తెగింపునివ్వని భయాన్ని వదిలెయ్.
నమ్మకం నిలువునా శిధిలమైనపుడు…
శకలాలే సైన్యంగా – యుద్ధం ప్రకటించు! అన్నాడొక విప్లవకవి. ఇజ్రాయెల్‌తో.. ‘ఆక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్’ సాగిస్తోన్న యుద్ధం అలాంటిదే. గ్లోబు మొత్తం మిడిగుడ్లేసుకుని చూస్తున్న యుద్ధానికి మూలం -పాలస్తీనియన్లకు మాతృదేశం ఇక రాదేమోనన్న అపనమ్మకమే. పాలస్తీనాను పక్కనపెట్టి.. వీలైతే చరిత్రనుంచే చెరిపేద్దామన్నంతగా సాగుతోన్న కుట్రలపై తిరుగుబాటే -పశ్చిమ ఆసియాలో యుద్ధం! ఒకప్పటి పాలస్తీనా భూభగంలో ఘర్షణల నియంత్రణకు -రెండు దేశాల ఏర్పాటు (టు స్టేట్స్ సొల్యూషన్) విధానమొక్కటే మార్గమని 1948లో ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించింది. కాలక్రమంలో యూదులకు ఇజ్రాయెల్ దక్కిందిగానీ, పాలస్తీనియన్లకు ఇప్పటికీ మాతృదేశమంటూ లేదు, రానివ్వట్లేదు. గ్లోబ్‌మీద వేగంగా మారుతోన్న పరిణామాలు -తమ డిమాండును కాలగర్భంలో కలిపేసే ప్రమాదముందన్న భయంతో దశాబ్దాలుగా సాగుతోన్న యుద్ధాల పరంపరలో భాగమే -ప్రస్తుత యుద్ధం! పశ్చిమాసియాలో కల్లోలం!! పాలస్తీనా కోసం గట్టిగా నిలబడాల్సిన ‘ఆక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్’లోని కొన్ని అరబ్ దేశాలు.. ప్రపంచ పెద్దన్న అమెరికా డబుల్ గేమ్‌లో ఇరుక్కుని ఇజ్రాయెల్‌తో చేతులు కలుపుతోన్న పరిణామాలు గత మూడు దశాబ్దాలలో చాలానే చోటుచేసుకున్నాయి. నయానో భయానో అరబ్ లీగ్‌ను తమ పంచకు చేర్చుకుంటే.. అమెరికా సాయంతో ఇరాన్‌ను తొక్కేసి.. పశ్చిమాసియాపై ఆధిపత్యం సాధించొచ్చన్న ఇజ్రాయెల్ రాజ్యకాంక్షకు -ఆ దేశంపై అక్టోబరు7, 2023న హామాస్ చేసిన భీకర అటాక్ ఒక కుదుపు. ప్రపంచాన్ని నివ్వెరపర్చిన ఏడాది క్రితంనాటి దాడే.. ఏడాదిగా సాగుతోన్న యుద్ధానికీ కారణం. భారీ ప్రాణ, ఆస్తినష్టం సంభవిస్తున్నా.. రెండు ప్రాంతాల మధ్య యుద్ధం ‘రీజినల్ వార్’గా రూపాంతరం చెందే పరిస్థితి వచ్చినా… ఎవ్వరూ వెనక్కి తగ్గకపోవడానికి కారణం -కాంక్ష. ఈ వార్ గేమ్‌లో అలుపులేదు. గెలుపు లేదు. శాంతికి అసలు చోటే లేదు!!
యువ రవి కిరణం
లెజండరీ!
ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కరు పుడతారు. వాళ్లే చరిత్ర సృష్టిస్తారు. కాలానికి -ఆ చరిత్ర అవసరం!
విజనరీ!!
సమాజాన్ని శ్వాసిస్తూ.. భవిష్యత్‌ను ఊహించి వర్తమానంలో ఆవిష్కరిస్తారు. విజనరీకి `సమాజమే ముఖ్యం!!
తెలుగుదేశం పార్టీ లెజండరీ -ఎన్టీ రామారావు. అదే తెలుగుదేశం పార్టీ విజనరీ -చంద్రబాబునాయుడు. ఒకరు చరిత్ర.! ఇంకొకరు భవిష్యత్!! ఈ ఇద్దరి ప్రభావం కాలంమీద పంతుందో.. సమాజంపైనా అంతే ఉంది. ఆ ఇద్దరి ఆవరణా ప్రభావంలోని ప్రపంచ సమూహమే -తెలుగుదేశం పార్టీ! గతానికి భవిష్యత్‌కు వారధిలాంటి వర్తమానం అది!!
విశ్వవ్యాప్తమైన తెలుగుదేశం సమూహంలో కోటానుకోట్ల కార్యకర్తలు. ప్రతి కార్యకర్తకూ చిన్నదో పెద్దదో కథ ఉంటుంది. ఆ కథకు తక్కువో ఎక్కువో `లెజండరీ విజనరీల ప్రభావం కారణమై ఉంటుంది. అదే వాళ్లను పార్టీలో నడిచేలా చేస్తుంది. పార్టీని నడిపించే నాయకులనూ చేస్తుంది. అలా -తెలుగుదేశం విద్యార్థి విభాగంలో పుట్టి.. తెలుగు యువత విభాగంలో అడుగులేసి.. పార్టీ ఆశీస్సులతో నాయకుడిగా రూపాంతరం చెందుతున్న యువ కార్యకర్త అంతరంగమే.. ఈ కవర్ కథనానికి ప్రధాన ఇతివృత్తం.
చాలామందిలాగే సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి.. విజనరీ సత్సంకల్ప విజయంలో అణుమాత్రపు రేణువవుతానంటున్న ఆ యువ కెరటం -ఈ రవికిరణం. లెజండరీ డిజైన్ చేసిన వికసితాంధ్ర -2047 మహాయాత్రలో పార్టీ సమూహంతో కలిసి వడివడిగా అడుగులేస్తున్న అతడే -నిమిని రవినాయుడు. పార్టీ పెద్దలకు -యువ రవి. యువత విభాగానికి -రవన్న!!
తెలుగుదేశం పార్టీలో 20ఏళ్ల ప్రస్తానమే అయినా.. -నిజానికి రవినాయుడి కథ చాలా చిన్నది. చంద్రగిరి నియోజకవర్గ రాజకీయ ప్రాబల్యంలో విద్యార్థి రాజకీయాలకు ఆకర్షితుడై.. 2005లో ఓరియంటల్ కళాశాల టిఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడయ్యాడు. తన సమర్థతతో ఏడాది తిరిగే సరికి చంద్రగిరి నియోజకవర్గ టిఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడిగా బాధ్యతలు అందుకున్నాడు. యూనివర్శిటీ రాజకీయాల్లోకి ప్రవేశించి ఎస్వీ వర్శిటీ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా.. నాలుగేళ్లకే చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా, ఆ విభాగం జాతీయ సమన్వయకర్తగా ఎదగడం.. విద్యార్థి రాజకీయాల్లో అతను పోషించిన చురుకైన పాత్రకు నిదర్శనం. 2020 తిరుపతి పార్లమెంట్ యువత అధ్యక్షుడిగా.. 2021లో యువత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పార్టీకి విస్తృత సేవలే అందించాడు. యువరవి రాజకీయ జీవితానికి ఇదొక పార్శ్వం. తరువాత పార్టీ కార్యక్రమాల కోఆర్డినేటర్‌గా, యువనేత నిర్వహించిన యువగళం వాలంటీర్ల కోఆర్డినేటర్‌గా, భువనమ్మ నిర్వహించిన నిజం గెలవాలి టూర్ కోఆర్డినేటర్‌గా.. ఎన్నికలముందు పార్టీ అధినాయకుడు చంద్రబాబు నిర్వహించిన శంఖారావం టూర్ కోఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వర్తించడం -రవినాయుడి రాజకీయ జీవితానికి మరో పార్శ్వం! రవినాయుడు నిబద్ధత, క్రమశిక్షణను పార్టీ గుర్తించింది. ఆ గుర్తింపే -శాప్ ఛైర్మన్. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థను నడిపించాల్సిన నాయకుడు.
