స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ -నినాదంతో కంపెనీలను ఆహ్వానిస్తున్నాం. పెట్టుబడులకు అత్యుత్తమ వాతావరణాన్ని కల్పించే బాధ్యత తీసుకుంటున్నాం. ఏపీని దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు మేము చేస్తున్న కృషికి నిదర్శనమే -టీసీఎస్. విశాఖ సాగరతీరానికి టాటా గ్రూప్స్‌నుంచి వస్తోన్న మణిపూస. భవిష్యత్ పెట్టుబడులకు ఓ మైల్ స్టోన్.
బిగ్ అనౌన్స్‌మెంట్ ఇవ్వబోతున్నా, వెయిట్ చేయండంటూ ఊరించి ఆసక్తి రేకెత్తించిన ఐటీ మంత్రి నారా లోకేష్.. ‘యస్.. టీసీఎస్’ అంటూ పదివేల ఉద్యోగాలు కల్పించే సంస్థను పట్టుకొచ్చి వెరీ బిగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. విశాఖ సాగర తీరానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ని తీసుకురావడం.. 10వేలమందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు ప్రకటించడం చిన్న విషయమేం కాదు. నిజానికి టీసీఎస్‌ను ఒప్పించడం -తాను కొత్త ఛాలెంజ్‌లకు సన్నద్ధమవ్వడంగా ప్రకటించుకోవడం.. లోకేష్ రాకెట్ స్పీడ్‌ని చెప్పకనే చెబుతుంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ఏపీ ప్రఖ్యాత కంపెనీలను స్వాగతిస్తోందని ప్రకటించిన యువనేత -రాష్ట్రానికి సర్‌ప్రైజ్ దసరా గిఫ్ట్ ఇచ్చినట్టే. అందాల విశాఖ సాగరతీరంలో టాటా కన్సల్టెన్సీ సర్వీస్ మరో మణిపూస కానుంది. మెరుగైన జీతభత్యాలు అందించే 10 వేల ఐటీ ఉద్యోగాలు యువతకు లభించడం ఖాయం. ఆంధ్రప్రదేశ్‌లో ఈవీ, ఏరో స్పేస్, స్టీల్, హోటల్స్, టూరిజం రంగాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు పరిశీలిస్తామని టాటా గ్రూప్ హామీ ఇవ్వడం బోనస్ అనుకోవాలి.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ఏపీ ప్రఖ్యాత కంపెనీలను స్వాగతిస్తోందని చెబుతున్న ఐటీ మంత్రి.. ఐటీ, ఎలక్ట్రానిక్స్, పారిశ్రామికాభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిపేందుకు వేగంగా అడుగులేస్తున్నట్టు ప్రకటించారు. ఐటీ అభివృద్ధిలో గేమ్ ఛేంజర్‌కానున్న టాటా గ్రూప్‌ని ఒప్పించి మెప్పించి టీసీఎస్‌ను రప్పించడంతో.. లోకేష్‌పై ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి.
తండ్రినుంచి పుణికి పుచ్చుకున్న విజన్‌ను తనదైన స్టయిల్లో ప్రయోగిస్తూ.. యువనేత దూసుకుపోతున్నాడు. ఏపీని మూడు క్లస్టర్లుగా విభజించి -అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర, మధ్య రాజధానిలో ఆయా భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా పారిశ్రామికాభివృద్ధి సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో భాగగా పెట్టుబడుల ఆకర్షణకు పరుగులు పెడుతున్న లోకేష్ -ఈనెల 25నుంచి ‘ఫారిన్ టూర్’కి సన్నద్ధమవడం ఆసక్తికరంగా మారింది. ఐదేళ్లలో లక్ష కోట్ల పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా లోకేష్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. ఐదేళ్ల పాలనలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న ముఖ్యమంత్రి మాట నిలబెట్టేందుకు అనుగుణమైన ప్రణాళికలనే లోకేష్ సిద్ధం చేస్తున్నారన్నది బలంగా వినిపిస్తోన్న మాట. ఈనెల 25 నుండి నవంబర్ 1వరకూ అమెరికాలో పర్యటించనున్న లోకేష్ -అక్టోబర్ 29, 30 తేదీలలో శాన్‌ఫ్రాన్సిస్కోలో జరగనున్న ‘9వ వార్షిక ఐటి సర్వ్ సినర్జీ సదస్సు’లో పాల్గొని ఐటి పెట్టుబడుల ఆకర్షణకు కృషి చేయనున్నారు. ఇప్పటికే విశాఖపట్టణంలో రెండు దఫాలుగా ఐటి కంపెనీలతో సమావేశమై అక్కడి మౌలిక వసతుల గురించి, ఇప్పటి వరకూ ఆయా కంపెనీల సక్సెస్ రేట్, భవిష్యత్ ప్రణాళికల గురించి విస్తృతంగా చర్చించారు లోకేష్.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరానికి హెచ్.సి.ఎల్‌ను తీసుకురావడం ద్వారా 4,500 మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. ఇప్పుడు దాని విస్తరణ ద్వారా మరో 5500 మందికి ఉద్యోగాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆ బాధ్యతను లోకేష్ తన భుజస్కంధాలపై వేసుకున్నట్టు తెలుస్తోంది. ఫేజ్ 2గా రాష్ట్రంలో విస్తరణ చేపట్టి.. పదివేల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు హెచ్‌సీఎల్ సన్నధ్ధమవుతోంది.
