సుశిక్షిత యుద్ధ సైనికులు!
విపత్తు తలెత్తినపుడే.. ఎదుర్కొనే సామర్థ్యం పదునెక్కుతుంది. గట్టుతెగిన బుడమేరుకు ఎటు పోవాలో పాలుపోక ఊరిమీద పడిరది. విలయంలో చిక్కుకున్న విజయవాడ అల్లల్లాడుతుంది. ఈ పాపం.. గత పాలకులదే కావొచ్చు. కానీ, ప్రజలు కష్టంలో ఉన్నారు. సమాచారం తెలియగానే క్షణం ఆలోచించకుండా.. నాయకుడే వరదకు ఎదురెళ్లాడు. ఆయన కేబినెట్లో సహచర మంత్రులం.. ఈమాత్రం బురదలోకి దిగలేమా? విజయవాడ మునకకు కారణం బుడమేరు మళ్లింపు కాల్వకు పడిన గండ్లే. మునిగిన విజయవాడను పైకి తీయాలంటే.. పడిన గండ్లు పూడ్చడం ఒక్కటే మార్గం. దగ్గరుండి బాధ్యతగా చేయిస్తేనే ఏ పనైనా త్వరగా పూర్తవుతుందన్నది ముఖ్యమంత్రి నమ్మకం. చంద్రబాబు నుంచి నేర్చుకున్న ఆ స్ఫూర్తినే అమలుచేస్తున్నా. గండ్లు పూడ్చాకే గట్టెక్కుతా. నగరానికి తిరిగొస్తా.
బురదపాలైన బుడమేరు గట్టుమీద నిలబడి.. నిలువునా తడుపుతున్న వర్షాన్ని లెక్కచేయకుండా.. యుద్ధ సైనికుడిలా గండ్లు పూడ్చివేత ఆపరేషన్స్‌లో నిమగ్నమైన నాయకుడి మాటలివి. ఆయనెవరో కాదు.. జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు. నాయకుడి ఆదేశాలు శిరసావహించి.. మునిగిన విజయవాడ మరింత వరదలో కూరుకుపోకుండా గట్టుకాసిన హీరో. గండ్లు పూడ్చివేతను దిగ్విజయంగా పూర్తి చేయించిన కర్తవ్య నిర్వాహకుడు. శభాష్ రామానాయుడు.
జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్ఫూర్తితో రేయింబవళ్లూ వరద నియంత్రణ చర్యలను పర్యవేక్షించారు. క్షేత్రస్థాయిలో సిబ్బందిని పరుగులు పెట్టించారు. బుడమేరు గండ్ల పూడ్చివేతలో మంత్రి నిమ్మల రామానాయుడు కృషి… ఐటీ మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణ.. ఇద్దరూ సమన్వయంతో తీసుకున్న బాధ్యత… నిర్వర్తించిన విధానం.. సాధించిన విజయం.. అన్నీ వేటికవే.
విజయవాడను వణికించిన విలయాన్ని చూసి తొణకలేదు, బెణకలేదు. ముంపునుంచి విజయవాడ నగరం తేరుకునేవరకూ వాళ్లకు అప్పగించిన బాధ్యతలనుంచి పక్కకు జరగలేదు. గండ్లు పూడ్చేశామన్న సమాచారంతోనే తిరిగి ముఖ్యమంత్రిని కలుస్తానంటూ.. బుడమేరు గట్టుపై నిమ్మల, కంట్రోల్ రూంలో నారా లోకేష్ భీóష్మించారు. గండ్లు పూడ్చివేత ఆపరేషన్స్ పర్యవేక్షిస్తూ.. రేయింబవళ్లు గడిపారు. మొదట క్షేత్రస్థాయిలో నిలబడిన మంత్రి నిమ్మల కృషిని ఎక్కువ చేసే చెప్పుకోవాలి. కాలికింద బురద పాదాలను తినేస్తున్నా.. ఎడతెరిపిలేని వాన నిలువునా తడిపేస్తున్నా.. రామానాయుడి దృష్టంతా గండ్ల పూడ్చివేతపైనే. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకున్నా.. ఎంత త్వరగా పూర్తిచేస్తే విజయవాడ అంత త్వరగా తేరుకుంటుందన్న ఆలోచనే. భారీ వర్షాలు.. పోటెత్తిన కృష్ణా వరదతో `బుడమేరు మళ్లింపు కాలువకు భారీ గండ్లు పడిన సంగతి తెలిసిందే. వెలగలేరు వద్ద హెడ్ రెగ్యులేటరీ నుంచి దాదాపు 60 వేల క్యూసెక్కులకు పైగా వరద ఒకేసారి వచ్చిపడిరది. ఇదంతా బుడమేరు డైవర్షన్ కాలువ (బీడీసీ), డ్రెయిన్ల