సింపుల్‌గా -ఇదీ రవినాయుడి పరిచయం. కానీ, శాప్ ఛైర్మన్‌గా బాధ్యతలు కట్టబెట్టకముందే.. రవినాయుడికి పార్టీ శ్రేణులు అంతకుమించిన పదవినే కట్టబెట్టాయి. అది పార్టీ భవిష్యత్ కేతనమైన నారా లోకేష్‌కు నమ్మిన బంటు. ‘హనుమ ఏ రోజునా ‘నేను’ అనుకోలేదు. ‘నా రాముడు, నా దేవుడు’ అనే అనుకున్నాడు. అందుకు కారణం -హనుమపట్ల రాముడు చూపించే వాత్సల్యం. నేనూ అంతే. ఆజన్మాంతం బంటునే’ అని మిత్రులు, సన్నిహితుల దగ్గర రొమ్ము విరుచుకుని ప్రకటించుకునే రవినాయుడి ప్రస్థానం ఆయన మాటల్లోనే…
మీ రాజకీయ ప్రస్థానం?
ప్రస్థానం అనేకంటే ప్రభావం అనాలేమో. ఇప్పటికీ అదే!. పార్టీలో చాలామంది మా నాయకుడు చంద్రబాబును చూస్తూ ప్రభావితమైవుంటారు? కానీ, నేను వింటూ ప్రభావితుడయ్యాను. నా అదృష్టం కొద్దీ పెద్దాయన పుట్టిన పక్కూళ్లోనే పుట్టా. ఆయన గొప్పతనాన్ని వింటూ పెరిగా. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి.. ఎన్నో కష్టాలను అధిగమించి.. క్రమశిక్షణతో నాయకుడిగా ఎదిగిన ఆయన గురించి ఊళ్లో గొప్పగా చెప్పుకునేవారు.
‘45 గడపలు కూడా ఉండని నారావారిపల్లె నుంచి మావూరి వరకూ సైకిల్‌మీద వచ్చి.. అక్కడినుంచి కొండెక్కి దిగి.. చంద్రగిరిలో చదువుకుని.. తరువాత పొలం పనులు చూసుకుని ఇంటికెళ్లేవాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా.. కులాల ప్రాధాన్యత, ధనప్రవాహంలాంటి ఇబ్బందులున్నా.. వర్శిటీ రాజకీయాల్లో క్రమశిక్షణ కలిగిన నాయకుడి పాత్ర పోషించాడు. అలా ఎదిగిన వ్యక్తి.. రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయ్యాడు’
నా బాల్యంలో ఎక్కువసార్లు విన్న కథ ఇదే. ఊళ్లో పెద్దలనుంచి, మా తాత తండ్రుల నుంచి ఎవరినుంచి ఎన్ని రకాలుగా విన్నా.. ఆ మాటల్లోని కోర్ కంటెంట్ మాత్రం ఇదే. ‘మనోడే. మనింటి బిడ్డే. కష్టపడ్డాడు. క్రమశిక్షణతో ఎదిగాడు’ అంటూ పదేపదే విన్న మాటలు నామీద తీవ్ర ప్రభావమే చూపించాయి. అలా వింటూ పెరిగి.. కళాశాలకు వచ్చేసరికి ‘సీబీఎన్’ అనేది ఒక స్ఫూర్తిగా ఉండిపోయింది. ఒక విజన్‌తో రాష్ట్రాన్ని అభివృద్ధివైపు నడిపించే స్థాయికి ఎదిగిన వ్యక్తికంటే స్ఫూర్తిప్రదాత ఎవరుంటారు?
రాజకీయాల్లోకి రావాలని అప్పుడే అనిపించిదా?
చెప్పలేను. ఎందుకంటే ఇక్కడ లక్ష్యాలేవీ లేవు. నేను విన్న పొలిటికల్ స్టోరీస్‌లో హీరోలా ‘సమాజానికి మంచి చేయాలి. ఆయనలా క్రమశిక్షణతో ఎదగాలి’. అదే ఆలోచన. అదే స్ఫూర్తి. ఆ ఎమోషన్ ఎంత స్ట్రాంగ్‌గా ఉండేదంటే.. నేను స్కూల్ డేస్‌లో ఉన్నపుడు, జన్మభూమిలో మొక్కలునాటే కార్యక్రమం వచ్చింది. మాది మేజర్ పంచాయితీ. మెయిన్‌రోడ్డునుంచి ఊళ్లోకెళ్లడానికి కిలోమీటర్ మేర పెద్ద మడం ఉంటుంది. ఒక ఊపుతో అదంతా చెట్లు పెట్టేశాం. ఫలితంగా జన్మభూమి అవార్డు వచ్చింది. `ఒక టీంకి ముందుండాలి అన్న బీజం అప్పుడే పడిరది. స్కూల్ డేస్‌లో ఎస్పీఎల్ చేశా. కాలేజ్‌కి వచ్చాక లీడర్‌షిప్ కోసం ఫైట్ చేశా. లీడర్‌గా ఉండాలన్న ఆలోచనే ఉక్కిరిబిక్కిరి చేసేది. ఎలాంటి సమస్యలొచ్చినా.. వెనక్కి తగ్గేవాణ్ని కాదు. అలా -తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్‌లోకి అడుగుపెట్టాను. కాలేజ్‌నుంచి మొదలైన ప్రయాణం.. ఆ విభాగంలోనే జాతీయ సమన్వయకర్త స్థాయి వరకూ సాగింది.
అంటే.. మీ కోర్ ఇన్‌ఫ్లుయెన్సర్ సీబీఎస్ సారే..?
కచ్చితంగా. సందేహమే లేదు. కాకపోతే -‘కోర్’ చుట్టూవుండే ఆంబియన్స్ కూడా స్టూడెంట్స్ యాజిటేషన్స్‌వైపు, లీడర్‌గా ఉండాలన్న ఆలోచనలవైపు నడిపించింది. ఎలాగంటే.. సీబీఎన్ సార్ సొంత బ్రదర్ రామ్మూర్తినాయుడు మా నియోజకవర్గ ఎమ్మెల్యే. మాదేమో చుట్టుపక్కల గ్రామాలకు రాజకీయ ఓనమాలు నేర్పిన మేజర్ పంచాయితీ. అలా ఎమ్మెల్యే మావూరు వచ్చినపుడు కలిసేందుకు మా తాత వెళ్తూ వెళ్తూ నన్నూ తీసుకెళ్లేవారు. అక్కడి రాజకీయ వాతావరణం, ఎమ్మెల్యేకు ప్రజలు సమస్యలు చెప్పుకోవడం, చిటికెలో అధికారులతో ఫోన్‌లోనే మాట్లాడి పరిష్కరించడం.. ఎమ్మెల్యేకిచ్చే రెస్పెక్ట్.. ఇవన్నీ ఆసక్తిగా అనిపించేవి. ఒక ఎమ్మెల్యే అయితే ఇంతమందికి మంచి చేయొచ్చా? అనిపించేది. మంచి చేయాలంటే.. పదిమందితో ఉండాలి. పదిమందిలో ఉండాలి. రాజకీయంగా ఎదగాలి అనిపించేది.
