అందుకే.. అతను చంద్రన్న!
కొద్దిరోజుల క్రితం…
సుదీర్ఘంగా సాగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో…
మాజీ సైనికులు, యుద్ధ వికలాంగ సైనికులు, యుద్ధ వితంతువులు, మాజీ సైనిక వితంతువులు, వారిపై ఆధారపడినవారి స్వయంసమృద్ధి, సహాయ పునరావాసానికై ఆంధ్రప్రదేశ్ ఎక్స్-సర్వీస్‌మెన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం లభించింది. కార్పస్ ఫండ్‌గా రూ.3కోట్లు ఇవ్వాలన్న చర్చ నడిచింది. సంబంధిత శాఖామంత్రి, ఇతర మంత్రుల చర్చను సాంతంవిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు `ప్రతిపాదనకు ఓకే అన్నారు. కాని, ముఖ్యమంత్రి ప్రకటించిన కార్పస్ ఫండ్ రూ.మూడు కోట్లు కాదు, రూ. 10 కోట్లు! మంత్రుల ముఖంమ్మీద చిన్న షాక్, పెద్ద చిర్నవ్వు!
ఈ ప్రస్తావన ఎందుకంటే.. చిన్న విషయంలోనే పెద్ద నిర్ణయం తీసుకున్న చంద్రబాబు… కొండంత కష్ట సమయంలో ఇంకెలాంటి నిర్ణయం ప్రకటిస్తారో చెప్పడానికే. అది `వరద ప్రభావిత ప్రాంతాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన పరిహార సాయం చూసి తెలుసుకోవచ్చు. కొన్ని సందర్భాలలో చంద్రబాబు చేతికి ఎముకుండదు. ప్రజలు కష్టంలోవున్నారంటే చేసే సాయానికి అసలు లెక్కేవుండదు. కష్టం తెలిసిన మనిషి పాలకుడైతే.. ప్రజలకు కష్టాల బాధుండదు. ఎవరికి ఎప్పుడు ఏది ఎలా ఇవ్వాలో.. ఎంతివ్వాలో చంద్రన్నకు తెలిసినంతగా చాలామందికి తెలీదు. అందుకే `ఆయన చంద్రన్నయ్యాడు. మనసెరిగిన వాళ్లంతా గౌరవంగా అలాగే పిలుచుకుంటారు.
అనూహ్య విపత్తు బెజవాడను ఈడ్చికొట్టింది. గత పాలకుల పాపాలకు ఫలితంగా విజయవాడ పీకల్లోతు కష్టంలో మునిగింది. అంతకుముందు ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన రాక్షస పాలకులు.. ఏపీ సంపత్తిని పూర్తిగా దోచేశారు. అసమర్థ విధానాలు, నిర్లక్ష్య నిర్ణయాలతో ఖజానాను ఖాళీ చేసి.. రాష్ట్రాన్ని పీకల్లోతు ఆర్థిక కష్టాల్లోకి నెట్టారు. విప్తతుల నిర్వహణకై కేంద్రం ఇచ్చిన కలామిటీ ఫండ్ దాదాపు రూ.2వేల కోట్లు ఖర్చుపెట్టేసి.. వాటికి లెక్కలు చూపకపోవడం వల్ల కేంద్రంనుండి రావాల్సిన నిధులూ ఆగిపోయాయి. చేతిలో చిల్లిగవ్వలేని సమయంలో.. ఇంత భారీ విపత్తును చంద్రన్న ఎలా ఎదుర్కొంటారన్న ప్రశ్నలు… ప్రజల మస్తిష్కాలను తొలిచేశాయి. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు తొణకలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరిస్తూనే.. భయం లేదు. నేనున్నా అంటూ ధైర్యం చెప్పారు. