ప్రక్షాళన మొదలైంది!
తిరుమల వెంకన్నసామికి అపచారం జరిగిందన్న అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. తిరుమలను అపవిత్రం చేసినవాళ్లు ఎంతటి వాళ్లయినా వదిలేది లేదని, తప్పుచేసిన వాళ్లకు శిక్షలు తప్పవని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు.
తిరుమలలో గత ప్రభుత్వం భక్తులకు నాసిరకం భోజనంపెట్టి తిరుమల తిరుపతి పవిత్రతను, భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే పాలనను తిరుమల ప్రక్షాళన నుంచే మొదలుపెట్టాను. అది ప్రజలకూ తెలుసు. ఇప్పటికే చాలావరకు ఫలితాలు సాధించాం. మహా ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించి అపవిత్రం చేసిన వాళ్ల ఆధారాలు లభ్యమైన వెంటనే చర్యలు తీసుకుంటాం. తప్పు చేస్తే ఎవరినైనా శిక్షించాల్సిందే. తిరుమల ప్రసాదం తయారీలో నాసిరకం ముడి సరుకులు, అపవిత్ర పదార్థాలు వాడినట్టు ల్యాబ్ రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. ఇందుకు కారకులెవరో కనిపెట్టి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. వెంకటేశ్వరస్వామి హిందువులకు కలియుగ దైవం. ఇలా చేస్తారని ఎవరూ ఊహించరు. ఎవరైనా శ్రీవారికి అపచారం తలపెడితే.. వచ్చే జన్మలో కాదు, ఈ జన్మలోనే శిక్షిస్తాడని భక్తుల విశ్వాసం. హిందువులు జీవితంలో ఒక్కసారైనా వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలని, కోరికలు చెప్పుకోవాలని అనుకుంటారు. అలాంటి పవిత్రమైన ప్రదేశాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించిన దుర్మార్గులను ఏంచేయాలో అర్థం కావడంలేదు. కక్కుర్తికి కూడా హద్దులుంటాయి. కానీ హద్దులు దాటి ప్రవర్తించి ఏదైనా చేస్తామనే పరిస్థితికి వచ్చారు గత పాలకులు. ఇంటివద్దే తిరుమల సెట్ వేసి పైశాచిక ఆనందం పొందడాన్ని మనం చూశాం. ఇది అతని మానసిక ప్రవర్తన, అహంకారానికి నిదర్శనం. ఒకవిధంగా అదీ.. స్వామికి అపచారం చేసినట్టే. భక్తుల మనోభావాలు దెబ్బతిని చాలామంది అప్పుడూ బాధపడ్డారు. ఎన్టీఆర్ తిరుమలలో అన్నదానం ప్రవేశపెట్టి పవిత్ర కార్యంగా చూస్తే.. గత ప్రభుత్వం ఆ మహత్కార్యం స్థాయిని దిగజార్చి.. నాసిరకం అన్నదానం చేయడంపై గతంలోనే ఫిర్యాదులు వచ్చాయి. మొత్తం తిరుమల వ్యవస్థను చక్కదిద్ది.. పవిత్రతను ఆపాదించే కార్యాచరణను ఎన్డీయే సర్కారు మొదలుపెట్టింది. స్వామి సన్నిధిని అడ్డా చేసుకుని బరితెగింపుతో వ్యాపారాలు చేసిన వారి సంగతి తేల్చడానికి ఇప్పటికే విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఇప్పుడు `కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన మహాప్రసాదం కల్తీ వ్యవహారంపై సిట్ దర్యాప్తునకు ఆదేశించాం. స్వామికి అపచారం చేసిన దుర్మార్గులు ఎవరన్నది తొందరలోనే తేలుస్తాం.

చెరపకురా.. చెడేవు!