ద్వారా ప్రవహించింది. దీంతో బీడీసీకి ఎడమవైపు మూడు ప్రాంతాల్లో.. కుడివైపు ఏడు ప్రాంతాల్లో గండ్లు పడ్డాయి. ఎడమవైపున పడిన గండ్ల ప్రభావంతో వరద రాయనపాడు మీదుగా సింగ్నగర్పై దండెత్తింది. బీడీసీ కాలువ సామర్థ్యం 15వేల క్యూసెక్కులే. బుడమేరు డ్రెయిన్ సామర్థ్యం 17,500 క్యూసెక్కులు. అదనంగా మూడు రెట్ల ప్రవాహం రావడంతో విజయవాడ తలమునకలైంది! గట్టుతెగిన వరద.. విజయవాడ నగరంతోపాటు దిగువనున్న గ్రామాల్లోకి, పంట పొలాల్లోకి పోటెత్తింది. బుడమేరు పరిస్థితిని చక్కదిద్దే ప్రత్యేక బాధ్యతలు మంత్రులు నిమ్మల రామానాయుడు, నారా లోకేష్ భుజస్కందాలపై మోపారు ముఖ్యమంత్రి చంద్రబాబు. క్షేత్రస్థాయిలో రామానాయుడు.. లైవ్ డ్రోన్ సాయంతో కంట్రోల్ రూంనుంచి వర్చ్యువల్ పర్యవేక్షణా బాధ్యత తీసుకున్న నారా లోకేష్. అలా.. వరద నియంత్రణ చర్యలు వేగవంతమయ్యాయి. 24 గంటలు తిరిగేసరికి.. ఈలప్రోలు, కవులూరు వద్ద గండ్లకు గట్టువేసేసింది ఇద్దరి మంత్రుల సారథ్యంలోని ఆపరేషన్ బుడమేరు టీం. రాయనపాడు నుంచి సింగ్‌నగర్ వైపు వరద పోటెత్తగా, ఆ ప్రాంతంలోని మూడు భారీ గండ్లను పూడ్చే పనుల్లో సమర్థతకు పదునుపెట్టారు. అడుగుతీసి అడుగేయలేనంత బురద కారణంగా.. వాహనాలు వెళ్లలేని పరిస్థితి. క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప.. ప్రణాళిక రూపొందించలేమని అర్థం చేసుకున్న రామానాయడు.. సిబ్బందితో కలిసి కాలినడకన గండ్లుపడిన ప్రదేశాలకు వెళ్లారు.
అక్కడినుంచే మొదలైంది అసలు యుద్ధం. తిండీ తిప్పలూ చూసుకోలేదు. వాన కురుస్తున్నా లెక్క చేయలేదు. గంటగంటకూ వరద పోటెత్తుతున్నా భయపడలేదు. చీకట్లు కమ్ముకున్నా విశ్రమించలేదు. మొత్తానికి.. మంత్రి రామానాయుడు బుడమేరు కాల్వ గట్లనుంచి కదల్లేదు. ఆపరేషన్‌లో పాల్గొన్న ఆర్మీతో కలిసిపోయాడు. హెచ్డీఆర్ఎఫ్ దళాలతో పనిలోకి దిగిపోయాడు. కట్టపైనే భోజనం. కరకట్టపైనే కునుకు. సీఎం చంద్రబాబు విజయవాడలో అధికారులతో సమీక్షిస్తుంటే, మంత్రి క్షేత్రస్థాయిలో తిరిగారు. వేరే ప్రాంతాల్లో వరద బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. సమయం దొరికిన మంత్రులు నిమ్మలకు సహకరించారు. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆయన వెంటున్నారు. మరోవైపు మంత్రి లోకేశ్ వర్చ్యువల్ పరిశీలనతో సిట్యుయేషన్ షేర్ చేస్తూ.. గండ్ల పూడ్చివేత పనులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ వచ్చారు. ఆ సమయంలోనే తన సంకల్పాన్ని గుర్తు చేసుకున్నాడు రామానాయుడు. విజయవాడ మునకకు కారణం బుడమేరు మళ్లింపు కాల్వకు పడిన గండ్లు. వీటిని పూడ్చితేనే నగరానికి ఉపశమనం. దగ్గరుండి చేయిస్తేనే, ఏ పనైనా త్వరగా పూర్తవుతుందన్నది ముఖ్యమంత్రి నమ్మకం. అదే స్ఫూర్తిని పాటిస్తున్నా. గండ్లు పూడ్చిన తర్వాతే గట్టెక్కుతా. నగరానికి వస్తానన్న రామానాయుడు.. ఇచ్చిన పనిని పూర్తిచేసిగాని నగరానికి తిరిగి రాలేదు.
ఆరు రోజులు గట్టు వదల్లేదు..