ఇక కాలేజ్ డేస్‌కి వచ్చేసరికి ఏదో చేసెయ్యాలన్న తపన. మనమెందుకు చెయ్యలేం? అన్న ప్రశ్న. కష్టాలు దాటి కిందిస్థాయినుంచి ఎదిగిన వ్యక్తి కళ్లముందే ఉన్నప్పుడు -నేనెందుకు ఎదగలేను అన్న సమాధానం. ఆ ఆవేశం, ఆలోచనలమధ్యే.. -విద్యార్థి సమస్యలకు ఎదురెళ్లిపోయేవాడిని. స్కాలర్‌షిప్పులు, రీయింబర్స్‌మెంట్ వ్యవహారాలు, సర్టిఫికెట్ ఇష్యూలు, మెస్ ఫెసిలిటీస్.. అలా సమస్య ఎక్కుడుంటే అక్కడ పోరాటానికి దిగేవాడిని. చిన్న వయసులోనే చాలా కేసులు ఫేస్ చేసిన అనుభవం అక్కడ్నించే వచ్చిందేమో. అలా.. విద్యార్థి దశ మొత్తం హక్కులు.. పోరాటాలు, కేసులతో సాగిపోయింది.
అయితే.. భవిష్యత్‌లో సీబీఎన్ అంతటి నాయకుడు అవుతారు..?
చరిత్ర సృష్టిస్తోన్న విజనరీని స్ఫూర్తిగా తీసుకోవడమే.. నేను ఎదిగినట్టు. ఇక -సీబీఎన్ అంటే వ్యక్తి కాదు, వ్యవస్థ. ఉమ్మడి రాష్ట్రాన్ని ప్రపంచ చిత్రపటంలో నిలిపిన వ్యవస్థ. విభజిత రాష్ట్రాన్నీ ఆ స్థాయికి తీసుకెళ్లాలన్న సత్సంకల్పమున్న వ్యవస్థ. అలాంటి వ్యవస్థలో చోటు దక్కడంకంటే ఎదుగుదల ఏముంటుంది? ఆయనను వింటూ.. అదృష్టం కలిసొచ్చి ఆయనను చూస్తూ అడుగులేస్తున్న నాలాంటివాళ్లు తెలుగుదేశం వ్యవస్థ నుంచి నేర్చుకున్నదిదే. మహావ్యవస్థలో కార్యకర్తగావున్నా.. మనకు అప్పగించిన బాధ్యతను -చిత్తశుద్ధితో, నిజాయితీగా, నిబద్ధతతో, క్రమశిక్షణగా నిర్వర్తించడంకంటే గొప్ప ఎదుగుదల ఉంటుందని నేననుకోను. నాయకుడికి నిర్వచనం.. సీబీఎన్ సార్‌నుంచి ఇదే నేర్చుకున్నా.
శాప్ చైర్మన్ పదవికి అర్హులే..?
(నవ్వేస్తూ..) శాప్ ఛైర్మన్ పదవి కాదు, బాధ్యత. ముఖ్యమంత్రి తన లక్ష్య సాధనలో నన్నూ భాగం చేస్తున్నట్టే ఫీలవుతున్నా. ఐదేళ్ల విధ్వంస పాలనా కాలంలో రాష్ట్రం మాదిరిగానే క్రీడారంగం భ్రష్టుపట్టింది. ఆ బూజు దులిపి.. రాష్ట్ర క్రీడారంగాన్ని ఉత్తేజపర్చమంటూ నామీద నమ్మకంతో అప్పగించిన బాధ్యతే అది. చైర్మన్లను ప్రకటించిన తరువాత.. సీబీఎన్ సార్ మాతో సమీక్ష జరిపినపుడు -మాకు చేసిన దిశా నిర్దేశాన్ని ఎప్పటికీ మర్చిపోను. ఎక్కడో మారుమూల గ్రామంలోని కుర్రాడికి -ఒలింపిక్స్‌లో సత్తా చూపించే నైపుణ్యం ఉండొచ్చు. అలాంటి ఆణి ముత్యాలను గుర్తించి.. సౌకర్యాలు కల్పించి.. వాడి నైపుణ్యానికి పదునుపెట్టే శిక్షణ ఇప్పించి.. లక్ష్యాన్ని ఛేదించే వరకూ నడిపించే కీలకమైన బాధ్యత అప్పగించారు. నా సమర్థత మీద నమ్మకంతో అవకాశమిచ్చారు. ఫలితాలు సాధించి సమర్థతను నిరూపించుకోవాల్సిన బాధ్యత నాది. అందుకే -శాప్ చైర్మన్‌ను పదవిగా చూడలేను, బాధ్యతగానే చూస్తున్నా.
మీ పేరు ప్రకటించగానే.. పార్టీ మొత్తం పండగ చేసింది..?
పండగ అనొద్దుగానీ, తెలుగు యువతకు దొరికిన గొప్ప గుర్తింపుగా పార్టీశ్రేణుల ఆనందమది. పార్టీ అధికారంలోకి రాకమునుపు మేంపడిన కష్టం, చేసిన పోరాటానికి గుర్తింపు ఇది. ముఖ్యమంత్రిగా రాజశేఖర్‌రెడ్డి ఉన్నపుడు ప్రతిపక్షంగా పార్టీ ఎదుర్కొన్న పరిస్థితి వేరు. జగన్ జమానాలో.. మేం పోరాటం కాదు, యుద్ధం చేశాం. అదీ -ఒక రాక్షసుడితో సాగించిన యుద్ధమది. తెలుగుదేశం కార్యకర్తలను ఎలాంటి చిత్రహింసలకు గురి చేశారో -ప్రపంచానికి తెలీంది కాదు. కేసులు బనాయించారు. హౌస్ అరెస్ట్‌లు చేశారు. జైళ్లకు పంపారు. బయటికొస్తే ఎత్తుకుపోయారు. ఎన్ని చేయాలో అన్నీ చేశారు. ఆ టైంలో ఎవ్వరికీ వెరవకుండా పార్టీకోసం నిలబడ్డవాళ్లలో… తెలుగు యువత పాత్ర చిన్నది చేయలేం. అలా నిలబడిన వాళ్లను పార్టీ ఓన్ చేసుకుంది. అందులో నేనూ ఉండటం.. నా అదృష్టం!
మరో విషయమేంటంటే -ఇంచుమించు అదే సమయంలో యువనేత లోకేష్ పాదయాత్ర మొదలైంది. నిజానికి ఆ పాదయాత్ర ఒక యజ్ఞం. దాన్ని భగ్నం చేయడానికి రాక్షస మూకలు చుట్టుముట్టాయి. లోకేష్ పాదయాత్ర మొదలవ్వడం.. వైసీపీ రాజకీయ భవిష్యత్‌కు ఫుల్‌స్టాప్ అని వాళ్లకు తెలుసు. అందుకే శతవిధాలా అడ్డుకునే ప్రయత్నం చేశారు. యువనేత యువగళం పాదయాత్రలో లోకేష్ వెంట.. రాముడికి వానరుల్లాగ మేం నిలబడ్డాం. రాక్షస మూకలను సమర్థంగా ఎదుర్కొన్నాం. అప్పుడు మేంపడిన కష్టాన్ని పార్టీ విస్మరించలేదు. తెలుగు యువతకు ఆ గుర్తింపే -చైర్మన్ బాధ్యత అని అనుకుంటా.