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాల్సిన మంత్రి పయ్యావుల కేశవ్‌కు ఆలోచనాత్మక ఆదేశాలిచ్చి.. ప్రజలను రక్షించుకోడానికి వరదలోకి దిగిపోయారు. పదిరోజులపాటు వరదలోనే ఉన్నారు. వరద బాధితుల చెంతనే నిలబడ్డారు. సూర్యుడు ఉదయించి మళ్లీ సూర్యోదయం వరకూ.. తానొక ముఖ్యమంత్రినన్న హోదాను విస్మరించి.. రాష్ట్ర ప్రజా కుటుంబానికి పెద్దన్నగా, చంద్రన్నగా అగ్రభాగాన నిలబడ్డాడు. యుద్ధప్రాతిపదికన ఫ్లడ్ ఆపరేషన్ మొదలైంది. తీసుకోవాల్సిన సహాయ చర్యలు ఆరంభమయ్యాయి. ఒకపక్క బాధితుల క్షుద్భాధ తీర్చే ఏర్పాట్లు సాగిపోయాయి. మరోపక్క ప్రమాదంలోవున్న ప్రజలను రక్షించేందుకు వరదలోకి వాహనాలు వెళ్లిపోయాయి. ఏ ఒక్క ప్రాణం వరద పాలవ్వకుండా చూడాలన్న తపనతో హెలీకాఫ్టర్లు ప్రభావిత ప్రాంతాలపై చక్కర్లు కొట్టాయి. వార్డులవారీ బాధ్యతలు భుజానికెత్తుకున్న మంత్రులూ వరదలోకి దిగిపోయారు. వాళ్లవెనుక కేంద్ర సర్వీసు అధికారుల నుంచి వార్డుస్థాయి సిబ్బంది వరకూ ఫ్లడ్ ఆపరేషన్‌లో భాగమైపోయారు. పనులు చకచకా చక్కబెట్టడానికి `వాటంతట అవే నిధులు సమకూరిపోయాయి. ఎలా? అంటే ఆన్సర్ పజిలే కావొచ్చు. కాస్త బుర్రపెట్టి ఆలోచిస్తే.. ఎలా? అన్న ప్రశ్నకు సమాధానం `చంద్రన్న!
ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే `వరదను జయించేశాం కదా! అని చంద్రబాబు ఆ ఘట్టం దగ్గరే ఆగిపోలేదు. వరద సహాయక చర్యలు సాగుతున్న సమయంలోనే.. నష్టపోయిన బాధితులకు ఎలా న్యాయం చేయాలి? ఎంత ఇవ్వగలిగితే బాధితుల భారీ నష్టాలకు కాస్తైనా ఉపశమనం ఇవ్వగలమనే ఆలోచించారు. బాధితుల కష్టం తన కష్టమేనన్నట్టు భావించి.. వరద నష్టాలను స్వీయపర్యవేక్షణలో లెక్కలు వేయించిన చంద్రబాబు.. తాజాగా ప్రభుత్వ పరిహారాన్ని ప్రకటించి విస్మయానికే గురి చేశారు. బహుశ, ఇంత ఉదార సాయాన్ని ఇంతకుముందు ఏ ప్రభుత్వం ప్రకటించి ఉండదు. ఇంకొంచెం గట్టిగా చెప్పాలంటే.. మునుపటి చంద్రబాబు ప్రభుత్వాల పాలనలోనే విపత్తుల పరిహారం ఇంత ఉదారంగా ప్రకటించి ఉండరు. ఇది కాదనలేని వాసవ్తం. అందుకే `వరద సాయం ప్రకటించేముందు ముఖ్యమంత్రి చంద్రబాబు స్థిరంగా ప్రకటించిన ఒక్క మాటను ఇక్కడ ప్రస్తావించుకోవాలి. అది `ఇది అత్యుత్తమ ప్యాకేజీ!
రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా కృష్ణా, బుడమేరు వరదలు సంభవించి విజయవాడ నగరాన్ని అతలాకుతం చేసినప్పటికీ, కేవలం పదిరోజుల్లో అందరి సహకారంతో నగరంలో పరిస్థితులను సాధారణ స్థితికి తేవడం చంద్రబాబు సంకల్పానికి, సమర్థతకు తార్కాణం. వరదవల్ల నష్టపోయిన ప్రతి ఒక్క కుటుంబాన్నీ అన్ని విధాలా ఆదుకుంటానని ఆదినుంచీ చెప్తూ వచ్చిన చంద్రన్న.. ఇచ్చిన మాట ప్రకారం అత్యుత్తమ ప్యాకేజీ ప్రకటించారు.
