మహాపచారం!
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి` ఘోర అపచారం జరిగింది. భక్తుల నీరాజనాలందుకునే శ్రీనివాసుడు కొలువైన తిరుమలలో కొంతకాలంగా `అది నిర్విఘ్నంగా సాగిపోయింది. దేశ విదేశాల్లోని కోట్లమంది హిందువులకు పరమ పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రంలోని శ్రీవారి లడ్డూ ప్రసాదం `కల్తీదైపోయింది!
వడ్డికాసులవాడి కళ్లుగప్పి.. ఖజానాను కొల్లగొట్టినపుడు వెంకన్న మౌనమే వహించాడు. భక్తులు తనకు సమర్పించిన కాన్కలకు.. చిల్లర దొంగలు కక్కుర్తిపడుతున్నారులే అని చిరుదరహాసంతో చూస్తూండిపోయాడు. పాలకమండలిలోకి చొరబడి.. అధికార అహంకారంతో.. తిరుమల కొండపై అనవసర నిర్మాణాలు చేపట్టి కోట్లు కొల్లగొట్టారు. స్వామి దర్శన భాగ్యం కోసం అల్లాడుతున్న భక్తులకు లక్షల్లో టిక్కెట్లు అమ్ముకుని కోట్లు సొమ్ము చేసుకున్నారు. ఇలాంటి ఎన్ని అపచారాలకు పాల్పడినా మౌనంగా భరించిన వెంకన్న.. కల్తీ నెయ్యి లడ్డూను తన మహాప్రసాదంగా భక్తులకు అమ్ముకోవడాన్ని మాత్రం భరించలేకపోయాడు దేవదేవుడు. ఎవరి ద్వారా అయితేనేమి.. అధికారమదంతో మహాపాపానికి ఒడిగట్టిన దుర్మార్గులను గద్దె దింపడమే కాదు, పాపాల బండారాన్ని బయటపెట్టి ప్రజలముందు నిజస్వరూపంతో నిలబెట్టారు. దేవుడికి మతం లేకపోవచ్చు. కాని`మత విశ్వాసాలను పాటించే మనుషుల మనోభావాలను దెబ్బతీస్తే.. ఆ దేవుడు కూడా సహించడు. తిరుమలలో జరిగిన వివాదాస్పద ఘట్టమదే.
ఏడుకొండలపైనున్న వెంకన్నను దర్శించుకున్నాక లడ్డూ ప్రసాదాన్ని అత్యంత భక్తితో కళ్లకద్దుకుని స్వీకరించినప్పుడు కలిగే తన్మయత్వభావన మాటల్లో చెప్పలేం. ఒకప్పుడు తిరుమల లడ్డూ ఆధ్మాత్మిక సౌరభాల్ని వెదజల్లుతూ, అత్యంత రుచికరంగా ఉండేది. కానీ ఐదేళ్ల వైకాపా పాలనలో లడ్డూపై అనేక ఫిర్యాదులు. రంగు, రుచి, వాసన బాగుండటం లేదని, రెండు రోజులకే చెడిపోతోందన్న విమర్శలు లెక్కకు మిక్కిలయ్యాయి. శ్రీవారి భక్తుల వేదన అప్పటి ప్రభుత్వ పెద్దలకుగానీ, తితిదే పాలక మండలికిగానీ, జగన్‌కు ఆత్మబంధువైన ఈఓ ధర్మారెడ్డికిగానీ.. చివరకు రాష్ట్రాన్ని ఏలిన జగన్‌కూ చెవికెక్కలేదు. లడ్డూలు, ఇతర ప్రసాదాల తయారీలో వాడుతోంది కల్తీ నెయ్యి అని వాళ్లకు తెలుసు కనుకే.. ఫిర్యాదులపై కిమ్మనలేదు. వైకాపా ప్రభుత్వ హయాంలో అప్పగించిన గుత్తేదార్లు సరఫరా చేసిన నెయ్యి.. వనస్పతి, వృక్ష, జంతు కొవ్వులతో కల్తీ అయిందని ఎన్డీడీబీ నివేదికలో బయటపడడంతో… శ్రీవారి భక్తులతో పాటు, యావత్ ప్రపంచం నివ్వెరపోతోంది. ఎన్డీయే ప్రభుత్వం గద్దెనెక్కిన తరువాత.. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల ప్రక్షాళనకు పూనుకున్న తరువాతే.. వ్యవహారం బయటపడిరది. కల్తీ వ్యవహారంపై దేశ, విదేశాల్లోని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తు గోవిందుడికే ఘోర అపచారం తలపెట్టినవారిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
శ్రీవారి లడ్డూ కల్తీపై పీఠాధిపతులు, పండితులు, సనాతన ధర్మ రక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అపవిత్ర పదార్థాలు వాడారని తెలిసి ఎంతో వేదన చెందామంటున్నారు. హిందూ దేవాలయాల పరిరక్షణ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు పీఠాధిపతులు, స్వామీజీలు కల్తీ తతంగం తీవ్ర ఆగ్రహమే వ్యక్తం చేశారు. ప్రసాదంలో ఏం కలుస్తుందోనన్న భయంతో భక్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అపవిత్ర పదార్థాల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలి. స్వామి సన్నిధిలో వేరే మతస్థులకు ఉద్యోగం ఉండకూడదు. శ్రీవారిపై భక్తి విశ్వాసాలు ఉన్నవారికే ఉద్యోగాలివ్వాలి. ప్రభుత్వం, ప్రజలు కలిసి ధర్మాన్ని రక్షించాలి. ల్యాబ్ నివేదికలు మనకు ఆధారం. అవి స్పష్టం చేసినప్పుడు చర్యలు తీసుకోవాల్సిందే. ఇంకా తప్పు జరగలేదంటే అపహాస్యమే అవుతుంది. ల్యాబులు ఇచ్చిన నివేదిక ప్రకారం కోర్టుకు వెళ్లాల్సిందే. కోర్టు విధించిన శిక్షలు అమలు చేస్తేనే ఇలాంటివి మరోసారి జరగకుండా ఉంటుంది అంటూ ప్రభుత్వాన్ని కోరారు.
అసలేం జరిగింది..
గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి ప్రసాదాలకు కల్తీనెయ్యి వినియోగించారని బయటపడడంతో తితిదే పాలకమండలి మాజీ చైర్మన్, జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి విలేకర్ల సమావేశంలో తమ చర్యల్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. శ్రీవారికి నివేదించే ప్రసాదాల తయారీకి రాజస్థాన్‌లోని ఫతేపూర్ నుంచి రోజుకు 60 కిలోల చొప్పున శుద్ధమైన దేశీ ఆవు నెయ్యిని దాతల సహకారంతో కొనేవారిమని, 60 కిలోలకు రూ.లక్ష ఖర్చయ్యేదని కొత్త కథ చెప్పారు. అంటే కిలో నెయ్యి ధర రూ.1,667 అన్నమాట..! అదే సమయంలో లడ్డూ ప్రసాదాల తయారీకి వినియోగించే వేల కిలోల నెయ్యిని కిలో రూ.320 చొప్పున కొన్నట్టు చెప్పారు. ఒకపక్క కిలో నెయ్యి రూ.1,667కి కొన్నామని సుబ్బారెడ్డి చెబుతూనే.. ఎలాంటి కల్తీలు లేకుండా కిలో ఆవు నెయ్యి రూ.320కి ఎలా కొన్నట్టు? ఎవరు సరఫరా చేశారు? ఇదే అనుమానాస్పదం, వివాదాస్పదమైంది. కిలో ఆవు నెయ్యి తయారీకి 17-18 లీటర్ల పాలు అవసరమన్నది నిపుణులు చెప్తోన్న మాట. లీటరు పాలు రూ.40 వేసుకున్నా… అన్ని పాలకు రూ.720 ఖర్చవుతుంది. మార్కెట్లో గేదె నెయ్యే కిలో రూ.800కి పైగా ధర పలుకుతోంది. అలాంటప్పుడు ఎక్కడో ఉత్తర్‌ప్రదేశ్, ఢల్లీివంటి ప్రాంతాల్లోని సంస్థలు రవాణా ఖర్చులు భరించి కిలో నెయ్యి రూ.320కి ఎలా సరఫరా చేయగలవు? ఈ ప్రశ్నలోనే సమాధానం నక్కివుంది. నెయ్యిలో కచ్చితంగా కల్తీ జరిగిందని సాధారణ ప్రజలూ ఇక్కడే నిర్థారణకు వచ్చారు. కానీ ఘనత వహించిన అప్పటి పాలకమండలి చైర్మన్, సభ్యులు ఆ విషయంపై ఇంకా బొంకుతున్నారు, ఎవర్ని మభ్యపెట్టడానికో!
నందిని బ్రాండ్‌తో పాల ఉత్పత్తులు విక్రయించే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) 50 ఏళ్లుగా తితిదేకి నెయ్యి సరఫరా చేస్తోంది. అది కర్ణాటక ప్రభుత్వరంగ సంస్థ. ఎక్కువ ధర కోట్ చేసిందన్న కారణంతో జగన్ ప్రభుత్వ హయాంలో అప్పటి తితిదే పాలకమండలి కేఎంఎఫ్‌ను పక్కన పెట్టేసింది. తితిదే చెబుతున్న ధరకు స్వచ్ఛమైన నెయ్యి సరఫరా చేయడం సాధ్యంకాదని కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమానాయక్ అప్పట్లో తెగేసి చెప్పేశారు. దాన్ని అవకాశంగా తీసుకుని.. కమిషన్లకు కక్కుర్తిపడి.. తక్కువ ధరకు కొంటున్నామన్న బుకాయింపుతో, కల్తీనెయ్యి కొనుగోలు చేశారన్న వాస్తవం ఇప్పుడు బయటపడిరది. 50 ఏళ్లుగా నెయ్యి సరఫరా చేస్తున్న కేఎంఎఫ్‌ను పక్కన పెట్టి… తితిదే కల్తీనెయ్యి కొనడం వెనుక మర్మం కమిషన్ల కక్కుర్తి.. పాలకుడికి హిందూ ధర్మంపట్ల, భక్తుల విశ్వాసాల పట్ల నిర్లక్ష్యం అన్నది స్పష్టమవుతోంది.
శ్రీవారి ప్రసాదాలు, అన్నప్రసాదాల నిమిత్తం తితిదే సుమారు 48 రకాల సరకులు కొంటుంది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు, కొండ దిగువన ఆలయాల్లో ప్రసాదాలకూ వాటినే వినియోగిస్తారు. నెయ్యి సహా ఆ పదార్థాలన్నీ తిరుపతిలోని గోడౌన్లో భద్రపరుస్తారు. వాటి నాణ్యతను పరీక్షించే ల్యాబ్‌ను మాత్రం తిరుమల కొండపై ఏర్పాటుచేశారు. నమూనాల్ని తీసుకెళ్లి అక్కడ పరీక్షిస్తుంటారు. ఆ పరీక్షలు తూతూమంత్రంగా జరిగాయనడానికి `కల్తీ నెయ్యి పెద్ద నిదర్శనం. తితిదేకి రోజూ పదివరకు నెయ్యి ట్యాంకర్లు వస్తాయి. ఒక్కో ట్యాంకర్లో 12,000 లీటర్ల నెయ్యి ఉంటుంది. కొన్ని ట్యాంకర్ల నుంచి ర్యాండమ్‌గా నమూనాలు తీసుకుని తిరుమల తీసుకెళ్లి పరీక్షిస్తారు. వాటిలో ఎలాంటి కల్తీ జరిగిందో నిగ్గుతేల్చే అధునాతన పరికరాలు ల్యాబ్‌లో లేవు. వచ్చిన ప్రతి ట్యాంకర్లో నెయ్యీ బాగుందని నిర్థారిస్తే అనుమానం వస్తుంది కాబట్టి… అప్పుడప్పుడూ కొన్ని ట్యాంకర్లను తిప్పి పంపినట్టు తితిదే సిబ్బంది రికార్డుల్లో రాస్తుంటారు. ఆ ట్యాంకర్లను తిరుపతి బైపాస్ రోడ్డులోకి తీసుకెళ్లి వేరే నెంబరు ట్యాంకర్లలోకి నింపి, మళ్లీ తీసుకొస్తారన్నది బహిరంగ రహస్యం. ముందు తిప్పిపంపిన అదే నెయ్యిని, తితిదే సిబ్బంది నాణ్యత బాగుందని సర్టిఫై చేస్తారనీ అక్కడివారు అంటున్నారు. కొండపై ల్యాబ్ ఇదివరకు తితిదే వైద్యాధికారి నియంత్రణలో ఉండేది. ధర్మారెడ్డి ఈవోగా ఉండగా మైసూరులోని సీఎల్టీటీఆర్‌ఐలో పదవీ విరమణ చేసిన టెక్నికల్ ఆఫీసర్ని తితిదే ల్యాబ్‌కు ఇన్‌ఛార్జిగా పెట్టారు. ఆయన తితిదే రెగ్యులర్ ఉద్యోగి కాకపోవడంతో… జవాబుదారీతనం ఉండదన్న విమర్శలు మొదటినుంచీ ఉన్నాయి. కలియుగ దైవం వేంకటేశ్వరుడి కళ్లుగప్పి.. ఇప్పటి వరకూ సాగిన అవినీతి దందా ఇది.