ఎవడు తీసిన గోతిలో వాడే పడతాడు `లాంటి తెలుగు నానుడులకు పర్ఫెక్ట్ పగ్జాంపుల్గా జగన్‌రెడ్డి. తెలిసో తెలియకో జరిగిన తప్పుకు సారీ చెప్పకుండా.. కల్తీ లడ్డూ అపచారాన్ని రాజకీయ రాద్ధాంతం చేద్దామని కుట్రపన్ని చివరకు బోర్లాపడ్డాడు. కలియుగ దైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే ఆసక్తి లేకపోయినా.. తిరుమల వెళ్తున్నానంటూ ప్రకటన చేయడం వెనుక కుట్ర కోణం లేదని చెప్పలేం. మహా ప్రసాదానికి జరిగిన అపచారంపై సనాతన భక్తులు భగ్గుమంటున్న తరుణంలో.. ఉద్దేశపూర్వకంగా అపచారానికి పాల్పడ్డాడని అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి తిరుమలకు వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో జగన్‌కు తెలీంది కాదు. జగన్‌కు కావాల్సింది కూడా అదే. డ్రామా, సింపతీ అనే అంశాలచుట్టూ రాజకీయాన్ని నడిపే అబద్ధాల జగన్.. తాను తిరుమలకు వెళ్తున్నానంటూ రెండురోజులు ముందుగానే ప్రకటించాడు. పక్కాగా షెడ్యూల్ ప్రకటించి.. పార్టీ వర్గాలను సైతం భారీగా మోహరించే ప్రయత్నం చేశాడు. హిందూ ధర్మంమీద అచెంచల విశ్వాసమున్న భక్తుల అహన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన జగన్.. తిరుమలపై ఒకవిధంగా దాడికే జగన్ తెగబడుతున్నాడన్న వాదనను సొంత వర్గీయుల నుంచే బయటకు వదిలాడు. మోహరింపులతో నియంత్రణ తప్పి రాద్దాంతం రక్తసిక్తమైతే.. ప్రజలముందు ప్రభుత్వాన్ని దోషిగా నిలపాలన్నది జగన్ కుట్ర. పార్టీ వర్గాలను భారీగా మొహరింపచేసి.. చిట్టచివరి క్షణంలో పర్యటన రద్దు చేసుకుని.. ప్రభుత్వం అడ్డుకుందనీ ప్రచారం చేయొచ్చు.. ఘర్షణ వాతావరణం సన్నివేశాన్ని ప్రజలకు సినిమాగా చూపించవచ్చన్న వ్యూహం విఫలమైంది. తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్టు.. జగన్ ఆశించిందేదీ జరగలేదు. అన్యమతస్థులు స్వామిని దర్శించుకోవాలంటే అనుసరించాల్సిన నియమ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ట్వీట్ చేశారు. రాజకీయంగా జగన్ ఇరుకున పడటానికి ఆ ట్వీటే పాశుపతాస్త్రమైంది. అన్యమతస్థుడినని అంగీకరిస్తూ డిక్లరేషన్ ఇవ్వడం జగన్‌కు ఇష్టం లేదు. ఒకవేళ తన తప్పు కప్పిపుచ్చుకునేందుకు డిక్లరేషన్ ఇచ్చే సాహసం చేస్తే.. రాజకీయ జీవితానికి అదే బూమరాంగ్ కావొచ్చు. జగన్ రాజకీయ జీవితానికి ఫుల్స్టాప్ పెట్టే అంశమది. ముఖ్యమంత్రిగా తాను గతంలో అనేకమార్లు తిరుమలకు వెళ్లినా.. ఎలాంటి డిక్లరేషన్ ఇవ్వలేదన్న విషయాన్ని ఈ సందర్భంలో జగన్ తన నోటితో తానే చెప్పుకోవాల్సి వచ్చింది. భక్తిపారవశ్యంతో భగవంతుని దర్శించుకోవాల్సిన జగన్.. అధికారదర్పంతో ఆచార సంప్రదాయాలను మంటగలిపాడన్న ఆగ్రహాన్నీ మరోసారి చవిచూడాల్సి వచ్చింది. కుట్రలు, కుతంత్రాలతో మొత్తం వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మలచుకుని.. ప్రభుత్వంపై బురదజల్లుదామనుకున్న జగన్.. చివరకు బోర్లాపడ్డాడు. జగన్ కుట్రను ప్రభుత్వాధినేత చంద్రబాబు చేధించడంతో.. జగన్ మళ్లీ కొత్త కుట్ర రచించుకోడానికి పరదాల వెనక్కి పోవాల్సి వచ్చింది.