లోకేష్‌కు బాగా దగ్గరైనట్టున్నారు..?
రాముడిని హనుమను వేరువేరుగా చూడలేమన్నా. లోకేష్ అన్నకు ఆజన్మాంతం ఆంజనేయుడినే. నేనేకాదు, లక్షలాది కార్యకర్తలు ఆయన మనసుకు దగ్గరగా ఉంటారు. ఒక్కసారి ఆయనకు దగ్గరైతే.. ఇక ఆ వాత్సల్యాన్ని తట్టుకోలేం. అది స్వయంగా అనుభవించిన వాళ్లకు తెలుస్తది. చిన్నప్పుడు పెద్ద ఎన్టీఆర్ గురించి తాతవాళ్లు చెప్పేవారు.. ‘ఆయన అభిమానం తట్టుకోలేంరా. అనన్యసామాన్యం’ అని. ఆ అభిమానం, వాత్సల్యాన్ని స్వయంగా చూసే, అనుభవించే అవకాశం లోకేష్‌తో తీరుతోంది మాలాంటి వాళ్లకు. ఆయన అభిమానంతో ఎవరినైనా అక్కున చేర్చుకుంటే -వాళ్లకోసం ఎంతమందితోనైనా యుద్ధం చేస్తాడు. అది మాటల్లో చెప్పలేం. నమ్మకం, విలువలు, విశ్వసనీయతలాంటి పదాలను పోతపోస్తే -అదే లోకేష్. లోకేష్ అంటే నాకు ఇష్టం. ఎంత అంటే -వదలాల్సివస్తే ప్రాణం వదిలేసేంత ఇష్టం. రవినాయుడి గుండెల్లో రాముడు -లోకేష్.
పార్టీ పవర్లోకి రావడానికి మొదటి అడుగు యువనేత నిర్వహించిన యువగళం పాదయాత్ర. అంతటి పాదయాత్రలోని ప్రతి ఘట్టంలో మీ పేరు వినిపించింది. అసలు.. ఎలా మొదలైంది?
ఒక్కముక్కలో చెప్పాలంటే -సింపుల్‌గా మొదలైన సెన్సేషన్!
గొప్పగా చెప్పాలంటే -చరిత్రలో సువర్ణాక్షరాలతో రాసుకోదగ్గ ఘట్టం. చెడు గెలవడం చాలా ఈజీ. చెడుమీద మంచి గెలవడం అంత ఈజీ కాదు, కానీ గెలుపు ఖాయం. లోకేష్ అన్న పాదయాత్రలో భాగస్వామ్యమైనవాళ్లంతా నేర్చుకున్న పాఠం. ఒక్క పాదయాత్రతో సామాన్యుడు అసామాన్యుడయ్యాడు. మంచివాడి ముసుగులోని రాక్షసుడు బయటపడ్డాడు. గెలుపు కష్టమనుకున్న పార్టీ అఖండ విజయాన్ని చూసింది. గెలుపు ఖాయమనుకున్న పార్టీ కుప్పకూలిపోయింది. నాలాంటి లక్షలాది వానరసేనకు ‘ధైర్యం’ దొరికింది. పార్టీకి ‘భవిష్యత్’ స్పష్టమైంది. ఇవన్నీ -ఒక్కో లైను కాదు. విశ్లేషించుకుంటే ఒక్కో ఘట్టం!
‘లోకేషన్న పాదయాత్ర చేయాలనుకుంటున్నాడు. ఒకసారి వచ్చి కలవండి’ `అంటూ రాజేష్ అన్ననుంచి ఫోన్ వచ్చింది. టిఎన్‌ఎస్‌ఎఫ్ ప్రణవ్‌ని తీసుకుని వెళ్లాను. సుదీర్ఘంగా సాగిన చర్చలో సారాంశం -‘యుద్ధానికి వెళ్తున్నాం, సన్నద్ధమవ్వండి’ అని. ఎలాంటి ఇబ్బందులొచ్చినా వెనకడుగు లేదు. విన్నువిరిగి మీదపడినా ఆగేది లేదు. ప్రిపేరవ్వండి అనే చెప్పారు. అలా -కోఆర్డినేషన్ బరువు బాధ్యతలు మా భుజాలపై మోపారు. విద్యార్థి ఉద్యమ అనుభవాలతో ఏర్పాట్లు చేసుకున్నాం. జనంలోకి నాయకుడు వెళ్తున్నాడు కనుక.. ఎలాంటి ఇబ్బంది రాకుండా మన రక్షణ కవచం (రోప్ టీం) మనమే ఏర్పాటు చేసుకోవాలి. ట్రాఫిక్ క్లియర్ చేయాలి. భోజన సౌకర్యాల నుంచి టెంట్లు వేసుకునే వరకూ మనవాళ్లే ఉండాలి. సైట్ క్లీనింగ్ నుంచి షెడ్యూల్ క్లియరెన్స్ వరకూ మనదే బాధ్యత. అలా రాజేషన్న మార్గదర్శకత్వంలో పరిమితమైన టీంకు పెద్ద బాధ్యత అప్పగించారు. అలా -యుద్ధానికి మా వానరసేన సమాయత్తమైంది. ఇక -అటుపక్క అధికారంలోవున్నది రాక్షస రాజ్యం. అన్ని వ్యవస్థలూ దానికి అనుకూలం. దానికొక బ్లూ మీడియా. ఏ చిన్న విషయాన్నైనా వాళ్లకు అనుకూలంగా చూపించుకోగలదు. మానసిక ధైర్యాన్ని దెబ్బకొట్టగల పెయిడ్ బ్యాచ్ సోషల్ మీడియా మరోవైపు.
పదితలల రావణుడి మీద కేవలం నేలమీద నిలబడి రాముడు చేసిన యుద్ధమే -యువగళం పాదయాత్ర.
కుప్పంలో మొదలై బంగారుపాళ్యం చేరేసరికి -లోకేష్ అన్నకు నోటీసులు. నేలమీద నిలబడినంత మాత్రాన -యోధుడు యోధుడు కాకుండాపోడుగా. ఎన్టీఆర్ మనుమడు, చంద్రన్న బిడ్డ.. లోకేషన్న ఇంచుకూడా తగ్గలేదు. ‘కష్టంలోవున్న ప్రజలను కలిసే హక్కు నాకుంది. ఆపడానికి మీరెవరు?’ అంటూ ధిక్కారం మొదలైంది. చుట్టూచేరిన జనంతో మాట్లాడటానికి స్టూలెక్కాడు. లాక్కున్నారు. మైకు తీసుకున్నాడు. గుంజకున్నారు. జాతీయ జెండా భుజానేసుకుని బిల్డింగ్ ఎక్కాడు. అన్నను ఏం చేయలేక.. వాలంటీర్లమీద పడ్డారు. దొరికినవాడ్ని దొరికినట్టు కొట్టారు. వెహికల్స్ లాక్కున్నారు. చంపేస్తామని భయపెట్టారు. ఒక్కటి కాదు, పాదయాత్ర పేరెత్తడానికే భయపడేలా చేశారు. ఆ టైంలో నాయకుడై లోకేష్ చేసిన ప్రకటన ఒక్కటే -‘పాదయాత్ర ఆగదు. కొడితే కొట్టించుకుందాం. అరెస్టులు చేస్తే జైలుకెళ్దాం. కష్టాల్లోవున్న ప్రజలను ఓదార్చడానికి -పాదయాత్ర కంటిన్యూ చేద్దాం’ అని.