విభజిత ఆంధ్రప్రదేశ్‌లో 2014-2019 మధ్య ఐటీ పరిశ్రమల అభివృద్ధికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎంతో కృషి చేశారు. అప్పటికే విశాఖపట్టణం, విజయవాడ సమీపంలోని గన్నవరం, తిరుపతి, చిత్తూరు తదితర కేంద్రాలలో ఉన్న ఐటి కంపెనీలకు మరిన్ని సదుపాయాలు కల్పించి ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు కొత్త కంపెనీల ఏర్పాటును ప్రోత్సహించారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2019-24 మధ్య కాలంలో అనేక ఐటి కంపెనీలు ఏపీని వదిలి వెళ్ళిపోవడమో, ఏపీలో కార్యకలాపాలు తగ్గించుకోవడమో చేశాయి. 2019కి ముందు ఏపీలో దాదాపు ఐదువేల ఐటి కంపెనీలు కార్యకలాపాలు నిర్వహించగా.. 2024 జనవరి 9 నాటికి 2540 ఐటీ కంపెనీలు మాత్రమే మిగిలాయి. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వ హయాంలో ఐటీ మంత్రి లోకేష్ కృషి ఫలితంగా పలు ఐటీ కంపెనీలు ఏపీ వైపు దృష్టి సారించడం శుభపరిణామం.
అంకురాలే.. ఆయుధాలు!
స్టార్టప్ ఆంధ్ర నినాదం మాత్రమే కాదు… పాలనా విధానాన్ని మార్చే ఆయుధం.
ఇదీ ఐటీ మంత్రి లోకేష్ సేన్సేషనల్ స్టేట్‌మెంట్.
న్యూఢల్లీలోని తాజ్‌మహల్ హోటల్‌లో సోమవారం జరిగిన యుఎస్- ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరం లీడర్‌షిప్ సమ్మిట్‌లో రాష్ట్ర విద్య, ఐటీ మంత్రి లోకేష్ అద్భుతమైన ప్రసంగం చేశారు. రాష్ట్ర భవిష్యత్ లక్ష్యాలను విశ్లేషిస్తూ.. ప్రాధాన్యతలను వివరిస్తూ.. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం కల్పిస్తోన్న అనువైన వాతావరణాన్ని కళ్లకుకట్టినట్టు చూపిస్తూ.. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ వ్యాపారధామమని ప్రకటించారు. ఇటీవల ఏపీ వరదలు ఎదుర్కొన్న సమయంలో వేగవంతమైన సేవలకు స్టార్టప్‌ల సహకారం అద్వితీయమంటూనే.. ప్రైవేటురంగ సహకారంతో 20లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని సాధిస్తామనీ పునరుద్ఘాటించారు. కీలకమైన సమ్మిట్‌లో ప్రసంగంగా.. ప్రశ్నలకు జవాబులుగా.. యుఎస్- ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ ఫోరం లీడర్‌షిప్ సమ్మిట్‌లో లోకేష్ స్ట్రాటజిక్ ఉపన్యాయ సారాంశం సంక్షిప్తంగా..
పరిశ్రమల స్థాపనకు భారత్‌లో మరే రాష్ట్రంలోలేని అనువైన వాతావరణం ఆంధ్రలో నెలకొల్పామని నమ్మకంగా చెప్తున్నా. వేగంగా పరిశ్రమలు నెలకొల్పేందుకు అనుమతులు సులభతరం చేశాం. ప్రోత్సాహకాలను విస్తృతం చేశాం. అందుకు అనుగుణంగా ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు పునరుద్ధరించాం. ప్రైవేటు సెక్టారు ప్రముఖులతో సలహా మండలి నెలకొల్పాం. సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ -పాలసీని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అంటే -ప్రాజెక్టులు, అనుమతులకు సంబంధించి ప్రత్యేక వాట్సాప్ గ్రూప్‌తో ప్రతివారం ఇన్వెస్టర్లకు సమాచారమందిస్తాం. దేశంలోనే తొలిసారిగా స్కిల్ సెన్సస్‌కు శ్రీకారం చుట్టింది ఏపీ. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా హౌస్ హోల్డ్ డాటా, ఎడ్యుకేషన్ డేటా మైక్రో లెవల్‌లో సేకరించడం మొదటి అడుగు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల సాధనకు స్కిల్ సెన్సస్ ప్రధాన దోహదకారి అన్నది ప్రభుత్వ విశ్వాసం. ప్రధాని మోదీ వికసిత్ భారత్ స్ఫూర్తితో.. 2047నాటికి వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణే మా లక్ష్యం.