భారీస్థాయిలో కురిసిన వర్షాలవల్ల కృష్ణానదిలో 11.43 లక్షల క్యూసెక్కుల వరద రావడం రాష్ట్ర చరిత్రలో రికార్డు. వరదతోపాటు బుడమేరు పొంగడం కూడా ముంపునకు కారణమైంది. ఏడురోజులపాటు ఏడు అడుగులమేర నీరు పల్లపు ప్రాంతాల్లో నిలిచిపోయింది. గతంలో ప్రారంభించిన బుడమేరు ఆధునీకరణ పనులను వైసీపీ సర్కారు నిర్లక్ష్యం చేయడం కూడా మరో కారణం. బుడమేరు పరీవాహకం కబ్జాల కోరల్లో చిక్కడం ఇంకో కారణం. ఇన్ని కారణాలను, సమస్యలను అధిగమించి తగు చర్యలు తీసుకోవడంలో విజయం సాధించాం. నాతోపాటు మంత్రివర్గం, ఉన్నతాధికారుల రేయింబవళ్ల పర్యవేక్షణ సాధారణ స్థితికి రావడానికి కారణం. వరద విప్తతునుండి ప్రజలను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం చేసిన అవిరళ కృషిని దేశం గుర్తించింది. పలువురు దాతలు స్వచ్చందంగా ముందుకువచ్చి పెద్దఎత్తున విరాళాలివ్వడం నా జీవితంలో మరపురాని సంఘటన.
విజయవాడ నగరం 32 వార్డులు, 179 సచివాలయాల పరిధిలోని వరద బాధితులను అన్నివిధాలా ఆదుకుని ఆర్థిక సాయం అందించడంతో పాటు దెబ్బతిన్న గృహోపకరణాల మరమ్మతుకు తగు చర్యలు తీసుకుంటున్నాం. గ్రౌండ్ ప్లోర్ నీటి మునిగిన వాళ్లందరికీ రూ.25 వేల ఆర్థికసాయం అందిస్తాం. ఒకఇంటికి రూ.25 వేలు ఇవ్వడమనేది చరిత్రలో ఇదే మొదటిసారి. ఒకప్పుడు రూ.4వేలు ఇచ్చిన పరిస్థితి ఉండేది. వరద సమయంలో ఏ ఒక్కరికీ భోజనాల విషయంలో లోటుచేయలేదు. రాయితీపై కూరగాయలు, 25 కేజీల బియ్యం, కేజీ పామాయిల్, కేజీ పంచదార, కేజీ పప్పు, రెండు కేజీల ఉల్లిపాయలు, రెండుకేజీల ఆలుగడ్డలు ఇచ్చాం. ఇప్పుడు ప్రతి ఇంటికి రూ.25 వేల ఆర్థికసాయం ఇవ్వనున్నాం. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, ఆపైన అంతుస్తుల్లో ఉండే అందరికీ రూ.10 వేల ఆర్థికసాయం. వరదలో మునిగిన ఇతర ప్రాంతవాసులకూ రూ.10 వేలు సాయం అందిస్తాం. కిరాణా షాపులు, టీ కొట్లువంటి వారికి రూ.25 వేల సాయం. రిజిస్టర్ చేసుకున్న ఎంఎస్ఎంఈల టర్నోవర్ రూ.40 లక్షలకంటే తక్కువుంటే.. వాళ్లు జీఎస్టీ ఫైల్ చేయాల్సిన పనిలేదు. జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోనివాళ్లకి రూ.50 వేలు ఇస్తాం. అదే సమయంలో ఎంఎస్ఎంఈలు రూ.40 లక్షల నుంచి రూ.1.5 కోట్లు టర్నోవర్వుంటే రూ.లక్ష పరిహారమిస్తాం. అలాగే రూ.1.5 కోట్లు ఆపైనవుంటే రూ.1.5 లక్షలు ఇస్తాం. టూవీలర్స్‌కు ఇన్సూరెన్స్ క్లెయిమ్, రిపేర్లు చేసుకునేందుకు సహకరిస్తాం. ఇప్పటివరకు రూ.71.50 కోట్లకు క్లెయిమ్‌కు సంబంధించి 9,088 వెహికల్స్ క్లెయిమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీటిలో 2,345 క్లెయిమ్స్ సెటిలయ్యాయి. రూ.6.21 కోట్లు అందచేశాం. 6,748 క్లెయిమ్స్ పెండిరగ్ ఉన్నాయి. ఇందుకు రూ.65.29 కోట్లు చెల్లించాల్సి ఉంది.