అతని కమిట్‌మెంట్‌కు షాకయ్యాం. రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఓ గొప్పింటి బిడ్డ. ఎన్టీఆర్ మనవడు. భువనమ్మ ఒక్కగానొక్క బిడ్డ. అమెరికాలో చదువుకున్నోడు. ఇంటినుంచే రాజకీయం నడిపించగల కుటుంబ నేపథ్యం. అయినా.. తండ్రిలాగే ఈ జనం పిచ్చేంటి? ఇతన్ని ఆపడం ఇక దేవుడితరం కూడా కాదు అనిపించింది మా అందరికీ. అది మొదలు -పాదయాత్రలో ఎన్నో భయానక ఘట్టాలు. మా ధైర్యం మా ముందు నడుస్తున్నంత వరకూ మేం ఎక్కడా ఆగలేదు. పాదయాత్ర ఆపలేదు.
పాదయాత్ర మొత్తం మీరే కనిపెట్టుకుని ఉన్నారట..?
అంత ఛాన్స్ మాకివ్వలేదు. టీములు మొత్తాన్ని లోకేష్ అన్నే కనిపెట్టుకుని ఉండేవాడు. చుట్టూ వానరసేనలా మేము. నడుస్తూ, నడిపిస్తున్న నాయకుడి ఇబ్బందులు చూసి గుండెమండేది. ఎక్కడ అదుపుతప్పుతామోనని కనిపెట్టుకుని ఉండేవాడు. లోకేషన్న మాటిస్తే ఎలా ఉంటందో చిన్న ఘట్టం చెప్తా.
పాదయాత్ర ఎమ్మిగనూరు సెగ్మెంట్‌కు చేరేసరికి -అన్నకు ఫీవర్ వచ్చేసింది. దానికితోడు అప్పటికే భుజం నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. పైగా ఎండాకాలం, యాత్ర చేయాల్సిన ప్రాంతమంతా మట్టిలేస్తుంది. నాయకుడి ముఖంలో స్ట్రెయిన్ తెలుస్తుంది. ఒక్కరోజు యాత్ర ఆపితే మంచిదన్నా అంటూ రాజేష్ అన్నకు చెప్పాం. ‘వినడులేరా’ అనేశాడు రాజేషన్న. గట్టిగా పట్టుబట్టాం. ‘ముందు మీరెళ్లి చెప్పండి’ అంటూ. చాలాసేపు తర్జన భర్జన తరువాత లోకేష్ అన్నను కన్విన్స్ చేయడానికి రాజేషన్న వెళ్లాడు. అప్పటికి టైం ఉదయం 11 అయ్యింది. ఎండ మామూలుగా లేదు. బస్సు లోపలికి వెళ్లిన రాజేష్ అన్న లోకేష్‌తో తిరిగి వచ్చాడు. అప్పుడు లోకేష్ చెప్పిన మాటలు.. ఎప్పటికీ మర్చిపోలేం. ‘ఈ ప్రాంతమంతా వలస కూలీల ప్రాంతం. నన్ను కలవడానికి కూలి మానుకుని ఎదురు చూస్తున్నారు. ఈరోజు వాయిదావేస్తే.. రేపు కూడా కూలి మానుకుని వస్తారు. రెండు రోజుల కూలిపోతే.. పదిహేను రోజులు ఆ కుటుంబాలు ఇబ్బంది పడతాయి. వాళ్ల కష్టం తెలుసుకోడానికి వచ్చాం, ఇబ్బంది పెట్టడానికి కాదు. పాదయాత్ర మొదలవుతుంది, పదండి’ అని. అంత జ్వరంలో, భుజం నోప్పితో పాదయాత్ర చేస్తుంటే.. మనసులు విలవిల్లాడాయి. కార్యకర్తల కళ్లలో కన్నీళ్లు, భయం. ఏమవుతుందోనన్న ఆందోళన. ఆ ఒక్క సంఘటన చాలు.. నాయకుడిగా ఆయన్ని జీవితాంతం గుండెల్లో పెట్టుకోడానికి. ఆ రాత్రికి చాలా ఇబ్బంది పడ్డాడు లోకేష్ అన్న. ఆరోజుకు యాత్ర ముగింపు టైంలో కార్యకర్తలకు గుడ్‌నైట్ చెప్పే పరిస్థితి లేకున్నా.. అందరినీ ఒకసారి చూసుకుని విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లాడు. అదెంత దారుణ పరిస్థితో దగ్గరగావున్న మాకు తెలుసు. నేనైతే అప్పుడే ఫిక్స్ అయ్యా.. ‘ఈయనే మన రాష్ట్రానికి ఫ్యూచర్’ అని!
రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసినపుడు అధికారంలోవున్న చంద్రబాబు సహకరించారు. చంద్రబాబు పాదయాత్రకు అధికారంలోవున్న కిరణ్‌కుమార్ రెడ్డి సహకరించారు. జగన్‌రెడ్డి పాదయాత్రకు అధికారంలోవున్న చంద్రబాబు సహకరించారు. లోకేష్ పాదయాత్రమీద మాత్రం -అధికారంలోవున్న జగన్‌రెడ్డి ప్రభుత్వం కత్తిగట్టింది. అదే మమ్మల్ని రాటుదేల్చింది. నిజమైన విజయానికి దారితీసింది. ప్రభుత్వ దురాగతాన్ని చూసిన ప్రజలు -మావైపు నిలబడ్డారు. నాయకుడి కష్టాన్ని చూసి ప్రకృతి సహకరించింది. జగన్‌రెడ్డి అధర్మ యుద్ధాన్ని చూసిన అందరు దేవతలు, సర్వమతాలు, అన్ని వర్గాలు పాదయాత్రను బలోపేతం చేశాయి. ఏ సినిమాలోనైనా ఏదోకచోట ఇక హీరో పనైపోయిందన్న సీన్ వస్తుంది. ఇక్కడ ప్రతిరోజూ అలాంటి సీన్లుదాటి.. హీరో గెలిచాడు. గెలిపించాడు. అలా గెలిచిన ధర్మం చేసిన రణన్నినాదమే -ఆనాటి విజయనగరం సభ. నభూతో నభవిష్యతి. నవశకానికి నాంది. సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది.
వందల రోజులు. వేల కిలోమీటర్లు. భయానకమైన ఇబ్బందులు. నాయకుడు చూపించే ప్రేమాభిమానాలు. ఆ జర్నీ మీకేం అనిపిస్తుంటుంది?
అదృష్టం అనిపిస్తుంది. దగ్గరకు తీసుకుని.. అవకాశమిచ్చిన లోకేష్ రుణం తీర్చుకోవాలనిపిస్తుంది. నేనే కాదు, పార్టీలోని ప్రతిఒక్కరూ అతనికోసం ఏం చేయడానికైనా సిద్ధపడిపోతారు. అదీ -లోకేష్ అంటే. పార్టీలో కోర్ టీం మొత్తం -ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడేవాళ్లే. వాళ్లలో ఒకడిగా నన్ను నిలబెట్టడమే -రుణం తీర్చుకోలేనంత గొప్ప గుర్తింపు. తెలుగు యువత, విద్యార్థి విభాగం మొత్తానికి ఇచ్చిన గుర్తింపు అది. రాజేష్ అన్న నన్ను నమ్మి అక్కడపెట్టాడు. లోకేష్ అన్న అభిమానంతో దగ్గరకు తీసుకున్నాడు. ఆ పర్టిక్యులర్ పాయింట్ నుంచి రవినాయుడు జీవితం.. రెండో అంకం అనుకోవాలి. అందుకే -ఈ జీవితం లోకేష్ అన్నకు అంకితం.