ఏపీలో వేగవంతమైన పారిశ్రామికాభివృద్ధికి మేం ఎంచుకున్న మార్గం -స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. మాకు అద్భుతమైన మానవ వనరులున్నాయి. విశాఖ నగరాన్ని ఐటి, కెమికల్, ఫార్మా, మెడికల్ డివైజెస్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దుతాం. ఏపీలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన ఎకో సిస్టమ్ కల్పిస్తున్నాం. అతిపెద్ద తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తున్నాం. 2029నాటికి 72 గిగావాట్స్ రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తి.. ఏపీ స్టేట్ టార్గెట్.
నేడు వేగంగా మారుతున్న అధునాతన సాంకేతిక ప్రక్రియలో స్టార్టప్ ఆంధ్ర కేవలం నినాదం మాత్రమే కాదు, పరిపాలన విధానాన్ని సమూలంగా మార్చే ఓ అద్భుత ఆయుధం. అంకురాలతో సాంకేతికతను ఏకీకృతం చేసి వినూత్న మార్గాల అన్వేషణ జరుగుతోంది. అందుకు కేస్ స్టడీ -వరద విపత్తును మేం ఎదుర్కొన్న విధానం. సహాయక చర్యల కోసం తొలిసారిగా ప్రభుత్వం డ్రోన్‌లు వినియోగించాలన్న సమయస్ఫూర్తి.
ట్రిలియన్ డాలర్ల స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి సాధించిన మొదటి మూడు రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ అవతరించాలన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం. రాష్ట్రాన్ని ప్రగతిశీల సంస్థగా మార్చేందుకు వచ్చే ఐదేళ్లలో 10 కీలక రంగాలను ప్రభుత్వం నిర్దేశించుకుంది. అమరావతి అభివృద్ధి, నదుల అనుసంధానం, మెరుగైన నీటి నిర్వహణ, ప్రజలు-పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంపొందించడం వంటి అంశాలు ఇందులో కీలకం.
అమరావతిని వరల్డ్ క్లాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాజధానిగా తీర్చిదిద్దబోతున్నాం. ఫేజ్ -1లో 100 రకాల ప్రభుత్వ సేవలను ఫోన్ ద్వారా అందించబోతున్నాం. పాలనలో ఏఐ వినియోగం ద్వారా మెరుగైన సేవలందిస్తాం. ఏపీ రాజధాని అమరావతిని గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. ఏపీ ప్రజలు ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా మా ప్రభుత్వం పని చేస్తోంది.
మనం.. శక్తిరూపం!
వీధినుంచి విశ్వం వరకూ.. కుటుంబం నుంచి ఖగోళం వరకూ.. ప్రతి విజయం వెనుకా మనమున్నాం. ప్రతి విజయంలో మనమున్నాం. తరచిచూస్తే -విజయాలకు ముందూ మనమే ఉన్నాం. ఏ విజయానికైనా మనమే కారణమవుతున్నాం. ఇన్ని అనుభవాలు.. ఇంత చరిత్ర ఉన్న తరువాతా.. మనమీద మనకు నమ్మం లేకపోతే ఎలా? సృష్టి కార్యానికి మనమే మూలమైనపుడు.. ఆది పరాశక్తి పరంపర మనమే అయినపుడూ -విజయాల కోసం వేచి చూడాలన్న భావన మనసుల్లోకి రానివ్వకండి. కష్టాలు, కన్నీళ్లను అధిగమించి విజయాలు సాధిచగల శక్తి, సత్తా మనలోనే ఉన్నాయని బలంగా నమ్మండి. నిద్రాణ స్థితిలోవున్న నిగూఢ శక్తిని వెలికి తీయడమే -మన విజయం. రాష్ట్ర ప్రజలకు.. ముఖ్యంగా మహిళలకు ముఖ్యమంత్రి సతీమణి నారా భవనేశ్వరి ‘విజయదశమి’ సందేశమిది. విజయవాడ పున్నమి ఘాట్‌లో నిర్వహించిన శక్తి- విజయోత్సవం ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భవనేశ్వరి.. ఏమోషనల్‌గా మాట్లాడారు. ‘పండుగ అంటే ఆర్బాటం కాదు. నలుగురూ కలిసి.. మన సంస్కృతి, సాంప్రదాయాన్నీ ఆచరణతో పదిమందికీ తెలియజెప్పే విధానం. మహిషాసురుడిని అంతం చేయడానికి త్రిమూర్తుల తేజస్సు నుండి ఉద్భవించిన మహాశక్తి, తొమ్మిది రోజుల యుద్ధంలో రాక్షస సంహారంగావించి సాధించిన విజయమే `తరువాతి రోజు మనం జరుపుకునే విజయదశమి’ అంటూ చైతన్యాన్ని మేల్కొలిపే మాటలు చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన భారత్‌లో సర్పంచ్ నుంచి రాష్ట్రపతి వరకూ.. మహిళే కనిపిస్తోంది -అటూ.. ప్రభుత్వ, వ్యాపార రంగాల్లో మహిళలు సాధిస్తున్న విజయాలను సమాజం ముందుకు తీసుకెళ్లాలని భువనమ్మ అప్పీల్ చేసిన విధానంతో.. శక్తి విజయోత్సవానికి నిండుదనమొచ్చింది.