రైతులకు పూర్తిస్థాయి భరోసా..
రైతుకు సాయంగా.. హెక్టార్ వరికి రూ.25 వేలు, ఎకరాకు రూ.10 వేలు సాయం ఇస్తున్నాం. హెక్టార్ పత్తికి రూ.25 వేలు, వేరుశనగకు రూ.25 వేలు, హెక్టార్ చెరకుకు రూ.25 వేలు, హెక్టార్ పొగాకుకు రూ.15 వేలు, హెక్టార్ మొక్కజొన్న, రాగికి రూ.15 వేలు ఆర్థికసాయం అందిస్తాం. హెక్టార్ సోయాబీన్, పొద్దుతిరుగుడు, పొగాకుకు రూ.15 వేలు. జనపనార, కొర్రలు, సామలకు రూ.15 వేలు, పసుపు, అరటికి రూ.35 వేల చొప్పున ఆర్థికసాయం నిర్ణయించాం. కూరగాయలకు రూ.25 వేలు, మిరపకు రూ.35 వేలు, బొప్పాయికి రూ.25 వేలు, టమాటకు రూ.25 వేలు, జామకు రూ.35 వేలు, పూలకు రూ.25 వేలు, ఉల్లిపాయ రూ.25 వేలు, నిమ్మకు రూ.35 వేలు సాయం అందించనున్నాం. మామిడికి రూ.35 వేలు, కాఫీకి రూ.35 వేలు సాయం. పుచ్చకాయకు రూ.25 వేలు, నర్సరీకి రూ.25 వేలు, దానిమ్మకు రూ.35 వేలు, సపోటకు రూ.35 వేలు, డ్రాగన్ ఫూట్‌కు రూ.35 వేలు, పామాయిల్ చెట్టుకు రూ.1500, సెరీకల్చర్‌కు రూ.25వేలు, కొబ్బరి చెట్టుకు రూ.1500సాయం అందిస్తాం. పశునష్టం జరిగిన వారినీ ప్రభుత్వం ఆదుకుంటుంది. ఒక్కో కోడికి రూ.100, పశువులకు రూ.50వేలు, ఎద్దులకు రూ.40వేలు. దూడలకు రూ.25వేలు, గొర్రెలకు రూ.7500 అందిస్తాం. షెడ్డు ధ్వంసమైతే రూ.5వేలు, ఎడ్ల బండ్లు కోల్పోయిన వారికి కొత్తవి ఇస్తాం. మత్స్యకారులనీ ప్రభుత్వం ఆదుకుంటుంది. ఫిషింగ్ బోట్, వల పాక్షికంగా దెబ్బతింటే రూ.9 వేలు, పూర్తిగా పాడైతే రూ.20 వేలు ఇస్తాం. వరదల్లో నష్టపోయిన ప్రతి చేనేత కార్మికులకి రూ.25 వేలు ఇస్తాం. నష్టపోయిన 2 వీలర్స్‌కి రూ.3 వేలు, ఆటోలకి రూ.10 వేలు ఇస్తూ.. తోపుడు బళ్ళు ఎంత రేటైనా కొత్తవి కొనిస్తాం. వరదల వల్ల రాష్ట్రంలో మొత్తం 2,72,272 కుటుంబాలు బాధితులుగా మారయి అని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