అంతమంది కష్టానికి మీ ఒక్కరికే ప్రతిఫలమా?
ముందేచెప్పాను, నాకిచ్చింది పదవి కాదు, బాధ్యత. తెలుగుదేశం ఒక వ్యవస్థ. దాన్ని నడుపుతున్న నాయకుడు -సమర్థతను బట్టి, అవసరాన్నిబట్టి ఒక్కొక్కరికీ ఒక్కో బాధ్యత అప్పగిస్తారు. నాకే కాదు, నాతో కలిసి పనిచేసిన సహచరులు, కష్టపడినవాళ్లందరికీ ఏదోక బాధ్యత అప్పగిస్తారనే గట్టి నమ్మకం నాది. ఇక ప్రతిఫలమంటారా?.. ఎన్నికలలో పార్టీ విజయం సాధించడమే పెద్ద ప్రతిఫలం. అది అందరికీ ఏదోకరూపంలో అందుతుంది. రాష్ట్రాన్ని అగ్రపథాన నిలబెట్టాలన్న అధినాయకుడి లక్ష్యం.. ఎవరికి అప్పగించిన బాధ్యతలు వాళ్లు నిర్వర్తించినపుడే సాధ్యమని నమ్ముతాను. మొన్నటికి మొన్న కార్పొరేషన్ చైర్మన్లను ప్రకటించడమే చూడొచ్చు. చాలా కసరత్తు తరువాత.. విమర్శలకు దూరంగా అన్ని వర్గాలను సంతృప్తిపరుస్తూ ఎంపిక చేశారు కనుకే.. చిన్న విమర్శ కూడా రాలేదు. పార్టీ అధినాయకుడు మాకు చెప్పే మాట ఒక్కటే. ‘ఎవరైతే పార్టీకి కష్టకాలంలో అండగావుంటారో.. ఎవరైతే త్యాగాలు చేస్తారో.. ఎవరైతే నిజారుతీగా పనిచేస్తారో.. వాళ్లకు గుర్తింపు, గౌరవం ఉంటుంది. గ్రామ కమిటీ అధ్యక్షుడి నుంచి పొలిట్ బ్యూరో వరకూ తీసుకెళ్లే బాధ్యత నాది’ అని.
శాప్ ఛైర్మన్‌గా మీరు హ్యాపీయేనా..?
పార్టీనుంచి ఏ బాధ్యత ఇచ్చినా హ్యాపీగానే ఫీలవుతాను. ఎందుకంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి పార్టీ ఇచ్చే ఒక అవకాశం అది. అభినందనలు తెలపడానికి ఫోన్ చేసిన మిత్రులు, సహచరులు అన్న మాటేంటో చెప్పనా.. ‘తెలుగు యువత, టీఎన్‌ఎస్‌ఎఫ్‌కు దొరికిన గొప్ప బాధ్యత అన్నా. విజయం సాధించి మనమీద నమ్మకాన్ని ఇంకా పెంచుకోవాలి’ అని. ఇది అందరికీ అప్పగించిన బాధ్యత, గుర్తింపుగానే ఫీలవుతున్నారు. ఇక బస్ ఛార్జీలు పెట్టుకునే స్థితిలో లేనివాళ్లు కూడా ఎక్కడో శ్రీకాకుళం, అనంతరం ప్రాంతాలనుంచి వచ్చి అభినందించి వెళ్లారు. అలాంటివాళ్లు నాకున్నపుడు -ఈ బాధ్యత నా ఒక్కడిదే అని ఎలా అనుకుంటాను. పార్టీకిగాని, నాకు బలంగా నిలబడిన వాళ్లకుగాని, నమ్మిన లోకేష్ అన్నకుగాని, ఆదరించిన సీబీఎన్ సార్‌కిగాని.. నా ప్రవర్తనవల్ల చిన్న మాట వచ్చినా.. రవినాయుడు ఓడిపోయినట్టే. తెలుగు యవత ఫెయిలైనట్టే. టీఎన్‌ఎస్‌ఎఫ్ నమ్మకం కోల్పోయినట్టే. అందుకే మళ్లీ చెప్తున్నా.. నాకు ఇచ్చింది పదవికాదు, బాధ్యత. కర్తవ్య నిర్వహణలో విజయం సాధించినపుడు.. పార్టీ పెద్దలు ఇచ్చే ప్రశంసలే నిజమైన పదవి. ఆ దిశగానే నా ప్రయాణం.
బాధ్యతలు తీసుకున్న పక్షం రోజుల్లో శాప్‌ను స్టడీ చేసుంటారుగా? ఏంటి పరిస్థితి?
శాప్ ఏడుస్తుంది. (నవ్వుతూ). శాప్ గత ఛైర్మన్ గది బూజులు పట్టేసి, జీవంలేనట్టు ఉందంటే -ఆ విభాగం మొత్తం ఎలావుందో నేను పెద్దగా విశ్లేషించక్కర్లేదు. ఔత్సాహికులను క్రీడలలో మెరికల్లా తీర్చిదిద్ది రాష్ట్రానికి అందించాల్సిన అమ్మ -శాప్. నిర్జీవంగా కనిపిస్తోన్న అమ్మను చూసి బాధేసింది. అందుకే -ప్రక్షాళన మొదలెట్టాం. గత పాలకులు -రాష్ట్రాన్ని విధ్వంసం చేసినట్టే.. శాప్ వ్యవస్థనూ నిర్వీర్యం చేసేశారు. జరిగిన తప్పులు, చేసిన మోసాలు, సాగిన అవినీతి, చూపించిన నిర్లక్ష్యం.. అన్నింటిపైనా అధ్యయనం జరుగుతోంది. రికార్డెడ్ ఎవిడెన్స్‌తోనే వాటిగురించి మాట్లాడతా. శాప్‌ను ప్రక్షాళించడమంటే -దాన్ని తీర్చిదిద్దడమే. అందుకే గత పాలకుల వైఫల్యాల గురించి ఎక్కువ మాట్లాడేకంటే.. శాప్‌ను బలోపేతం చేయడానికే పక్కువ సమయం కేటాయించుకుంటున్నాం.
ఎలా? వివరంగా చెప్తారా?
ఏముంది, శాప్ పరిధిలో 34 క్రీడలు. పరిధిలోకి రానివి మరో 20. వీటన్నింటి మీదా అవగాహనతో ఒక ప్రణాళికను రూపొందిస్తున్నాం. స్పష్టంగావున్న లక్ష్యమేంటంటే -ఆంధ్రప్రదేశ్‌ను క్రీడారంగంలో అగ్రస్థానంలో నిలపాలి. ఎక్కడికి వెళ్లాలో క్లారిటీవుంటే -ఎలా వెళ్లాలో ప్రణాళిక వేసుకోవచ్చు. మేమిప్పుడు అదే స్థితిలో ఉన్నాం. ‘ఎవరో మెడల్ సాధిస్తే మనం చప్పట్లు కొట్టడం కాదు. మన పిల్లలు మెడల్ సాధిస్తే.. దేశం మొత్తం చప్పట్లు కొట్టాలి’ అని దిశా నిర్దేశ చేశారు సీఎం చంద్రబాబు. క్రీడాంధ్రప్రదేశ్ లక్ష్యం ముఖ్యమంత్రిది. దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో విద్యామంత్రి లోకేష్ డైరెక్షన్ ఉంది. క్రీడామంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, ఏపీ క్రికెట్ అసోసియేషన్ ఛైర్మన్ కేశినేని శివనాథ్ అనుభవం, బలం నాకుతోడుంది. శాప్ పండి నుంచి స్టాఫ్ వరకూ డెడికేటెడ్ మెకానిజం పనిచేస్తుంది. ఉన్న చిన్నచిన్న ఇబ్బందులను అధిగమించి ముందుకు వెళ్లడమే తరువాయి.
శాప్ చైర్మన్‌గా లోకేష్ మిమ్మల్ని సజెస్ట్ చేశారంటారా?
ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలో పార్టీ పెద్దలు చర్చించాకే నిర్ణయం తీసుకుంటారు. కానీ, నాకు బాధ్యతలు అప్పగించడం వెనుక పార్టీ ఆలోచన ఏమైవుంటుందో.. ముందే చెప్పాను. చేయాల్సిన పని, సాధించాల్సిన లక్ష్యాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు `2014లో పార్టీ అధికారంలోకి వచ్చినపుడు -ముఖ్యమంత్రి చంద్రబాబు క్రీడారంగంపై ఎక్కువ దృష్టి పెట్టారు. ప్రతి నియోజకవర్గంలో ఇండోర్, అవుట్‌డోర్ స్టేడియంలు నిర్మించాలనుకున్నారు. అంటే మౌలిక సదుపాయాలు కల్పిస్తే -ఆంధ్రపదేశ్ క్రీడారంగంలో దూసుకెళ్తుందన్న విజన్ ఫిక్స్ చేశారు. అందుకు అనుగుణంగా భూసేకరణ జరిగింది. క్రీడా విలేజ్‌లు తేవాలన్న సంకల్పంతో నిధులు కేటాయించారు. వేగంగా ఫౌండేషన్స్ పడ్డాయి. 20శాతం నుంచి 93 శాతం వరకూ స్టేడియంల పనులు పూర్తయ్యాయి. ఈలోగా ప్రభుత్వం మారడమే.. రాష్ట్రం కలలన్నీ కుప్పకూలిపోయాయి. ఎలావున్న స్టేడియంని అలానే వదిలేశారు. చూస్తే బాధేస్తోంది. విజయనగరంలో 80శాతం పూర్తైంది. 20 శాతం పనులు పూర్తి చేయలేకపోయారు. మంగళగిరి స్టేడియం 92 శాతం పూర్తైంది. అలనే వదిలేశారు. తిరుపతిలో 147 ఎకరాలు క్రీడా విలేజ్ కోసం భూసేకరణ చేస్తే.. ప్లాట్లువేసి అమ్మేసుకున్నారు. ఆ ప్రాజెక్టును మళ్లీ చేపట్టే ప్రయత్నాల్లో కలెక్టర్‌ను కలిసి చర్చించాం. పలమనేరు, శ్రీకాళహస్తి, సత్యవేడు.. ఒకటీ రెండూ కాదు. అంతెందుకు `గత ప్రభుత్వంలొ క్రీడామంత్రి రోజా జిల్లాలోనే దారుణ పరిస్థితులు ఉన్నాయి. స్టేడియంలు నిర్వహించలేక కాంట్రాక్టు ఇచ్చేసిన దౌర్భాగ్యం చూస్తున్నాం. ఇక ఆడుదాం ఆంధా కార్యక్రమాన్ని ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఓట్లు కోసం క్రీడల్ని తాకట్టుపెట్టి దిగజార్చేసిన దౌర్బాగ్యం అక్కడుంది. నేనెందుకు ఓడిపోయానో నాకే తెలీడం లేదు అని జగన్‌రెడ్డి అన్న మాటలు గుర్తొస్తే నవ్వొస్తుంది. ఇలాంటి దౌర్భాగ్యపు పనులు చేస్తే -ప్రజలు ఎలా క్షమిస్తారు. నాసిరకం కిట్లు, బ్యాట్లు, టీషర్టులతో దెబ్బతిన్న యువతే -బలంగా దంచికొట్టారు. ఇక సీఎం కప్ అని ప్రకటించి -దాని ప్రతిష్టనే దిగజార్చేశారు.
త్రికరణ శుద్ధిగా ప్రక్షాళన మొదలుపెట్టాం. అందులో భాగంగానే అన్నీ మారతాయి. కొత్త వెబ్‌సైట్.. కొత్త పాలసీ.. అన్నీ వస్తున్నాయి. ముందు నిర్జీవంగావున్న శాప్ కార్యాలయంలో క్రీడోత్సాహం కనిపించేలా తీర్చిదిద్దుదుతున్నాం. ఎవరైనా పారిశ్రామికవేత్తలు వచ్చి స్పోర్ట్స్ స్టూడెంట్స్‌ని అడాప్ట్ చేసుకోవాలంటే.. మనం సాధించగలమన్న నమ్మకం వాళ్లకు కలగాలి. అలాంటి ఆంబియన్స్‌ని మనం క్రియేట్ చేసుకోవాలి.
నియోజకవర్గాలస్థాయిలో, జిల్లాల స్థాయిలో సమస్యలు లేవని చెప్పను. అవన్నీ పరిష్కరించుకోవాలి. సర్టిఫికెట్లను కూడా ఆన్‌లైన్ చేద్దామన్న ఆలోచన ఉంది. కరెప్షన్‌కు తావులేకుండా.. పూర్తి పారదర్శక శాప్‌ని ఆవిష్కరించగలిగితే.. అన్నీ అనుకూలమవుతాయనే నమ్ముతున్నా. ఎప్పుడు కలిసినా విద్యా మంత్రి లోకేష్ చెప్తున్నదొక్కటే. ‘ఏ పని చేసినా మన మార్కు స్పష్టంగా ఉండాలి. పంత మంచి చేయగలమో అంతా చేద్దాం. అన్ని ప్రాంతాలకూ తిరుగు. నిరుపయోగంగావున్న స్థలాలను గుర్తించు. వాటిమీద డీపీఆర్ చెయ్యి. పారిశ్రామికవేత్తలను కలువు. క్రీడలను ప్రొత్సహించడానికి సిద్ధంగా ఉన్నవాళ్లు చాలామందే ఉన్నారు. పబ్లిక్ పాజిటవ్‌గా ఉంది. పీపీపీ విధానాన్ని అమలు చేద్దామని సీఎం సార్ చెప్తున్నారు. అనుకూలమైన వాతావరణాన్ని అవకాశంగా మార్చుకో’ అని. ఆ దశగానే ప్రయాణిస్తున్నా. ప్రజాసహకారం కోరుతున్నాం. మీడియా సహకారం తీసుకుంటాం. శాప్‌కు కొత్త జవసత్వాలు అందిస్తాం. రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్‌గా మార్చేవరకూ పరుగులు తీస్తాను. శాప్ ఛైర్మన్‌గా ఉన్నంతవరకూ చివరిరోజు వరకూ నా ప్రయత్నం ఇలానే ఉంటుంది, ఉండబోతుంది.
గత ఐదేళ్ల పాలన కారణంగా -రాష్ట్రంలో కనిపించని డిజాస్టర్ ఒకటి జరిగింది. అది `స్టేట్‌లో స్పోర్ట్స్, గేమ్స్ మూడ్ కనుమరుగైపోయింది. దాన్ని ఎలా ఫేస్ చేస్తారు?