అరాచక శక్తులు అధికారంలోవుంటే.. అవినీతి, అస్తవ్యస్త నిర్ణయాలతో చెలరేగిపోతే…. ఎలాంటి అనర్థాలు జరుగుతాయో చెప్పడానికి గత ఐదేళ్లలో తిరుమలలో జరిగిన అపచారాలే నిదర్శనం. జగన్ తన సామాజికవర్గానికి చెందినవారికి తిరుమలను అడ్డాగా మార్చేశారు. మొదట సొంత బాబాయి సుబ్బారెడ్డి, తర్వాత కరుణాకర్రెడ్డిని పాలకమండలి చైర్మన్లుగా చేశారు. స్వామివారి సేవలో కంటే.. తన సేవలో ఎక్కువగా తరించే ధర్మారెడ్డిని అర్హత లేకపోయినా తితిదే ఈఓ చేశారు. సుబ్బారెడ్డి హయాంలో పాలకమండలి సమావేశాన్ని చేపల మార్కెట్లా మార్చేసి… స్వామివారి సేవల ధరలకు వేలంపాట పెట్టడం చూసి భక్తులే విస్తుపోయారు. ఇక కరుణాకర్‌రెడ్డి హయాంలో… దృఢంగా ఉన్న భవనాల్ని కూలగొట్టడం.. అవసరమున్నా, లేకున్నా.. స్వామివారి సొమ్ముల్ని సివిల్ వర్క్స్ పేరిట ఇష్టారాజ్యంగా ఖర్చుపెట్టడం. ఇదే జరిగింది ఇప్పటివరకు. ఆక్రమంలో భారీగా ముడుపులు దండుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఇక పాలకమండలి సభ్యులు… వీఐపీలకు దర్శనాలు చేయిస్తూ, వారి సేవల్లో తరించారు. సామాన్య భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా, లడ్డూ సహా అన్నింటి ధరలూ పెంచేశారు. రూ.25 ఉన్న లడ్డూ ధరను కరుణాకర్‌రెడ్డి హయాంలో రూ.50కి పెంచారు. రూ.100 ఉన్న పెద్ద లడ్డూ ధరను రూ.200కి పెంచారు. సహజంగా ధర పెరిగితే నాణ్యత పెంచాలి. కానీ కల్తీ నెయ్యి దట్టించి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు.. శ్రీవాణి ట్రస్టు సహా… గత ఐదేళ్లలో అనేక కుంభకోణాలకు తెరతీశారు. కల్తీ నెయ్యి ఒక్క అంశమేనని… గత ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ కుంభకోణాలు చాలానే బయటపడే సమయం వచ్చిందని శ్రీవారి భక్తులు భావిస్తున్నారు.
కల్తీకి సాంకేతిక నిర్థారణ
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి వాడే నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె ఉన్నట్టు ఎన్టీడీబీ కాఫ్ సంస్థ నివేదికలో వెల్లడైందన్నది తితిదే ఈవో జె శ్యామలరావు చెప్తోన్న మాట.
నిజానికి ల్యాబ్ రిపోర్టులు పరిశీలిస్తే.. నెయ్యి నాణ్యతకు ప్రామాణికమైన ఎస్-విలువ ఒక ఈక్వేషన్ ప్రకారం 97.96 నుంచి 102.04 మధ్యవుండాలి. పరిమితికిమించి 116.09గా ఉన్నట్టు నిర్థారణైంది. దీన్నిబట్టి ఇందులో పందికొవ్వు ఉన్నట్లు స్పష్టమవుతుంది. మరో ఈక్వేషన్ ప్రకారం 95.90 నుంచి 104.10 మధ్య ఉండాల్సిన ఎస్-విలువ అతి తక్కువగా 23.22గా ఉంది. ఇందులో గొడ్డు కొవ్వు కలిసి ఉన్నట్టు పరీక్షలు ధృవీకరిస్తున్నాయి. దేశంలోనే అత్యంత ప్రఖ్యాత సంస్థ గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) కాఫ్ (సెంటర్ ఫర్ ఎనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్ స్టాక్ అండ్ ఫుడ్)కు నెయ్యి నమూనాలు పంపించి పరీక్షలు చేయించాం. మొత్తంగా నెయ్యి స్వచ్ఛతకు సంబంధించి ఎస్-విలువ 95.68 నుంచి 104.32 మధ్య ఉండాల్సి ఉండగా.. చాలా తక్కువగా 20.32 ఉన్నట్టు పరీక్షల్లో తేలింది. చూడటానికి నెయ్యిలా కనిపిస్తుందే తప్ప.. అసలు అది నెయ్యే కాదని, ఇందులో జంతు కొవ్వులతోపాటు వివిధ రకాల పదార్థాలు కలిశాయని ల్యాబ్ రిపోర్టులు తేటతెల్లం చేస్తున్నాయి. మొత్తం నాలుగు నమూనాలకు సంబంధించిన వేర్వేరు నివేదికలు వచ్చాయి. అన్నింటిలోనూ ఒకేతరహా ఫలితాలు. ఈ నెయ్యిని సరఫరా చేసిన తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టారు. న్యాయపరమైన చర్యలూ మొదలయ్యాయి.