తన తిరుమల పర్యటన రద్దును సైతం ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమంగా ప్రజలముందు వివరించి.. పచ్చి అబద్ధాలను ప్రచారం చేసిన జగన్‌పై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహాన్నే వ్యక్తం చేశారు. మొత్తం పరిణామాలపై మీడియాతో మాట్లాడుతూ.. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామిపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి వెళ్లడం జగనుకు ఇష్టంలేని అంశం. అందుకు తిరుమల ప్రయాణం రద్దు చేసుకుని.. అదేదో ప్రభుత్వం అడ్డుపడినట్టుగా చెప్పడం జగన్ తరహా రాజకీయం. అతను చెప్తున్నట్టు జగన్‌కు నోటీసిచ్చివుంటే.. మీడియాకు చూపించాలి. అదీ చూపించలేదు. పైగా తనకే జరిగితే.. దళితుల్ని దేవాలయాల్లోకి రానిస్తారా? అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు విద్దేషాలను రెచ్చగొట్టేవే. సంబంధంలేని వ్యాఖ్యలు చేసి రాష్ట్రంలో అజలడి సృష్టించాలన్న నీచ రాజకీయాలు సాగే కాలం కాదిది.
దళితుల్ని దేవాలయాల్లోకి వెళ్లకుండా ఎవరు అడ్డుకుంటారు.? అతను తిరుమల వెళ్లకుండా ఉండేందుకు సాకులు వెతుక్కోవడమే కాదు, క్రూర రాజకీయానికి తెరలేపడం కాదూ. వైకాపా ప్రభుత్వ హయాంలో తితిదే నెయ్యి కొనుగోళ్లకు టెండర్ నిబంధనలు ఎందుకు మార్చారు? రివర్స్ టెండరింగ్ పేరుతో కిలో రూ.319కి కాంట్రాక్ట్ ఇచ్చి, నాణ్యత లేని, నాసిరకం నెయ్యి కొని ప్రసాదాల్ని ఎందుకు అపవిత్రం చేశారు? తిరుమలలో ప్రసాదం, అన్నదానంలో పెట్టే భోజనం బాగాలేవని, గదులు శుభ్రంగా ఉండట్లేదని వైకాపా హయాంలో భక్తులు ఎన్నిసార్లు ఆందోళనలు చేశారో గుర్తు లేదా? పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో చేయకూడని ఘోరాలన్నీ చేసి, ఇప్పుడు మాపై ఎదురుదాడికి దిగుతున్నారు అని చంద్రబాబు నిప్పులు చెరిగారు.
పనిమొదలెట్టిన
సిట్ చీఫ్ త్రిపాఠి!
శ్రీవారి లడ్డు తయారీలో వినియోగించే కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్).. తన విచారణ చేపట్టింది. తొలుత సిట్ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కమిటీకి నేతృత్వం వహిస్తున్న గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, తిరుపతి ఏఎస్పీ వెంకట్రావు, డీఎస్పీలు సీతారామారావు, శివ నారాయణ స్వామి, సీఐలు సత్యనారాయణ, ఉమామహేశ్వర్, సూర్యనారాయణ స్వామివారి సేవలో పాల్గొన్నారు. స్వామి దర్శనానంతరం తితిదే అధికారులు వారికి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల సహస్ర దీపాలంకరణ సేవ, ఉత్సవమూర్తులను త్రిపాఠి దర్శించుకున్నారు. తిరుమల నుంచి బయలు దేరిన సిట్ సభ్యుల బృందం పద్మావతి అతిథి గృహానికి చేరుకొని సమావేశం కానుంది. మూడు రోజులపాటు తిరుపతిలో బస చేయనున్న సిట్ అధికారులు దర్యాప్తు కొనసాగించనున్నారు.
తిరుమల వెంకన్నపట్ల అపచారానికి పాల్పడిన దుష్టుల నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేయడం తెలిసిందే. తప్పెక్కడ జరిగింది? దేవదేవుడిపట్ల అంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది ఎవరు? వడ్డికాసులవాడికి కల్తీ ప్రసాదంపెట్టి.. కాసులు సంపాదించాలనుకున్న కక్కుర్తిగాళ్ల బండారం బయటపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కు చీఫ్‌గా సర్వశ్రేష్ఠ త్రిపాఠికి బాధ్యతలు అప్పగించడం తెలిసిందే. జగన్ పాలనలో తిరుమలలో చోటుచేసుకున్న అపచారాలు, జంతు కొవ్వులు కలిసిన కల్తీ నెయ్యితో ప్రసాదం తయారీ, ఇతర అక్రమాలు, అధికార దుర్వినియోగాలను గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి బయటపెట్టాల్సి ఉంది.