అక్షరాలా నిజం. మేం ఫేస్ చేయబోయే ఛాలెంజ్‌లో అదొకటి అత్యంత కీలకం. స్పోర్ట్స్‌ని కెరియర్‌గా తీసుకోగలిగే మూడ్ పిల్లల్లో రావాలంటే.. ముందు పేరెంట్స్‌ని మోటివేట్ చేయాలన్న ఆలోచనకు వచ్చాం. దానికి ఫౌండేషన్ విద్యామంత్రి లోకేష్ నుంచే మొదలైంది. ఎక్కడైతే స్కూల్స్‌కు గ్రౌండ్స్ లేవో.. వాటిని గుర్తించమని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చారు. నాలుగువేలకు పైగా స్కూల్స్‌కి గ్రౌండ్స్ లేవు. చిన్న ఆట స్థలమైనా ఉంటేనే.. ప్రైమరీ స్కూల్ నుంచి విద్యార్థులు క్రీడలపట్ల ఆసక్తి చూపుతారు. దానిమీదే అధ్యయనం జరుగుతుంది. ఇక తల్లిదండ్రలను మోటివేట్ చేయడానికీ -కార్యక్రమాలు సిద్ధం చేస్తున్నాం. ఏదైనా క్రీడలో జాతీయ, అంతర్జాతీయ గురింపు సాధించిన ఆటగాడి ఇమేజ్ ఎలా ఉంటుందో మనకెందరో ఎగ్జాంపుల్స్ ఉన్నారు. పైగా క్రీడల్లో రాణించడమంటే దేశభక్తిని ప్రదర్శించడం. జాతీయ కేతనాన్ని ప్రపంచ దేశాలపై ఎగరేసే అవకాశం చేజిక్కించుకోవడం. అంతకుమించిన కిక్కేముంటుంది. పేరెంట్స్‌లో అలాంటి అవగాహన తీసుకొచ్చి.. పిల్లలను క్రీడలవైపు ప్రోత్సహించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం.
మెడల్స్ సాధించగానే.. కెరీర్‌లో కుదురుకున్నట్టా..?
ప్రశ్నలో అంతరార్థం అర్థమైంది. చాలామంది తల్లిదండ్రులకు ఉన్న భయమే అది. అందుకే `జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన ఆటగాళ్ల కష్టానికి ఎలాంటి గుర్తింపు నివ్వాలి. ఎలాంటి గౌరవాన్ని ఇవ్వాలి. కెరియర్‌ని త్యాగం చేసి ఆటలను ఎంచుకున్న క్రీడాకారులకు ఎలాంటి యూనిఫారం జాబ్‌లు కల్పించాలి అన్నిటిపైనా అధ్యయనం చేస్తున్నాం. ఇక రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పీపీపీ విధానం ఎలానూ ఉంది. ప్రయివేట్ సెక్టార్‌లో పారిశ్రామికవేత్తలకు క్రీడాకారులను అడాప్ట్ చేసి.. క్రీడల తరువాత వాళ్ల కంపెనీల్లోనే క్రీడాకారులకు అకామిడేట్ చేసుకునే దిశగానూ అడుగులేస్తున్నాం. అందుకు అనుగుణంగా -జిల్లాస్థాయిల్లో ఏయే పరిశ్రమలు ఉన్నాయి? ప్రయివేట్ సెక్టార్‌కి క్రీడాకారులను ఎలా అడాప్ట్ చేయొచ్చు? గవర్నమెంట్‌లో పంప్లాయిమెంట్ ఎలా క్రియేట్ చేయాలి? వీళ్లకు గుర్తింపు ఎలా ఇవ్వాలి? ఇలా అనేక అంశాలమీద ప్రభుత్వ ప్రోత్సాహంతో శాప్ అధ్యయనాలు మొదలుపెట్టింది. విస్తృతమైన ప్రణాళిక ఒక కొలిక్కివస్తే.. అక్కడినుంచి కొత్త బాటలు పడతాయనే అనుకుంటున్నా.
ఇక -క్రీడలకు ఫిజికల్ ఫిట్‌నెస్ ముఖ్యం. చిన్న వయసునుంచే విద్యార్థుల్లో ఆ ఫిట్‌నెస్ పెంచడానికి విద్యా శాఖామంత్రి లోకేష్ కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. స్కూల్స్ స్థాయిలో ఆటస్థలాలపై దృష్టి పెట్టడం అందులో భాగమే. అలాగే -మనకు అటవీ ప్రాంతం, మెట్టప్రాంతం, డెల్టా తీరప్రాంతాలున్నాయి. విభిన్న భౌగోళిక ప్రాంతాల్లో ఒక్కో చోట ఒక్కో ఆటకు ప్రాధాన్యత ఉంది. రాయలసీమలో కబడ్డీ, ఖోఖో.. అర్బన్ ఏరియాల్లో షటిల్ బ్యాడ్మింటన్, క్రికెట్, బాస్కెట్‌బాల్.. కొన్ని ప్రాంతాల్లో రన్నింగ్ ఇలా. వీటన్నిటినీ సమ్మిళితం చేసి.. అందుకు అనుగుణమైన ప్రణాళికలు రచించుకుని ముందుకెళ్లే దిశగా అడుగులు మొదలయ్యాయి.
వీటన్నిటికంటే భిన్నంగా -శాప్‌కు మరో టార్గెట్ లేకపోలేదు. ఆటలను ప్రోత్సహించి.. విద్యార్థులను ఫిజికల్‌గా, మెంటల్‌గా దృఢంగా మలచి.. జీవితంలో ఎలాంటి ఆటుపోట్లునైనా ఎదుర్కోగలిగే క్వాలిటీ హ్యూమన్ రిసోర్స్‌ను తయారు చేసే బాధ్యత కూడా తీసుకోబోతున్నాం.
క్రీడలపట్ల ఆసక్తి చూపించే ముఖ్యమంత్రి -ప్రతినెలా రివ్యూ చేయడానికి ఒక టైం కేటాయించారు. అందులో భాగంగానే ఈనెల 23న స్పోర్ట్స్‌మీద విస్తృతమైన సమీక్ష ఉండొచ్చు. 50శాతం పనులు పూర్తై ఆగిపోయిన స్టేడియంలకు ముఖ్యమంత్రి రూ.23 కోట్లు విడుదల చేశారు. పనుల ఎస్టిమేషన్ కాపీలు సిద్ధమవుతున్నాయి. అలాగే, మెడల్స్ సాధించిన వాళ్లకు ప్రకటించిన బహుమానాలు గత ప్రభుత్వం ఇవ్వలేదు. దానిపైనా ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారు. మొత్తంగా -క్రీడారంగానికి సంబంధించి నిర్దుష్టమైన ప్రణాళిక ఇవ్వబోతున్నాం. ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలో బెస్ట్‌మెథడ్స్ తెలుసుకోవడానికి జిల్లాలకూ వెళ్తున్నాం.
ఒకపక్క ఎండీ. మరోపక్క క్రీడామంత్రి. ఇంకోపక్క క్రికెట్ అసోసియేషన్ ఛైర్మన్. ఇవన్నీ శాప్ బలాలే. మార్గనిర్దేశనం చేయడానికి యువనేత లోకేష్.. నిధులు కేటాయించి ప్రాథమ్యాల ప్రకారం సదుపాయాల కల్పనకు ముందుకు నడిపించే ముఖ్యమంత్రి.. వీళ్లిద్దరూ రాష్ట్ర క్రీడారంగానికి వరాలు. శాప్ అద్భుతమైన విజయాలు సాధించగలదని, లక్ష్యాన్ని ఛేదించగలదని గట్టిగా నమ్ముతున్నా.
– రాణిప్రసాద్