శ్యామలరావు ఈవోగా బాధ్యతలు చేపట్టి సీఎంను కలిసినపుడు.. లడ్డూ నాణ్యతపై వస్తోన్న ఫిర్యాదులను అధ్యయనం చేయమని గట్టిగానే చెప్పి పంపిచారు. పోటులో పనిచేసేవారూ నెయ్యి బాగోలేదని పదే పదే ప్రస్తావించడంతో.. శ్యామలరావు ఆ దిశగా దృష్టిపెట్టారు. ప్రధానంగా నెయ్యిపైనే ఫిర్యాదులున్నందున నమూనాలను పరిశీలించాం. సరకుచూస్తే నెయ్యా? లేదంటే నూనెనా? అనిపించింది. దీనిపై సరఫరాదారులను హెచ్చరిస్తే సరిదిద్దుకున్నారు. ఏఆర్ డెయిరీ ఫుడ్స్ సరఫరా చేసిన నాలుగు ట్యాంకర్లలోని నెయ్యి కల్తీ అయినట్లు గుర్తించాం. తితిదే చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈ నెయ్యి నాణ్యతను పరీక్షించేందుకు జులై 6, 12వ తేదీల్లో నమూనాలు పంపాం. వారం తరువాత ఫలితాలొచ్చాయి. పంది కొవ్వు, గొడ్డు కొవ్వుతోపాటు ఇతర పదార్థాలు నెయ్యిలో కలిసి ఉన్నాయని తేలింది అని శ్యామలరావు చెప్పారు.
నిజానికి.. నెయ్యి సరఫరా కోసం మార్చి 12న తితిదే టెండర్లు పిలిచింది. కిలో రూ.320కు అందించేలా మే8న ఏఆర్ డెయిరీ ఫుడ్స్‌కు టెండరు ఖరారైంది. మే 15న సరఫరా ఆర్డరు అందింది. అప్పటినుంచి 15-20 రోజుల తర్వాత ఆ సంస్థ మొత్తం పది ట్యాంకర్ల నెయ్యి పంపింది. ఇందులో ఆరు ట్యాంకర్ల నెయ్యిని తితిదేలో వినియోగించారు.
నెయ్యిలో కల్తీని పరీక్షించేందుకు తితిదేకు సొంతంగా ల్యాబ్ లేదు. టెండరు షరతుల ప్రకారం బయట ఎన్‌ఏబీఎల్ గుర్తింపున్న ల్యాబ్‌లో పరీక్షించవచ్చు. అయితే ఎక్కడా పరీక్షలకు పంపించలేదు. కల్తీని పరీక్షించే ల్యాబ్ ఇక్కడ ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నించనూ లేదు. దీనికి రూ.75 లక్షలే ఖర్చవుతుంది. ల్యాబ్ లేకపోవటాన్ని సరఫరాదారులు అలుసుగా తీసుకున్నారు. స్వచ్ఛమైన, నాణ్యమైన నెయ్యి అందించాలంటే కొంత ధర ఉంటుంది. అలాంటిది, సరఫరాదారులు తితిదేకు కిలో రూ.320 నుంచి రూ.411 ధరకే ఇచ్చారు. ఈ ధరలకు నాణ్యమైన నెయ్యి అందించలేరని నిపుణులు చెబుతున్నారు. తక్కువ ధరకు కొనడమే కల్తీకి కారణమైంది.
శ్రీవారి నైవేద్యాల తయారీకి 2021 మే నుంచి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. ఇందులో బియ్యం, ఆవు నెయ్యి, బెల్లం ఒక సంస్థ నుంచి తీసుకుంటున్నారు. దీనివల్ల ప్రసాదం నాణ్యత తగ్గిందనే ఫిర్యాదులొచ్చాయి. వీటిపైనా పరిశీలించాం. నిపుణుల కమిటీ ద్వారా పరీక్షలు చేయించి ఆ సంస్థ నుంచి తాత్కాలికంగా సరకులు తీసుకోవడం లేదు. ల్యాబ్ నివేదికలలోనూ ఇబ్బందులను గుర్తించాం. బియ్యం ఒకేలా లేకపోవడం వల్ల ప్రసాదాల తయారీ ఇబ్బందిగా మారింది. ఒకసారి మెత్తగా, మరోసారి గట్టిగా ఉంటోంది. కొన్నిసార్లు త్వరగా పాడవుతోంది. బియ్యంలోనూ మలినాలు, విరిగిపోవడాలు ఉంటున్నాయి. నెయ్యి కూడా ఆర్గానిక్ అంటూ ఇస్తున్నారు. ఇదీ నాణ్యంగా లేదని ప్రాథమికంగా పరీక్షిస్తే తేలింది. అందువల్ల సంస్థ సేవలను తాత్కాలికంగా సస్పెండ్ చేశాం. నాణ్యమైన సరకులు ఇస్తారన్న నమ్మకం తితిదేకు వస్తే పునరుద్ధరిస్తాం. ఇది డొనేషన్ పద్ధతిన పెట్టారు. వీటన్నింటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం అన్నది ఈవో శ్యామలరావు మాట.
ఎంత అపచారం.. పందికొవ్వు సుస్పష్టం
వెజిటబుల్ ఆయిల్స్లోలో మాత్రమే ఉండే బీటా సిటోస్టెరాల్‌తోపాటు లార్డ్ (పంది కొవ్వు) వంటి పదార్థాలు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి సరఫరా చేసిన నెయ్యిలో కలిశాయన్నది సుస్పష్టం. అసలు పాల ఉత్పత్తుల్లో బీటా సిటోస్టెరాల్, లార్డ్ ఆనవాళ్లు కూడా ఉండవు. అయినా వాటిని కలిపారంటే అది వందశాతం కల్తీ నెయ్యేనని, స్వచ్ఛతకు తావే లేదన్నది నిపుణులు చెప్తోన్న మాట. నెయ్యి నాణ్యతపై నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్టీడీబీ) కాఫ్ ఇచ్చిన ఫలితాల నివేదికలపై అనుభవంగల శాస్త్రవేత్తలు, నిపుణులు అధ్యనయం చేసి భారీ కల్తీ జరిగిందని గట్టిగానే చెప్తున్నారు.
ఎన్డీడీబీ కాఫ్ నివేదికలో 39 రకాలకు సంబంధించి రసాయన పరీక్షలు చేశారు. వాటిలో 10 అంశాల్లో పదార్థాలు ప్రమాణాలకు మించి ఉన్నట్లు తేలింది. నిర్దేశించిన ప్రమాణాలకు మించినా, తగ్గినా అందులో ఏదో ఒకటి కలిసినట్లేనని గుజరాత్‌కు చెందిన నిపుణుడు అంటున్నారు. వివిధ రకాల ఆమ్లాల ప్రమాణాలు తగ్గడానికి కారణాలనూ విశ్లేషించారు. నాణ్యమైన నెయ్యిలో బుటిరిక్ యాసిడ్ 1.0 నుంచి 1.5 మధ్య ఉండాలి. అయితే 0.05 మాత్రమే ఉంది. కల్తీ చేసినందునే ప్రమాణాల కంటే తక్కువగా వచ్చింది. 0.5-2.2 మధ్య ఉండాల్సిన కాప్రోయిక్ యాసిడ్ 0.05 మాత్రమే ఉన్నట్లు తేలింది. ఇది తగ్గడానికీ కల్తీయే కారణం. లారిక్ ఆమ్లం నిర్దేశిత ప్రమాణాల (1.5-40)కు మించి 11.71 ఉన్నట్లు వెల్లడైంది.
లినోలెయిక్, లినోలెనిక్ ఆమ్లాలు ప్రమాణాలకు మించి ఉండటమే.. నెయ్యి కల్తీని రూఢీ చేస్తున్నాయి. నెయ్యిలో 99.9శాతం మిల్క్ ఫ్యాట్, 0.5% తేమ ఉంటుంది. ఇతర పదార్థాలుంటే కల్తీగానే పరిగణించాలి. అలాగే.. ఎస్-వాల్యూలో పేర్కొన్న అన్ని ఈక్వేషన్లు నిర్దేశిత ప్రమాణాలకు లోబడి లేవు. ముఖ్యంగా నెయ్యి నాణ్యతను నిర్థారించే ఎస్-వాల్యూ 5 చాలా తక్కువగా ఉంది. 95.68 నుంచి 104.32 మధ్య ఉండాలని ప్రమాణాలు నిర్దేశిస్తుంటే, 20.32 మాత్రమే ఉన్నట్లు ఫలితాల్లో తేలింది. అంటే కచ్చితంగా కల్తీ నెయ్యేనని అర్థమవుతోంది. ఈక్వేషన్ 3లో చెప్పిన ఎస్.వాల్యూ ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ (23.22)గా ఉండటం ఆందోళనకరం. అది పామోలిన్, జంతువుల కొవ్వును సూచిస్తోంది. దీన్నిబట్టి నెయ్యిలో జంతువుల కొవ్వును కలిపారన్నది నిర్థారించొచ్చు. పాల్మిటిక్ ఆమ్ల పరిమితి పెరగడంతోపాటు పాల్మిటోలైక్ ఆమ్లం ప్రమాణాలకంటే తక్కువగా ఉంది. ఇది వనస్పతి కల్తీకి గల అవకాశాలను సూచిస్తోంది.
పెద్ద మొత్తంలో ఆహార పదార్థాలు సరఫరా చేస్తున్నప్పుడు టెండర్ దక్కించుకున్న సంస్థలు అక్రమాలకు పాల్పడే అవకాశం లేకపోలేదు. ధర గిట్టుబాటు కాకపోయినా, మార్కెట్లో ధరలు పెరిగినా ఆమేరకు నాణ్యతను తగ్గిస్తారు. దీన్ని నివారించడానికి ఆహార పదార్థాల తయారీ ప్రదేశంతోపాటు వాటిని చేర్చేచోట కూడా నాణ్యతా పరీక్షలు చేయాలన్న నిబంధనలున్నాయి. ఇంత పెద్దమొత్తంలో కొనుగోలు చేస్తున్నప్పుడు సొంతంగా తనిఖీచేసే వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. ఇవేవీ జగన్ సర్కారు పాటించలేదు. గొడ్డు, పందికొవ్వులు కలిస్తే నెయ్యిలో రుచి, వాసన ఉండదన్నది నిపుణుల మాట.
బీటా సిటోస్టెరాల్: ఇది వెజిటబుల్ ఆయిల్స్లో మాత్రమే ఉంటుంది. పాల ఉత్పత్తుల్లో ఉండదు. నిబంధనల ప్రకారం నెయ్యిలో ఉండకూడదు. కానీ, శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి సరఫరా చేసిన నెయ్యిలో ఇది ఉన్నట్లు ఎన్డీడీబీ కాఫ్ నివేదిక వెల్లడిరచింది. పరీక్షించిన నెయ్యిలో ఇది వెజిటబుల్ ఆయిల్ ఉనికిని తెలియజేస్తోంది. పామోలిన్ ఆయిల్ తో నెయ్యిని కల్తీ చేశారని స్పష్టమవుతోంది.
లార్డ్ (పందికొవ్వు): పరీక్షించిన నెయ్యిలో అధిక పరిమాణంలో (ఎస్-వాల్యూ 116.09) లార్డ్ ఉన్నట్లు తేలింది. ఇది నెయ్యిలో రావడానికి అవకాశమే లేదు. దీని ఆనవాళ్లూ ఉండకూడదు. అయినా ఉందీ అంటే కచ్చితంగా కల్తీకి పాల్పడినట్లే.
లడ్డూ పవిత్రతను పునరుద్ధరించాం: తితిదే
శ్రీవారి లడ్డూ అపవిత్రంపై వస్తున్న అనుమానాలను నివృత్తి చేస్తూ తితిదే ఎక్స్ వేదికగా స్పందించింది. శ్రీవారి లడ్డూ ప్రసాదాల పవిత్రత పునరుద్ధరించామంటూ పోస్టు పెట్టింది. గతంలో ఉపయోగించిన నెయ్యి, ప్రస్తుతం వినియోగించిన నెయ్యి వివరాలను ఆ పోస్టులో వివరించింది. నెయ్యి కల్తీని నిర్దారించిన ల్యాబ్ రిపోర్టును తితిదే ఎక్స్‌లో పోస్టు చేసింది. నందిని డెయిరీ నెయ్యి ల్యాబ్ రిపోర్టును కూడా పక్కనే పోస్టు చేస్తూ.. లడ్డూ నాణ్యతపై భక్తుల్లో ఉన్న అపోహలు తితిదే తొలగించింది.
దేవదేవుడే..
నాతో చెప్పించాడేమో..
దైవత్వాన్ని విశ్వసించే వ్యక్తిగా అలాగే అనుకుంటున్నా. మనం మనుషులం.. నిమిత్తమాత్రులం. పవిత్రతా పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే వ్యక్తిని నేను. ప్రజల మనోభావాలంటే వైసీపీది లెక్కలేనితనం. లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో రివర్స్ టెండర్లా? ఈ దారుణం ఎక్కడైనా చూస్తామా? వెంకన్నకు అపచారం చేసిన ఎవ్వరినీ వదిలేది లేదు. తిరుపతి పవిత్రతను కాపాడేందుకు మహాశాంతియాగంతో సంప్రోక్షణ నిర్వహించాం.
