ఆ గెలుపు.. నాది కాదు మాది!
ప్రకాశం బ్యారేజీని కూల్చి లక్షమందికి పైగా ప్రజలను చంపాలనుకున్నాడు జగన్. విపత్తులో ఉన్నపుడు వికృత రాజకీయాన్ని ప్రదర్శించాలనుకున్న జగన్ కుట్రలు పారలేదు. అతని పైశాచిక రాజకీయ ఆటలు ఎంతొకాలం సాగవు. అధికారం అండతో.. ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసింది జగనే. 50మందిని చంపేసి.. ఐదూళ్లు నామరూపాలు లేకుండా చేసిన జగన్ దురాగతాలు అంచనాలకు అందవు. ఇప్పుడు.. ప్రజలు, ప్రభుత్వం విలయంతో యుద్ధం చేస్తుంటే.. ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజీని కూల్చేసి విజయవాడ సహా లంక గ్రామాలను నామ రూపాల్లేకుండా చేయాలని చూశాడు. లక్షలాది ప్రజలను జలసమాధి చెయ్యాలనుకున్న జగన్ కుట్ర బట్టబయలైంది. మేన్ మేడ్ డిజాస్టర్‌కు కుట్ర చేసిన జగన్.. మూల్యం చెల్లించక తప్పదు.

ఆ గెలుపు..
నాది కాదు మాది!
విధ్వంస రాజకీయాలకు చరమగీతం పాడి.. గద్దెనెక్కిన కొద్ది రోజుల్లోనే బుడమేరు ప్రళయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది ఎన్డీయే సర్కారు. ఎడతెరిపిలేని వాన బెజవాడ నెత్తిన కుమ్మరిస్తే.. గత పాలకుల నిర్లక్ష్యానికి బలహీన పడిన కరకట్టలు కదిలిపోయాయి, కరిగిపోయాయి. దుష్ఫలితం.. బెజవాడమీదకు బుడమేరు ఉరకలెత్తింది. మహా విలయంగా ముంచేసింది. ప్రభుత్వంలో పూర్తిగా కుదురుకోకముందే ఎదురుపడిన విపత్తును సమర్థంగా ఎదుర్కోవడంలో `అనుభజ్ఞుడైన చంద్రబాబు.. అనన్యసామాన్య పనితనాన్ని ప్రదర్శిస్తే.. వరదపై యుద్ధానికి సేనాపతిగా నిలబడిన ఐటీ మంత్రి నారా లోకేష్ సైలెంట్ ఆపరేషన్‌తో విజయం సాధించారు. అటు ముఖ్యమంత్రికి సమన్వయంగా ఉంటూ.. ఇటు కేబినెట్ సహచరులను సమన్వయపర్చుకుంటూ, సాంకేతికత సాయంతో `ఎన్డీయే సాధించిన విజయానికి కీలక పాత్ర పోషించారు. వరదపై సాగిన పదిరోజుల యుద్ధంలో అహర్నిశలూ శ్రమించిన ఐటీ మంత్రి లోకేష్‌తో చిన్న చిట్‌చాట్.
ప్రశ్న : సార్వత్రిక ఎన్నికల యుద్ధంలో తెదేపా సేనాధిపతిగా పార్టీని గెలిపించారు. పదిరోజుల క్రితం వరదపై సాగించిన యుద్ధంలోనూ సేనాధిపతిగా నిలబడి ప్రభుత్వాన్నీ గెలిపించారు. పార్టీలో.. ప్రభుత్వంలో కీలక నేతగా మీకు ఏమనిపిస్తుంది?
జవాబు : సమష్టి కృషి. అదే.. మా విజయ రహస్యం. ముఖ్యమంత్రి నుంచి కార్యకర్త వరకు అందరం సమన్వయంతో పనిచేయడంతోనే అప్పుడూ.. ఇప్పుడూ విజయం సాధించాం. భారీ వరదలో ప్రాణ నష్టాన్ని నివారించగలిగాం.
ప్రశ్న: విపత్కర పరిస్థితులు తలెత్తినపుడు క్షణం ఆలోచించకుండా కార్యక్షేత్రంలోకి దిగే నాయకుడు చంద్రబాబు. అపార అనుభవజ్ఞుడైన నాయకుడితో క్రైసిస్ టైంలో కలిసి పనిచేయడం.. ఎలా అనిపించింది. ఆయన నుంచి ఏం నేర్చుకోవాల్సింది ఉంది?
జవాబు : ఎటువంటి సవాళ్లనైనా ధీటుగా ఎదుర్కోవడం చంద్రబాబు గారికి వెన్నతో పెట్టిన విద్య. 74 ఏళ్ల వయసులో ఆయన ప్రజల కోసం పడుతున్న తపన మా అందరికీ స్పూర్తిదాయకం. ఆయన నుంచి ఎంతనేర్చుకున్నా.. నేర్చుకోవాల్సింది చాలా ఉన్నట్టే అనిపిస్తుంది.
ప్రశ్న : బెజవాడ వరదను అధిగమించడంలో అహరహం శ్రమించారు. పదిరోజులపాటు ప్రజల కష్టాన్ని దగ్గరుండి చూశారు. ఆ ప్రయాణంలో మిమ్మల్ని బాగా కదిలించిన అంశం?
జవాబు : వరద ప్రమాదకరస్థాయిలో ఉందని తెలిసినా సెప్టెంబరు 1న, ఆదివారం అర్ధరాత్రి చంద్రబాబు గారు ఉన్నఫళంగా ఎన్డీఆర్ఎఫ్ బోటులో ప్రజల వద్దకు వెళ్లిపోయారు. మీకు నేనున్నానంటూ హెవీ ఫ్లడ్‌లో పర్యటిస్తూనే.. విలయంలో చిక్కుకున్న బాధితులకు ధైర్యం చెప్పారు. ఆ ఘటన నన్ను బాగా కదిలించించింది. నిజానికి ఆ రోజంతా బాబు గారు నిద్రపోలేదు.
ప్రశ్న : టీం స్పిరిట్‌కు సింబాలికల్ ఐకాన్ లోకేష్. ఆ విషయంలో తండ్రిని మించిన తనయుడు అన్న మాట పరిపక్వత కలిగిన పరిశీలకుల నుంచి వినిపిస్తోంది. ఎలా ఫీలవుతారు?
జవాబు : అది వాళ్ల అభిమానం కావొచ్చు. కానీ, రాష్ట్రంలో 70 లక్షలమంది క్రమశిక్షణ కలిగిన పసుపు సైన్యమే మా బలం. మాచర్లలో జై జగన్ అంటే వదిలేస్తామని వైసీపీ ముష్కర మూకలు చంద్రయ్య పీకమీద కత్తిపెడితే.. జై తెలుగుదేశం అంటూ ప్రాణాలు వదిలాడు చంద్రయ్య. అంతకుమించిన స్పిరిట్, కమిట్మెంట్ ఏముంటుంది. 70 లక్షల మంది కార్యకర్తలందరిలోనూ అదే స్పిరిట్, అదే కమిట్మెంట్. అలాంటి కార్యకర్తలున్న పార్టీలో వాళ్లతో కలిసి పని చేయడమే నా అదృష్టం. అంతకుమించిన ఆనందం ఏముంటుంది?
ప్రశ్న : బుడమేరు వరద ప్రజలకే కాదు, ప్రభుత్వానికి పెద్ద పాఠం. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ప్రజలనుంచి ఎలాంటి సహకారం తీసుకుంటారు?యువనేతగా సూచించండి.
జవాబు : గత ప్రభుత్వ హయాంలో బుడమేరును ఆక్రమించి ఎడాపెడా అక్రమ నిర్మాణాలు చేపట్టడమే ప్రస్తుత దుస్థితికి కారణం. వాటిని నివారించి.. బుడమేరు ప్రవాహానికి సరైన మార్గం కల్పించడం ఎన్డీయే ప్రభుత్వం నిర్వర్తించాల్సిన ప్రధాన విద్యుక్తధర్మం. ఇక ప్రస్తుత విపత్తును గుణపాఠంగా భావించి ప్రజలు కూడా అక్రమ నిర్మాణాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వంలో భాగస్వామిగా సూచిస్తున్నా.
ప్రశ్న : బుడమేరు గండ్లు పూడ్చివేతలో మంత్రి రామానాయుడి శక్తి.. మీ పర్యవేక్షణా యుక్తి.. ఈ రెంటి సమన్వయమే పెద్ద విజయం. ఆ ఐదు రోజుల యుద్ధం.. మీకెలా అనిపించింది?
జవాబు : వరదలో చిక్కుకున్న ప్రజలను ఎలాగైనా బయటకు తేవాలన్న ఆలోచన తప్ప.. ఆ క్షణంలోనే ఇంకేమీ ఆలోచించలేదు. గట్టుతెగిన బుడమేరును నియంత్రిచగలిగితేనే.. వరదనుంచి విజయవాడను బయటకు తేగలం. ఆ బాధ్యతలు మాకు అప్పగించడంతో.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్షణం ఆలోచించకుండా రంగంలోకి దిగాం. మా ప్రయత్నానికి అధికారులూ తమవంతు సహకారాన్ని చిత్తశుద్ధిగా అందించారు. ఆర్మీ సైతం మా కృషిని ప్రశంసించింది. నిజానికి ` అది జీవితంలో మరిచిపోలేని ఘట్టం.
ప్రశ్న : చివరిగా.. బెజవాడ వరదనుంచి మనం ఏం నేర్చుకోవాలి?
జవాబు : విపత్తులను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు అందరూ సమష్టిగా ముందుకు సాగటం అవసరం. సహాయ చర్యల్లో తొలి రెండు రోజులు కొన్ని ఇబ్బందులు తలెత్తినా తర్వాత అన్ని సాఫీగా సాగాయి. రాజకీయ స్వార్థంతో ప్రకాశం బ్యారేజీనే దెబ్బతీయాలని కుట్ర పన్నారు. ప్రజలు చైతన్యవంతులై భవిష్యత్తులో మళ్ళీ అటువంటి నాయకులు అధికారంలోకి రాకుండా చూడాలి.