ఆరు రోజులపాటు నిద్రాహారాలు మాని బుడమేరు గట్టుపైనే ఉన్నాం. బుడమేరుకు పడిన మూడు గండ్లను విజయవంతంగా పూడ్చగలిగామని సంతోషంగా ఆ క్షణాలు గుర్తు చేసుకున్నారు జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు. ఆరు రోజులపాటు నిద్రాహారాలు మాని బుడమేరు గట్టుపైనే ఉన్నాం. రెండోదశలో వరదనీరు పెరిగినా తట్టుకునేలా మంత్రి నారా లోకేశ్ సూచన మేరకు గట్లు ఎత్తు పెంచే పనులు పూర్తిచేశాం. మళ్లీ వర్షాలు పడి ఆకస్మిక వరద వచ్చినా తట్టుకునేలా బుడమేరు గట్లను బలోపేతం చేశాం. వారంపాటు పంట పొలాలు చెరువులను తలపించాయి. ఆ దృశ్యాలు చూస్తూ తట్టుకోలేకపోయాం. అదే మాలో కసి పెంచింది కూడా. వారం యుద్ధం తరువాత గండ్లు పూడ్చడంతో పొలాలు బయటపడ్డాయి. బుడమేరు పరీవాహక ప్రాంతంలో మళ్లీ వర్షాలు పడి ప్రవాహం పెరిగే అవకాశం ఉందన్న సమాచారం నేపథ్యంలో.. పనులు పూర్తైన తరువాతా అక్కడినుంచి కదల్లేకపోయాం. 8వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చే అవకాశం ఉందన్న సమాచారంతో అలెర్టవ్వడం కూడా పరిస్థితిని మన నియంత్రణలోకి తెచ్చుకోగలిగాం. గండ్లు పూడ్చివేతతో విజయవాడ దిగువ ప్రాంతాలకు బుడమేరు వరద నీరు ఆగింది. ఆ తరువాతే.. జక్కంపూడి, సింగ్‌నగర్, నిడమానూరు వరకు నిలిచిపోయిన నీటిని కొల్లేరుకు పంపేలా చర్యలు చేపట్టి విజయం సాధించాం అని గుర్తు చేసుకున్నారు మంత్రి నిమ్మల.
చివరిగండి పూడ్చివేత సాహసమే..
బుడమేరు గండ్లు పూడ్చివేత పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయగలిగింది సీబీఎన్ టీం. కాకపోతే.. మూడో గండి పూడ్చివేత పనులు పూర్తి చేయడానికి ఆపరేషన్ టీం ఒక యుద్ధమే చేసింది. నాలుగు రోజులపాటు ఆగండి నుంచే 30నుంచి 40వేల క్యూసెక్కుల వరదనీరు విజయవాడలోని రాయనపాడు, అజిత్‌సింగ్ నగర్ తదితర ప్రాంతాలను ముంచెత్తింది. బుడమేరు మూడోగండి పడిన ప్రాంతానికి 6వ మద్రాస్ రెజిమెంట్ నుంచి 120మంది ఆర్మీ సిబ్బంది దిగారు. తాత్కాలికంగా ఇనుప రాడ్డులతో వంతెనల్లాగా నిర్మాణం చేసి (గాబియన్ బాస్కెట్) దాంట్లో రాళ్లు వేసి గండిని పూడ్చే ప్రక్రియను అమలుచేసి విజయం సాధించారు. అలా.. వారం తరువాత డైవర్షన్ కాల్వకు పడిన మూడు భారీ గండ్లను ఎట్టకేలకు పూడ్చేశారు. గండ్లను సమర్థంగా పూడ్చేయడమే విజయవాడ నగరానికి కొంత ఊరట. చాలా ప్రాంతాల్లో వరద నీరు మరుసటి రోజుకే తగ్గింది. లోతట్టు ప్రాంతాల్లో ఒకటి నుంచి రెండు అడుగుల వరకు నిలిచిన నీటిని 300వరకు మోటార్లువాడి తోడేశారు. మొత్తంమ్మీద ఆపరేషన్ బుడమేరు దిగ్విజయంగా పూర్తి చేసి.. విజయవాడను ముంపునుంచి పైకి తీయగలిగారు. ఇంతటి యుద్ధంలో కనిపించే సైనికుడు నిమ్మల అయితే..కనిపించని ఆరెండో హీరో నారా లోకేష్. తనకు అప్పగించిన పనిని అంత వేగంగా మంత్రి నిమ్మల పూర్తి చేయడానికి.. కనిపించని చోదకశక్తినిచ్చింది నారా లోకేషే. ముఖ్యమంత్రి, ప్రజల ప్రశంసలతో ఇద్దరూ ఇద్దరే అనిపించుకున్నారు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు.