ప్రతి మతానికీ కొన్ని సంప్రదాయాలు, కట్టుబాట్లు ఉంటాయి. మతం ఏదైనా వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంటుంది. దేవాలయాల పవిత్రత, భక్తుల మనోభావాలను కాపాడేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాను. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో స్వామికి అపచారం జరగడం దేశవ్యాప్తంగా బాధించేదే. గత ప్రభుత్వం హయాంలో దేవాలయాల్లో అనేక అపచారాలు జరిగాయి. రామతీర్థంలో రామచంద్రమూర్తి విగ్రహాన్ని ధ్వంసం చేసి.. తల తొలిగించినా ఆనాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. గత పాలకులు ప్రజల మనోభావాలకు ఎలాంటి విలువా ఇవ్వలేదు. తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో అపవిత్ర పదార్థాలను నిర్థారిస్తూ ఎన్‌డిడిబి నివేదిక ఇస్తే.. దానికి సమాధానం చెప్పకుండా బుకాయించేవాళ్లను ఏమనాలి? కిలో ఆవు నెయ్యి రూ.320కు ఎలా వస్తుంది? శ్రీవారికి నైవేధ్యంగా పెట్టే లడ్డూ తయారీలో రివర్స్ టెండర్లు ఏంటి? పరమ పవిత్ర పుణ్యక్షేత్రం దగ్గర తీసుకునే నిర్ణయాల్లో ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి కదా! తప్పు చేసింది కాక, సిగ్గులేకుండా ఎదురుదాడి చేస్తారా?
అధికారంలోకి వచ్చిన సమయంలోనే ..తిరుమల ప్రక్షాళనకు కొత్త ఈవోను ఆదేశించాను. ఈవో చర్యలు మంచి ఫలితాలు ఇచ్చాయి. లడ్డూ నాణ్యత పెంచారు. పలు కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టారు. లడ్డూ నాణ్యత కోసం నందినినుంచి మళ్లీ నెయ్యి కోనుగోలు చేశారు. టీటీడీ ఈవోకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తూ.. ప్రక్షాళన చేశారేకానీ ఇవన్నీ రోజూ బయటకు వచ్చి చెప్పలేదు. ఇప్పుడు ఆ ఏడుకొండల వాడే నాతో లడ్డూ అపవిత్రతపై మాట్లాడిరచాడేమో! ఆ దేవుడు నా నోటినుంచి నిజాలు చెప్పించాడేమో! మనం నిమిత్తమాత్రులం. దేవుడే అన్నీ చేయిస్తాడు. ఇదీ అంతే అనుకుంటున్నా.్ణ్ణ
ఏడుకొండలవాడా క్షమించు
శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. కలియుగ ప్రత్యక్ష దైవం బాలాజీకి జరిగిన ఘోర అపచారానికి సనాతన ధర్మాన్నినమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అమృతతుల్యంగా.. పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది. జంతు అవశేషాలతో మలినమైంది. విశృంఖల మనస్కులే ఇలాంటి పాపానికి ఒడిగడతారు. లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం మనసు కలత చెందింది. అపరాధ భావానికి గురైంది. అందుకే నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయ సంకల్పించానంటూ పవన్.. తన దీక్షను పూర్తి చేశారు. సెప్టెంబర్ 22న గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీదశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపట్టారు. 11 రోజులపాటు దీక్ష కొనసాగించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. దేవదేవా… నీపట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమని వేడుకున్నారు. వైకుంఠ దామంగా భావించే తిరుమల పవిత్రతకు, వేదాచారాలకు, ధార్మిక విధులకు కళంకం తెచ్చేలా పెడపోకడలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరినీ బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మాన్ని పునరుద్ధరించుకొనే దిశగా రాష్ట్ర ప్రజలు అడుగులు వేసే తరుణం ఆసన్నమైందని అంటూ.. ధర్మో రక్షతి రక్షితః అని పవన్ పిలుపునిచ్చారు.
, .
అందుకే..
అంత పవిత్రం..
ప్రపంచంలోనే తిరుమల లడ్డూకి ప్రత్యేకత ఉంది. లడ్డూ ప్రసాదం గురించి తెలియనివారుండరు. అనేక రకాల ప్రసాదాలున్నప్పటికీ భక్తులకు అందుబాటులో ఉండేది, దొరికేది లడ్డూ మాత్రమే. అసలు ఇది ప్రసాదంగా నిర్ణయమవడానికి వెనకున్న అంశాల్లోనూ ఆధ్మాత్మిక పవిత్రత కనిపిస్తోంది. మహాప్రసాదంలో కల్తీ నెయ్యి కళంకం వెలుగుచూడటంతో.. ప్రసాదం వెనకున్న కథనాలు, నమ్మకాలు, ఆధ్యాత్మిక సౌరభాలు మళ్లీ ప్రజల ముంగిటకు వచ్చాయి. అలాంటి వాటిలో ఈ అధ్యయనం ఒకటి.
క్రీ.శ. 614లో పల్లవరాణి సమవాయి తిరుమల ఆలయానికి భోగశ్రీనివాసమూర్తిని కానుకగా సమర్పించుకుంది. ఈ విగ్రహం పంచబేరాల్లో ఒకటిగా ఉంది. పల్లవుల కాలంలోనే భగవంతునికి పల్లవ ప్రసాదం సమర్పించేవారు. అప్పట్లో తిరుమలకు చేరుకునేవారి సంఖ్య చాలా తక్కువగా ఉండేది. అనంతరం శ్రీ రామానుజాచార్యుల రాకతో తిరుమల ప్రాశస్త్యం పెరిగింది.
అనంతరం స్వామివారికి సమర్పించే నైవేద్యానికి రెండవ దేవరాయల కాలంలో అమాత్య శేఖరమల్లన్న మూడు గ్రామాలను సమర్పించారు. వీటిపై వచ్చే ఆదాయంతో నిత్యం సేవలు నిర్వహించేవారు. మల్లన్న కాలంలోనే శ్రీవారికి సమర్పించే సేవల వివరాలతో సమయ పట్టిక తయారుచేశారు. అప్పట్లో భక్తులకు ప్రసాదంగా తిరుప్పొంగం ఇచ్చేవారు. అనంతరకాలంలో మనోహరపడి, సుక్కీయం, అప్పం.. తదితర వాటిని స్వామివారికి సమర్పించేవారు. విజయనగర ప్రభువుల కాలంలో అవసరం అనే ప్రసాదాన్ని ఇచ్చేవారని శాసనాలు పేర్కొంటున్నాయి.
