్‌లో రాజధాని అమరావతికి ముంపు ప్రమాదం లేకున్నా.. కృష్ణా కరకట్టలను బలోపేతం చేయాల్సి ఉంది. భవిష్యత్‌లో వరద ఉధృతి పెరిగినా.. రాజధాని నగర వాసులు ఎలాంటి భయాందోళనలు లేకుండా ధైర్యంగా ఉండాలంటే.. కరకట్టలు బలహీనపడిన ప్రాంతాలను గుర్తించి బలోపేతం చేయక తప్పదు. ప్రకాశం బ్యారేజీ వద్ద 15 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చినా.. రాజధానిలోకి చుక్క నీరు ప్రవేశించకుండా రాజధాని పొడవునా పటిష్టమైన కాంక్రీట్‌ నిర్మాణం మరింత ఉపయుక్తం.

కొండవీటివాగుకు మెరుపులా వచ్చే వరదల నుంచి ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు సీడబ్ల్యూసీ అబ్జర్వేటరీని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. బుడమేరు వాగు పుట్టుకు ప్రదేశం నుంచి కొల్లేరులో కలిసే వరకు అవసరమైన మేరకు వెడల్పు చేయడం, వాగులో పూడిక, ప్రవాహ మార్గంలోని అనధికారిక కట్టడాలు, ఆక్రమణల తొలగింపు.. ఇవన్నీ ప్రభుత్వం ముందున్న సవాళ్లే. అంతకంటేముందు, వెలగలేరు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద బుడమేరు డిశ్చార్జి సామర్ధ్యాన్ని 25 వేల క్యూసెక్కులకు పెంచడం, బుడమేరు డైవర్షన్‌ కెనాల్‌ సామర్థ్యాన్ని 40 వేల క్యూసెక్కులకు పెంచడం, గత ప్రభుత్వం నిలిపివేసిన బుడమేరు విస్తరణ పనుల్ని తక్షణం పూర్తి చేయడంలాంటి చర్యలతో భవిష్యత్‌ ముప్పునుంచి మహానగరాన్ని సంరక్షించుకునే అవకాశం ఉంటుంది.

ఇటీవల బుడమేరు విధ్వంసం చూశాక చాలామంది ఆక్రమణల గురించి మాట్లాడుతున్నారు. కొల్లేరు చేపల చెరువులతో నిండిపోయిందని అంటున్నారు. వీటితో పాటు మరో ముఖ్య అంశం ఉంది. మెట్ట ప్రాంతంలో వాననీరు లోయవాగు, పులివాగు, పడమటివాగు, కోతులవాగు లాంటి ఎన్నో చెరువులను నింపాకగానీ బుడమేరులోకి చేరదు. అలాంటి చెరువుల్లో కొన్ని పూడుకుపోయాయి. మరికొన్ని ఆక్రమణకు గురయ్యాయి. వాటికి పూర్వస్థితి కల్పిస్తే అవి పెద్దనదులపై ప్రాజెక్టుల్లా పనిచేసి కింది ప్రాంతం ముంపునకు గురికాకుండా కాపాడతాయి. భూగర్భ జలశాఖను ఏపీ సర్కారు గతంలో భూగర్భ జలం, జలగణన శాఖగా మార్చి వాటర్‌ ఆడిట్‌ చేయాలని సంకల్పించింది. ఈ శాఖను మరింత బలోపేతం చేసి వాగులు, వంకల అధ్యయనానికి, వాటర్‌ ఆడిట్‌ చేయడానికి, వరద నియంత్రణకు సమాచారమిచ్చే వ్యవస్థగా తీర్చిదిద్దాలి. భౌగోళిక పరిస్థితుల్లో మార్పులతో విపత్తులు ముంచుకొస్తున్న తరుణంలో.. ఉపద్రవాలు దాపురించకమునుపే ప్రభుత్వం పూర్తి చేయాల్సిన అతి పెద్ద యుద్ధం ఇదే!

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *