జాతీయం

రెక్కలల్లార్చిన లోహవిహంగాలు!

  • October 8, 2024
  • 1 min read
[addtoany]
రెక్కలల్లార్చిన లోహవిహంగాలు!

భారీ విలయంలో చిక్కుకుని అల్లాడిపోతున్న మానవ పక్షుల కోసం లోహ విహంగాలు రెక్కలల్లార్చుకుంటూ వాలాయి. ఆకలి బాధితులకు ఆహారం అందించాయి. దాహార్తులకు నీళ్లిచ్చాయి. పిల్లా పాపలకు బిస్కెట్లు, పాలిచ్చాయి. ఎక్కడో మారుమూల వరదలో చికుకుని ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్న బాధితుల ఆచూకీని రక్షణ బృందాలకు చేరవేశాయి. శక్తి సన్నగిల్లగానే బ్యాటరీ రీచార్జి చేసుకుని.. వరద బాధితుల కోసం అవిశ్రాంతంగా సేవలందించాయి. వ్యాధులు ప్రబలకుండా వాయువేగంతో మందులను పిచికారీ చేసిందీ లోహవిహంగాలే. వరద సమయంలో.. బలహీనంగావున్న కరకట్టల ఆచూకీనిచ్చి జాగ్రత్తపడేలా చేసిందీ ఈ లోహ విహంగాలే. మానవ బృందాలకు అసాధ్యమైన వరద సహాయక కార్యక్రమాల నిర్వహణను.. రంగంలోకి దిగిన విహంగాలు చిటికెలో చక్కబెట్టాయి. భారీ వరద నుంచి విజయవాడను రక్షించేందుకు ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యల్లో ఇతోధిక పాత్ర పోషించిన ఆ లోహ విహంగాలే `సాధారణ పరిభాషలో డ్రోన్లు.

అసాధారణ సమస్య ఎదురైన సమయంలోనూ సృజనాత్మక ఆలోచనకు పదును పెట్టడంలో `ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవజ్ఞుడు. అలాంటి చంద్రబాబు సారథ్యంలో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు తీసుకున్న చొరవ `ఇప్పుడు దేశంలో విపత్తులు ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు పాఠ్యాంశంగా మారింది. ప్రపంచంలోనే ఈ తరహా ప్రయత్నం మొట్టమొదటిది అనడానికి సంకోచాలు అక్కర్లేదు. 30 కిలోల బరువు మోయగల డ్రోన్లను ఉపయోగించి.. వరదలో చిక్కుకున్న వేలమందికి సరైన సమయంలో ఆహార పొట్లాలు, నీళ్లు, మందులు అందించగలిగారు. మూడు కెమెరా డ్రోన్లతో కొండపల్లి దగ్గర బుడమేరు గండ్లను ఐటీ మంత్రి లోకేష్‌ అనునిత్యం పర్యవేక్షించి.. పూడ్చివేత పనులను సమర్థంగా నిర్వహించారు. క్షేత్రస్థాయిలోవున్న ఇరిగేషన్‌ మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్‌ అధికారులకు సమన్వయం చేస్తే.. డ్రోన్‌ లైవ్‌ పర్యవేక్షణతో ఎప్పటికప్పడు కార్యనిర్వహణా బృందాలకు సూచనలిస్తూ త్వరితగతిన బుడమేరు గండ్లను పూడ్చగలిగారు. అందుకే `వరద విపత్తు నివారణ, నియంత్రణలో డ్రోన్ల పాత్ర ప్రత్యేకత సంతరించుకుంది. డ్రోన్లు, రోబో జాకెట్లు, డేటా అనలిటిక్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇలా రకరకాల డిజిటల్‌ అప్లికేషన్స్‌ను ఒకవైపు వరద నియంత్రణ చర్యల్లోనూ, మరోవైపు ప్రజలను ఆపదనుంచి గట్టెక్కించే సహాయక చర్యల్లోనూ ఉపయోగించడమనేది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవానికి, కార్యదక్షతకు నిదర్శనం!