మూడువందల ఏళ్ల క్రితమే తిరుమలలో తీపి ప్రసాదాన్ని భక్తులకు ఇచ్చేవారని తెలుస్తోంది. 1803లో బ్రిటిషువారు ప్రసాదాల విక్రయాన్ని ప్రారంభించాలని ఆలయ నిర్వాహకులకు సూచించారు. అప్పట్లో వడకు ఎక్కువ డిమాండ్ ఉండేది. ఎందుకంటే అవి ఎక్కువ రోజులు నిల్వవుండేవి. అనంతరం మహంతుల హయాములో తీపి బూందీ ఇచ్చేవారు. ఈ ప్రసాదమే కొంతకాలంలో లడ్డూగా మారింది.
1940ల్లో మిరాశీదార్లలో ఒకరైన కల్యాణం అయ్యంగార్ లడ్డూ ప్రసాదం ఇవ్వడం ప్రారంభించారు. ఈ ప్రసాదానికి విశేషమైన ఆదరణ లభించింది. తిరుమల అంటే లడ్డూ ప్రసాదం అనేంతగా పేరు వచ్చింది. మనకు మాములుగా తెలిసిన లడ్డూలూ రెండు మాత్రమే. భక్తులకు దర్శనంతోపాటు ఇచ్చేది. అదనంగా కావాలంటే రూ.50 పెట్టి కొనుగోలు చేసేది. ఇదికాకుండా, రెండో రకం కల్యాణోత్సవం లడ్డూ, దీని ధర రూ.200. ఇవే కాకుండా ఆస్థానం లడ్డూ అని మరొకటి ఉంది. ప్రత్యేక పర్వదినాల్లో, రాష్ట్రపతిలాంటి విశిష్ట అతిథులు వచ్చిన సమయాల్లో వీటిని తయారుచేస్తారు. బరువు 750 గ్రాములు. లడ్డూలో వాడే పదార్ధాలను కొలతల ప్రకారమే వినియోగిస్తారు. దీనికి ప్రత్యేకంగా దిట్టం ఉంటుంది. ఒక ప్రోక్తం అంటే 51 లడ్డూలు. లడ్డూ తయారీలో సెనగపిండి, చక్కెర, జీడిపప్పు, యాలకులు, ఆవు నెయ్యి, కలకండ, ఎండుద్రాక్ష… తదితర పదార్థాలు వినియోగిస్తారు. లడ్డూ ప్రసాదానికి పేటెంట్ వుంది. 2009లో జీఐ (భౌగోళిక గుర్తింపు) లభించింది.
ఎందుకంత రుచి
కలియుగంలో కలౌ వేంకటనాయక.. అన్నారు కదా! అందుకే ఆ శ్రీనివాసుని ప్రసాదం ముందు సాటిరాగల పదార్థాలు ఏవైనా ఉంటాయా? అన్న రీతిలో దేవదేవుని ప్రసాదాలు అత్యంత రుచికరంగా ఉంటాయి. తిరుమల కొండల్లో ప్రవహించే నీరు, వాతావరణం, ఆలయంలో పోటు… అన్నీ కలిసి స్వామివారి ప్రసాదాన్ని విశిష్టంగా నిలుపుతున్నాయి..
డైవర్షన్ పాలిటిక్స్..
రాజకీయాల కోసం దేవుడినీ వాడుకోవాలనే దుర్మార్గ మనస్తత్వం ప్రపంచంలో చంద్రబాబు ఒక్కడికే ఉందంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించడం విడ్డూరం. ల్యాబ్ రిపోర్టుల సాక్షిగా కల్తీ అయిన మహాప్రసాదం వ్యవహారం బట్టబయలైనా.. ప్రభుత్వంపు ఎదురుదాడికి దిగి.. చేసిన తప్పునుంచి తప్పించుకోవడానికి, కప్పిపుచ్చడానికే ప్రయత్నించాడు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని తిరుమల ఆలయానికి అపవిత్రత ఆపాదిస్తావా?. లడ్డూ తయారీ ప్రక్రియను దారుణంగా అభాసుపాలు చేస్తావా? నెయ్యిపై రెండు నెలల క్రితం వచ్చిన నివేదికను ఇప్పుడు టీడీపీ కార్యాలయంలో విడుదల చేస్తావా? రాజకీయంగా కొట్లాడాలనుకుంటే.. నాతో కొట్లాడు. రాజకీయ స్వార్థం కోసం టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రకు పాల్పడ్డ చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలంటూ ప్రధానికి, సీజేఐకి జగన్ లేఖలు రాయడాన్ని ప్రజలే తప్పుబడుతున్నారు. రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం. చంద్రబాబు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ 5.. వీరంతా ఉన్మాదస్తులు.. ఉన్మాదంతో బాధపడుతున్నారు. రాజకీయంగా కొట్లాడాలనుకుంటే చెయ్.. బంగారంగా చెయ్.. మేమంతా ఆహ్వానిస్తాం. ప్రజలకు ఫలానా మంచి చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చావ్. ఆ మంచి చేసి ప్రజల మన్ననలు పొందు. కానీ ఇవేం రాజకీయాలు..? ఒక అబద్ధాన్ని సృష్టించడం, దాన్ని అమ్మడం, ఆ అబద్దం ద్వారా మనుషుల మీద బురద జల్లడం ఎంత వరకూ ధర్మం? అంటూ వైఎస్ జగన్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసి మళ్లీ మళ్లీ అభాసుపాలయ్యాడు. మాజీ ముఖ్యమంత్రి జగన్ కపటి నాటకం బట్టబయలు కావడం, కల్తీ ఉదంతం ల్యాబ్ రిపోర్టులతో పక్కాగా బయటపడటం.. జగన్ చెప్పేవన్నీ అబద్ధాలని తేలిపోవడంతో.. ప్రజలే ఛీకొట్టే పరిస్థితిని జగన్ తనంతట తానే కొనితెచ్చుకున్నాడు.
మహాశాంతియాగంతో
సంప్రోక్షణ
దేవదేవుడికి జరిగిన మహాపరాథాన్ని మహా శాంతియాగంతో సంప్రోక్షణ చేశారు. శ్రీవారి లడ్డూ కల్తీ దుమారంపై భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మహాపరాధానికి ఎలాంటి కీడు సంభవించబోతోందనే భయాందోళనలూ వ్యక్తం చేస్తున్న వేళ.. `అత్యవసరంగా సమావేశమైన తితిదే కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల పవిత్రతను కాపాడే అంశాన్ని సుదీర్ఘంగా చర్చించింది. తిరుపతిలోని తితిదే పరిపాలన భవనంలో ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులతో ఈవో శ్యామలరావు భేటీ అయ్యారు. లడ్డూ అపవిత్రత నేపథ్యంలో సంప్రోక్షణపై ప్రధాన అర్చకుడు, ఆగమ పండితులతో ఈవో చర్చించారు. శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం నిర్వహించాలని నిర్ణయించి.. ప్రభుత్వ అనుమతి తీసుకున్నారు. మరోపక్క ఆగమ పండితులు, జీయర్లు, కంచి పీఠాధిపతులు, సనాతన ధర్మ పండితులతో చర్చించి సంప్రోక్షణ ఎలా ఉండాలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమాచారం తీసుకున్నారు. అలా, భక్తుల మనసు కుదటపడటానికి, పవిత్రతకు కలిగిన భంగాన్ని నివారించడానికి `స్వామి సన్నిధిలో మహా శాంతియాగం నిర్వహించారు.
ఆహా.. ఏమి రుచి!
పదార్థానికి కాదు, పవిత్రతది!
తిరుపతి వేంకటేశ్వరస్వామి దర్శనమంటే భక్తులకు మధురానుభూతి. శ్రీవారి ప్రసాదాన్ని భక్తులు అపురూపంగా భావిస్తారు. నెలరోజులైనా లడ్డూ రుచి, వాసన తగ్గేది కాదు. తిరుమల యాత్ర ముగించుకుని ఇంటికొచ్చిందాకా.. లడ్డూల కవర్లు నేలను తాకనివ్వకుండా జగ్రత్తపడేవారు. ఇంటికి తెచ్చిన లడ్డూను ఎంతో పవిత్రంగా బంధుమిత్రులకు పంచేవారు. తిరుమలలో శ్రీవేంకటేశ్వరుని లడ్డూ ప్రసాదాన్ని ఎలా తయారు చేస్తారంటే…
శ్రీవారి గర్భాలయానికి ఆగ్నేయంలో ఉన్న పోటు (వంటశాల)లో తయారుచేసిన ప్రసాదాలను.. ముందుగా వకుళమాతకు చూపించి, అనంతరం స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. లడ్డూల తయారీకి వినియోగించే వస్తువులు, సరకులను ఏది ఎంత మోతాదులో వాడాలో సూచించేదే దిట్టం. తొలిసారిగా 1950లో దిట్టంను నిర్ణయించారు. 2001లో సవరించిన దిట్టాన్ని తితిదే ప్రస్తుతం అనుసరిస్తోంది. 2001 దిట్టం ప్రకారం.. 5,100 లడ్డూల తయారీకి 803 కిలోల సరుకులు వినియోగిస్తారు. ప్రస్తుతం 3.50 లక్షల లడ్డూల తయారీకి అవసరమైన దిట్టాలను పోటుకు అందిస్తున్నారు.
15ఏళ్ల క్రితం బూందీపోటును ఆలయానికి వెలువల ఉత్తరభాగాన ఏర్పాటుచేశారు. బూందీని వెలుపల తయారుచేసి, కన్వేయర్ బెల్టు ద్వారా ఆలయానికి తీసుకెళ్లి ఆగమోక్తంగా స్వామివారి ప్రాకారం లోపలే లడ్డూలు తయారు చేస్తున్నారు. తర్వాత ట్రేల ద్వారా ఆలయం వెలుపల లడ్డూ కేంద్రానికి కన్వేయర్ బెల్టు ద్వారానే తరలిస్తున్నారు. చిన్న లడ్డూ: 140- 170 గ్రాములు. కల్యాణం లడ్డూ: 700 గ్రాములు. రోజుకు తయారయ్యే చిన్న లడ్డూలు: 3.5 లక్షలు. రోజుకు తయారయ్యే కల్యాణం లడ్డూలు: 7100. రోజుకు తయారయ్యే వడలు: 4 వేలు. రోజుకు తయారయ్యే మినీ లడ్డూలు (ఉచిత పంపిణీకి): 1,07,100.
శ్రీనివాసునికి 50 రకాల ప్రసాదాలు
శ్రీనివాసునికి ఆగమశాస్త్రంలో నిర్దేశించినట్లు 50 రకాల ప్రసాదాలను నివేదిస్తున్నారు. స్వామికి నివేదించే ప్రసాదాల్లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. వెయ్యేళ్ల క్రితం శ్రీరామానుజాచార్యులు నిర్దేశించిన నిబంధనల ప్రకారం శ్రీవారికి నైవేద్యం ఇప్పటికీ సమర్పిస్తున్నారు. సుప్రభాతం సేవ నుంచి రాత్రి ఏకాంతసేవ వరకు ప్రసాద నివేదనలు జరుగుతాయి. రోజూ జరిగే నిత్యసేవల వివిధ రకాల నివేదన సమర్పిస్తారు.
సుప్రభాత సమయంలో నవనీతం, గోక్షీరంతో తయారుచేసిన పదార్థాలను నివేదిస్తారు. తోమాల పూర్తయిన తర్వాత కొలువు సమయంలో నల్లనువ్వులు, బెల్లం, శొంఠి నైవేద్యంగా సమర్పిస్తారు. సహస్రనామార్చన తర్వాత జరిగే మొదటిగంటలో మీగడ, వెన్న, పెరుగుతో తయారుచేసిన అన్నాన్ని స్వామివారికి నివేదిస్తారు. రోజువారీ చిత్రాన్నం, దద్దోజనం, క్షీరాన్నం, కదంబం, పాయసాన్నం స్వామివారికి సమర్పిస్తారు. మధ్యాహ్నం ఆరాధనలో నాదుకం, లడ్డూ, దోసె, వడ, అప్పం నైవేద్యంగా పెడతారు. సాయంకాలం అష్టోత్తర శతనామార్చన తర్వాత శుద్దన్నం, సీరా నివేదన జరుగుతుంది. రాత్రి నైవేద్య సమయంలో తోమాల తర్వాత మిరియాలతో తయారుచేసిన మరీచ్చాన్నం, ఉడాన్నం నివేదిస్తారు. రాత్రి ఆరాధన తర్వాత ఏకాంతసేవలో పాయసం నైవేద్యంగా పెడుతున్నారు.