భారీ వర్షాలు.. ఎగువ ప్రాంతాలనుంచి పోటెత్తిన కృష్ణమ్మ.. మరోపక్క గట్టుతెగిన బుడమేరు. వెరసి బెజవాడ మహానగరం ముంపునకు గురైంది. ప్రతి వార్డూ ముంపులోవున్న సమయం. వరదకు ఎదురెళ్లి బాధితులకు ఆహారం, నీళ్లు, మందులు సరఫరా చేయడం ప్రభుత్వానికీ అసాధ్యమైన పరిస్థితి. విపత్కాలాన్ని బహుముఖ వ్యూహంతో ఎదుర్కోవాలన్న సీఎం చంద్రబాబు ఆలోచనల మేరకు `వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రంగంలోకి దిగారు. వ్యవసాయంలో క్రిమికీటకాల నివారణకు మందులను పిచికారీ చేసే డ్రోన్లను ఫ్లడ్‌ సీన్‌లోకి దింపారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకులు పీవీ సత్యనారాయణ ఈ ఆలోచనను తెరపైకి తేవడంతో.. డ్రోన్‌ నిపుణుడు, సీనియర్‌ శాస్త్రవేత్త ఎ సాంబయ్య తన బృందంతో అప్పటికప్పుడు 115 వ్యవసాయ డ్రోన్లను రూపాంతరం చేశారు. ఏపీ డ్రోన్‌ కార్పొరేషన్‌ ఎండీ దినేష్‌ సహాయ సహకారాలు అందించడంతో.. ఆగమేఘాల మీద లోహవిహంగాలు రెక్కలల్లార్చుకుంటూ వాలిపోయాయి.

వరదలో చిక్కుకుని నిస్సహాయంగా చూస్తున్న బాధితుల ముందు `ఎక్కడి నుంచో రెక్కలు కట్టుకుని ఎగురుకుంటూ వచ్చి ఆహారాన్ని చేతికందించాయి. ఆ క్షణం బాధితుల్లో భావోద్వేగం ఎలా ఉంటుంది? విజయవాడలో సాక్షాత్కరించిన సాంకేతిక దృశ్యమిదే. బుడమేరు వరద బాధితుల క్షుద్బాధ తీర్చేందుకు ప్రభుత్వం తొలిసారి డ్రోన్లతో ఆహారాన్ని అందించే ప్రయోగం చేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ బాధితుల కడుపునింపింది.

ఈ సరికొత్త ఆలోచన రావడానికి.. సమస్యే కారణం. ఇరుకురోడ్లలో ఉన్న బాధితులకు పడవల్లో వెళ్లి ఆహారం అందించడం సాధ్యం కాలేదు. వరద తీవ్రత ఎక్కువగా ఉన్న వాంబే కాలనీ, అజిత్సింగ్‌నగర్‌, అరుణోదయనగర్‌, జక్కం పూడి కాలనీ పరిధిలోని అనేక వీధుల్లో వేలమందిని ఆకలి బాధలు చుట్టుముట్టాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు చాలామంది ఇళ్ల పైభాగానికి చేరుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. హెలికాప్టర్లతో ఆహారం పంపాలన్నా.. చుట్టూవున్న విద్యుత్‌ తీగల కారణంగా కొన్ని ప్రాంతాల్లో సాధ్యం కాలేదు. దీంతో ప్రభుత్వం ఆలోచించి.. డ్రోన్లను ప్రయోగించింది. వాటిద్వారా ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్నవారికి ఆహార పదార్థాలను అందించింది. అపార్టుమెంట్ల పైభాగంలోవున్న బాధితులకూ డ్రోన్ల ద్వారా ఆహార పదార్థాలు సరఫరా అయ్యాయి. గత రెండురోజుల్లో సుమారు 10వేల మంది ఆకలి తీర్చడంలో లోహవిహంగాలు అద్భుత సేవలు అందించాయి.

లొకేషన్‌ షేర్‌ చేస్తే డ్రోన్లు ఆ ప్రాంతానికి వెళ్లి ఆహారాన్ని అందించడం మొదలెట్టాయి. అలానేకాక.. ఆపరేటింగ్‌ విధానంలోనూ అవసరమైన ప్రాంతాలకు వాటిద్వారా ఆహారాన్ని అందించారు. విపత్తుల నిర్వహణ సంస్థకు అందిన మెసేజ్‌లు, వారికి వచ్చిన ఫోన్‌ నంబర్ల ఆధారంగా బాధితుల లొకేషన్‌ గుర్తించి అవసరం మేరకు ఆహారం, మందులు, నీళ్ల సీసాలను పంపించారు. ఒక్కో డ్రోన్‌ ద్వారా 8-10 కిలోల సామగ్రిని పంపే అవకాశం ఉంది. డ్రోన్‌కు తాడుతో బుట్టనుకట్టి.. అందులో ఆహార పదార్థాలను పంపారు. అవి నాలుగు కిలోమీటర్ల దూరం వరకు వెళ్తాయి. దారిలో విద్యుత్‌ తీగలు, నిర్మాణాలు అడ్డుతగిలితే తప్పుకొనేందుకు ‘క్రాష్‌ డిటెక్షన్‌’ ఫీచర్‌ సైతం ఉంది. ఆహారాన్ని అందించగానే హోమ్‌ బటన్‌ నొక్కితే నేరుగా వెనక్కు వచ్చేస్తుంది.

ఆహారం అందించే సమస్య తీరిపోవడంతో.. అవే డ్రోన్లును ఇంకెలా వాడుకోవాలన్న ఆలోచనలు పుట్టుకొచ్చాయి. ఆలోచన వచ్చిన మరుక్షణం.. కెమెరా డ్రోన్లను వివిధ వరద ముంపు ప్రాంతాల్లో తిప్పడం మొదలుపెట్టారు. ఎప్పటికప్పుడు ఎంతమేరకు నీరు తగ్గుతుంది? ఎక్కడెక్కడ నీటిమట్టం పెరుగుతుంది? ఎక్కడెక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. సమయానుకూలంగా తగిన రక్షణ చర్యలు తీసుకోవడంలో డ్రోన్ల పాత్ర కీలకమే అయ్యింది. పారిశుద్ధ్య కార్యక్రమాల్లోనూ డ్రోన్లు సేవలు విస్తృతం చేశారు. అంటువ్యాధుల ప్రబలకుండా.. కెమికల్స్‌ స్ప్రే చేసేందుకు డ్రోన్లు ఇతోధిక సేవలే అందించాయి. వరద విపత్తు సమయంలో వివిధ సహాయ కార్యక్రమాలకు డ్రోన్‌ టెక్నాలజీని వాడటం.. దేశానికే గర్వకారణం. విపత్తు నివారణా ఆధునిక విధానానికి ఇదొక కేస్‌ స్టడీ!

ప్రజాప్రతినిధుల సమష్టి భాగస్వామ్యం

వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ సమన్వయంతో వైద్య వ్యవస్థను క్రియాశీలం చేసి ముంపునకు గురైన ప్రాంత ప్రజల ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకోవడం జరిగింది. పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి  పొంగూరు నారాయణ  సమన్వయంతో డ్రోన్లను ఉపయోగించి వివిధ క్రిమిసంహారక మందులను వీధుల్లో చల్లిస్తూ 31 వార్డుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను వేగవంతం చేయించడం,  మరోవైపు క్రస్ట్‌ గేట్ల నిపుణులు కన్నయ్యనాయుడు సాంకేతిక సలహాలు, సంప్రదింపులతో ప్రకాశం బ్యారేజ్‌కి కౌంటర్‌ వెయిట్‌కు త్వరితగతిన మరమ్మత్తులు చేపట్టటం, బుడమేరు వరదకు సంబంధించిన విపత్తు నుండి ప్రజలను రక్షించుకుంటూ ఎప్పటికప్పుడు డేటా సెంటర్లకు డేటా తెప్పించుకొని అనలటిక్స్‌తో నిర్ణయాలు తీసుకుంటూ సమర్థమైన, సమగ్రమైన విపత్తు నిర్వహణ చేపట్టటం భావితరాలకు మార్గదర్శకమే.

హోంమంత్రి వంగలపూడి అనిత సమన్వయంతో విపత్తు ప్రాంతంలో నిరంతర ఆహారం తదితరాల సరఫరా కోసం పోలీస్‌ యంత్రాంగాన్ని సమర్థంగా ఉపయోగించగలిగారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ సమన్వయంతో రెవిన్యూ శాఖ అధికారులు వివిధ రకాల నష్టాల అంచనాలను వేస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ సమన్వయంతో విపత్తు నిర్వహణకు కావలసిన ఆర్థిక వనరులను సమకూర్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌, ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్‌ యాదవ్‌, రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల మంత్రి కొలుసు పార్థసారథి.. ఇలా ప్రజాప్రతినిధులు, అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో రేయింబవళ్లు పనిచేస్తూ సమష్టి కృషితో ప్రజలకు అండగా నిలిచారు.

ఇలాంటి సమర్థమైన విపత్తు నిర్వహణ మన రాష్ట్రానికే కాకుండా.. ఇతర రాష్ట్రాలకూ ఆచరణీయం.. ఆదర్శనీయం… అభినందనీయం.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *